Previous Page Next Page 
మళ్ళీ తెల్లవారింది పేజి 32

    "కాదు. ఒకరోజు రాత్రి రమేశ్ రౌండ్స్ వెళ్ళాడట. ఆ పిల్ల పనిచేస్తున్న వార్డుకు అక్కడ సత్యం ఆ పిల్లతో మాట్లాడుతూ కన్పించాడట. సత్యం మేరీని తన భార్యగా పరిచయం చేశాడట. సత్యం రమేశ్ ను చూడగానే గుర్తించి అమాంతరం కౌగలించుకున్నాడట. పదినిముషాల్లో అందర్ని గురించి అడిగాడట. అమ్మను, నాన్ననూ చూడాలని వుంది. ఎప్పుడో ఒకసారి మేరీని తీసుకెళ్ళి వాళ్లకు చూపించి వస్తానన్నాడట. హడావిడిగా వెళ్ళిపోయాడట."
    "దుర్మార్గుడు ఎంత పనిచేశాడు? అన్నభార్య అని చూడకుండా మారుమూల గ్రామానికి ట్రాన్స్ ఫర్ చేయిస్తాడా? పోనియ్! వాళ్ళెక్కడున్నారో చెప్పాడా?"
    "లేదు."
    "ఆ పిల్ల ఉద్యోగం ఏ ఊళ్లో చేస్తుందో రాయమనండి. ఆ రమేశ్ గాడ్ని ఆ చంపా ఈ చంపా వాయించాలని వుంది. బాగా తిట్టి వుత్తరం రాయండి."
    "వాడు మాత్రం ఏం చేశాడు? తన అంతస్థుకూ, గౌరవానికీ భంగం కలక్కుండా చూసుకున్నాడు."
    "మీరు వాడు చేసిన ఛండాలపుపనిని సమర్ధిస్తున్నారా?"
    "లేదు. వాడి దృక్పధం నుంచి ఆలోచిస్తున్నాను." కామేశ్వరరావు కండువా భుజం మీద వేసుకొని నిలబడ్డాడు.
    "ఇంత ఎండలో ఎక్కడికి?" 
    "ట్యూషన్ కు వెళ్ళాలి."
    "ఇంత ఎండలోనా? ఒక్క రోజు వెళ్ళకపోతేనేం? ఏం కొంపలు మునిగిపోతాయ్?"
    "మోహన్ కు రేపటి నుంచి పరీక్షలు. ఆఁ! ఇప్పటికే ఆలస్యం అయింది. వాడు నాకోసం ఎదురుచూస్తుంటాడు." అని చరచర బయటికి వెళ్ళిపోయాడు.
    సుందరమ్మ భర్త వెళ్ళిన వైపు చూస్తూ కూర్చుండిపోయింది.
    కళ్లకు పన్నెండేళ్ల సత్యం రూపం కన్పించింది. కళ్ళు చెమ్మగిల్లాయి.
    వాడు మళ్లీ తన కళ్లకు కన్పిస్తాడా? వాడైనా తమను వృద్దాప్యంలో ఆదుకుంటాడా? తనొక పిచ్చిది. పెంచి ప్రయోజకుల్ని చేసిన వాళ్లే, సంపాదనపరులై తమదారి తాము చూసుకున్నారు. సత్యానికి తను ఏం చేసింది? తండ్రి నుంచి ఏం పొందాడు? వాడు తమ కోసం చెయ్యక్కర్లేదు. ఒక్కసారి ఈ పాపిష్టికళ్లకు కన్పిస్తేచాలు.
    ఆయన పని కూడా బొత్తిగా అయిపోయింది. అంత పొడుగ్గా కన్పించేమనిషి, కృంగిపోయి పొట్టిగా కన్పిస్తున్నాడు. అభిమానంగల మనిషి. మనసులో ఏముంటుందో పైకి మాత్రం బిడ్డల్ని ఒక్కమాట అనడు. తనను అననివ్వడు. ఎంతకాలం ఈ బండిని ఎలా ఈడ్చగలడు? తనకు ఈ మధ్య ఒక భయం పట్టుకుంది. తమను పిల్లలు సరిగా చూడరేమోననే భయం.
    ఆయనకాస్తా గుటుక్కుమంటే
    సుందరమ్మ వెన్నెముకలోకి చలికుదుపు వచ్చింది.
    ఛ! ఏమిటి తను ఇలా ఆలోచిస్తున్నది? ఆయన వుండగానే తన ఘటం వెళ్ళిపోవాలి. అంతకంటే తను కోరుకునేది ఇంకేముంటుంది?
    తను... తను... వెళ్ళిపోతే... ఆయనను ఎవరు చూస్తారు? ఈ వయసులో ఆయన ఒక్కడూ... ఇంత కాసి పోసేవాళ్లుకూడా లేకపోతే... లేదు. లేదు. ముందే ఆయన వెళ్ళిపోవాలి!
    ఓ భగవంతుడా! ఇవ్వాళ తనకు ఇలాంటి ఆలోచనలువస్తున్నాయేమిటి?
    సుందరమ్మ బుర్రలో వృద్దాప్యంలో తాము అనుభవించబోయే జీవితం గురించిన ఆలోచనలు, క్యాన్సర్ వ్యాధిలా ఎటుబడితే అటే అల్లుకు పోతున్నాయి.
                                                                             *   *   *
    వీధి వాకిట్లోనుంచి అనేక కంఠాలు విన్పించి సుందరమ్మ ఇంట్లోనుంచి ఆదుర్దాగా బయటికి వచ్చింది.
    కామేశ్వరరావును ఇద్దరు లోపలకు మోసుకొస్తున్నారు. ఆ వెనక పదిమందిదాకా వున్నారు.
    సుందరమ్మకు నిలువుగుడ్లు పడ్డాయి.
    కామేశ్వరరావును మంచం మీద పడుకోబెట్టారు.
    "అయ్యో! ఏమైంది? ఇంతలోనే ముంచు కొస్తుందనుకోలేదు దేవుడా! ఓయి దేవుడో! నన్నేంచేసి పోదామనుకుంటున్నావు? వద్దు! వద్దంటే వినకుండా ఎండన పడిపోయావు దేవుడో!" సుందరమ్మ గోడుగోడున ఏడవసాగింది. 
    చంద్రానికి కబురు అందింది. పరుగు పరుగున వచ్చాడు. ఇరుగుపొరుగూ చేరారు. డాక్టరు వచ్చాడు. పెదవి విరిచాడు. ఇంజక్షన్ చేసి వెళ్ళిపోయాడు. రాత్రికి గడవాలన్నాడు డాక్టరు. చంద్రం అన్నలిద్దరికీ, తమ్ముడికీ ఫోన్లు చేశాడు.

    సుందరమ్మ కంటికి కడివెడుగా కారుస్తూ భర్త మంచం పక్కనే కూర్చుంది. చంద్రం, చంద్రం భార్యకూడా మంచం పక్కనే కూర్చున్నారు. ప్రతి అర్ధగంటకూ టైం చూసుకుంటున్నాడు చంద్రం. ఈ రాత్రికి ఎలాగయినా గట్టెక్కించాలని మనసులోనే భగవంతుడ్ని మళ్లీ మళ్లీ ప్రార్దిస్తున్నాడు.
    ఇంకా రెండు గంటలు గడిస్తే చాలు! డాక్టరు చెప్పిన గడువు అయిపోతుంది. తన తండ్రి బతుకుతాడు. ఇంకా రెండు గంటలు. ఓన్లీటు అవర్స్!
    తెల్లవారు ఝామున నాలుగు గంటలకు కామేశ్వరరావు కళ్ళు తెరిచాడు. భర్త ముఖంలోకే చూస్తూ కూర్చున్న సుందరమ్మకు గండం గడిచినట్టేనని పించింది.
    "చంద్రం! చంద్రం! చూడరా! చూడరా! నాన్న కళ్ళు తెరిచారురా! ఏమండీ! ఎలా వుందండీ? భర్త ముఖం మీద వంగి అడుగుతోంది.
    కామేశ్వరరావు భార్య ముఖంలోకి చూస్తున్నాడు.
    "ఏమిటండీ అలా చూస్తున్నారు. నేను మీ సుందరిని. మాట్లాడండి. ఒక్కమాట మాట్లాడండి. నన్ను వదిలేసి ఎందుకు వెళ్ళిపోతున్నారు. చెప్పండి. నన్నేం చెయ్యమంటారు! చెప్పండి ఒక్కమాట చెప్పండి...."
    "అమ్మా! నువ్వు గొడవచెయ్యకు." చంద్రం తల్లిని వారించాడు.
    అనాదిగా చివరిక్షణంలో వున్న వ్యక్తిని, ఎవరో ఒకరు ఒక్కసారి కడసారి... ఒక్కమాట చెప్పమని అడుగుతూనే వున్నారు.
    మృత్యుదేవత కోరల్లో చిక్కుకున్న ప్రాణికూడా, ఒక్కమాట చివరిమాట చెప్పాలని విలవిల్లాడిపోతుంది. ఆఖరుసారిగా ఏదో చెప్పాలని ఆ ప్రాణితపించిపోతుంది. కాని...
    పెదవులు కదలవు. గొంతు పెగలదు. చేతులు ఆడవు.
    అందుకే ఆ చెప్పాలనుకున్న ఆ ఒక్కమాట - ఆ చివరి మాట, అసహాయంగా ఆ తుది చూపుల్లో చెప్పడానికి ప్రయత్నిస్తుంది ఆ ప్రాణి. తుదిచూపుల్లో కదిలిన ఆ సందేశం ఎవరికీ అందదు. అర్ధంకాదు అందరికీ ఆభాష తెలిసినట్టే వుంటుంది. కాని ఎవరికీ తెలియదు.
    ఆ చూపులలో కదిలిన బాషకుభాష్యం ఏ భాషా పండితుడూ చెప్పలేడు.
    చివరకు తను చెప్పదల్చుకున్నది ఎవరికీ అర్ధం కాలేదన్న వ్యధతో ఆ ప్రాణి కళ్లు మూస్తుంది.
    కామేశ్వరరావు భార్యముఖంలోకి చూస్తూ కళ్ళతో చివరిమాట చెప్పాడు:-
    "నేను పోతున్నాను. నువ్వెలా బతుకుతావు"

 Previous Page Next Page