"ఛ! అవేం మాటలు?"
"నా మాటలు తప్పుగా విన్పిస్తున్నాయా! మరివాడు రాసిందేమిటి? ఆ అత్తగారే వెళ్ళి కూతురి దగ్గిర మంచి పనిమనిషి దొరికేదాకా వుండొచ్చుగా?"
"నువ్వు తల్లివి కనక రాశాడు. అత్తగారికి ఎలా రాస్తాడు? అవసరానికి తల్లిని రమ్మనడంలో తప్పేముంది సుందరీ?"
"అవును! తప్పేంలేదు. కనిపెంచినందుకు, నాకొడుకు తన ఇంట్లో నాకు టెంపరరీ పనిమనిషి ఉద్యోగం ఇస్తున్నాడు. తప్పేముంది? ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాను."
"నీ కొడుకు కనకనే రాయగలిగాడు. పరాయివాళ్ళకు అలా రాస్తాడా ఏం? పిల్లల విషయంలో చిన్నచిన్న విషయాలకు పట్టింపులకు పోకూడదు. వాళ్ళు చిన్నవాళ్ళు. మనం జన్మనిచ్చి, పెంచి పోషించిన వాళ్ళూ..."
"అదేనండీ నా బాధ! చివరకు వాళ్లు తల్లికి పనిమనిషి స్థానాన్ని తమ ఇంట్లో కల్పిస్తున్నారు. పోనియ్! కోడలి వంటరిగా వుంది. భయపడుతోంది. కొద్దిరోజులు వచ్చి వుండమ్మా అని రాశాడా! పనిమనిషి దొరికేదాకా వుండమని రాస్తాడా? మన పెంపులోనే ఏదైనా లోపంవుందా? లేక... లేక..." సుందరమ్మ గొంతు దుఃఖంతో పూడుకుపోయింది. మాటలు పెగల్లేదు.
"ఇన్నిటికీ వెళ్తావా లేదా?"
"వెళ్ళను" ఖచ్చితంగా అంది సుందరమ్మ.
"వెళ్తేనే బాగుంటుందేమో! మరోసారి ఆలోచించు."
"ఆలోచించడానికి ఏమీ లేదు. వాళ్ళ అత్తను పిలిపించుకోమని రాయండి."
"ఆమాట మనం ఎందుకు రాయడం. నీకు రావడానికి వీలుగా లేదని రాస్తాలే. ఆరోగ్యం బాగా లేదని రాస్తాను."
సుందరమ్మ మాట్లాడలేదు. చెమ్మగిల్లిన కళ్ళను పైట కొంగుతో తుడుచుకుంది.
"మరో విషయం"
"చెప్పింది చాలు. ఇంకేం చెప్పాలి" సుందరమ్మ లోపలకు వెళ్ళబోయింది.
"విను. మన సత్యం..."
"లోపలకు వెళుతున్న సుందరమ్మ ఆగి, గిర్రున తిరిగింది. ఆతృతగా రెండడుగులు ముందుకు వేసి "ఆ మన సత్యం! సత్యానికి ఏమైంది? ఎక్కడున్నాడు? ప్రశ్నల వర్షం కురిపించింది.
కామేశ్వరరావు ఆలోచిస్తూ వుండిపోయాడు.
"మాట్లాడరేం? నా బిడ్డకు ఏమైంది? అసలు వాడు ఎక్కడున్నాడు? చిన్నాడికి కన్పించాడా?"
"నువ్వు తాపీగా విను. వాడికేం కాలేదు. బాగానే వున్నాడు."
"మరి! ఇంత చల్లని వార్త చెప్పడానికి సందేహిస్తారేం! అయ్యోరాత!"
"వాడు పెళ్ళి చేసుకున్నాడట!"
"నిజంగా! ఇవ్వాళ లేచి ఎవరి ముఖం చూశానో ఎంత మంచివార్త విన్నాను! వాడెక్కడున్నాడో రాశాడా! అడ్రసు రాశాడా! రాయడు. వాడెందుకు రాస్తాడు? కనీసం పెళ్లి చేసుకుంటున్నానని కూడా రాయలేదు.
"సాధింపు మొదలు..."
"ఇది సాధింపు కాదండీ! తల్లి మనసు పడేవేదన"
"వాడు ఒకింటివాడయ్యాడంటే సంతోషంగా లేదూ?"
"ఎందుకు లేదండీ! వాళ్ళిద్దర్నీ చూడాలని వుంది. ఎక్కడున్నాడో తెలిస్తే వెళ్ళి ఇంటికి తీసుకొద్దాం." సుందరమ్మ సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయింది.
"ఆ అమ్మాయి ఉద్యోగం చేస్తున్నదట"
"నిజంగా? వాడికి మనం ఏమీ చెయ్యలేదు. ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాం. అయినా వాడు ప్రయోజకుడయ్యాడు. చదువుకొని ఉద్యోగం చేస్తున్న పిల్లను కూడా చేసుకున్నాడు. ఆ అమ్మాయి ఏం ఉద్యోగం చేస్తుందో రాశాడా? రమేశ్ వాళ్ళ పెళ్ళికి వెళ్ళాడా? వెళ్ళే వుంటాడు. రమేశ్ కు వెంటనే ఉత్తరం రాసి సత్యం అడ్రసు రాయమనండి. ఆఁ సరే! ఆ అమ్మాయి ఉద్యోగం ఏమిటట! సత్యం కూడా ఉద్యోగం చేస్తున్నాడా?"
"ఆ అమ్మాయి నర్సు ఉద్యోగం చేస్తుందట"
"నర్సు ఉద్యోగమా!" సుందరమ్మ నీరసపడిపోతూ అడిగింది.
"మరో విషయం - విని మరి బాధపడకూడదు."
"ఏమిటి చెప్పండి"
"ఆ అమ్మాయి క్రిస్టియన్ పిల్ల" సుందరమ్మ నోరు తెరిచేసింది. "ఆఁ!" అంది.
"ఏమిటలా అయిపోయావ్!"
"విడికిదేం పోయేకాలం కిరస్తానీ పిల్లను చేసుకున్నాడు? బాధపడిపోతూ అన్నది.
"వాడికి కులాలమీద, మతాలమీద నమ్మకం లేదని నీకు తెలియదా? చిన్నప్పుడు మనుషులంతా ఒకటికాదా అని నిన్ను నిలదీసేవాడు మర్చిపోయావా? ఇంతకాలానికి వాడొక ఇంటివాడయ్యాడు. వాడు సుఖంగా వున్నాడన్న కబురు తెలిసింది. సంతోషించు."
"వాడేం చేస్తున్నాడట?"
"వాడు ఉద్యోగం ఏమీ చెయ్యడం లేదు. విప్లవ రాజకీయాల్లో తిరుగుతున్నాడు. అండర్ గ్రౌండు జీవితం గడుపుతున్నాడు. అమ్మాయి పెళ్లికొచ్చి, నిమిషాలమీద వెళ్ళిపోయాడు. ఎందుకనుకున్నావ్?"
అయ్యో! ఇంకా అలా దొంగలాగే బతుకుతున్నాడా?"
"ఛ! అదేంమాట! దొంగలాకాదు. విప్లవకారుడిగా పోలీసుల్ని హడలగొడ్తున్నాడు. గర్వించు."
"పోలీసులు పట్టుకుంటే ఏం చేస్తారు?"
"కాల్చేస్తారు - లేకపోతే జైల్లో పడేస్తారు"
"ఏమండీ! బావురుమంది సుందరమ్మ.
"ఊరుకో సుందరీ! సత్యంకోసం మనం ఏడవకూడదు. వాడు మన బిడ్డ అయినందుకు గర్వించాలి. వాడు మనిషి. మనుషుల కోసం, మనిషిగా తన కర్తవ్యం నెరవేరుస్తున్నాడు. ఏ వెయ్యికి ఒక్కడో చెయ్యగలపని మన సత్యం చేస్తున్నాడు. మానవత్వం మనుగడ కోసం మరణించడానికి సిద్ధంగా వున్న ధన్య జీవివాడు. వాడి కోసం మనం ఏడవకూడదు. తను నమ్మిన సిద్ధాంతాల కోసం ప్రాణాలను ఇవ్వడానిక - మానవ కళ్యాణం కోసం జరుగుతున్న ఆ మహాయజ్ఞంలో సమిధగా..." ఆపైన కామేశ్వరరావుకు మాటలు దొరకలేదు. స్వరం గద్గదమైంది.
సుందరమ్మ భర్త ఏం చెబుతున్నాడో అర్ధం చేసుకోవడానికి ప్రయత్నం చేసింది. పూర్తిగా అర్ధం కాలేదు. అయినా తన కొడుకు ఏదో చాలా గొప్పపని చేస్తున్నాడని అర్ధం చేసుకుంది.
"నీ చిన్నకొడుకు చేసిన ఘన కార్యం వింటావా?"
సుందరమ్మ చివ్వున తలెత్తి భర్తముఖంలోకి విస్మయంగా చూసింది.
"రమేశా? ఏం చేశాడు? సత్యాన్ని పోలీసులకు అప్పగించాడా?"
"వాడు అంతపనీ చెయ్యగలడు. కాని వాడు అంతకంటే ఘోరమైన పనే చేశాడు."
"ఏం చేశాడు?"
"ఆ అమ్మాయిని, హైదరాబాద్ గాంధీ ఆసుపత్రి నుంచి దూరంగా ఒక మారుమూల గ్రామానికి ట్రాన్సఫర్ చేయించాడు."
"వాడికి అదేం పోయేకాలం? అలా ఎందుకు చేశాడు?"
"వాడు డాక్టరు. ఆపిల్ల నర్సు. తన వదిన తను పనిచేసే ఆసుపత్రిలో నర్సుగా వుండడం వాడికి నామోషీగా వుందట. చిన్నతనంగా వుందట. అందుకే ఆపని చేయించాడట. రమేశ్ కు ముందు ఆపిల్ల సత్యం భార్య అని తెలియదట. మంచి పిల్లనీ, డ్యూటీ బాగా చూస్తుందనీ చాలా గౌరవంగా చూసేవాడట."
"మరి సత్యం భార్య అని ఎప్పుడు తెలిసింది? ఎలా తెలిసింది? ఆ పిల్లే మాటల్లో చెప్పిందేమో!"