"ఎప్పుడైతే నీ మనసు కష్టపెడితే నన్ను క్షమించు"
"నాతో జీవితం పంచుకున్నందుకు కృతజ్ఞతలు"
ఇందులో ఏదో ఒకమాట చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడేమో!
"ఏమండీ! ఎలా వుందండీ! మాట్లాడండీ! నన్ను దగా చేసి వెళ్ళిపోకండీ!" గోడుగోడున ఏడుస్తూ, లబలబ లాడిపోతున్న సుందరమ్మకు ఆ చూపుల ఆంతర్యం అర్ధం కాలేదు.
కామేశ్వరరావు కళ్ళు మూశాడు. తుది శ్వాస వదిలాడు. శాశ్వతంగా భవబంధాలను తెంచుకొని వెళ్ళిపోయాడు.
అందరూ ఘొల్లుమన్నారు.
సుందరమ్మ స్పృహ తప్పి పడిపోయింది.
సుందరమ్మ జీవితాన్ని చీకటి తెరలు చుట్టేశాయి.
తెల్లవారి మధ్యాహ్నానికల్లా కొడుకులూ - కోడళ్లూ వచ్చి వాలిపోయారు. కూతురూ - అల్లుడూ వచ్చారు.
"అదృష్టవంతుడు తిరుగుతూ తిరుగుతూ వెళ్ళిపోయాడు."
"బిడ్డలంటే వాళ్లు ఎలా అల్లాడి పోతున్నారో చూడు."
"పాపం! సుందరమ్మ పెద్ద కాణీ అంత బొట్టుతో పార్వతీదేవిలా వుండేది."
"ఆయన చేతులమీదుగా వెళ్ళిపోయే అదృష్టం ఆవిడకు లేదు. చూడు ఎలా అయిపోయిందో. ఈ లోకంలోనే లేదు మనిషి"
తలొకమాటా అంటున్నారు.
శవం చుట్టూ బిడ్డలు కొడుకులు, కోడళ్లు - కూతురు అల్లుడు కూర్చుని ఏడుస్తుంటే వచ్చినవాళ్ళు ముచ్చటపడిపోతున్నారు. కొందరు కళ్ళు తుడుచుకుంటున్నారు. కొందరు కామేశ్వరరావు గుణగణాలను వర్ణిస్తున్నారు .మరికొందరు స్మశాన వైరాగ్యంతో వేదాంతం మాట్లాడుతున్నారు.
చిన్న కర్మ జరిగింది.
సుందరమ్మ రెండు రోజులు పచ్చి మంచినీళ్ళు ముట్టలేదు. పెద్దకర్మకు ఘనంగా ఏర్పాట్లు చెయ్యమని రమేశ్ తో, చంద్రంతో చెప్పి రామం, రఘు వెళ్ళిపోయారు. కోడళ్లు మాత్రం వుండిపోయారు. కూతురు తల్లిని ఒక్క క్షణం వదలకుండా కనిపెట్టుకొని కూర్చుంటుంది.
పెద్దకర్మ రెండు రోజులుందనగా కొడుకులిద్దరూ వచ్చారు. చాలా ఘనంగా కర్మ కాండ నడిపించారు.
"చావులా లేదు. పెళ్లిలా జరిగింది. ఆయనకేం పుణ్యాత్ముడు" అన్నారు భోజనాలకు వచ్చిన పెద్దలు.
ఆరోజు రాత్రి కామేశ్వరరావు ఆత్మశాంతి కోసం భజన ఏర్పాటు చేశారు. కొడుకులూ, కోడళ్ళూ కూడా భజనలో కూర్చున్నారు.
రెండురోజులు గడిచాయి.
మూడోరోజు రాత్రి భోజనాల తర్వాత అందరూ ఆరుబయట పందిరి కింద కూర్చున్నారు. రామనాధంను కూడా రఘు వుండమని కోరాడు. అందరి మనస్సుల్లోను ఒకే విషయం మెదులుతోంది. ప్రతిఒక్కడూ, రెండోవాడు సంభాషణ ప్రారంభించాలని ఎదురుచూస్తున్నారు. రామనాధం అందర్నీ మార్చి మార్చి చూస్తున్నాడు.
"సత్యం కూడా వస్తే బాగుండేది. ఎక్కడున్నాడో ఏమిటో!" అన్నాడు రామనాథం.
"అవును అంకుల్. నేనూ అదే ఆలోచిస్తున్నాను." అన్నాడు చంద్రం.
రామనాథం కామేశ్వరరావు గురించి ఎన్నో విషయాలు చెబుతున్నాడు. వాళ్లను చిన్నతనంలో తల్లిదండ్రులెంత అపురూపంగా చూసుకున్నారో చెబుతున్నాడు.
"ఇంకా అరవై నిండలేదు. మరో ఐదారేళ్ళు వుంటే బాగుండేది పాపం! మీ అమ్మ వంటరిదైపోయింది."
"అమ్మ వంటరిది ఎలా అవుతుంది అంకుల్. మేమంతా లేమా?" అన్నాడు రామం.
"అవును! కాని నేను అనేది అదికాదు. ఈ వయసులోనే భార్యాభర్తలు ఒకరు లేకుండా ఒకరు వుండలేదు. అది వయసుమళ్ళిన వాళ్లకే అర్ధం అవుతుంది.
"అది నిజమే అంకుల్!" అన్నాడు రఘు.
ఏడుస్తున్న కొడుకుని బుజ్జగిస్తూ సునంద బయటికి వచ్చింది.
"అమ్మాయ్! నువ్వు కూడా వచ్చి కూర్చో!" అన్నాడు రఘు.
సునంద ఒక క్షణం పెద్దన్నకేసి చూసింది. ఆమె భర్తకూడా అక్కడే వున్నాడు. పెట్రమ్యాక్సులైట్ల వెలుగులో అన్నల ముఖాలను మార్చి మార్చి చూసింది. అందరూ ఏదో విషయం మీద మనసులోనే మధనపడుతున్నట్టుగా అర్ధం చేసుకుంది. వెళ్ళి పెద్దన్నయ్య పక్కన మంచంమీద కూర్చుంది.
"ఏంటన్నయ్యా! ఏదో విషయం సీరియస్ గా చర్చిస్తున్నట్టున్నారు?"
"ఇంకా లేదమ్మా నువ్వు కూడా వుంటే బాగుంటుందని..." నసికాడు రఘు.
"ఏమిటో చెప్పు."
రఘు, రామం ముఖంలోకి చూశాడు. రామం ,రమేశ్ ముఖంలోకి చూశాడు.
"మీరు ఏమాలోచిస్తున్నారో నేను చెప్పనా?" అన్నాడు రామనాథం.
"చెప్పండి అంకుల్". అందరూ ఒక్కసారే అన్నారు.
"ఊ! హూ! చెప్పను. మీరే చెప్పాలి. రఘు పెద్దవాడివి. ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు."
"చెప్పన్నయ్యా! ఏమిటి?"
"అదే... అమ్మ విషయం...." నానుస్తూ అన్నాడు.
"అదేమిటయ్యా! ఇంటికి పెద్దకొడుకువి. సందేహిస్తావెందుకు? మీ అమ్మను నీ దగ్గరపెట్టుకోవడమే ఉచితంగా వుంటుంది" అన్నాడు రామనాథం.
రఘు తమ్ముళ్లకేసి చూశాడు.
"వాళ్ళేమనుకుంటారయ్యా! నీ దగ్గిరే వుంటుంది. తర్వాత ఆమెకు వెళ్ళాలనిపించినప్పుడు, వెళ్లదల్చుకున్న కొడుకు దగ్గరకు వెళ్తూ వస్తూ వుంటుంది. ఆమెకేం అదృష్టవంతురాలు. ప్రయోజకులైన నలుగురు కొడుకులున్నారు." రామనాథం చెప్పుకుపోతున్నాడు.
"అంకుల్ నేను సందేహిస్తున్నది అందుకు కాదు అంకుల్. పల్లెటూరులో జీవితమంతా గడిపిన అమ్మ ఆ పట్నాలలో వుండగలదా అని!"
"అందుకే చంద్రం అన్నయ్య దగ్గిర వుంటేనే అమ్మకు బాగుంటుందని మేం అనుకుంటున్నాం" అన్నమాటను అందుకొని అన్నాడు రమేశ్.
చంద్రం గిర్రున తలతిప్పి చిన్న తమ్ముడి ముఖంలోకి చూశాడు.
"అవును. నేను కూడా అదే అనుకుంటున్నాను." అన్నాడు రామం.
"అన్నయ్యా భయపడకు. నీ ఆర్ధిక పరిస్థితి మాకు తెలియంది కాదు. బరువంతా నీమీద పడేస్తామనుకోకు." అన్నాడు రమేశ్.
'మనందరం నెలకింతని పంపిద్దాం. వాడి మీద బరువెందుకు వేస్తాం!" అన్నాడు రామం.
"అవును చంద్రం మేము ప్రతినెలా డబ్బు పంపిస్తాం. పల్లెటూర్లో ఒక మనిషికి ఎంత ఖర్చవుతుంది కనక!"
"స్టాపిట్ ఐసే!" దాదాపు అరిచినట్టే అన్నాడు చంద్రం.
అందరూ తృళ్లిపడ్డారు. చంద్రం అంతగట్టిగా అరుస్తాడని భావించలేదు.
"మీరు నాకు నెలకింతని పంపిస్తారా? మీ అంత గొప్పగా సంపాదించకపోవచ్చు. బడి పంతుల్నే కావచ్చు. నేను మీలాగ పట్టుబడితే నాన్న నన్ను కూడా ఏ డాక్టర్నో, ఇంజనీర్నో చేసి వుండేవాడు. చివరిరోజుల్లో వాళ్లకు అండగా వుండాలనే నేను టీచర్ ట్రైనింగ్ చేశాను. పైగా నేను కూడా పెద్ద చదువుకు వెళ్తే నాన్న నడుం పూర్తిగా విరిగిపోతుందని భయపడ్డాను. అంతేగాని తల్లికి ఇంత ముద్దపెట్టలేని అసమర్ధుడ్ని కాను. ఏరా రమేశ్ అంతగొప్పవాడివయ్యావా?"


