అంత పెద్ద ఇల్లు ఇప్పుడెవరూ కట్టరు.
భైరవమూర్తి తాతముత్తాతలు జమీందారులై ఉండాలి. ఈ ఊరంతా వాళ్ళ స్వాధీనంలో ఉండి ఉండాలి.
ఇప్పుడు జమీందారీలు పోయాయి.
జమీందారులూ పోయారు.
కాని ఆనాటి వైభవం తాలూకు చిహ్నాలు ఇంకా మన సంస్కృతిలో మిగిలే ఉన్నాయి.
వారి అలవాట్లూ, ఆ దౌర్జన్యాలూ కూడా కొన్నిచోట్ల ఇంకా సాగుతూనే ఉన్నాయి.
నేను బిల్డింగ్ ముందుకొచ్చి నిల్చున్నాను.
ఒకసారిగా ఏడెనిమిది నల్ల కుక్కలు నన్ను చుట్టేశాయి.
బందీని చేశాయి.
నేను అడుగు తీసి వెయ్యడానికి వీలులేకుండా ఉంది.
ఏం చెయ్యాలో తోచడం లేదు.
దిక్కులు దద్దరిల్లేలా అన్నీ ఒకేసారి అరవసాగాయి.
ప్రాణాలు ఉగ్గబట్టుకొని నిల్చున్నాను.
భవనం వైపు చూశాను.
పెద్ద గేటు వేసిఉంది. ఆ గేటులో నుంచి కేకలు పెట్టినా ఎవరికీ వినిపించదు. పైగా ఈ కుక్కల అరుపు ఒకటి!
భవనంలో ఎక్కడా దీపం ఉన్నట్టుగా అన్పించలేదు.
కుక్కల అరుపు మరీ ఎక్కువైంది. వాటిని అదిలించడానికి కూడా భయంగా ఉంది.
అంతలో ఏదో కంఠం "ఛ-పోండి!" అని చిన్నగా విన్పించింది.
కుక్కలన్నీ ఒక్కసారిగా తలొకవైపుకు వెళ్ళిపోయాయి.
నేను చుట్టూ చూశాను.
ఎవరూ లేరు.
ఎవరా మాటలన్నది, వాటిని అదిలించింది ?
భైరవమూర్తా ?
అయివుండాలి.
కాని అతనెక్కడ ?
ఉన్నట్టుండి నల్లటి మబ్బులు కమ్మాయి.
చీకట్లు కమ్మాయి. తలపైకెత్తి చూశాను.
చంద్రుడు కన్పించలేదు.
సన్న జల్లు ప్రారంభం అయింది.
"భైరవమూర్తిగారూ !" గట్టిగా అరిచాను. నా గొంతు నాకే 'కీచు' మన్నట్టు విన్పించింది.
ఏదో నీడ గోడ పక్కగా కదిలివచ్చింది. వళ్ళు జలదరించింది.
వాచ్ మాన్ అయివుంటాడని సర్దిచెప్పుకొన్నాను.
గేటు తెరిచి పక్కగా నిల్చున్నాడు.
అతని రూపం కన్పించడంలేదు. నీడలాగే కన్పిస్తున్నాడు.
"భైరవమూర్తిగారున్నారా ?"
అతను పలక్కుండా చెయ్యి భవంతివైపుకు చూపించాడు.
ఆ చెయ్యి కూడా నీడలాగే ఆ చీకట్లో కన్పించింది. ఆ చెయ్యి అలా పొడవుగా సాగినట్టుగా అన్పించింది.
మళ్ళీ భయం !
ఆ భయాన్ని వెనక్కు నెట్టే ప్రయత్నం.
ముందుకు అడుగులు వేశాను.
ఆ నిశ్శబ్ద నిశీధిలో నా అడుగుల సవ్వడి నన్నే భయ పెడుతోంది.
చీకట్లో ఆ భవనం భూతగృహంలా అన్పించింది.
ఇంత పెద్ద ఇంట్లో ఒక్క దీపం పెట్టుకోకూడదూ?
భైరవమూర్తికి సంతానం, ముని సంతానం కూడా ఉండాలే న్యాయంగా?
చల్లటిగాలి జివ్వున వీచింది.
కాంపౌండులోకి అడుగుపెట్టగానే ఎముకల్ని కొరికే ఈ గాలి ఏమిటి?
భైరవమూర్తి నన్ను ఈ సమయానికే రమ్మన్నాడుగా!
మరి నా రాకకోసం ఎదురు చూడటం లేదా?
నా వెనకే బర్రున శబ్దంచేస్తూ అంతలోనే రెండు ఇనుప దిమ్మలు ఒకదానికి ఒకటి కొట్టుకున్నట్లు శబ్దం అయి, మరు నిముషంలో ఆగిపోయింది.
నేనూ యాంత్రికంగా ఆగిపోయాను.
వెనక్కు తిరిగి చూశాను.
గేటు మూసి ఉంది. కాని గేటు తెరిచిన నీడ ఆ దరిదాపుల్లో కన్పించలేదు.
నీడేమిటి? వాడు వాచ్ మాన్. గేటు మూసేసి బిల్డింగ్ వెనక్కు వెళ్ళిపోయి ఉంటాడు.
ఇప్పుడే ఈ చీకట్లు ముంచుకురావాలా?
అరణ్యంలో నన్ను భయపెట్టిన దయ్యాల పనేమో ఇది? అవి నన్ను వెంబడిస్తున్నాయేమో!
నేను మళ్ళీ దయ్యాలను నమ్ముతున్నానా?
దయ్యాలు ఎక్కడో లేవు.
మనసులోనే ఉన్నయ్.
అందులో నా మనసు బాగా బలహీనం అయింది కొద్ది గంటల్లోనే!
వేల సంవత్సరాల నుంచి మనిషి రక్తంలో ప్రవహిస్తున్న మూఢ నమ్మకాలు.
అదను చూసి బయటపడ్తాయి. మనిషి వంటరిగా జీవించలేడు. ఈ భయం వల్లనేనేమో!
వెనక్కు వెళ్ళిపోతే?
వాడు గేటు తెరుస్తాడా?
సాలె గూటిలో చిక్కుపోలేదుగదా?
ఆ పెద్దమనిషి భైరవమూర్తి పేరు చెప్పగానే ఎందుకలా అయిపోయాడు? నన్నే ఓ భూతాన్ని చూసినట్టుగా చూశాడు.
భైరవమూర్తి కూడా పిశాచమేనేమో ?
నాన్ సెన్స్ ! ఇంత దూరం వచ్చి ఇప్పుడు భయపడి వెనక్కు పోవడం ఏమిటి?
ఇంతవరకూ నేను క్షేమంగానే చేరాను.