Previous Page Next Page 
రాబందులూ - రామచిలుకలు పేజి 31


    "అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? లేవండి! రైలు టైం అయిపోతుంది" అన్నాడు జానకిరామయ్య.

 

                                        25


    డేగలమర్రి పంచాయితీ సమితి ఆఫీసులో, ప్రెసిడెంటు నరహరి తన గదిలో కూర్చుని బి.డి.ఓ. రామమూర్తితో మాట్లాడుతున్నాడు.

 

    "ఏమిటి విశేషాలు? పదిహేను రోజులుగా ఊళ్లో లేనుగదా?"


    
    "విశేషాలేమీ లేవండి. కొత్త ముఖ్య సేవిక వచ్చింది అన్నాడు" బి.డి.ఓ.

 

    "అదేమిటి? ఆదిలక్ష్మి ఏమైంది?"


    
    "మీరెళ్ళిన తెల్లవారే లాంగ్ లీవ్ పెట్టి వెళ్ళిపోయింది?"

 

    "అదేం?"

 

    "ఏమో తెలియదు. లీవ్ మాత్రం పెళ్ళి చేసుకోబోతున్నానని పెట్టింది. ఆరునెలలు పెట్టింది. వర్క్ సఫర్ అవుతుందనీ, వెంటనే మరో ఆమెను పోస్టు చెయ్యమనీ డిస్ట్రిక్టు ఆఫీసర్ కు వ్రాశాను.

 

    "ఆదిలక్ష్మికి పెళ్ళా? దానికిప్పుడు పెళ్ళేమిటి? కొత్త ముఖ్యసేవిక వచ్చిందా?"

 

    "వచ్చింది సర్. ఇంతకుముందే జాయినింగ్ రిపోర్టు ఇచ్చింది. పిలిపించమంటారా?" అడిగాడు బి.డి.ఓ.

 

    "ఎట్లా వుంది?"

 

    "మీరే చూస్తారుగా" అంటూ బి.డి.ఓ. బంట్రోతును కేకవేసి కొత్తగా వచ్చిన ముఖ్య సేవికను పిలవమని చెప్పాడు.

 

    సునంద వచ్చి ప్రెసిడెంటుకు నమస్కరించింది. నరహరి ప్రతి నమస్కారం చెయ్యకుండా సునంద ముఖంలోకి చూస్తూ వుండిపోయాడు.

 

    "సునంద, కొత్త ముఖ్య సేవిక. వారు మన ప్రెసిడెంటుగారు" బి.డి.ఓ. పరస్పరం పరిచయం చేశాడు.

 

    ప్రెసిడెంటు చూపులు ఎబ్బెట్టుగా తోచాయి సునందకు.

 

    "ఎక్కడినుండి వచ్చావ్?" అడిగాడు నరహరి.

 

    సునందకు ప్రెసిడెంటు ప్రశ్న అర్ధం కాలేదు. చూస్తూ వుండిపోయింది.

 

    "ఇంతకుముందు ఏ సమితిలో పనిచేశావ్?" మళ్ళీ అడిగాడు నరహరి.

 

    "ఎక్కడా చెయ్యలేదు. ఫ్రెష్ అపాయింట్ మెంటు."

 

    బి.డి.ఓ. సమాధానం ఇచ్చాడు.

 

    సునందకు ప్రెసిడెంటు అడిగే తీరూ, అతని చూపులూ ఎబ్బెట్టుగా తోచాయి.

 

    "ఐ సీ!" అంటూ నరహరి సునంద ముఖంలోకి గుచ్చి గుచ్చి చూడసాగాడు.

 

    సునంద ఇబ్బందిగా నిల్చుంది.

 

    అది గమనించి బి.డి.ఓ. "వెళ్ళమ్మా ఆఫీసులో కూర్చో! నేను వచ్చి వర్క్ గురించి చెబుతాను" అన్నాడు.

 

    బ్రతుకుజీవుడా అన్నట్టు బయటపడింది సునంద.

 

    సునంద వెళ్ళిపోయాక కూడా అటేచూస్తూ వుండిపోయాడు నరహరి. నరహరిని చూస్తూ బి.డి.ఓ. ముసి ముసిగా నవ్వుకున్నాడు.

 

    "దయచేయండి! దయచేయండి?" లోపల అడుగుపెడ్తున్న పరమేశాన్ని, లేచి నిలబడి చాటంత ముఖంతో ఆహ్వానించాడు నరహరి.

 

    "కూర్చోండి! రావోయ్ శేఖరం! కూర్చో!" పరమేశం వెనక ప్రవేశించిన శేఖరంతో అన్నాడు నరహరి.

 

    బి.డి.ఓ. లేచి నిలబడ్డాడు.

 

    "చూడు రామ్మూర్తీ చిలకలపాడు, చింతలపాలెం, కాకులపల్లె పంచాయితీలకు వెంటనే ఫండ్స్ రిలీజ్ చెయ్యి."

 

    "అలాగేనండీ!"

 

    "ఇవ్వాళే ఆర్డర్స్ వెళ్ళిపోవాలి."

 

    "యస్. సర్." అంటూ బి.డి.ఓ. వెళ్ళిపోయాడు.

 

    "అదేమిటి నరహరీ ఆ సర్పంచ్ లు మన పార్టీవాళ్ళు కారనీ, మనమీద దుష్ప్రచారం చేస్తున్నారనీ నువ్వేగా అన్నావ్? వాళ్ళకు ముందు ఫండ్స్ రిలీజ్ చెయ్యమంటావేం?" నరహరిని ఎగాదిగా చూస్తూ అడిగాడు పరమేశం.

 

    అర్ధయుక్తంగా నవ్వాడు నరహరి.

 

    అర్ధంకాని పరమేశం జవాబు కొరకు నరహరి ముఖంలోకి చూశాడు.

 

    "అది అప్పటి మాట. సమితి ఎలక్షన్లు దగ్గరపడుతున్నాయి గదా? ఇహ నుంచి ఎలక్షన్లు అయ్యేంతవరకూ, ఊగిసలాడే వాళ్ళకే మన ఫండ్స్ అన్నీ! మరి వాళ్ళందర్నీ మనవైపుకు తిప్పుకోవాలిగా?" అని తెలివిగా మందహాసం చేశాడు.

 

    "నీ ఎత్తుగడలు మామూలు వాళ్ళకు అందవు" అంటూ పరమేశం నరహరి భుజం తట్టాడు.

 

    "ఎత్తుగడలూ లేవు, వల్లకాడూ లేదు. ఇవన్నీ పంచాయితీ లెవల్ రాజకీయాలు. మీ స్టేట్ లెవెల్ వాళ్ళకు అర్ధం కావులే. ఏమయినా ఇందులో తట్టుకోవడం కష్టమయ్యా! ఎప్పుడూ బుర్ర పదునుగానే వుండాలి. ఎక్కడికక్కడ నరుక్కు వస్తేనేగాని నెగ్గుకు రాలేం!" అన్నాడు నరహరి.

 

    "ఇంకెంత కాలం లేవయ్యా! బరువూ భారం అంతా శేఖరం భుజాలమీద వేసెయ్! నువ్వు అక్కడ అదే ఆ ఆకుపచ్చ కుషన్ సీట్లో ఎం.ఎల్.సి.గా కూర్చొని విశ్రాంతి తీసుకుందువుగాని" అన్నాడు పరమేశం.

 

    శేఖరానికి వారి మాటలు వింటుంటే చిరాకుగా వుంది, ఇబ్బందిగా కుర్చీలో కదిలాడు.

 

    పరమేశం మాటలకు నరహరి ఉబ్బి తబ్బిబై పోయాడు.

 

    "జనరల్ ఎలక్షన్స్ అవగానే, మీరూ పక్కపక్కనే ఎం.ఎల్.ఏ.గా వుంటారుగా?" అన్నాడు నరహరి ఉత్సాహంగా నవ్వుతూ.

 

    పరమేశం పక పక నవ్వాడు.


                                                                         26


    సునంద పొలం గట్టుమీద, కాలువ గట్టుమీద నడుస్తూ పల్లెనుంచి పల్లెకు వెళ్తూ ఎంతో ఉత్సాహంగా పనిచేస్తూంది. హరిజన వాడలకు వెళ్లి, ఆ పిల్లలకు స్నానాలు చేయిస్తూ, పరిశుభ్రత గురించి చెబుతూ ఆడవాళ్ళతో అనేక విషయాలు గురించి చెబుతూ "చెయ్యాలంటే పల్లెల్లో ఎంతో పని వుంది" అనుకుంటూ వుంటుంది. గ్రామసేవికల సహకారంతో రాత్రి పాఠశాలలు పెట్టి వయోజనులకు చదువు నేర్పిస్తూంది. హుందాగా ముక్తసరిగా మాట్లాడుతూ తన పని తాను చేసుకుపోయే సునంద అంటే ఆ వూళ్ళలోని పెద్దలకు కొందరికి గౌరవం, చాలా మందికి కోపంగా వుంది.

 

    కొద్ది రోజుల్లోనే పల్లెల్లో పని చెయ్యడం, పల్లె ప్రజల దృక్పథం మార్చడం అంత తేలికైన పనికాదని తెలుసుకుంది సునంద.

 

    కుటుంబ నియంత్రణ గురించి చెబుతూ వుంటే స్త్రీలు సునందను అదోలా చూసేవారు. తిరస్కారంగా మాట్లాడేవారు. అయినా వారి మాటలు పట్టించుకోకుండా వాళ్ళను ఒప్పించడానికి శాయశక్తులా పనిచెయ్యసాగింది.

 

    పౌష్టిక ఆహారం గురించి చెబుతూ, వంట ప్రదర్శనలు చేయిస్తూ స్త్రీలను ఎక్కువ మందిని మహిళా మండలుల వైపుకు ఆకర్షితులను చేసింది.

 

    కొన్ని ఊళ్ళలో జరుగుతున్న దారుణాలను గ్రహించడానికి సునందకు ఎంతో కాలం పట్టలేదు. మహిళా సమాజాల ద్వారా నిర్వహించబడుతున్న కోళ్ళ గూళ్ళల్లోని గ్రుడ్లు అందవలసిన వారికి అందడం లేదని గ్రహించింది. అలాంటి మహిళా సమాజాలకు వెళ్ళి గ్రుడ్లు పంచవలసిన రోజు తను దగ్గిర వుండి, పిల్లలకూ, బాలింతలకూ, చూలింతలకూ పెట్టించేది. బాల్వాడీలలో మధ్యాహ్నం భోజనం పిల్లలకు సరిగా అందుతుందో లేదో సర్ ప్రైజ్ విజిట్స్ చేసి తెలుసుకొనేది. అలా జరగనిచోట టీచర్లమీద కంప్లైంటు రాసేది.

 

    కొద్దిరోజుల్లోనే సునంద కొందరికి కంటక ప్రాయంగా తయారైంది.

 

    ఆ పల్లెల్లోని కొందరు మగవాళ్ళు ఆమెను ఆకలి కళ్ళతో చూసేవారు. కొందరు వెకిలి మాటల్తో బాధపెట్టేవారు. కొందరు కసిగా "ఇది చెయ్యలేదు, అది చెయ్యలేదు" అంటూ తప్పులు పట్టడానికి ప్రయత్నించేవారు. సునంద లోలోపల బాధ పడినా పైకి తొణక్కుండా తన పని చూసుకుపోఆగింది.

 

    ముఖ్యంగా చింతలపాలెం సర్పంచ్ కూ, ఆ మహిళా మండలి ప్రెసిడెంటుకూ సునంద అంటే చాలా కోపంగా వుంది.

 

    సర్పంచ్ కు కావాల్సిందేదో సునంద గ్రహించింది. కాని గ్రహించనట్టే వుంటూ వచ్చింది. ఆ ఊరి మహిళా మండలి ప్రెసిడెంటు సర్పంచ్ గారి సతీమణి. మండలికి ఇచ్చిన రెండు కుట్టు మిషన్లలో ఒకటి సర్పంచ్ గారి ఇంట్లో వుందని గ్రహించిన సునంద, ఆ మిషన్ తెప్పించి మండలిలో పెట్టించింది. ఆ రోజునుంచి భార్యాభర్తలు సునందమీద కారాలు మిరియాలు నూరసాగారు. అనేక రకాల పుకార్లు లేవదీశారు. ఆమె చరిత్ర మంచిది కాదని కట్టుకథలు అల్లారు. అయినా సునంద అవేవీ లక్ష్య పెట్టలేదు.

 

    గోగులపల్లి సర్పంచ్ చదువూ సంస్కారం కలవాడు. ఆ ఊళ్ళో మహిళా మండలికూడా ఎంతో బాగా నడుస్తోంది. ఆ సర్పంచ్ కూ, ఆ ఊరి మహిళలకూ సునంద అంటే ఎంతో గౌరవం. అక్కడకు వెళ్తే ఆ సర్పంచ్ భార్య సునందను మరోచోట భోజనం చెయ్యనివ్వదు. సాధారణంగా సునంద ఎవరింట్లోనూ భోజనం చెయ్యదు.

 

    పొద్దు వాటాలింది. చినుకులు పడుతున్నాయి. అయినా చింతలపాలెం నుంచి సునంద హెడ్ క్వార్టర్స్ కు బయలుదేరింది. ఆ ఊరినుంచి డేగలమర్రి మూడు మైళ్ళుంది. ఆ వూరికి రోడ్డులేదు. వర్షాకాలం బండి కూడా పోదు. రాత్రిపూట ఆ ఊళ్ళో వుండటం ఇష్టంలేని సునంద కాలి నడకన పొలం గట్టుమీద నడుస్తోంది. జారుతున్న కాళ్ళను నిలదొక్కుకుంటూ తలవంచుకొని నడుస్తూంది. ఆ రోజు ప్యూన్ కూడా తోడురాలేదు. శెలవు పెట్టాడు.

 

    "ఏవఁ మ్మోయ్! సేవికా ఎక్కడకు? గోగులపల్లెకేనా?"

 Previous Page Next Page