సునంద చివ్వున తలెత్తింది. గట్టుమీద ఎదురుగా చింతలపాలెం సర్పంచ్ నిల్చుని వున్నాడు. సునందకు వళ్ళు మండిపోయింది.
"ఏమిటా పిలుపు?"
"ఏం నువ్వు సేవికవుకాదా?"
"కాదు. నాడెజిగ్నేషన్ ఎక్స్ టెన్ షన్ ఆఫీసరు. పలికితే ఆ పేరుతో పిలవండి. లేదా పేరుపెట్టి మర్యాదగా పిలవండి" అన్నది సునంద.
"ఎట్టెట్టా నువ్వు ఆఫీసరువా? ఏం ఆఫీసరు కాలినడకన వెళ్ళే ఆఫీసరు. అంత రోషమెందుకు? తెలుగులో ముఖ్య సేవిక అంటారుగా?"
"ఒకప్పుడు. మీ లాంటివాళ్ళు సేవికా, సేవికా! అంటూ అవమానిస్తున్నారనే ప్రభుత్వం మా డెజిగ్నేషన్ మార్చింది."
"అబ్బో కత చానా వుందే? అది సరేగానీ చీకటిపడుతూంది. పైగా వర్షం కురుస్తోంది. పొలం గట్లమీద వంటరిగా పడిపోతున్నావ్ ఎక్కడికి, గోగుల పల్లికేనా?"
"అది మీ కనవసరం! తప్పుకోండి!" అన్నది సునంద రోషంగా.
"అంత రోషం దేనికి ఉన్న మాటంటే? రాత్రికి అక్కడే పడుకుంటావా?"
అతని మాటల్లోని అంతరార్ధం బోధపడింది. "అవును!" అన్నది కసిగా.
"పోనియ్! ఒక్క రాత్రి మా దగ్గిర పడుకోకూడదూ?" పళ్ళికిలించాడు.
"షటప్?" గట్టిగా అరిచింది సునంద.
"ఏమిటి మహా ఎగిరిపడుతున్నావ్? తప్పుమాటేమన్నాను? ఒకరోజు మా ఊళ్ళో పడుకోకూడదా అన్నాను" అంటూ వెకిలిగా నవ్వాడు సర్పంచ్.
సునందకు ఆ గట్టుమీదనుంచి కిందకు తొయ్యాలనిపించింది.
"తప్పుకోండి!"
"తప్పుకోకపోతే?"
"అధిక ప్రసంగం చెయ్యొద్దు!"
"ఏం మహా పతివ్రతలా టెక్కు చేస్తున్నావ్? నా కంటే ఆ గోగులపల్లి ప్రెసిడెంటు బాగుంటాడా?" అంటూ సునంద రెక్కపట్టుకున్నాడు.
సునంద ఒక్కసారిగా అతన్ని తోసేసింది. జారుతున్న గట్టుమీద కాలు నిలదొక్కుకోలేక పంటచేలో పడిపోయాడు.
సునంద జారుతున్న గట్టుమీద బలంగా పాదాలు మోపుతూ ముందుకు సాగిపోయింది, వెనక్కు తిరిగి చూడకుండా.
రోజంతా విధి విరామం లేకుండా తన విధ్యుక్త ధర్మాన్ని నిర్వహించిన సునంద బాగా అలసిపోయి వుంది. ఈ సంఘటనతో మనస్సు కలత బారింది. ముఖం వడలిపోయింది. ఎలాగో ఇంటికి చేరుకుంది.
భోజనం చెయ్యకుండా మంచానికి అడ్డంపడి కళ్ళు మూసుకుంది.జానకిరామయ్య మాటలు గుర్తువచ్చాయి. నిజంగా తాను ఈ ఉద్యోగం చెయ్యగలదా? ఆడపిల్లలు పల్లె పల్లె తిరిగి ఉద్యోగం చెయ్యడం ఎంత కష్టమో తనకు ఇప్పుడు అర్ధమౌతూంది. అయినా తప్పదు. ఎన్ని సమస్యల్నయినా ధైర్యంతో, ఆత్మ విశ్వాసంతో ఎదుర్కోక తప్పదు.
ఆలోచనలనుంచి, నిద్రలోకి జారిపోయింది సునంద.
27
"చూడు రామ్మూర్తీ! ఆ మిగిలిన ఫండ్స్ అన్నీ వర్క్స్ కు మళ్ళించు" అమితి ఎస్టిమేట్సు గురించి మాట్లాడుతూ అన్నాడు నరహరి బి.డి.ఓ.తో.
"మొత్తం అటే డైవర్ట్ చెయ్యమంటారా?" బి.డి.ఓ అంటుండగానే సునంద లోపలకు వచ్చింది.
నరహరి ముఖం విప్పారింది. "ఏమిటి సునందా? ఏం కావాలి?" అతి మృదువుగా అడిగాడు నరహరి.
సునంద నరహరి ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా "నేను రాబందులపాడు మహిళామండలి విజిట్ కు వెళ్తున్నాను" అన్నది బి.డి.ఓ.తో.
"మంచిది వెళ్ళు!" అన్నాడు బి.డి.ఓ. "చిలకలపాడు వెళుతున్నాను. నాతో రా జీపులో!" అన్నాడు నరహరి.
"రాబందులపాడు మహిళా మండలి ప్రోగ్రాం ఇచ్చాను. ఇవ్వాళ బాల్వాడీ ప్రారంభోత్సవం కూడా వుంది. వాళ్ళంతా నా కోసం ఎదురుచూస్తూ వుంటారు" అన్నది సునంద.
"బాల్వాడీ ప్రారంభోత్సవమా? ఏమయ్యా నాకు చెప్పలేదేం? వాళ్ళకు ఫండ్స్ ఎక్కడనుంచి వచ్చాయి?" తీవ్ర కంఠంతో అడిగాడు నరహరి_ బి.డి.ఓ. ని.
"అదేనండీ! స్త్రీలకూ, శిశువులకూ ప్రత్యేకంగా కేటాయించిన ఐదు శాతం జనరల్ ఫండ్స్ మూడు సంవత్సరాలుగా ఖర్చు పెట్టలేదు. చాలా ఎమౌంట్ ఎక్యూమిలేట్ అయివుంది. సునందే ఈ ప్రొపోజల్ పెట్టింది. మీరు ఢిల్లీ వెళ్ళినప్పుడు శాంక్షన్ చేశాం!" అన్నాడు బి.డి.ఓ.
నరహరికి తన పర్మిషన్ తీసుకోకుండా ఫండ్స్ రిలీజ్ చేసినందుకు చెడ్డకోపం వచ్చింది. కాని బి.డి.ఓ.ని ఏమీ అనలేక పోయాడు. అతనితో మంచిగా వుంటేగాని మిగిలిన ఫండ్స్ వర్క్స్ కు మళ్ళించడానికి వీల్లేదు.
"సరే! పో!" అంటూ ఆ కోపం సునంద మీద చూపించాడు.
సునంద వెళ్ళినవైపే గుర్రున చూస్తున్న నరహరితో "ఇంకా కొత్త గదండీ! మెల్ల మెల్లగా ఆమే దోవలోకి వస్తుంది" అన్నాడు బి.డి.ఓ.
బయటికి వెళ్తున్న సునందకు 'లూ' ఎదురైనాడు. తలవంచుకు వెళ్ళిపోతున్న సునందను తిరిగి తిరిగి చూస్తూ లోపలకు వచ్చాడు.
నరహరి ముఖ కవళికలు మార్చుకొని లూ ముఖంలోకి తీవ్రంగా చూశాడు.
లూ జంకుతూ నరహరి ఎదురు కుర్చీలో కూర్చున్నాడు.
"ఏం?" అన్నట్టు చూశాడు నరహరి లూ ముఖంలోకి.
"అదే బావా! బిల్స్ విషయం" నట్టుతూ అన్నాడు లూ.
నరహరి మూడ్ మూర్చుకొని సూపర్ వైజర్ని పిలిపించాడు.
"ఏం సార్! పిల్చారా?" సూపర్ వైజర్ నిలబడే ప్రశ్నించాడు.
"అవును! ఆ బిల్డింగూ, రోడ్డూ తాలూకు పేమెంటు గురించి ఏం చేశావ్? ఇంకా బిల్స్ ప్రిపేర్ చెయ్యలేదేం?" అడిగాడు నరహరి.
"ఆ బిల్డింగ్ ఇంకా పూర్తికాలేదు సార్!"
"బిల్డింగ్ పూర్తి అవుతుంది లేవయ్యా! బిల్ వెయ్యి! ఆ రోడ్డుకు సంబంధించిన బిల్లుకూడా పట్టుకురా!"
"సార్! ఆ రోడ్డుకు ఇంకా మెటల్ కూడా తోలలేదు సార్!" నీళ్ళు నములుతూ జవాబిచ్చాడు సూపర్ వైజర్.
"బిల్లు ప్రిపేర్ చెయ్యవయ్యా అంటే వెధవ సోదంతా మాట్లాడతావేం!" గుడ్లెర్ర జేశాడు నరహరి.
సూపర్ వైజర్ భయంతో బిగుసుకు పోయాడు.
బి.డి.ఓ. ఆశ్చర్యంగా నరహరి ముఖంలోకి చూస్తూ వుండిపోయాడు.
లూ ముఖం చాటంత చేసుకొని బావగారి కేసి ప్రశంసా పూర్వకంగా చూశాడు.
నరహరి బెదిరిపోయిన సూపర్ వైజర్ని లాలిస్తూ అన్నాడు. "బిల్లుకీ పనులు పూర్తి కావడానికీ సంబంధం ఏమిటి? ఇట్లా అయితే ఎట్లా బ్రతుకుతావయ్యా? ఒకదానికొకటి లంకెవేసి ఏదీ కాకుండా కాలెత్తుక్కూర్చోవడం తెలివైనవాళ్ళ లక్షణం కాదయ్యా! దేని పాటికి అది జరిగిపోతూనే వుండాలి. ఊఁ కానియ్! త్వరగా బిల్స్ తయారుచేసి పట్టుకురా! మళ్ళీ రేపు నేను ఊళ్ళో వుండను."
"అలాగే సార్!"
"అదీ అట్లా కాస్త బ్రతుకుతెరువు కూడా తెలుసుకో! ఊరికే గొడ్డుచాకిరి చేస్తే ప్రయోజనం ఏమీ ఉండదు" అన్నాడు నరహరి.
"పనిలోపని! ఆశ్రమదానం తాలూకు రోడ్డుకి చేసిన రిపేర్సుక్కూడా బిల్లువేసి పట్టుకురా!" లూ అందుకొని అన్నాడు సూపర్ వైజర్ తో.
బి.డి.ఓ. లూ మాటలకు బిత్తరపోయాడు.
"అదేమిటి సార్! ఆ రోడ్డుకు అప్పుడే రిపేర్స్ ఏమిటి? అయినా ఎస్టిమేట్స్ వెయ్యకుండా రిపేర్ ఎలా చేయించారు సార్?" ఆశ్చర్యంగా అన్నాడు బి.డి.ఓ.
నరహరి కనుబొమలు ముడిచాడు.
"అదేమిటి సార్! సోమరిపోతులు వేసిన రోడ్డు ఎంతకాలం వుంటుంది?" అన్నాడు లూ బి.డి.ఓ. తో.
"మరి ఎస్టిమేట్స్ మాటో!"
"మీరు ఎస్టిమేట్స్ వేయించేదాకా కూర్చుంటే ఆడున్న కంకరంతా కొల్లేరుపాలే. అందుకే బావగారితో ముందుగానే ఒక మాటజెప్పి ఏకదమ్మున పనిచేయించే బిల్లు పట్టుకొచ్చాను. రూ|| 17,336_66 న.పై.లు. కావాలంటే కూడి చూసుకోండి." అంటూ బిల్లు బి.డి.ఓ. ముందు పెట్టాడు లూ.
"పదిహేడువేలే! ఇదేమిటిసార్! కొత్త రోడ్డుకు డబుల్ అయింది రిపేర్సుకు?" బి.డి.ఓ. వాపోతూ అన్నాడు నరహరితో.
"ప్రెసిడెంటుగారి కారుకు రిపేర్లూ, దానికి షెడ్డూ, బి.డి.ఓ.గారి ఇంటికి సప్లయి చేసిన.... ...."
"వెధవ నస!" లూ మాటల్ని మధ్యలోనే అందుకొని అన్నాడు నరహరి.
"ఇంకా నిల్చున్నావేరా? పో? వెళ్లి త్వరగా బిల్స్ తయారుచేసి తీసుకురా!" సూపర్ వైజర్ తో అని నరహరి లేచి బయటికి వెళ్లిపోయాడు.
28
రాబందులపాడు మహిళామండలి ప్రెసిడెంటు కామాక్షమ్మ చెయ్యి విరిగిన చెక్క కుర్చీలో కూర్చుని వుంది. లావుపాటి శరీరం, నలిగిన పట్టుచీరా, మెడ తిరగని నగలతో బందిపోటు దొంగలా వుంది. సెక్రటరీ వెంకటలక్ష్మి బెంచీమీద, దొంగల నాయకుడికి ఎదురు తిరగలేని మంచిదొంగలా కూర్చుని వుంది.