"నూరేళ్ళా? ఎందుకు బాబూ! నాకు ఓల్డ్ ఏజ్ అంటే మహాభయం!" అంటూ కుర్చీకి నిండుగా కూర్చుంది.
"ఎంతమాట! మీలాంటివారికి నూరేళ్ళు చాలవు! పదిమందికి ఉపయోగపడే మనుషులు!"
"ఆ ఏదోలెండి మానవజన్మ ఎత్తినందుకు ఆ మాత్రం మానవసేవ చెయ్యకపోతే జీవితానికి సార్ధకత ఏముంది?" అంటూ సునందను పరిశీలనగా చూడసాగింది.
"సునంద! బి.ఏ.ఫస్టుక్లాసులో పాసయింది. మా హాస్టల్లోనే వుండి చదువుకుంది. బుద్ధిమంతురాలు."
సునంద నమస్కరించింది. మిసెస్ వైకుంఠం చిరునవ్వుతో తల వూపింది.
"ప్రస్తుతం ఆ అమ్మాయి ఉద్యోగాన్వేషణలో వుంది. ఈ రోజుల్లో మీలాంటి వారి అండదండలు లేకపోతే ఉద్యోగాలు దొరకవు. మీరే ఎలాగయినా ఆ అమ్మాయికి ఉద్యోగం ఇప్పించాలి" మిస్ గ్రేస్ అన్నది.
"ఓ అదెంత పని? ఏం అమ్మాయ్! పల్లెటూళ్ళల్లో పనిచేస్తావా?" సునందను అడిగింది. మిసెస్ కైలాసం.
"చేస్తానండీ! వినయంగా సమాధానంగా ఇచ్చింది సునంద.
ఒక అప్లికేషన్ రాసి పట్టుకురా? నీ క్వాలిఫికేషన్స్ తో.
"సునందా! వెళ్ళమ్మా! గదిలోకి వెళ్ళి అప్లికేషన్స్ రాసి పట్టుకురా! ఈ లోపల మా విషయాలేవో మాట్లాడుకుంటూ వుంటాం"! అన్నది మిస్ గ్రేస్.
వెళుతున్న సునందతో "త్వరగా రావాలి" అన్నది మిసెస్ వైకుంఠం.
కారు ఎక్కుతున్న మిసెస్ వైకుంఠానికి అప్లికేషన్ అందించి నమస్కరించింది సునంద.
మిసెస్ వైకుంఠం అప్లికేషన్ అందుకుంది. కాని నమస్కారం అందుకోలేదు.
"ఆ విషయం మర్చిపోకండి! ఎలాగయినా సునందకు ఉద్యోగం ఇప్పించాలి" అన్నది మిస్ గ్రేస్.
కారు వెళ్ళిపోయింది.
"నాకు ఉద్యోగం వస్తుందా మేడం?"
"మిసెస్ వైకుంఠం తల్చుకుంటే రేపీపాటికి నీకు ఉద్యోగం ఇప్పించగలదు. ఆమెకు నాతో కొంత పని వుందిలే. నీకు ఉద్యోగం ఇప్పించక తప్పదు."
సునంద కళ్ళు సంతోషంతో వెలిగాయి.
మూడో రోజు సునందను పిల్చి వార్డెన్ అపాయింట్ మెంట్ ఆర్డరు అందించింది.
సునంద మనస్సు కృతజ్ఞతతో నిండిపోయింది.
డేగలమర్రి సమితిలో ముఖ్య సేవికగా టెంపరరీ ఉద్యోగం వచ్చింది.
తల్లిదండ్రులకు ఈ శుభవార్త విన్పించడానికి సునంద ఇంటికి వచ్చింది.
బండి దిగి సునంద స్థాణువులా నిలబడిపోయింది. ఇంటిముందు జనం గుమిగూడి వున్నారు. ఏం జరిగిందో తెలియదు. కాని జరగరానిది ఏదో జరిగిందని తెలుసుకుంది.
రెక్కపట్టుకుని తులశమ్మ సునందను లోపలకు నడిపించుకు తీసుకెళ్ళింది.
వసారాలో ధర్మయ్య గుంజకు చేరబడి వున్నాడు. అతనికి దగ్గరగా జానకిరామయ్య, మరికొంతమంది ఊళ్ళో పెద్దలు కూర్చుని వున్నారు.
సునంద ఒక్క ఉదుటున మెల్లగా ఇంట్లోకి వచ్చింది. చుట్టూ స్త్రీలు కూర్చునివున్నారు. తల్లి శవం చాపమీద వుంది. సునంద చూస్తూ నిలబడిపోయింది. సరస్వతమ్మ ప్రశాంతంగా నిద్రపోతున్నట్టుంది. నొసట కుంకుమ చెరగలేదు. దువ్వుకున్న తల రేగలేదు.
ఓ పక్కగా కుప్పగా పోసివున్న పూలూ, సగం కట్టిన మాలా, కళ్ళజోడూ పడివున్నాయి.
"అమ్మా!" అంటూ తల్లి శవంమీద విరుచుకు పడిపోయింది సునంద.
"అమ్మా లేమ్మా! నేను వచ్చానమ్మా! నాకు ఉద్యోగం దొరికింది. ఇక నువ్వు మాలలు కట్టనక్కర్లేదు. నువ్వు కష్టపడక్కర్లేదు. నేను నిన్ను పోషిస్తానమ్మా!" అంటూ కదిలి కదిలి ఏడవసాగింది సునంద.
ఎవరిదో ఓ హస్తం సునంద తలను ఓదార్పుగా నిమిరింది.
సునంద చివ్వున తలెత్తి చూసింది.
"నాన్నా!" దుఃఖం గుండెల్ని బద్దలు కొట్టుకుంటూ పెల్లుబికింది. తండ్రి చేతులకు చుట్టుకుపోయింది.
తండ్రి, కూతుర్ని పొదివిపట్టుకొని దుఃఖాన్ని దిగమింగుకుంటున్నాడు.
"కూతురికి ఉద్యోగం వచ్చింది. ఆ శుభవార్త వినకుండానే కళ్ళు మూసింది పాపం!"
"ఆమె ఆ అదృష్టానికి నోచుకోలేదు."
"అయితేనేం! పుణ్యాత్మురాలు!"
"ఇద్దరూ పార్వతీ పరమేశ్వరుల్లా వుండేవారు."
"ఇంకా ఆలస్యం ఎందుకు? కానివ్వండి! అమ్మాయికూడా సమయానికి వచ్చింది. ఆఖరు చూపైనా అందుతుందో లేదో అనుకున్నాం!"
తలొక రకంగా సానుభూతి చూపుతున్నారు.
వాకిట్లో మగవారు సరస్వతమ్మ అంతిమ ప్రయాణానికి సన్నాహాలు జరుపుతున్నారు.
"బతికినన్నాళ్ళూ అనుబంధాలు పెంచుకొని పాకులాడతాం! కాని ఎప్పుడూ మనిషి వంటరివాడే! వంటరిగానే వచ్చి వంటరిగానే పోతాడు" అన్నాడు జానకిరామయ్య.
24
"ధర్మయ్యా! ఇవ్వాళేనా అమ్మాయి ప్రయాణం!" వసారాలో గోడకు చేరబడి దిగులుగా కూర్చొని వున్న ధర్మయ్యను అప్పుడే లోపలకు ప్రవేశించిన జానకిరామయ్య ప్రశ్నించాడు.
"అవును!" అన్నట్టు ధర్మయ్య తల ఆడించాడు.
"ఏమోనయ్యా ధర్మయ్యా! నువ్వేమన్నా చెప్పు! నాకు మాత్రం అమ్మాయి ఈ ఉద్యోగం చెయ్యడం ఇష్టంలేదు. పంచాయితీ సమితుల్లో ఆ పల్లెటూర్లలో అనేక రకాలైన మగవాళ్ళ మధ్య తిరుగుతూ ఆడపిల్లలు ఉద్యోగం చెయ్యడం అంటే అశిధారావ్రతం చెయ్యడమే!"
"ఉద్యోగం అన్న తర్వాత ఎక్కడైనా పదిమంది మధ్య చేయాల్సిందేగా బాబాయ్!" మంచినీళ్ళ గ్లాసు జానకిరామయ్యకు అందిస్తూ అన్నది సునంద.
"ఇది అన్ని ఉద్యోగాల్లాంటిది కాదమ్మాయ్! రకరకాల గొడవలు వింటున్నాం! నీకు తెలియదమ్మా!"
"మన పని మనం నిజాయితీతో చేస్తే గొడవ లెందుకుంటాయ్? ఈ ఉద్యోగంలో అంతో ఇంతో ప్రజలకు సేవచేసే అవకాశం వుంది. మిగతా ఉద్యోగాల్లో ఆ అవకాశాలు తక్కువ బాబాయ్! నాన్న నన్ను చదివించింది ఉద్యోగం చేసుకొని కేవలం నా పొట్ట నేను పోషించుకోవాలని కాదు. నా కాళ్ళమీద నేను నిలబడి, సమాజానికి కూడా కొంత సేవ చెయ్యాలని నాన్న ఆశయం. అందుకే నాకు ఉద్యోగం వచ్చింది" అన్నది సునంద.
ధర్మయ్య గర్వంగా కూతురుకేసి చూశాడు.
"ఇప్పుడేమంటావ్?" అన్నట్టు ధర్మయ్య జానకిరామయ్య ముఖంలోకి చూశాడు.
"సేవా! సేవా! అంటూ మీ భార్యాభర్తలు జీవితాన్నే అంకితం చేశారు. అది చాలదూ? అమ్మాయి తల్లోకి కూడా ఎందుకయ్యా ఈ పిచ్చి ఎక్కిస్తావు?"
"నాన్న నాకేం చెప్పలేదు బాబాయ్! కాని నాన్న అడుగుజాడల్లో పెరిగిన నాకూ ఉడతాభక్తిగా ఏదో ప్రజలకోసం చెయ్యాలని వుండటంలో అసహజం ఏముంది? నేనేదో ప్రజలను ఉద్దరించగలను అనడంలేదు. చెయ్యాలనే కాంక్ష ఉండటంలో తప్పులేదుగా?"
"అమ్మా! నీతి నిజాయితీతో, సంఘ సేవా తత్పరతతో, నిస్వార్ధంగా కృషిచేసేవారు, ఎక్కడైనా నెగ్గుకు రాగలరు. నీ విధి నిర్వహణలో ఎన్ని ఇబ్బందులు కలిగినా ఇది మాత్రం గుర్తుంచుకో తల్లీ!" అన్నాడు ధర్మయ్య.
"ఈ పిచ్చిమాలోకాలు ఇక మారరు" అన్నట్టు తండ్రీ కూతుళ్ళను మార్చి మార్చి చూశాడు జానకిరామయ్య.
"అది కాదయ్యా! ముఖ్య సేవికగా ఉద్యోగం చెయ్యడమంటే మాటలు కాదు. పల్లె పల్లెకూ వెళ్ళాలి. మగవాళ్ళ మధ్య తిరగాలి. రకరకాల కథలు వింటున్నాం! రాబందుల మధ్యలో ఒక రామచిలుక ప్రవేశించినట్టే ఈ ఉద్యోగంలో ప్రవేశించడం అంటే!"
ధర్మయ్య కొంచెం డీలా పడిపోయాడు.
"మనం మంచివాళ్ళం అయితే ఎవరేం చెయ్యగలరు బాబాయ్! అదీకాక అందర్నీ రాబందులనే ఎందు కనుకోవాలి?"
"అవునమ్మా! అందరూ చెడ్డ వాళ్ళనడంలేదు. కొందరుంటే చాలదా? అన్ని సమితుల్లో పనిచెయ్యడం కష్టం కాకపోవచ్చును. కాని కొన్ని చాలా భయంకరంగా వుంటాయి. మంచివాళ్లుకూడా నోరు తెరిచి అన్యాయాన్ని ఎదుర్కోలేని పరిస్థితులు వుంటాయి. ముఖ్యంగా నువ్వు వెళుతున్న సమితి అంత మంచిగా లేదమ్మా! అదే నా బాధ" అన్నాడు జానకిరామయ్య.
"పరిస్థితులు లొంగకుండా నా విధిని నేను నిర్వహించగలననే ఆత్మవిశ్వాసం నాకుంది బాబాయ్!" అన్నది సునంద దృఢంగా.