Previous Page Next Page 
పిపాసి పేజి 30


    అతని ఇష్టప్రకారమే, నెమలికంఠంరంగు, రోపురంగు అంచుది, కంచిచీర కట్టుకుంది. ముత్యాల నెక్లెస్ వేసుకుంది. ఇంట్లో పూసిన ఎఱ్ఱగులాబీని, జడలో పక్కగా పిన్నులో గుచ్చి పెట్టుకుంది.     


    "రాధీ..... మా బాస్ రామచంద్రరావుగారు వీరు, వారి సతీమణి దుర్గాబాయమ్మగారు." పరిచయం చేశాడు మధన్. నమస్కారం చేసింది రాధిక.


    "భలేవాడివే బాబూ.... చెప్పావుకావేం, రత్నావళిని చేసుకున్నట్టు" అంది దుర్గాబాయమ్మ.


    "రత్నావళి ఏమిటి, రాధిక అని చెప్పాడు" అన్నారు రామచంద్రరావుగారు.


    రాధిక గొంతులో వెలక్కాయపడ్డట్టయింది. ఏదో భయం, బాధ, ఉక్కిరి బిక్కిరవుతున్నట్టనిపించింది. బ్యాగులోంచి, చేతిరుమాలుతీసి, మొహం మీద పెట్టిన చెమటని మెల్లగా తుడుచుకుంది. అది గమనిస్తూన్న మధన్," ఈమె అసలు పేరు రాధికే." అని చెప్పి," అన్నట్టు మీ ప్రయాణం ఎలా జరిగింది" అంటూ మాట మార్చేశాడు.    


    "బాగానే జరిగింది బాబూ" అని సమాధానం చెప్పి, "ఏవండోయ్.... ఈ అమ్మాయి ఎంత బాగా డాన్సు చేస్తుందో తెలుసా? అద్భుతం.... ఏమండీ.... ఈసారి మన ఆఫీసు వార్షికోత్సవాలకి, ఈమె డాన్సు పెట్టించాలి. ఏం బాబూ..... నీకేమైనా అభ్యంతరమా?" అంది.     


    సమాధానం చెప్పకుండా రాధిక, మధన్ మొహమొహాలు చూసుకున్నారు.


    "ఏమిటి? ఇద్దరూ మాట్లాడ్డం లేదు. పెళ్ళయ్యాక డాన్సు మానేశావా ఏమిటమ్మా" అంది చూస్తూ అమాయకంగా.    


    "అవునండీ..... మానేశాను." అంది ముక్తసరిగా రాధిక.


    "ఎందుకమ్మా..... అంత చక్కటి కళని చేతిలో పెట్టుకుని.... పోనీ, పిల్లాపాపా కలిగే దాకా చెయ్యొచ్చుగా అంది." రాధిక జవాబివ్వకపోవడం చూసి, "పోనీలే. కనీసం మన ఆఫీసు ఫంక్షనికి చేద్దువుగాని" అంది, రాధిక, సమాధానానికి ఎదురు చూడకుండానే.


    ఆవిడ ఇన్నిసార్లు చెబుతూ వుంటే మాట్లాడకుండా ఊరుకోవడం, బావుండదనిపించింది మధన్ కి. "అలాగే లెండి, తప్పకుండా చేస్తుంది' అన్నాడు. రాధిక ఉలిక్కిపడింది. మధన్ చూడనట్టే ఊరుకున్నాడు. భోజనాలయ్యాక, మధన్ కి సూటు గుడ్డా, రాధికకి పట్టుచీరా పెట్టారు రామచంద్రరావుగారు  దంపతులు. ఆ దంపతులిద్దరికీ, పాదాభివందనం చేసి, ఆశీస్సులందుకున్నారు మధన్, రాధికా.   


    కారు మౌంటు రోడ్డుమీద జారిపోతున్నట్టుగా పోతోంది. రాధిక ఎటో చూస్తోంది ఆలోచనలతో.


    "రాధీ.... కోపం వచ్చిందా?"


    "లేదు."


    "మరయితే మాట్లాడవేం?"


    "మనసు బాగాలేదు."


    "సారీ..... నీకిష్టం లేదని తెలిసి కూడా, ఆవిడ అంతగా అడుగుతుంటే కాదనలేకపోయాను."


    ...................


    "క్షమించు రాధీ".... ప్రాధేయపడుతూ, చేతులు పట్టుకున్నాడు.


    'అంతమాటనకండి. ఇందులో మీ తప్పేమీ లేదు. ఆ డాన్సరు ముద్ర నా మొహం నుంచి పోవడం లేదు."


    "అయినా ఒకటి చెప్పనా రాధీ..... ఎంతమంది, పెళ్ళిచేసుకున్నాక నాట్యం చెయ్యడం లేదూ? అందులో తప్పేముంది?"   


    "దయచేసి ఇక ఆ ప్రస్తావన ఆపండి, నేను తప్పొప్పులు ఎంచడం లేదు. నాకిష్టం లేదు అని మాత్రమే అన్నాను."  


    "ఈ ఒక్క విషయంలో, మనకి ఎందుకింత, భిన్నాభిప్రాయాలున్నాయో తెలీటం లేదు" అన్నాడు మధన్ ఆమెకేసి చూస్తూ.


    "నా గతజీవితమే అందుకు కారణం."


    "ఎంతసేపూ గతాన్నే తలుచుకుని ఎందుకు బాధ పడతావ్? భవిష్యత్తుని చూసుకోవాలి."


    "అంటే."


    "నీ కళంటా వృధా పోకుండా, ఉపయోగపడేదిలా వుండాలి."


    "రాధిక అదోలా చూసింది అతని మొహంలోకి. అది గ్రహించిన మధన్ మరి మాట్లాడలేదు.


    "వెన్నల బావుంది కదూ?" అన్నాడు మాట మారుస్తూ.


    "ఊ".... అంది.


    "వెన్నెల్లో చలివేస్తోంది సుమా" అంటూ దగ్గరగా జరిగాడు.


    రాధిక మాట్లాడలేదు. ఆమె బుర్రనిండా ఆలోచనలు. సీలింగ్ ఫానులా గిర్రున తిరుగుతున్నాయ్.   


    కారు ఇంటిముందు ఆగింది. ఇద్దరూ మౌనంగా కారుదిగి కారు షెడ్ లో పెట్టి లోపలికెళ్ళారు. రాజేశ్వరమ్మ మేలుకునే వుంది కాబోలు, వెంటనే తలుపు తీసింది. మేడమీదకెళ్ళి బట్టలు మార్చుకుని మంచంమీద వాలిపోయారిద్దరూ, ఆలోచనలతో అలసిపోయి. మర్నాడంతా కూడా రాధిక మౌనంగా వుంది. అందుకే మధన్ మళ్ళీ ఆ విషయాన్ని కదపలేదు. కోడలి పరధ్యానాన్ని చూసి. "ఏమమ్మా ఒంట్లో బాగులేదా" అని అడిగింది రాజేశ్వరమ్మ.  


    "బాగానే వుందత్తయ్యా" అనేసి ఊరుకుంది రాధిక.


    కానీ, మళ్ళీ నాట్యం చెయ్యాలంటే ఏదో ఒక రకమైన బాధ. మనసు ఎదురు తిరుగుతోంది. అంతలోనే" మధన్ మాట నిలబెట్టడం నీ బాధ్యత. నీకోసం అతనెంతో త్యాగం చేశాడు. ఈ మాత్రం చెయ్యలేవా నువ్వు" హృదయం బోధిస్తోంది.

 Previous Page Next Page