Previous Page Next Page 
డా|| వాసిరెడ్డి సీతాదేవి సాహిత్యం పేజి 30


    రాజారావుకి కోపమూ, నవ్వూ కూడా వచ్చాయి.

 

    "ఎం.ఎల్.సి. అవుతానంటే నేనెందుకు మధ్య అడ్డు చెబుతాను? అయి తీరాల్సిందేననుకుంటే అవు" అన్నాడు రాజారావు సుడులు తిరుగుతున్న సిగరెట్ పొగలోకి చూస్తూ.

 

    అరుంధతి అభిమానం లోతుగా దెబ్బతిన్నది. రోషం, కోపం ముప్పిరిగొన్నాయి మనసులో.

 

    "మీరు ఉంచుకున్న మనిషికి ఎవరో ఎందుకు సీటు ఇస్తారు?" కసిగా అంది అరుంధతి.

 

    రాజారావు ఓ క్షణం ఆమెకేసి చూశాడు, ఆమె కోపంతో బుసకొడుతున్న నాగినిలా కనిపించింది. రాజారావుకూ చాలా కోపం వచ్చింది.

 

    "నువ్వు కోపంలో అన్నా నిజమే అన్నావు. దీన్నిబట్టి నీకు సమాజంలో వున్న స్థానం ఏదో నీకు బాగా తెలుసుననే తెలుస్తూంది. నువ్వు చాలా తెలివైనదానివి. ఈ సంగతి కూడా నీకు తెలిసే వుంటుంది. నేను వుంచుకున్న మనిషిని ఎం.ఎల్.సి.ని చెయ్యమంటే నలుగురూ ముఖం మీదే వూస్తారు." చాలా కటువుగా వుంది రాజారావు కంఠం.

 

    అరుంధతి మనస్సు రోషంతో, అవమానంతో విలవిలలాడిపోయింది.

 

    "ఎందుకు వుయ్యాలి? మనిద్దరం ఒకే తప్పు చేస్తున్నాం. నీకు మాత్రం సమాజంలో తలెత్తుకొని తిరిగే అధికారం వుంది. నిన్ను పదిమంది గౌరవిస్తారు. పూలదండలు వేస్తారు. కాని నేను ఆడదాన్ని, అందుకే...కాదు...నువ్వు నాకు సరైన స్థానం ఇవ్వలేదు. నీ జీవితంలో, నీ ఇంట్లో, అంటే- నువ్వే నన్ను గౌరవించలేదు. అందుకే సమాజం కూడా గౌరవించటంలేదు." అరుంధతి కంఠంలో ఏ భావమూ ధ్వనించలేదు. నిర్లిప్తంగా అన్నది.

 

    "నేను నీకు తగినంత గౌరవాన్ని ఇచ్చాను. నేను చాలా భరించాను, ఇంక భరించే ఓపిక లేదు నాలో. బయట తలెత్తుకోకుండా వున్నాను. ఢిల్లీ వరకూ నామీద రిపోర్టులు పోయాయి. ఈ ఎలక్షన్స్ లో గెలిచే నమ్మకం కూడా లేదు. నా ఆరోగ్యం కూడా బాగా దెబ్బతిన్నది."

 

    అరుంధతికి రాజారావు మీద అసహ్యం వేసింది, లోకం మీద అసహ్యం వేసింది, తనమీద తనకే అసహ్యం వేసింది.

 

    "మీరంత అనిష్టంగా ఇక్కడకు రానక్కరలేదు." కోపంలో అనేసింది అరుంధతి.

 

    "అదే నీ కోరిక అయితే అలాగే జరుగుతుంది." రాజారావు చాలా కాలంగా ఆ మాట కోసమే ఎదురు చూస్తున్న వాడిలా చివుక్కున లేచి నిల్చున్నాడు. విసురుగా బయటకు వెళ్ళిపోయాడు. అరుంధతి కళ్ళప్పగించి చూస్తూ కూర్చుండిపోయింది. ఆమెకు మతి పోయినట్టయింది. అంతకు ముందు ఎన్నోసార్లు ఇంతకంటే ఎక్కువ మాటలు అన్న రోజులున్నాయి. అతను చిన్న పిల్లవాడిలా తన దగ్గర ఏడ్చిన రోజులు వున్నాయి. ఒకసారి చాలాకాలం క్రితం దాదాపు పది సంవత్సరాల క్రితం ఒకసారి కోపంలో ముఖం కూడా చూపించవద్దన్నది. దానికి అతను ఏడ్చాడు. బాధ పడ్డాడు. అతను అంత బాధపడడం తను సహించలేకపోయింది. పసివాణ్ణి లాలించినట్లు లాలించి బుజ్జగించింది. తనను చూడకుండా వుండలేను అనేవాడు. తను లేని జీవితానికి అర్ధమే లేదని ఎన్నిసార్లు అనలేదు? అవును! ఆ రోజులు వేరు. ఆ రోజుల్లో తను వయస్సులో వుండేది. శరీరంలో ఆకర్షణ వుండేది. అతనిలో చెలరేగిన కోర్కెలు, బలిసిన గుర్రాల్లా పరుగులు తీసే రోజులు అవి. ఈనాడు తనలో ఆ ఆకర్షణ లేదు. ఆయనలో ఆ కోర్కెలు లేవు. దీనికోసమేనా తను ఇంత సాహసం చేసింది? ఈ రోజుకోసమేనా తను భర్తనూ, కన్నబిడ్డనూ, వంశ గౌరవాన్నీ కాలదన్ని వచ్చింది? ఈ నిమిషం కోసమేనా జీవితం తనకిచ్చిన హాలాహలాన్నంతా నవ్వుతూ తాగింది? ఇందుకేనా? ఇందుకేనా?

 

    అరుంధతికి ఆలోచించే శక్తి కూడా లేదు. అలాగే కూచుని వుండిపోయింది.

 

    "నేను వెళ్ళొస్తా."

 

    అరుంధతి త్రుళ్ళిపడి తలెత్తి చూసింది. ఎదురుగా విమలాదేవి నిల్చొని వుంది. అర్ధం కానట్లు చూసింది అరుంధతి. జవాబు కూడా ఎదురుచూడకుండానే బయటకు వెళ్ళిపోయింది విమలాదేవి. ఒక్కక్షణంలో తను ఎంత ఎత్తునుంచి కిందపడిపోయిందో అర్ధం అయింది. తను ఇంతకాలంగా ఒక మంచుకొండమీద నిల్చొని వుంది. అది క్రమంగా, ప్రతిక్షణం, తనకు తెలియకుండానే కరుగుతూ వచ్చింది. తనుమాత్రం ఆ మంచు కొండను నిజమైన కొండగానే భావించి గర్వించింది. ఈనాడు ఆ కొండ పూర్తిగా కరిగిపోయిది. తను ఒంటరిగా చీకటి లోయలో మిగిలిపోయింది.


                                       30


    అధికారపక్షంలో వున్న రాజారావు అనుచరులు, రాజారావు రాజకీయ జీవితాన్ని గురించి తమలోతాము చర్చించుకోసాగారు. అధికార పిపాస నెత్తికెక్కిన రాజారావుకు అరుంధతితో వున్న అనురాగ బంధాన్ని తెంచుకోవటానికి అట్టేకాలం పట్టలేదు. అంత బాధగానూ అనిపించలేదు.

 

    రాజారావుకూ అరుంధతికీ చెడిందనే వార్త ఇట్టే గుప్పుమనిపోయింది. మరునాటినుంచే ఆ ఇంటి గేటుముందు కార్లు ఆగలేదు. మనుషులు రావటంలేదు, నాగేంద్రరావు మాత్రం రెండు రోజులపాటు వచ్చాడు. ఆ తరవాత అతనూ పత్తాలేడు. ఆ ఇంటి తలుపులు ఎప్పుడూ మూసుకొనే వుంటున్నాయి. వేసిన తలుపులు తెరవాల్సిన అవసరం కలగటంలేదు.

 

    ఇప్పుడు జీతం ఇచ్చి పెట్టుకున్న వంటమనిషీ, తోటమాలీ మాత్రం వున్నారు. డ్రైవర్ కు పనిలేదు. కాని ప్రతినెలా మొదటి తారీఖున వచ్చి జీతం తీసుకెళుతున్నాడు. ఆ గేటుదగ్గర మనిషి లేడు. పనులు చేయించుకున్న వాళ్ళుకూడా ఒక్కసారైనా మర్యాద కోసమైనా రాలేదు. పదిరోజుల తరువాత ఓనాటి రాత్రి రాజారావు వచ్చాడు. కాని తలుపులు తెరవబడలేదు. ఓ పదినిముషాలు అలాగే నిలబడి గిర్రున తిరిగివెళ్ళిపోయాడు. మళ్ళీ అటుకేసి రాలేదు. ఆమె ఏమయిందో, ఎలా వుందో కనుక్కోవాలని తోచలేదు. ఎలక్షన్స్ హడావుడి వచ్చింది.

 

    ఈసారి ఎలక్షన్ లో కాంగ్రెసుకు దేశంలో అనుకోనివిధంగా అపజయం ఎదురైంది. రాష్ట్రంలో రాజారావు పార్టీవాళ్ళు చాలా మంది గెలిచారు. కాని రాజారావు ఓడిపోయాడు. డిపాజిట్ కూడా రాలేదు. రాజారావు వ్యతిరేక పార్టీవాళ్ళు అధికారంలోకి వచ్చారు.

 

    రాజారావు ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిన్నది. రాజకీయ జీవితంపట్ల విరక్తి, జీవితంపట్ల నిర్లిప్తత వచ్చేసింది. అరుంధతికి అన్యాయం చేశానేమోననే బాధ హృదయంలో ఓమూల లేకపోలేదు. అయినా ఆమె దగ్గరకు మళ్ళీ వెళ్ళాలని లేదు. స్వంత ఊళ్ళో వ్యవసాయం చేయించుకోవాలంటే హైదరాబాదునుండి మకాం ఎత్తేశాడు.  


                                       31


    అరుంధతి అంత పెద్ద ఇంట్లో వంటరిగా, శ్మశానవాటికలోని మోడువారి పొగబారిన చెట్టులా వుంది. గత స్మృతుల్ని నెమరువేసుకుంటూ గంటలకొద్దీ కూర్చున్నచోటే కూచుని పోయేది. మాట్లాట్టానికి ఎవరూ లేరు. ఉన్న పనివాళ్ళతో మాట్లాడాలనిపించేది కాదు. వాళ్ళు ఏం చేస్తున్నా, ఎలా పనులు చేసుకుపోతున్నా పట్టించుకొనేది కాదు. అప్పుడప్పుడు ఆమెకు ఆ ఇంటినుంచీ, ఆ వాతావరణంనుంచీ, ఆ వూరినుంచీ దూరంగా ఎక్కడికో పారిపోవాలనిపించేది. ఎక్కడికి వెళ్ళినా తనతోపాటు వచ్చేది తన బోలుజీవితమే. అది నిండదు. ఆ ఖాళీ తనను వెంటాడుతూనే ఉండిపోతుంది. ఎక్కడకు వెళ్ళినా తాను వంటరిమనిషే!

 

    తోచనప్పుడల్లా, మనుషుల ముఖాలకు వాచిపోయినప్పుడల్లా వరండాలోకివచ్చి నిలబడేది. ఆనాడు సాయంత్రం ఏడు గంటలయినా ఈ చెవులో వడగాలి ఆ చెవిలోకి కొడుతూంది. తన జీవితం, తన హృదయం కూడా అలాగే మండిపోతున్నట్టు అనిపించింది. ఆకులు రాలిన చెట్లను చూసి తన జీవితంతో పోల్చుకొనేది. తోటంతా క్రమంగా ఎండిపోతూంది. మొక్కలకు నీళ్ళుకూడా సరిగాపోసేవాళ్ళులేరు.

 

    తొలకరి వానలు ప్రారంభం అయాయి. భూమినుంచి ఆవిరి ఒక్కసారిగా పైకి వచ్చింది. తమాషా వాసన వస్తూంది. ఆ వాసన అంటే ఒకప్పుడు అరుంధతికి చాలా ఇష్టం. ఎండిపోయిన మొక్కలు జీవం పోసుకుంటున్నాయి. ప్రకృతి పచ్చని చీరలో పెళ్ళికూతురులా నిండుగా కలకలలాడుతూంది. కాని అరుంధతి జీవితంలో ఎటువంటి మార్పులేదు. వంటమనిషికి ఒకే కూతురు. ఆ పిల్ల వానలో ఆడుకుంటూ చిందులు తొక్కుతోంది. అరుంధతికి మాధవి కళ్ళకు కనిపించింది. వర్షం పడుతుంటే తప్పటడుగులు వేస్తూ వర్షంలోకి పరుగెత్తేది; ఇంటిముందు వున్న నీళ్ళలో కాగితం పడవల్ని నడిపిస్తూ తండ్రి పిల్లను ఆడించేవాడు; అరుంధతి గడపలో నిల్చొని కూతుర్ని చూసుకుంటూ మురిసిపోయేది. ఇక శాంతమ్మ విషయం చెప్పనే పనిలేదు.

 

    అరుంధతికి ఇప్పుడు ఆలోచించటానికి మిగిలింది ఒకే ఒక వస్తువు. అది మాధవి. రాత్రింబవళ్ళు మాధవిని గురించే ఆలోచిస్తూ కాలం గడిపేది. వరండాలో నిల్చొని, రోడ్డుమీద నడుస్తున్న వయస్సులోవున్న అందమైన ఆడపిల్లల్లో తన కూతుర్ని చూసుకోవాలని తాపత్రయ పడేది. ఒక్కసారి తనకు మాధవిని చూపించమని భర్తకు నాలుగైదు ఉత్తరాలు రాసింది. ఆ ఆశా ఇప్పుడు ఆమెకు లేదు.

 

    వారంరోజులుగా ఒకటే ముసురు. వరండాలో నిల్చొని అరుంధతి బయటకు చూస్తూంది. ఏదో వచ్చి అరుంధతి ముఖానికి గట్టిగా తగిలింది. త్రుళ్ళిపడి చూసింది. అప్పటికే మరికొన్ని వడగళ్ళు ఆమె నెత్తిమీదా, ముఖంమీదా టపటప పడ్డాయి. దెబ్బలు తగులుతున్నా, ఆమెకు అక్కడ నుంచి కదలాలని లేదు. వరండాలో పడ్డ రెండు వడగళ్ళను తీసి నోట్లో వేసుకుంది. నాలుక జివ్వుమన్నది. గతం కళ్ళముందుకొచ్చి నిలచింది. అవి తను కొత్తగా కాపరానికి వెళ్ళినరోజులు. పెద్ద వడగళ్ళ వర్షం వచ్చింది. తను సరదాకొద్దీ ముంగిలి ముందు వడగళ్ళను ఏరి గ్లాసులో వేస్తూంది. తాను తడిసిపోతున్నందుకు భర్తా, అత్తా లబలబలాడారు. తను వినిపించుకోలేదు. సీతాపతి కూడా వర్షంలోకి వచ్చి భార్య చేతిగ్లాసులో వడగళ్ళు ఏరి వెయ్యసాగాడు. శాంతమ్మ-కొడుకు వర్షంలో తడిస్తే జబ్బు పడతాడని మొత్తుకుంది.

 

    అరుంధతి కిందకు చూసింది. వడగళ్ళు తెల్లగా కుప్పలు కుప్పలుగా పడివున్నాయి. చిన్నగా కళ్ళముందే కరిగిపోతున్న వడగళ్ళను చూస్తూ, తన జీవితాన్ని వాటి జీవితంతో పోల్చుకుంటూ నిట్టూర్చింది.

 

    గణగణ ఫోను మోగింది. అరుంధతికి ఆశ్చర్యం వేసింది - ఆ సమయంలో తనకు ఫోనుచేసేవారు ఎవరా అని? బహుశా రాంగ్ నెంబరు అయివుంటుందనుకుంది. ఫోను ఆగిపోయింది. చేతి గడియారం చూసుకుంది. సరిగ్గా పది. సరిగా ఇదే సమయానికి రాజారావు రోజూ ఫోను చేసేవాడు. తాను వచ్చినా రాకపోయినా, తాను ఎక్కడవున్నా ఎన్ని పనుల్లో వున్నా పది గంటలకు తప్పక ఫోను చేసేవాడు.

 

    ఫోను మళ్ళీ మోగింది. తనకే అయివుంటుంది. రాజారావే చేసి వుంటాడేమో! హైదరాబాదు వచ్చి వుంటాడేమో! ఉద్వేగంతో లోపలకు పరుగెత్తి, ఫోను రిసీవర్ మీద చెయ్యివేసింది. కాని ఎత్తుకోలేదు. కొంచెంసేపు నొక్కిపట్టి మళ్ళీ వరండాలోకి వచ్చింది. తప్పక రాజారావే అయివుంటాడు అంతకంటే తనకు ఫోను చేసేవాళ్ళు ఎవరూ లేరు. తీసి వుండాల్సింది. ఏమనేవాడో? ఎలా వున్నాడో? ఒకసారి అతన్ని చూడాలని కూడా వుంది.

 

    మళ్ళీ ఫోన్ మోగింది. నిదానంగా వెళ్ళి రిసీవర్ తీసి చెవుదగ్గర పెట్టుకుంది. అది గుంటూరు పబ్లిక్ కాల్ ఆఫీసునుంచి. గుంటూరునుంచి తనకు ట్రంక్ ఫోనా? అయితే రాజారావే? ఎందుకు చేసివుంటాడు? మాట్లాడాలని హృదయం ఉద్రేకపడుతూంది. వద్దని మనసు పెనుగులాడుతూంది.

 

    "అరుంధతి?" అటునుంచి.

 

    "యస్ అంది." అరుంధతి.

 

    "మాట్లాడండి పార్టీతో!" అంది ఎక్స్చేంజిలో గొంతు.

 

    "ఎవరు?" అటునుంచి.

 

    "మీ రెవరు?"

 

    "నేనెవర్నయితే నీకేంలే? ఎవరు మాట్లాడుతుంది?" కంఠం కటువుగా వుంది. రాజారావు గొంతుకాదు. తనకు పొరపాటున ఎవరి కాళో కనెక్షన్ ఇచ్చి వుంటారు అనుకుంది.

 

    "నా పేరు అరుంధతి."

 

    "నీకు మాధవిని చూడాలని వుంది కదూ?"

 

    అరుంధతికి అర్ధం కాలేదు. మాధవి! ఎవరు మాధవి అంటున్నారు? తను పొరపాటుగా వినలేదు కదా!

 

    "ఎవరు నువ్వు?" అరుంధతి అరచినంత పనిచేసింది.

 

    "అది నీకు అనవసరం. మాధవిని నీవు చూడాలనుకుంటే ఈ రాత్రికి ఇందుపల్లి రా. పన్నెండు తరువాత రావాలి. తెల్లవారుఝామున ఐదు లోపలే రావాలి. ఆ తరువాత వచ్చినా, ఈ రోజు నువ్వు రాకపోయినా మాధవి నీకు కనిపించదు." కొండలు బద్దలు చేసుకొని వచ్చిన శబ్దంలా ఆ మాటలు ఆ గొంతును బద్దలు చేసుకుంటూ వచ్చాయి.

 

    "మాధవి కులాసాగా వుందా?" వణుకుతున్న కంఠంతో ప్రశ్నించింది అరుంధతి. జవాబుగా అవతల ఫోను పెట్టగా "ఖంగ్" మనే శబ్దం చెవుల్లో మోగింది. అరుంధతి ఆ రిసీవర్ ను అలాగే పట్టుకొని ఎంతసేపు నిలబడిందో ఆమెకే తెలియదు.

 

    ఆమెకు బుర్ర పనిచెయ్యటంలేదు. మాధవి! మాధవికి ఏమయింది? తననెందుకు అంత అర్దరాత్రి రమ్మన్నట్టు? అలా జరగదు. జరగటానికి వీల్లేదు. మాధవి కులాసాగానే వుంది. తను ఎన్నో ఉత్తరాలు ప్రాధేయపడుతూ రాసింది. మాధవికి పెళ్ళి జరగబోతూందేమో? ఆ తరవాత తనకు చూసే అవకాశం వుండదని సీతాపతికి జాలివేసి ఈ అవకాశాన్ని కల్పించాడు - అంతే! కాని ఆ రాతి మనిషికి జాలా? ఆ కంఠంలో కసి కరుడుకట్టివున్నట్లు తనకు వినిపించింది. ఏమయినా తను వెంటనే వెళ్ళాలి.

 

    తోటమాలిని పంపించి డ్రైవర్ని పిలిపించింది. డ్రైవరు రాగానే ఇంటికి తాళాలువేసి, వున్నపాటున వెళ్ళి కార్లో కూచుంది. పదకొండు దాటింది.

 

    కారు శరవేగంతో విజయవాడ రోడ్డుమీద పోతూంది. అంతకంటే వేగంగా ఆమె మనసు పరిగిడుతూంది.

 

    కారువేగం హెచ్చించమని డ్రైవర్ని హెచ్చరించింది. డ్రైవరు గొణుక్కున్నాడు, విని వూరుకుంది. ఒకప్పుడు తను ఎన్ని తిట్టినా పెదవి కదిపేవాడుకాదు. ఆరు నెలలుగా వాడికి జీతం దండగ్గా ఇస్తూంది. అయినా వాడు విసుక్కుంటున్నాడు. అరుంధతి విషాదంగా తనను చూసి తనే నవ్వుకున్నది.

 

    ఆమె సీటుకు చేరబడింది. ఆలోచనలతో బుర్రంతా చెదలపుట్టలా వుంది.

 

    తనను చూసి అత్తగారు ఏమంటుందో? బహుశా మాట్లాడదు. ముఖం తిప్పుకుంటుందేమో? తన బిడ్డ తనను గుర్తిస్తుందా? తన ఫలానా అని చెప్పుకోవాలా? తన బిడ్డ తనను అసహ్యించుకోకుండా తన గుండెలమీద వాలిపోతుందా? ఒక్కసారిగా లేచి లేగదూడలా పరుగెత్తుకొచ్చి తనను చుట్టుకుంటుందా?

 

    మాధవిని తను తీసుకొని రాకపోవటమే మంచిదయింది. కాదు, అతను తన వెంట పంపించక పోవటమే మంచిదయింది. తనతో వస్తే ఈ వాతావరణంలో ఎలా పెరిగి వుండేదో? తను పెళ్ళి చెయ్యగలిగి వుండేదా? చెట్టంత తండ్రి చల్లని నీడలో, అమృత హృదయురాలైన నాయనమ్మ చేతికింద తన మాధవి పెరిగింది. ఆమెకు అంతకంటే ఇంకేం కావాలి? వయస్సులో వున్న మాధవి ఎలా వుందో? తను కౌగిలించుకుంటే తన తలకుపైనే ఆమె తల వుంటుందేమో!

 Previous Page Next Page