కామేశ్వరరావు అదోలా చిరునవ్వు నవ్వాడు.
"అలా చేస్తే కథే లేదు."
"మరి! ఏం చేశాడు?"
"ఇంటికి వచ్చాడు. అదును చూసి తల్లిని చంపాడు. గుండెకాయ కోసి దోసిట్లో పదిలంగా పెట్టుకొని ప్రేయసి ఇంటికేసి పరుగుతీశాడు."
"ఎవరండీ ఈ కథ రాసిన సచ్చినోడు? ఏం చెప్పాలని రాశాడు తల్లుల్ని చంపమంటాడా?"
"పూర్తిగా విను!"
"ఇంకా ఏం వినాలి? మన అబ్బాయిలు అలాంటివాళ్లు కాదని చాలా మంచివాళ్లనీ చెప్పాలనేగా ఈ కథ చెబుతున్నారు?"
"కాదు!"
"మరి?"
"ఆ గుండెకాయను ప్రేయసికి ఎప్పుడెప్పుడు అందించి మెప్పును పొందాలా అన్న ఆతృతతో పరుగు తీస్తున్నాడు. ఉన్నట్టుండి ఎదురుదెబ్బ తగిలి బొక్కబోర్లా పడ్డాడు. చేతిలో వున్న గుండెకాయ ఎగిరి అల్లంత దూరంలో పడిపోయింది."
"మంచిపని అయింది పాపిష్టి ముండాకొడుకు ఆపడడం పడడం నేలకు కరుచుకుపోయి చచ్చి వుంటాడు. అంతేగా? పాపం! కథ చివర్లో అలాంటి కొడుకులకు మంచి బుద్దే చెప్పాడులెండి ఆకథ రాసినవాడు."
"అలా అయితే అది మామూలు కథే అయి వుండేది."
"అంటే వాడు చావలేదా?"
"లేదు లేచి నిల్చున్నాడు. గుండెకాయ పడివున్న చోటకు పరుగుతీశాడు. దాన్ని దోసిట్లోకి తీసుకోబోయాడు" ఆగి కామేశ్వరరావు భార్యముఖంలోకి చూస్తూ చిరునవ్వు నవ్వాడు.
ఆమె విసుగ్గా చూసింది "వెధవ కథ! ఇదేం కథ-" అన్నట్టు.
"వంగి దాన్ని చేతిలోకి తీసుకోబోతుండగా "దెబ్బతగిలిందా నాయనా!" అని కొడుకుని అడిగింది ఆ గుండెకాయ బాధగా.
సుందరమ్మకు తల మీద సుత్తి దెబ్బతగిలినట్టుగా అయింది.
ఈ కథ ద్వారా భర్త తనకు ఏం చెప్పాలనుకున్నాడో అర్ధం అయింది .తల్లి ప్రేమ అంటే అలా వుండాలి. నీలో తల్లి హృదయం లేదనేగా చెప్పదల్చుకున్నది? సుందరమ్మ మనసు చివుక్కుమంది. తనలో తల్లి మనసు లేదా? తల్లి ప్రేమంటే ఏమిటో తనకు తెలియదా? అంటే బిడ్డలు ఏంచేసినా కిమ్మనకుండా పడివుండడాన్నే ప్రేమగా భావించాలా!
"ఏమిటి సుందరీ అంతగా ఇదైపోతున్నావు?"
"తల్లి ప్రేమ అంటే ఏమిటో నాకు తెలియదనేగా మీ ఉద్దేశం!"
"ఛ! అదేమిటి? నేను అలా అన్నానా?"
"అవును అనలేదు - కాని నాకు తెలియ జెప్పాలనుకొంది అదే! లేకపోతే ఇప్పుడు నాకు ఈ కథ ఎందుకు చెప్పినట్టు?
కామేశ్వరరావు తన పొరపాటును గ్రహించాడు. అవును. నిజమే! ఈకథ చెప్పడంలో తన ఉద్దేశం అదేగా?
"చెప్పండి."
"ఏమిటి?"
"ఆ కథ చెప్పడంలో మీ ఉద్దేశం ఏమిటి?"
"ప్రత్యేకంగా ఏమీలేదు. నువ్వు బాధ పడుతూ వుంటే చిన్నవాళ్లు ఏం చేసినా మనం పెద్దవాళ్ళం సర్దుకుపోవాలన్న ఉద్దేశంతో చెప్పాను. అంతేకాని నీకు బిడ్డల మీద ప్రేమ లేదని ఎత్తి చూపించడానికి చెప్పలేదు. నువ్వు నీ బిడ్డల్ని ఎంతగా ప్రేమిస్తావో నాకు తెలియదా సుందరీ! నీ పిల్లల్లో ఏ ఒక్కడికైనా జరగరానిది జరిగితే..."
"ఏమండీ! ఏమిటా మాటలు! అశుభం పలకకండి వాళ్ళందరూ బాగుండాలి. నా బిడ్డలకు ఏమీ జరగదు. జరగకూడదు. వాళ్లు క్షేమంగా వుండాలి." భర్తమాటల్ని మధ్యలోనే అందుకొని ఆవేశంగా అన్నది.
"చూశావా మరి! అదే తల్లిప్రేమ అంటే. ఇది చెప్పాలనే ఆ కథ చెప్పాను." నవ్వుతూ అన్నాడు కామేశ్వరరావు.
"పర్వాలేదు. వాళ్లు మనల్ని చూడకపోయినా పర్వాలేదు. వాళ్లు సుఖంగా వుండాలి. వాళ్లు సంతోషంగా వుండాలి." మంద్రస్థాయిలో తనకు తనే చెప్పుకుంటున్నట్టుగా అంది.
* * *
చెప్పుల శబ్దం విని, సుందరమ్మ చేతులు కొంగుకు తుడుచుకుంటూ బయటికి వచ్చింది. లోపలకు వస్తున్న భర్త కన్పించాడు.
"అప్పుడే వచ్చేశారా? ఇవ్వాళ ట్యూషన్స్ లేవా?"
"చిన్నవాడు ఉత్తరం రాశాడు. పోస్టుమ్యాన్ రోడ్డు మీద కన్పించి ఇచ్చాడు. అది ఇచ్చి వెళ్దామని వచ్చాను." అంటూ కవరు సుందరమ్మకు అందించాడు.
"ఏం రాశాడు?"
"చదువు"
"మీరు చదవలేదా? చెప్పండి ఏం రాశాడు? అందరూ బాగున్నారా? మనల్ని రమ్మనమని రాశాడా?"
"ఇంకా నేను చదవలేదు."
"చదివి చెప్పండి." కవరు భర్తకు అందించింది.
కామేశ్వరరావు ఉత్తరం చదువుతున్నంతసేపూ సుందరమ్మ కుతూహలంగా భర్తముఖంలోకి చూస్తూ వుండిపోయింది. ఆయన ఉత్తరం చదివి, మడత పెట్టి, కవర్లో దూర్చి సుందరమ్మకు అందించాడు.
"ఏం రాశాడు? మనల్ని రమ్మని రాశాడా?"
"ఊ"
సుందరమ్మ ముఖం విప్పారింది.
"వాడు రాస్తాడని నాకు తెలుసు. వాడు మనల్ని వదిలెయ్యడండీ. వెంటనే జవాబు రాయండి వచ్చేస్తున్నామని. చిన్న సన్యాసి. వాడిదగ్గరే పడివుందాం."
"నీధోరణి నీదేనా?"
"ధోరణి ఏమిటండీ? వాడు రమ్మని రాస్తే - వెళ్దాం అన్నాను. మీకు ఇష్టంలేదా?"
"నిన్ను వెంటనే బయలుదేరి రమ్మన్నాడు."
సుందరమ్మ భర్త ముఖంలోకి ఆశ్చర్యంగా చూసింది.
"నన్ను రమ్మని రాశాడా? మరి మిమ్మల్ని రమ్మనలేదా? తమాషాకు అంటున్నారుకదూ?"
"కాదు. నిన్నే రమ్మని రాశాడు."
"మిమ్మల్ని రమ్మని రాయలేదా?"
"నేను వెళ్ళి ఏం చేయాలి?"
"అదేమిటి? అర్ధం అయ్యేలా చెప్పండి."
"ఏం లేదు. మామూలే! హైదరాబాద్ లో కొత్తగా కాపురం పెట్టాడుగా?"
"ఆఁ! అయితే"
"కోడలికి అంతా కొత్తగా వుందట. ఇంకా మంచి పనిమనిషి కూడా దొరకలేదట. తను ఎక్కువ రాత్రి డ్యూటీలు చెయ్యాల్సి వస్తుందట. రాత్రిపూట వంటరిగా వుండడానికి కోడలు భయపడుతుందట. వాళ్ళ అత్తగారు మంచి పనిమనిషిని చూసి పంపిస్తానని చెప్పిందట. అంతవరకూ నువ్వు వుంటావని రమ్మని రాశాడు."
సుందరమ్మ వెర్రిదానిలా చూసింది. మూగదానిలా చూసింది.
"వెంటనే రమ్మన్నాడు. రేపు బయలుదేరితే సరి!"
"నేను వెళ్ళను"
"అదేమిటి?"
"పనిమనిషి దొరకలేదా? మంచి పనిమనిషిని వాళ్ళ అమ్మ పంపించేంతవరకు, నేను పనిమనిషిగా వెళ్ళాలా?" తనకు తానే చెప్పుకుంటున్నట్టు అన్నది.