నా పిరికితనం వల్లనే అలా అన్పిస్తోంది.
జారిపోతున్న గుండెను ఎగదోసుకొంటూ నడక వేగం పెంచాను. ఊరి మధ్యకు వచ్చాను. అప్పటికి కొంత భయం తీరినట్టుగా అయింది.
కొన్ని ఇళ్ల ముందు మంచాలు వేసుకొని మగవాళ్ళూ, ఆడవాళ్ళూ నిద్రపోతున్నారు.
అమ్మయ్య, మనుష్యుల మధ్యకు వచ్చిపడ్డాను.
ఇక భయం లేదు.
"ఎవరది ?" తృళ్ళిపడ్డాను.
నా చేతిలో పెట్టె కింద పడింది.
పెట్టె తీసుకొని నిలబడి చూశాను.
"ఎందుకు బాబూ, అంత బెదిరిపోయావ్?" అన్నాడు నడి, మంచం మీద కూర్చుని చుట్ట తాగుతున్న ఓ మధ్య వయస్కుడు.
నేను ఆగాను. అతనికి కొద్దిగా దగ్గరకు వెళ్ళాను.
అతను చుట్ట నోట్లోనుంచి తీసి తుపుక్కున ఊశాడు.
"ఎవరు నువ్వు !"
"మాది ఈ ఊరు కాదు."
"ఎవరింటి కెళ్ళాలి?"
"భైరవమూర్తి ఇంటికి !"
అతను మాట్లాడకుండా భయంగా నా ముఖంలోకి చూశాడు.
"ఆ ఇల్లు ఎంతదూరం?" అన్నాను.
"నాకు తెలవదు !" అంటూ చుట్ట గిరాటువేసి మంచంలో మునగ దీసుకొని పడుకొన్నాడు.
భైరవమూర్తి పేరు చెప్పగానే అలా అయ్యాడేం ?
అతను దుర్మార్గుడన్నారుగా?
అందుకే ఈ ఊరి ప్రజలకు భయం కావచ్చు.
ఆలోచిస్తూ నాలుగు బజార్ల కూడలిలోకి వచ్చాను.
కుడిచేతి వైపుకు తిరిగాను.
ఇరవై గజాలు వెళ్ళేసరికి ఒక నల్లకుక్క మొరగసాగింది. దాన్ని అదిలిస్తూ ముందుసాగాను. ఒక ఫర్లాంగువరకు నాలుగైదు ఇళ్లున్నయ్. ఆ కుక్క అరుస్తూ నా వెనకేవస్తోంది. అదెక్కడ కాలు పట్టుకుంటుందో ననే భయం ఒకవైపు. నాకు కుక్కలంటే భయం. కరిస్తే బొడ్డు చుట్టూ ఇన్ జెక్షన్స్ చేయించుకోవాలి. ఒకసారి అనుభవం అయింది.
ఒకడు కుక్కలా అరుస్తూ చావడం చిన్నప్పుడు మా ఊళ్ళో చూశాను. చాలా భయంకరమైన దృశ్యం. అదే నా భయం.
ఇళ్ళు లేవు.
కనుచూపు దూరంలో ఇళ్ళు కన్పించడం లేదు.
ఊరిబయటికి వచ్చేస్తున్నట్టున్నాను.
వెన్నెల పిండారబోసినట్టుంది.
అందుకే ఒంటరిగా నడుస్తున్నా భయంగా లేదు.
కాని, దొంగలు తిరిగేవేళ.
ఎవడైనా తన్ని చేతిలోని పెట్టె లాక్కెడతాడేమోననే భయం. మనుష్య సంచారం లేదు. చుట్టూ నిశ్శబ్దత.
గబగబా నడుస్తున్నాను.
మరో సందులోనుంచి ఇంకో నల్లకుక్క వచ్చింది అరుస్తూ.
రెండు చెరోవైపున అరుస్తూ నాతోపాటు నడుస్తున్నాయి.
ఇదెక్కడి పీడరా బాబూ !
ఆ దయ్యాల గొడవే బాగున్నట్టుంది.
ఎవడో ఒకడు మనిషనేవాడు పక్కనే ఉన్నాడు.
తిరిగి వెళ్ళి ఆ రాత్రికి ఎవరింట్లోనైనా తలదాచుకోవాలనిపించింది.
మళ్ళీ అంతలోకే నా పరికితనం మీద నాకే చిన్నతనంగా అన్పించింది.
గబగబ నడుస్తున్నాను.
ఇంకా ఇల్లు కన్పించదేం ?
పెద్ద బంగళా అన్నారుగా ?
అయినా, వాడు నన్ను తెల్లవారకముందే ఎందుకు రమ్మన్నట్లు ?
ఛా మళ్ళీ వెనక్కు వెళ్తున్నాను.
ఇంత దూరం వచ్చాను.
ఈ కాస్తకు భయపడి పారిపోవడం ఏమిటి ?
ఇదేదో తెలుసుకొని మంచి నవల రాయవచ్చును.
ఎదురుగా మరో కుక్క అరుపు విన్పించింది.
అది బర్రె దూడంత ఎత్తున భయంకరంగా నల్లగా ఉంది. అరుస్తూ ఎదురొస్తోంది.
ఆ భైరవమూర్తి కుక్కలే అయి ఉండాలి.
ఇన్ని కుక్కల్ని పెంచుతున్నాడా ?
భయంకరంగా దూరంనుండి వస్తోన్న కుక్కను చూస్తూ ముందుకే నడుస్తున్నాను. ఇవి కరవవు. కరిచేవయితే ఈపాటికే నన్ను ఈ రెండూ నిలువునా చీల్చేసి ఉండేవి. అందుకే అంటారు అరిచే కుక్కలు కరవవని!
ఎందుకు కరవవు ?
వెధవ సామెత !
కొన్ని అరిచీ కరుస్తాయి.
కొన్ని అరవకుండానూ కరుస్తాయి.
ఏమిటో పిచ్చి ఆలోచనలూ నేనూ !
అల్లంత దూరంలో వెన్నెల్లో ఎత్తుగా నిల్చున్న తెల్లటి భవనం వెన్నెల్ని మూసుకొని వెండిలా మెరుస్తోంది.
అమ్మయ్య, వచ్చేశాను.
ఇక భయంలేదు.
నాలోని రచయిత ఉత్సాహపడ్డాడు.
ఎలాంటి కథ వినిపిస్తాడో భైరవమూర్తి.
ఏ కథయినా ఫర్వాలేదు. ఆ కథ వినడానికి నేను చేసిన సాహసమే చాలు, పాఠకులను ఉర్రూతలూగించే నవల రాయడానికి.
భూత ప్రేతాల కథలు అక్కర్లేదు.
మంచి క్రైమ్ కథ రాయవచ్చును.
ఇల్లు దగ్గరౌతోంది.
మూడు కుక్కలూ అరుస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఆ కుక్కలంటే భయంకూడా పోయింది.
ఓ క్షణం నిల్చుని భవనంకేసి చూశాను.
పూర్వకాలంలో కట్టిన కట్టడం అని తెలుస్తూనే ఉంది.