Previous Page Next Page 
బొమ్మరిల్లు పేజి 30


    కళ్ళు తుడుచుకొని తలుపుతీసింది.


    "అక్కా నువ్వు అన్నం తినలేదటగా?"


    "ఆకలిగా లేదు"


    "ఊహూ, నువ్వు తినకపోతే నేనూ తినను. నాకు మహా ఆకలిగా ఉంది" మారాం చేస్తున్నట్టు అన్నది రాధిక.


    రేణుక రాధ వెనకే డైనింగ్ హాలులోకి వెళ్ళింది.


                                                                     16


    రాధ సుధీర్ తో తిరుగుతోందని వింటూనే ఉన్నది.


    రేణుక మళ్ళీ ఆ విషయంలో కలుగజేసుకోలేదు.


    రెండు మూడుసార్లు రాధ ఏదో చెప్పాలని ప్రయత్నం చేసింది. రేణుక ముభావంగా ఉండడంవల్ల ఏమీ చెప్పలేకపోయింది.


    ఆ రోజు కాలేజీ నుంచి త్వరగా వచ్చింది. వస్తూనే గది తలుపులు బిగించుకుని పడుకుంది. తల్లి ఎంత పిల్చినా తలుపులు తెరవలేదు. చిన్న తమ్ముడు రఘూ కూడా పిల్చాడు. లోపలనుంచే సమాధానం ఇచ్చింది. తనకు ఆరోగ్యం సరిగా లేదని గొడవ చెయ్యొద్దని విసుక్కుంది.


    రేణుకకు ఆ రోజు అర్జంటు కేసు రావడం వల్ల ఆపరేషన్ లో ఉండిపోయింది. ఆలస్యంగా ఇంటికి వచ్చింది. వస్తూనే తల్లి ఏడుస్తూ "దానికి ఏమైందో? లోపల ఆరుగంటలు నుంచి తలుపులు బిగించుకొని పడుకుంది" అని చెప్పింది.  


    రేణుక తలుపు కొట్టింది. రాధ తలుపు తీసింది. జుట్టు రేగి ఉంది. కళ్ళు వాచి ఉన్నాయి. ఏడుస్తూ పడుకొని ఉంటుందని అర్థం అయింది.


    "ఏమయింది రాధా?" ఆప్యాయంగా అడిగింది.


    రాధ రేణుక అలా అడగ్గానే బావురుమంది.


    రేణుక రాధను పట్టుకుని బుజ్జగించింది.


    "ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావ్?" అని అడిగింది.


    "సుధీర్ మోసం చేశాడు అక్కా!" అంటూ మళ్ళీ వెక్కివెక్కి ఏడవసాగింది.


    రేణుకకు ఏం మాట్లాడాలో బోధపడలేదు. చెల్లెల్ని రెండు చేతులతోనూ పొదివి పట్టుకొని ఉండిపోయింది.


    "రాధా, అసలు ఏమైందో చెప్పమ్మా" లాలనగా అడిగింది.


    "అంత మంచితనం చూపించకు అక్కా! నేను భరించలేను. నీ మాట వినలేదు. నిన్ను అవమానించాను. నన్ను తిట్టు కొట్టు, కాని జాలిపడకు"


    "రాధా, ఏమిటా పిచ్చిమాటలు? అసలు ఏం జరిగిందో చెప్పకుండా?"


    రాధ కళ్ళు తుడుచుకుంది.    


    "సుధీర్ ను నీదగ్గరకు తీసుకురావాలనుకున్నాను. అతను రోజూ ఏదో సాకుతో తప్పించుకోసాగాడు. చివరకు ఈ రోజు పెళ్ళి విషయం సిగ్గు విడిచి నేనే అడిగేశాను"


    "ఏమన్నాడు?" ఆతృతగా అడిగింది రేణుక.


    "తనకు అభ్యంతరం లేదట"


    "మరి?"


    "అతని తల్లిదండ్రులు లక్షలు కట్నం ఇచ్చే పిల్లకోసం గాలిస్తున్నారట. వాళ్ళను ఎదిరించే శక్తి తనలో లేదట."


    "ఊ"


    రాధ రేణుక ముఖంలోకి చూసింది.


    రేణుక ముఖం గంభీరంగా ఉన్నది.


    "మీ అక్క అంత సంపాదిస్తోంది. లక్ష రూపాయలు కట్నంగా ఇవ్వలేదా?" అంటున్నాడు.


    రేణుక రాధ ముఖంలోకి చూస్తూనే ఉండిపోయింది.


    "రేపు నీతోవచ్చి మాట్లాడతానన్నాడు"


    రేణుక ఆలోచనలో పడింది.


    "లక్ష రూపాయలు మా అక్క ఎక్కడనుంచి తెచ్చిస్తుంది? నువ్వు వచ్చి మాట్లాడినా లాభం లేదన్నాను."


    రేణుక ముఖంలోకి ఓ క్షణం చూసి మళ్ళీ రాధ అన్నది.


    "కనీసం ఏభైవేలన్నా లేకపోతే వాళ్ల అమ్మా నాన్నా ఒప్పుకోరు అంటున్నాడు"


    "ప్రేమించేటప్పుడు అమ్మనూ, నాన్ననూ అడిగే ప్రేమించాడా?" కోపంగా అన్నది రేణుక.


    రాధ తలదించుకున్నది.


    "ఇవాళే చెప్పేస్తాను. కట్నం ఇచ్చే పిల్లనే చేసుకోమని. అందరిలా నాకు కన్నతండ్రి ఉన్నాడా? కట్నం ఇచ్చి పెళ్ళి చెయ్యడానికి?" అంటూ చివ్వున లేచి చరచరా బయటికి వచ్చి బాత్ రూంలోకెళ్ళి తలుపు బిగించుకుంది రాధిక.


    రేణుక కణత మీద కంకరరాయి తగిలినట్టే అయిపోయింది. రాధిక వెళ్ళినవైపే వెర్రిదానిలా చూస్తూ ఉండిపోయింది. ఓ నిముషం తెప్పరిల్లి లేచి తన గదిలోకి వెళ్ళిపోయింది.


    బుర్ర పని చెయ్యడం లేదు. బట్టలు కూడా మార్చుకోకుండానే మంచానికి అడ్డంగా పడింది. బాగా అలసి ఉన్న మనసు నిద్రలోకి జారిపోయింది.


    రేణుక అకస్మాత్తుగా మెలుకువ వచ్చింది. గోడ గడియారం కేసి చూసింది. చీకట్లో గడియారం ముళ్ళూ, అక్షరాలూ మెరుస్తున్నాయి.


    పన్నెండున్నర దాటుతోంది. కడుపులో ఏదో మంటగా ఉన్నది. ఆ మంట గుండెలదాకా ఎగబాకుతోంది.


    "ఏమిటిది ఇలా ఉంది?


    తను భోజనం చెయ్యకుండా పడుకున్నట్టు గుర్తుకు వచ్చింది.


    వెంటనే లేచి డైనింగ్ హాలులోకి వెళ్ళింది. ఫ్రిజ్ తెరచి నీళ్ళ బాటిల్ తీసుకున్నది. గటగట రెండు గ్లాసుల నీళ్లు తాగాక గాని కడుపులో మంట ఆరలేదు. ఎదురుగా ఉన్న పళ్ళెం నుంచి రెండు అరటిపళ్ళు తీసుకొని తినేసింది. గదిలోకి వచ్చి పడుకుంది. నిద్ర పట్టడంలేదు. మనసులో ఎలాగో ఉన్నది.


    రేణుక ఆలోచించసాగింది.


    తనకు మెలుకువ వచ్చింది. రాగానే కడుపు మంట గురించి తప్ప మరో ఆలోచన రాలేదు. ఆ మంట చల్లారిన తరువాత గాని బుర్రలోకి వేరే ఆలోచన రాలేదు. మరి ఈ దేశంలో నూటికి డెబ్బయ్ వంతు ప్రజలు బీదవాళ్ళేగా? వాళ్ళ ఆలోచనలు ఎప్పుడూ కడుపు చుట్టూనే వుంటాయన్న మాట వాళ్ళు ప్రేమను గురించి ఆలోచించరు. వాళ్ళు కల్పనా లోకంలో విహరించరు. ఆకలివేస్తే అన్నం తిన్నట్టు, దాహం వేస్తే మంచినీళ్ళు తాగినట్టు సెక్సును అనుభవిస్తున్నారేగాని దానికి రంగులు పూసి ప్రేమలోకంలోకి, విసిరివేసే కథలంటే ఎందుకు జనం ఇంతగా పడి చస్తున్నారు? ఎవరాజనం కడుపు నిండినవాళ్ళేగా?


    ఏమిటి తను ఇలా ఆలోచిస్తోంది? తను ఇప్పుడు ఆలోచించవలసింది సాహిత్యాన్ని గురించా?

 Previous Page Next Page