Previous Page Next Page 
బొమ్మరిల్లు పేజి 29


    "చాల్లే! ఊరుకో! అక్కయ్య మీద నీకు అంత అభిమానమే ఉంటే నువ్వు ఇలాంటి పనులు చెయ్యవు. అది పెళ్ళి పెటాకులూ లేకుండా..."


    "అమ్మా" గట్టిగా అరిచింది రేణుక.


    మరుక్షణంలో అక్కడినుంచి వెళ్ళిపోయింది.


    రాధ కూడా రేణుక వెనకే వెళ్ళింది.


    "నన్ను క్షమించు అక్కా! నా వల్ల అమ్మ నిన్ను బాధపెట్టింది"


    రేణుక అదోలా నవ్వింది.


    "అయితే రాధా! నిజంగా నీకు బస్ అందలేదా?"


    రాధ తలవంచుకుంది.


    "నిజం చెప్పు! నువ్వు సినిమాకు వెళ్ళావు గదూ?"


    "ఎవరు చెప్పారు?"


    "వెళ్ళావా? లేదా?"


    "ఎవరు చెప్పారో ముందు చెప్పు!"


    "నేనే చూశాను"


    రాధ తృళ్ళిపడింది!


    "ఎందుకంత తప్పు చేసిన దానిలా బాధపడ్తావ్? అతనెవరు?"


    "సుధీర్!"


    "ఏ వూరు? ఏ కులం? ఎవరి అబ్బాయి?"


    "నాకు తెలియదు"


    "ఏమీ తెలుసుకోకుండానే అతనితో తిరుగుతున్నావా"


    రాధ మాట్లాడలేదు.


    "అతన్ని గురించి పూర్తిగా తెలుసుకోకుండానే...."


    "అతను చాలా మంచివాడు! మేమిద్దరం...."


    "ప్రేమించుకొంటున్నారు" రేణుక అందుకుని అన్నది.


    "అవును!"


    "పెళ్ళి చేసుకుంటానన్నాడా?"


    "అనలేదు. కాని చేసుకుంటాం!"


    "రాధా! పిచ్చిగా మాట్లాడకు. ఇది సినిమా కథ కాదు. ప్రేమిస్తున్నాను అన్న ప్రతివాడు వెంటబడి పెళ్ళి చేసుకోవడానికి"


    "అతను చాలా మంచివాడు!"


    "ప్రేమించే ప్రతి ఆడదీ తన ప్రియుడ్ని గురించి అనేమాట ఇదే!"


    రాధకు వళ్ళు మండింది.


    "ప్రేమ గురించి నీకేం తెలుసు?" అన్నది దురుసుగా రాధ.


    రేణుక చెల్లెలి ముఖంలోకి చూసింది. చూస్తూనే ఉండిపోయింది.


    "అవును! నిజమేనమ్మా! నాకు ప్రేమ గురించి ఏమీ తెలియదు" రేణుక తనకు తానే చెప్పుకుంటున్నట్టు బరువుగా, చిన్నగా అన్నది.


    రాధ ముఖం వెలవెలా బోయింది. తను అన్నదేమిటో అప్పటికి బోధపడలేదు.


    "సారీ అక్కా! ఏదో వాగేశాను"


    "లేదమ్మా, ఉన్నమాటే అన్నావ్!"


    "నన్ను క్షమించలేవా అక్కా?" గద్గద కంఠంతో అన్నది రాధ.


    "పిచ్చి పిల్లా, నువ్వు ఎందుకు అంతగా బాధపడ్తావ్? నువ్వన్నదాంట్లో తప్పేమీ లేదు. వెళ్ళు అన్నం తిను" గొంతులో ఉబికి వస్తున్న దుఃఖాన్ని అణుచుకుంటూ చరచరా తన గదిలోకి వెళ్ళిపోయింది.


    మంచానికి అడ్డంగా పడి వెక్కివెక్కి ఏడ్చింది. మనసులోని బాధ కరిగి కన్నీరై ప్రవహించింది. మనసు తేలికపడినట్లనిపించింది.


    రాధ ఏమన్నది?


    తనకు ప్రేమంటే ఏమిటో తెలియదా?


    ప్రేమించడం చేతకానందువల్లనే తనకు పెళ్ళికాలేదు అని రాధ అనుకుంటుందా? అందుకే ఆమెను చూసి తను ఈర్ష్య పడుతున్నదనే భావం రాధకు కలిగిందా? రాధను చూసి తను ఈర్ష్య పడటమా?


    రామం తెలివైనవాడు.


    రాధ కూడా తెలివైనదే.


    తనే వట్టి పిచ్చి మొద్దు.


    తన స్వార్థం తను చూసుకోలేకపోయింది.


    తనలాంటి వాళ్ళు బ్రతకడం చేతగాని వాళ్ళు!


    ఈ ప్రపంచంలో ఎవరికి వారే మరొకరి కొరకు త్యాగం చెయ్యడమంత తెలివితక్కువ తనం మరోటి లేదు. తను ఎవరికోసం, తన ప్రేమను త్యాగం చేసిందో వాళ్ళ దృష్టిలోనే తను చులకన అయింది.


    తను పెంచినవాళ్ళు, తనకు ఏంకావాలో తెలుసుకొని తమ భవిష్యత్తుకు బాట వేసుకుంటున్నారు. కాని...ఏ ఒక్కళ్ళు తనకు ఏం కావాలో అడగడంలేదు. తను ఎవరికీ అక్కర్లేదు.


    చివరికి ఎవరిదారి వారు నిర్ణయించుకొని వెళ్ళిపోతారు. తను ఒక్కతి మాత్రం మిగిలిపోతుంది.


    రేణుక లేచింది.


    యాంత్రికంగా అద్దం ముందుకెళ్ళి నిలబడింది.


    కళ్ళచుట్టూ నల్లటి వలయాలు కన్పించాయి.


    పాపిట్లోనూ, చంపల దగ్గిరా తెల్లజుట్టు నల్లజుట్టు మధ్యనుంచి స్పష్టంగా కన్పిస్తోంది.


    కళ్ళలో అలసట కన్పిస్తోంది. తన ప్రతిబింబాన్ని చూస్తూ అదోలా నవ్వుకుంది.


    తన అసిస్టెంటు సుమతి రోజూ జుట్టుకు రంగు వేసుకోమని గోల పెడుతుంది.


    తను జుట్టుకు రంగు వేసుకుంటే ఇంత పెద్దదిగా కన్పించదు. నిజమే. కాని తను అలా కన్పించి ఎవర్ని ఆకర్షించాలి?


    గౌతమ్ రూపం కళ్ళముందు మెదిలింది. కళ్ళలో నీరు ఉబికింది.


    "అక్కా, అక్కా" రాధ తలుపు కొడుతున్నది.

 Previous Page Next Page