"అందరివలె నాకు కన్నతండ్రి ఉన్నాడా, నాకు కట్నం ఇచ్చి పెళ్ళి చెయ్యడానికి?" రాధిక మాటలు మళ్ళీ మళ్ళీ చెవుల్లో రింగు మంటున్నాయ్.
అంటే రాధ ఉద్దేశ్యం లక్ష రూపాయలు కట్నం ఇచ్చి పెళ్ళి చెయ్యమనేగా?
సుధీర్ మోసం చేశాడని ఏడవడం-నాటకం అన్నమాట! సుధీర్ తో ఆలోచించి ఆడిన నాటకం ఇది! ఏభైవేలకు కనికరించే చేసుకుంటానన్నాడట అంటే ఏభైవేలు ఇచ్చి పెళ్ళి చెయ్యాల్సిన బాధ్యత తనమీద వున్నట్టు రాధ భావిస్తున్నదా? తన తండ్రి ఉంటే ఏభైవేలు ఇవ్వగలిగేవాడా? ఆ మాటకు వస్తే నాన్న ఇన్ని సౌకర్యాలు మాత్రం కలిగించగలిగేవాడా తనకొచ్చే జీతం రాళ్ళతో? నాన్న బ్రతికి ఉంటే తను వివాహం చేసుకొని వెళ్ళిపోయి వుండేది. తన సంపాదన...తనకూ ఒక ఇల్లూ- ఆ ఇంట్లో భర్తా...పిల్లలూ... వుండేవారు... తనూ...తన సంసారం....
రాధకు తనేం తక్కువ చేసింది.
రాధ చిన్నపిల్లకాదు.
రాధ చదువుకుంటోంది.
ప్రేమించిన ప్రియుడుతో తిరుగుతోంది.
పెళ్ళి గురించి ఆలోచిస్తోంది.
కనీసం అప్పుడైనా తన అక్కను గురించి- కేవలం తన చెల్లెళ్ళ కోసం, తమ్ముళ్ళకోసం యంత్రంలా సంపాదిస్తూ బ్రతుకుతున్న అక్క గురించి- ఒక్కసారైనా ఆలోచించి ఉంటుందా?
ఊహూ! ఆలోచించి ఉండదు. అలా ఆలోచించగలిగినప్పుడు అంత మాట తనముందు అనదు. అనలేదు.
ఇప్పుడు తనేం చెయ్యాలి? ఏభైవేలు కట్నం ఇచ్చి రాధ పెళ్ళి చెయ్యాలా? ఏభైవేలు ఎక్కడ్నించి తేవాలి? అవును తను బాగానే ఆర్జించింది. మంచి ఇల్లు కట్టింది. నర్సింగ్ హోం కట్టించింది. దానికి కొంత బ్యాంకు నుంచి అప్పు తీసుకుంది. ఇంకా ఆ అప్పు పూర్తిగా తీరలేదు.
17
రేణుక బద్ధకంగా నిద్రలేచింది.
కళ్ళు మండుతున్నాయ్!
కనురెప్పలు బరువుగా వాలిపోతున్నాయ్!
పళ్ళు తోముకుని బద్ధకంగా డైనింగ్ టేబుల్ ముందు కూర్చుంది.
తల్లి మౌనంగా కాఫీకప్పు ముందు పెట్టింది.
పక్క కుర్చీలో కూర్చుంది. కాఫీ ఇచ్చి అలా పక్కనే కూర్చుంది. అంటే తల్లి తనతో ఏదో ముఖ్య విషయం మాట్లాడబోతున్నదని ఇట్టే తెలిసిపోయింది రేణుకకు.
ఇంకేం విషయం?
రాధ పెళ్ళి విషయమే కావచ్చు.
అమ్మకూడా మారిపోతున్నది ఎంతసేపూ చిన్నవాళ్ళ గురించేగాని తన గురించి ఆలోచించడం మానేసింది.
రాధిక పెళ్ళి గురించి మాట్లాడుతుంది.
చంద్రం డాక్టర్ చదవాలంటున్నాడని చెబుతుంది.
చిన్నది నెక్లెస్ కావాలని ఏడుస్తున్నది!
కోడలికి నెల తెప్పిందట! సారె పంపించాలి!
ఇలా ప్రతిరోజూ ఏదో ఒక డిమాండ్ చేస్తూనే ఉంటుంది.
తన గురించి ఆలోచించడం మానేసింది.
తనను ముసలిదానికింద కట్టేసింది.
"ఇంకా దానికి పెళ్ళేమిటి?" అనుకుంటోందేమో?
"అమ్మాయ్, రాధ విషయం ఏమాలోచించావ్!" చిన్నగా అన్నది.
రేణుక మౌనంగా కాఫీ తాగుతూ ఉండిపోయింది.
"నేను కానీ కట్నం ఇవ్వను. ప్రేమించేటప్పుడు నన్ను అడిగి ప్రేమించిందా? ఇద్దర్నీ పోయి గంగలో దిగమను" అనాలనుకుంది.
"ఏమ్మా మాట్లాడవ్? దాని బతుకు....?"
"ప్రేమించిననాడు కట్నం అడగడం ఏమిటి?" వ్యంగ్యంగా అన్నది.
"మన కర్మ! ఏం చేస్తాం చెప్పు! ఆడపిల్లవాళ్ళం!"
"ఈ పెళ్ళి మానెయ్యమను. నేను మరొకర్ని చూసి చేస్తాను"
"నేను చేసుకుంటే సుధీర్ నే చేసుకుంటాను" రాధిక ఎక్కడి నుంచి వచ్చిందో తుఫానులా విసురుగా వచ్చింది.
"చేసుకో! నేను వద్దన్నానా?" అంతకంటే విసురుగా అన్నది రేణుక.
"అంతకంటే నీలాగే ఉండమంటే పోలా. అసలు నాకు పెళ్ళి కావడం నీకిష్టం లేదని నాకు తెలుసు"
"రాధికా!" తల్లి రాధిక చెంప చెళ్ళుమనిపించింది.
రాధికకు కళ్ళముందు రంగులు కన్పించాయి.
రేణుకకు రాధిక అన్నమాట అంతకంటే తీవ్రంగానే గుండెకు తగిలింది. చలన రహితంగా కూర్చుండిపోయింది.
రాధిక కుర్చీమీద కూర్చుని ముఖం చేతులలో దాచుకొని వెక్కివెక్కి ఏడవసాగింది.
"నా కర్మ! నా రాత! ఆయన దారిన ఆయన పోయాడు. ఇంకా ఈ పాపిష్టిదాన్ని ఎన్ని చూడమని వెళ్ళిపోయాడో! ఎందుకే ముండా ఏడుస్తావ్! ప్రేమించావుగా? వెళ్ళు! వెళ్ళి వాణ్ణే అడుగు. వాడు చేసుకోనంటే ఎందులోనన్నా పడి చావు. నా దగ్గిర లక్షలు లేవు. నీకు కట్నం గుమ్మరించి పెళ్ళి చేయడానికి"
రాధిక ఏడుస్తూనే ఉన్నది.
రేణుక తల్లి కేసి చూసింది.
"అమ్మా! ఏమిటమ్మా ఆ మాటలు?"
"అనండి తల్లీ? అందరికీ నేనే లోకువైపోయాను"
ఒక్కొక్కసారి ఆమె అర్థం పర్థం లేకుండా రెచ్చిపోతుంది. ప్రతి మాటకూ పెడర్థాలు తీస్తుంది. ఆమె మనసు మరి కలత చెందినప్పుడు పూర్తి బాలెన్స్ తప్పుతుంది. తనేం మాట్లాడుతుందో తనకే తెలియదు.
ఆ విషయం తెలిసిన రేణుక ఓ క్షణం మౌనంగా ఉండిపోయింది.
అరచేతుల్లో ముఖం దాచుకొని వెక్కి వెక్కి ఏడుస్తున్న రాధికను చూసింది.
జాలి వేసింది. రాధిక ఏడుస్తున్నది. తను పెంచి పెద్దచేసిన చెల్లెలు తను వాళ్ళకోసమే పెళ్ళి మానేసి సంపాదనలో పడింది. కట్నం ఇవాలనే సరికి తన మనసు ఎందుకు ఎదురు తిరిగింది?
తను తండ్రికి ఇచ్చిన మాట మర్చిపోయిందా?


