పెళ్ళవగానే హనీమూన్ అంటూ ఈ వూరూ ఆ వూరూ ఎందుకెళతారో అందరూనూ చక్కగా కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటే కాలం ఎలా గడిచిపోతోందో, మనం ఎక్కడున్నామో కూడా తెలీదే, స్తలాలు చూడడానికి టైమెక్కడిది" మధన్ గుండెలమీద తల ఆనించి అతని షర్టుగుండీలను కుడిచేతితో సవరిస్తూ గోముగా అంది రాధిక.
'కరెక్ట్. అందుకే ప్రేమయాత్రలకు కాశ్మీరాలూ కొడైకెనాలూ ఏలానో, వలపులొలుకు చెలి చెంతనుండగా వేరే స్వర్గము ఏలనో అన్నాడో కవి" అంటూ గట్టిగా తన బాహువుల్లో బంధించాడు మధన్.
"అబ్బ.... వొదలండీ' అంటూ పట్టు విడిపించుకుని లేడిపిల్లలా గబగబా వెళ్ళి సోఫామీద కూర్చుంది.
"రాధీ.... ఇవాళ నువ్వెంత అందంగా వున్నావు. నీ బొమ్మ గియ్యనా?" అన్నాడు.
"అలాగే" అంటూ కాళ్ళు ముడుచుకుని పక్కకి తిరిగి "సైడ్"ఫోజులో కూర్చుంది రాధిక.
మధన్ తన కుంచె రంగులూ తెచ్చుకుని బొమ్మగియ్యడం మొదలెట్టాడు.
ప్రతిరోజూ ఆఫీసు నుంచి ఇంటికి రాగానే ఇదే కార్యక్రమం. నాలుగు రోజులు పట్టేది బొమ్మ పూర్తవ్వడానికి. తదేకంగా చిత్రానికేసి చూస్తున్న రాధికని చూసి "ఎలా వుంది?" అన్నాడు మధన్.
"నా బొమ్మని నేనే నమ్మలేకపోతున్నాను. మీరెంత బాగా వేస్తారోనండీ బొమ్మలు. ఈ మధ్యన వెయ్యడం ఎందుకు మానేశారు. మీరు గొప్ప చిత్రకారులు అని పేరు తెచ్చుకోవాలి. అదే నాకోరిక."
"రాధీ..... మరి నా కోరికేమిటో చెప్పనా?"
"ఊ.... చెప్పండి"
"నువ్వూ గొప్ప నర్తకివని పేరు తెచ్చుకోవాలి. నీలోని కళ కర్పూరంలా కరిగిపోక వెలుగై నలువైపులా వ్యాపించాలి."
"మధన్..... దయచేసి ఇంకేమీ చెప్పకండి. మీరామాట అన్నప్పుడల్లా నాకు నా గతజీవితం జ్ఞాపకం వస్తుంది." అంటూ పటాన్ని టేబిల్ మీద పెట్టేసి ఆలోచిస్తూ సోఫామీద కూర్చుండిపోయింది.
"సరేలే పద భోం చేద్దాం" అంటూ చెయ్యిపట్టిలేవనెత్తాడు మధన్ నిట్టూరుస్తూ.
చిలకాగోరింకల్లా చేతులు పట్టుకుని నడుస్తూ భోజనానికి వస్తున్న కొడుకునీ కోడల్నీ చూసి మురిసిపోయింది రాజేశ్వరమ్మ.
"అత్తయ్యా..... మీరింకా భోం చెయ్యలేదా?" ఆప్యాయంగా అడిగింది రాధిక.
"లేదమ్మా..... ఆకలిగా లేదు. ఈ పూట మజ్జిగతాగి పడుకుంటా, అదిసరేగాని, తొందరగా ఒక మనమరాలినో మనవడినో కని నా చేతిలో పెట్టు. నాకు బొత్తిగా తోచడం లేదు" వడ్డిస్తూ అంది రాజేశ్వరమ్మ.
"నో..... నో.... రెండు మూడేళ్ళదాకా ఆ ప్రసక్తే లేదసలు" కాయలా వుంది నువ్వు చెప్పింది" కోపంగా అంది రాజేశ్వరమ్మ.
"ఆ తరువాతైనా ఇద్దరుపిల్లలు అంతే. దో...య...తీన్"
"ఈ కుటుంబ నియంత్రణ పాఠాలు వినీ వినీ బాగానే ఒంట పట్టాయిలే. పిల్లల్ని పోషించలేని వాళ్ళకికాని మనకెందుకు ఈ కుటుంబనియంత్రణ" ఈసారి మరింత కోపంగా వుంది ఆమె
కంఠం.
"అది కాదమ్మా, పోషించగలంకదా అని కానేస్తే, రేపు వీళ్ళందరూ పెరిగి పెద్దవాళ్ళయ్యాక, కాలేజీలో సీట్లు దొరకవు. ఉద్యోగాలు దొరకవు. ఇంకా....."
"చాల్లెండీ! ఆలీ, లేదు చూలీ లేదూ కొడుకు పేరు సోమలింగం, అన్నట్లుంది మీరు చెప్పడం" నవ్వింది రాధిక.
"ఆలి వుందిగా! మిగతావన్నీ. అవే వస్తాయి" అందరూ నవ్వేశారు. కబుర్లు చెప్పుకుంటూ మెల్లగా భోజనాలు పూర్తిచేశారు. కంచాలు బయట పనిమనిషికి వేసొచ్చి, ఏవో సర్దబోయింది రాధిక.
"నువ్వెళ్ళమ్మా.... నేను చూసుకుంటాలే ఇవన్నీ" అంది అత్తగారు.
"మీరెప్పుడూ అంతే. చిన్న పని కూడా చెయ్యనివ్వరు. ఇలా తిని కూర్చుంటే, కొన్నాళ్ళకి ఈ తలుపుల్లో పట్టను." అంది నవ్వుతూ రాధిక.
"మరేం ఫరవాలేదులే. అంతలోపలే, నీచేత పని చేయించడానికి, ఓ కొడుకుని కనెయ్యి" అంది ఆమె మళ్ళీ అదే ధోరణిలో.
"ఈ పెద్ద వాళ్ళంతా ఇంతే. పెళ్ళయ్యేదాకా ఆ తొందర, ఆ తరవాత, మనవలకోసం తొందర" అనుకుంటూ నవ్వుకుంది, వక్కపొడి డబ్బా పట్టుకుని, మేడమీద కెళ్ళింది, ముసిముసిగా నవ్వుకుంటూ.
గబగబా రోజులు గడిచిపోతున్నాయ్, ఆరోజు పెందలాడే వచ్చాడు మధన్ ఆఫీసునుంచి.
"ఇవాళేమిటో తొందరగా వచ్చేశారేం..... ఏమిటి విశేషం' నవ్వుతూ అడిగింది.
"విశేషమే మరి. మా బాస్, ఇవాళ రాత్రి మనిద్దరినీ డిన్నర్ కి పిలిచాడు."
రాధిక మొహంలో నవ్వు మాయమయింది. ఆమెకి ఇల్లే స్వర్గంలా వుంది మరో చోటికయితే, రాననేదేకానీ, వాళ్ళ బాస్ ఇంటికి. పైగా అతనికి బాస్ అంటే వల్లమాలిన గౌరవం. కాదనలేకపోయింది. పైగా, సంతోషంతో మధన్, ఏ చీర కట్టుకోవాలో ఏ నగ పెట్టుకోవాలో అన్నీ ఏకరువు పెడుతున్నాడు.