"టిఫిన్ పట్టుకురండి. కాఫీ లేకపోతే పెట్టండి" అంది అరుంధతి.
అరుంధతి అంతకుముందే టిఫిన్ చేసింది.
విమలాదేవి ఒకసారి కళ్ళు పెద్దవి చేసుకొని వెంకన్న వైపుచూసి మౌనంగా లోపలకు వెళ్ళిపోయింది.
"వెంకన్నా! అందరూ బాగున్నారా?" అరుంధతి కంఠం వణికింది. ఆమె ఎవర్ని గురించి ప్రశ్నించిందో వెంకన్నకు అర్ధం అయింది. వెంటనే జవాబివ్వలేకపోయాడు.
"బాగున్నారు!" ముక్తరిగా అనేశాడు. అరుంధతి వెంకన్న ముఖంలోకి చూసింది. ఆ ముక్తసరి జవాబులో ఏదో నిగూఢరహస్యం దాగివున్నట్లనిపించింది.
"నిజం చెప్పు వెంకన్నా! పాప బాగుందా?" మాతృహృదయాన్ని చీల్చుకుంటూ వచ్చాయి మాటలు అతి దీనంగా.
"బాగుందమ్మా, మాధవమ్మగారికేం? పుత్తడిబొమ్మ. అచ్చం ఇన్ను చూసినట్టే ఉంటుంది" అన్నాడు వెంకన్న చెమ్మగిల్లిన కళ్ళు తుడుచుకుంటూ.
"ఎప్పుడైనా నన్ను అడుగుతుందా?" ఉద్వేగంగా అడిగింది.
వెంకన్న మాట్లాడలేదు. మళ్ళీ తలగుడ్డతో కళ్ళు తుడుచుకున్నాడు.
"పోనీయ్ లే వెంకన్నా, నువ్వెందుకు బాధపడతావు?" గుండెల్ని చీల్చుకుంటూ వచ్చిన ఆ మాటల్లోని ఆవేదనకు వెంకన్న మనస్సు కరిగిపోయింది. కళావిహీనంగా ఉండే వెంకన్న కళ్ళు కిందకు వాలిపోయాయి.
"అత్తగారు బాగున్నారా?"
"అదే బాగు తల్లీ! నువ్వెళ్ళిన నాటినుంచి ఆమెకు ఎప్పుడూ జబ్బే! ఆరునెల్లగా పక్షవాతంతో మంచం పట్టింది."
"మరి ఇల్లు ఎవరు చూసుకుంటున్నారు?"
"ఇంట్లో పనంతా బుల్లెమ్మగారే చేస్తున్నారమ్మా!"
అరుంధతి తనువెల్లా పులకరించిపోయింది. తన చిట్టితల్లి-తనకళ్ళకు పసిపాపగా మాత్రమే కనిపించే తన బిడ్డ, అంత ప్రయోజకురాలయిందా? రెక్కలు కట్టుకెళ్ళి మాధవిని చూడాలనే కోర్కె హృదయంలో వెల్లువలా పొంగిపొర్లింది.
"వెంకన్నా! మాధవి బాగా ఎత్తుగా వుందా? పని బాగా చేస్తుందా? సంతోషంగా వుంటుందా?" గబగబా అడిగేసింది.
"నీకంటె ఓ గుప్పెడు ఎత్తుగానే వుంటుంది."
అరుంధతి కళ్ళు ఆనందంతో తళతళలాడాయి. కళ్ళ ముందు కూతురి విగ్రహాన్ని వూహించుకోవటానికి ప్రయత్నిస్తూ కూర్చుంది కాని ఆమెకు-మెళ్ళో పులిగోరు, నొక్కులజుత్తు, బోసినవ్వుల్ని విరజిమ్ముతూ, పాలబుగ్గలతో మట్టిలో ఆడుకుంటున్న పసిదే కనిపించసాగింది.
"మాధవికి చదువు చెప్పించలేదా వెంకన్నా?" ఆ ప్రశ్నా బరువుగా వచ్చింది.
"లేదమ్మా! చిన్నప్పుడు ఏదో వీధిబడికి మాత్రం యెల్లింది."
"పోనియ్ లే వెంకన్నా, చదువులేకపోతేనేం? అత్తయ్య చేతుల్లో పెరిగింది. తప్పక గుణవంతురాలయి వుంటుంది. ఆ పల్లె వాతావరణంలో వీధిముఖం చూడకుండా, కల్లాకపటం ఎరగని పల్లెపడుచులా పెరిగింది నా బిడ్డ. జీవితంలో నేను చాలా పోగొట్టుకున్నాను. నా బిడ్డకు అలా జరక్కూడదు. జరగదు కూడా. అదే చాలు" చిన్నగా తన మనస్సును తనే ఊరడించుకుంటున్న ధోరణిలో అన్నది.
ఓ నిముషం మౌనంగా వుండి "ఆయనెలా వున్నారు?" అనేసింది. కాని ఆ ప్రశ్న, తన ప్రశ్న తనకే ఎబ్బెట్టుగా అనిపించింది.
"బాగానే వున్నారమ్మా!" వెంకన్న బరువుగా అన్నాడు. ఆ జవాబులో "ఎలా బాగుంటారమ్మా?" అని ఎదురు ప్రశ్న వినిపించింది అరుంధతికి.
"పిల్లకు సంబంధాలు వస్తున్నాయా?"
వెంకన్న వెంటనే జవాబివ్వలేదు. "ఎందుకు రావమ్మా?" అని మాత్రం తప్పనిసరిగా అన్నట్లు అన్నాడు.
"నువ్వేదో దాస్తున్నావు వెంకన్నా! నిజం చెప్పు. నేను జీవితంలో చాలా చేదును రుచి చూశాను. నువ్వేది చెప్పినా విని తట్టుకోగలను. చెప్పు - నిజం అమ్మాయి సంతోషంగా వుంటుందా?" నిలదీసినట్లు ప్రశ్నిస్తుంటే వెంకన్న దిక్కులు చూడటం మొదలుపెట్టాడు.
"అమ్మాయికేం తరుగమ్మా?" అన్నాడు ఎలాగో ముక్తసరిగా.
అరుంధతి నిట్టూర్చింది. అదే తనకు కావాల్సింది. తన కూతురికి ఏ తరుగూ వుండకూడదు. సుఖంగా వుండాలి. ఆదర్శ గృహిణిగా గౌరవం తెచ్చుకోవాలి.
విమలాదేవి టిఫిన్, కాఫీతెచ్చి వెంకన్న ముందు వుంచింది.
"టిఫిన్ తిను వెంకన్నా!" ఆదరణగా అంది అరుంధతి.
"ఇప్పుడివన్నీ ఎందుకు తల్లీ! నిన్ను చూశాను నా కడుపు నిండిపోయింది" అన్నాడు ఆర్ద్రంగా.
"తిను వెంకన్నా!" బలవంతం చేసింది అరుంధతి.
వెంకన్న లేచాడు. ఉండమని అరుంధతి లోపలకు వెళ్ళింది. వంద రూపాయల నోట్లు రెండు తెచ్చి వెంకన్న చేతిలో పెట్టింది.
"ఎందుకు తల్లీ, ఇంత డబ్బు ఇస్తున్నావు?" అన్నాడు వెంకన్న కొంచెం వెనక్కు తీస్తూ.
"ఫరవాలేదు వుంచు. ఇంటిదగ్గర ఉన్నవాళ్ళకు ఏదైనా పట్టుకెళ్ళు. పట్నంనుంచి వట్టి చేతుల్తో వెళతావా?" అంటూ ఇచ్చింది. వణుకుతున్న చేతులతో అందుకున్నాడు వెంకన్న.
అరుంధతికి తన బిడ్డకు ఏదైనా పంపించాలని వుంది.
"వెంకన్నా!" అరుంధతికి ముందు మాట పెగల్లేదు, దుఃఖంలో పూడుకుపోతున్న గొంతునుంచి.
వెంకన్న మౌనంగా నిల్చున్నాడు. ఆమె ఏదో తను మొయ్యలేని బాధ్యతనే తనమీద వెయ్యబోతున్నట్లనిపించింది అతనికి.
"అమ్మాయికి ఏదైనా కొనిస్తాను; తీసుకెళ్ళి ఇస్తావా?"
వెంకన్న బెదిరిపోయాడు.
"ఎందుకంత భయపడుతున్నావు?"
"ఆ సంగతి దొరగానికి తెలిస్తే నన్ను ప్రాణాలతో వదలరమ్మా!" అన్నాడు వెంకన్న వణుకుతున్న స్వరంతో.
అరుంధతి చూస్తూ నిల్చునిపోయింది.
"ఒకనాడు పాప 'అమ్మ ఎలా వుంటుంది వెంకన్న తాతా?" అని అడిగింది. 'అచ్చం నీలాగే వుంటుందమ్మా!' అని చెప్పాను. ఇంకా ఎన్నో విషయాలు అడిగింది. చెబుతున్నాను. అయ్యగారు చాటునుంచి విన్నారు. రౌద్రమూర్తి అయిపోయారు. నామీదకు దూకి జుట్టు పట్టుకుని వంచి కొట్టారమ్మా! ఆ పిచ్చికోపంలో బుల్లెమ్మగారిని కూడా చెంపదెబ్బలు కొట్టారు. మళ్ళీ ఆ విషయం మాట్లాడినట్లు తెలిస్తే చంపేస్తానని బెదిరించారు" అన్నాడు. వెంకన్న ఆర్ద్రకంఠంతో.
అరుంధతి దుఃఖం పెల్లుబికింది.
"ఇక నువ్వెళ్ళు వెంకన్నా రేపు నీ కొడుకును తీసుకురా!" ఎలాగో అనగలిగింది.
తన గదిలోకి వెళ్ళి తలుపులు బిగించుకొని, మంచంమీద విరుచుకొని పడిపోయింది. ఆ ఇంటికి వదిలి బయటకు వచ్చిన ఇన్ని సంవత్సరాల్లో ఏనాడూ, ఆనాడు ఏడ్చినంతగా ఏడవలేదు. అసలు ఆమెకు తన జీవితంలోనే అంతగా ఏడ్చినట్లు గుర్తులేదు. సాయంత్రం ఆరుగంటలవరకు ఆ గది తలుపులు తెరుచుకోలేదు.
29
"ఏం అలాగున్నావు?" అన్నాడు రాజారావు వస్తూనే అరుంధతి ముఖంలోకి నిదానంగా చూస్తూ.
"ఎలా వున్నాను? నాకేం? బాగానే ఉన్నాను" అంది ముక్తసరిగా అరుంధతి.
"కాదు. నువ్వు బాగాలేవు. ఏదో దాస్తున్నావు. చెప్పవూ?" లాలింపుగా అడిగాడు రాజారావు.
"నా బ్రతుకులో దాచుకోడానికి కూడా ఏదో వుందని నేను అనుకోవటంలేదు. నా జీవితం అంతా బహిరంగమే. బజారుపాలే అయింది" అరుంధతి విసురుగా అంది.
రాజారావు జవాబివ్వలేదు. మౌనంగా ఆమెనే చూస్తూ కూర్చున్నాడు.
"రాజాగారికి సీటు వచ్చినట్టే" అన్నాడు ఆమెను ఆ మూడ్ లోంచి తప్పించటానికి.
అరుంధతి వినిపించుకోనట్టే కూర్చుంది.
"చాలా గొడవ జరిగింది. ఈ విషయంలో కొందరు నా ఆత్మీయులనుకొన్న వాళ్ళకు కూడా నేను దూరం కావాల్సి వచ్చింది" అన్నాడు.
అప్పటికీ అరుంధతి విననట్లే కూర్చుంది. రాజారావు లోలోపలే విసుక్కున్నాడు.
"మొదలియార్ విషయం ఏమయింది?" తాపీగా అడిగింది.
"ఏమీ కాలేదు. ఈ విషయంలో నేను కలుగ చేసుకోదలచలేదు. ముఖ్యమంత్రి ఇష్టానికి వ్యతిరేకంగా చెయ్యమని వత్తిడి పెట్టటం నాకు ఇష్టంలేదు." ఖచ్చితంగా అన్నాడు.
"ఏం? ఎందువల్ల?" రెట్టించినట్లు అడిగింది అరుంధతి.
రాజారావుకు కోపం వచ్చింది. కాని తమాయించుకున్నాడు.
"ఎందుకా? మనం చెయ్యమంటున్న పని న్యాయం కాదు కనుకనే!" అదే స్వరంలో అంత తీవ్రంగానూ అన్నాడు.
రాజారావు విసుక్కుంటే అరుంధతిలో పట్టుదల పెరుగుతుంది. అది తెలిసిన రాజారావు సాధారణంగా విసుక్కోడు. ఈ మధ్య రాజారావుకు విసుగు ఎక్కువైందనీ, వీలుంటే తన జీవితాన్నుంచి తప్పుకోవాలని కూడా చూస్తున్నాడనీ గ్రహించింది అరుంధతి. రాజారావు మీద కసి తీర్చుకోవటానికి నొప్పించే మాటలనడానికీ వెనుదీయటం లేదు. కొంతకాలంగా ఇద్దరిమధ్యా అగడ్తాలాంటి అడ్డం ఏదో ఏర్పడిందని ఇద్దరికీ అనిపిస్తూనే ఉంది.
"న్యాయం, అన్యాయం గురించి మీరు మాట్లాడుతున్నారా? ఇంతకాలంనుంచి మీరు ఇప్పించిన ప్రమోషన్లు అన్నీ న్యాయంగా చేసినవేనా? డబ్బుకోసం చేశారు. ఈ పనీ డబ్బుకోసమే చెయ్యండి" అంది మొండికెత్తినదానిలా.
అరుంధతికి మొదలియార్ మీద అభిమానం ఏమీలేదు. ఏడువేలకే ఆ పని చెయ్యడం ఇష్టంలేదు. ఆ పని రాజారాఫు చెయ్యలేడని కూడా తెలుసు. అందుకే అతన్ని చెయ్యమని వత్తిడి చేస్తూంది.
"నేను డబ్బుకోసం చేసిన పనులకంటే నీకోసం చేసిన పనులే ఎక్కువ" అన్నాడు రాజారావు.
"నన్ను నమ్మించటానికి ప్రయత్నించకండి. మీ భార్యాపిల్లల పేర్లు మీద ఎంతెంత ఆస్తివుందో ఒకసారి వెనక్కు తిరిగి చూసుకోండి."
"నీకున్న దానికంటే చాలా తక్కువే!" కోపంగా అన్నాడు రాజారావు. అతని ముఖంలో కోపచ్చాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
మరీ తెగిందాకా లాగటం మంచిది కాదనిపించింది అరుంధతికి.
"నా డబ్బేమిటి? మీ డబ్బేమిటి? నా డబ్బు మీదికాదూ? నేనేం చేసుకుంటాను?" అంది అరుంధతి రాజారావు ముఖంలోకి నిశితంగా చూస్తూ, కంఠంలోకి మార్దవాన్ని తెచ్చిపెట్టుకుంటూ.
రాజారావు మాట్లాడలేదు. ఆలోచిస్తూ కూచున్నాడు. ముఖంలో విసుగుదల స్పష్టంగా కనిపిస్తూంది.
"ఏమిటి అంత ఆలోచన?" చిరుకోపంగా అడిగింది.
"అరూ! నేను ఒకటి చెప్పదలచుకున్నాను. ఇకమీదట మనం ఇలాంటి రికమండేషన్స్ తగ్గించుకోవాలి. కాదు- పూర్తిగా మానుకోవాలి. ఇప్పటికే చాలా చెడ్డపేరు వచ్చింది. నా పరపతి కూడా పోయింది. పార్టీలో రెండు గ్రూపులు తయారయాయని నీకు తెలుసుగా? ఏ నిమిషంలోనైనా ముఖ్యమంత్రి నన్ను కూడా వదిలించుకోవచ్చు!" అన్నాడు రాజారావు నిదానంగా.
"వదిలేస్తే డిసిడెంట్స్ లో చేరండి." నిర్లక్ష్యంగా అనేసింది అరుంధతి.
"అది అసంభవం. వాళ్ళంతా నాకు వ్యతిరేకులే. అంతమంది నాకు వ్యతిరేకం కావటానికి కారణం ఏమిటో ఆలోచించు" అన్నాడు చురుగ్గా.
"అంటే పార్టీలో చీలికలు రావటానికి కారణం నేనేనంటారా ఏమిటి?" అరుంధతి హేళనగా నవ్వింది.
"అవును. ప్రత్యక్షంగా నేను, పరోక్షంగా నువ్వు!" దృఢంగా అన్నాడు రాజారావు.
"ఇంతకీ ఏమంటారు?"
"అనేదాని కేముంది? ఎలక్షన్స్ దగ్గర కొస్తున్నాయి. మనం కొంచెం జాగ్రత్తగా వుండాలంటున్నాను" అన్నాడు రాజారావు చిరాకుపడుతూ.
"అంటే మొదలియార్ విషయం మాట్లాడవద్దంటారా?"
"మొదలియార్ విషయమేకాదు-ఎవరి విషయమూ మాట్లాడవద్దంటున్నాను" అన్నాడు రాజారావు విసురుగా.
"అంతేనా మీ సమాధానం?" బెదిరింపు వుంది ఆమె కంఠంలో.
"రఘుపతి మొదలియార్ కంటే సీనియర్. ముఖ్యమంత్రికి కావల్సినవాడు. ఈ విషయంలో కలుగచేసుకుంటే, ఆయనకూ నాకూ స్పర్ధలు తప్పవు. అప్పుడు నా భవిష్యత్తు ఏమవుతుందో కొంచెం ఆలోచించు."
"మీ భవిష్యత్తును గురించే ఆలోచించమని చెబుతారు ఎప్పుడూ. నేను మీ భవిష్యత్తుని గురించి ఆలోచించాలి, అంటే మీ కుటుంబ భవిష్యత్తుని గురించి ఆలోచించమనేగా? ఒక్కనాడైనా నా భవిష్యత్తుని గురించి ఆలోచించారా? అందమైన ఆడది, ఇల్లు వదిలి వచ్చిందే చాలని మీ విలాసాలకు ఉపయోగించుకున్నారు. మీ కోర్కెలు తీర్చుకున్నారు."
"నేను నిన్ను ఇల్లు వదిలేసి రమ్మన్నానా?" మధ్యలోనే అందుకొని కోపంగా అన్నాడు రాజారావు.
అరుంధతి తలెత్తి రాజారావు ముఖంలోకి నిరసనగా చూసింది.
"ఆ మాట ఎప్పుడో ఒకనాడు మీ నోటినుంచి వస్తుందని నేను ఏనాడో గ్రహించాను." అరుంధతి లోతుగా వున్న స్వరంతో బాధగా అంది.
రాజారావు మౌనంగా కూచున్నాడు. సిగరెట్ తీసి ముట్టించుకున్నాడు. అతని నొసటిమీద ముడతలు కనిపిస్తున్నాయి.
ఇవ్వాళ అరుంధతికి ఊరుకోవాలని లేదు. రాజారావును వీలయినంతవరకు నొప్పించాలని వుంది. కసిగా వుంది.
"విమలాదేవి విషయం ఏం చేశారు?"
"ఆవిడ గురించి నేను ప్రయత్నం చెయ్యలేదు. ఆవిడ విషయంలో నేను కలుగజేసుకుంటే నాకు పిచ్చెక్కిందంటారు." సిగరెట్ పొగ గట్టిగా వూదుతూ అన్నాడు.
"పోనియ్ నా విషయం?"
"నీ విషయమా! ఏమిటది?" విస్మయంగా చూశాడు.
"నేను ఇల్లు వదిలి వచ్చాక మూడుసార్లు ఎలక్షన్స్ జరిగాయి. పోయిన రెండు ఎలక్షన్స్ లో వచ్చేసారి సీటు ఇప్పిస్తానని నన్ను మభ్యపెడుతూనే వచ్చారు. నన్ను బాహ్యప్రపంచంలో అడుగు పెట్టకుండా చేశారు. ప్రపంచంలో నా స్థానాన్ని నేనుగా నిర్ణయించుకునే అవకాశం కల్పించారు కాదు. మీ భవిష్యత్తునే ప్రతిసారీ ఆలోచించారు. ఈసారి నేను యం.యల్.సి. అయి తీరాల్సిందే!" అంది మొండిగా అరుంధతి.