"నాకేమీ అర్థం కావడంలేదు సుబ్బన్నా! బుర్ర పనిచెయ్యడం లేదు."
"అమ్మాయిగారు చచ్చిపోలేదు!"
చివ్వున తలతిప్పి డ్రైవర్ ముఖంలోకి చూశాడు.
"చచ్చిపోలేదా? నిజమా? నీకెలా తెలుసూ? మరీ ఇంతవరకూ చెప్పలేదేం? అమ్మాయి ఎక్కడికెళ్ళింది? ఎక్కడుంది?"
"అది తెలియదు సర్!"
"మరి చచ్చిపోలేదని అంటున్నావ్?"
"నాకు అలా అన్పిస్తుంది సర్!"
"దానికి కారణం వుండాలిగా? సుబ్బన్నా ఏదో నానుంచి దాస్తున్నావ్? దయచేసి నీకు తెలిసిందేదో చెప్పు!" అర్థింపుగా గద్గద స్వరంతో అడిగాడు రంగారావు.
సుబ్బన్న ఆలోచిస్తూ ఉండిపోయాడు.
"చెప్పు సుబ్బన్నా! నీకు తెలిసిందేదో దాచకుండా చెప్పు!"
"అమ్మాయిగారు ఆ హిప్పీగాళ్ళతో వెళ్ళిపోయిందేమోనని నా అనుమానం సర్!"
"సుబ్బన్నా!" దాదాపు అరిచాడు రంగారావు.
సుబ్బన్న మాట్లాడలేదు.
"ఎందుకొచ్చింది నీకా అనుమానం?"
సుబ్బన్న తటపటాయించాడు. మొదటినుంచీ తనకు తెలిసినదంతా చెప్పాలనుకున్నాడు. మళ్ళీ అపరాధం తనమీదకు నెట్టేస్తారేమోననే భయం కలిగింది.
"చెప్పవేం?"
"ఆరోజు! వాడు మనింటికి వచ్చాడు గదా సర్! మీరు కొట్టబోయారు కూడా! అందుకే నాకలా అన్పిస్తోంది. వాళ్ళు చాలా చెడ్డవాళ్ళు సర్. అమాయకుల్ని మత్తు మందులకు అలవాటుచేసి ఆకర్షిస్తారు. ఒకరోజు అమ్మాయిగారు రిక్షాలో మత్తుగా వచ్చారు గుర్తుందా సర్! వాడే ఇచ్చి ఉంటాడు ఆ మత్తుమందు!"
రంగారావు ఆలోచిస్తూ ఉండిపోయాడు. అవును! సుబ్బన్న చెప్పింది నిజామా కావచ్చు! తనకు ఆ ఆలోచన రాలేదు.
"మరి ఆచీర కాలువ ఒడ్డున-"
"అనుమానం రాకుండా ఉండాలనే అలా చేసి ఉండొచ్చు సర్! వాళ్ళ బట్టలు వేసుకొని వెళ్ళిపోయుంటారు!" అన్నాడు సుబ్బన్న.
ఉంగిడి పడిన గొడ్డులా చూశాడు రంగారావు.
"సుబ్బన్నా! ఈ సంగతి ముందే ఎందుకు చెప్పలేదూ?" రంగారావు కంఠంలో దుఃఖం పెళ్ళిబికింది.
"ముందే చెబితే నన్ను బతకనిస్తారా బాబూ!" అనుకున్నాడు.
"ముందు నాకు అనుమానం రాలేదు సర్. శవం దొరకలేదంటే ఆలోచించాను."
"వాళ్ళెక్కడుంటారో తెలుసా?"
"ఎవరూ?"
"వాళ్ళే ఆహిప్పీలు..."
"తెలుసుకున్నాను. అక్కడికి వెళ్ళాను కూడా! అందరూ వెళ్ళిపోయారు. అక్కడ ఎవరూ లేరు!"
"ఎక్కడికి?"
"తెలియదు సర్. అక్కడ ఓ చిన్న ఇరానీ హోటలుంది సర్! ఆ హోటల్ వాళ్ళు చెప్పారు. పదిరోజుల కిందట అందరూ వెళ్లిపోయారు. అమ్మాయిగారు కూడా వాళ్ళతో వెళ్ళిపోయి వుంటారు. పోలీసు రిపోర్టు ఇస్తే వాళ్లు వెతికి పట్టుకుంటారు సర్!"
"నీకీ విషయం ఎప్పుడు తెలిసింది?"
"మొన్ననే సర్! మీకు చెప్పాలంటే భయం వేసింది."
"అమ్మాయిని ఎవరయినా చూశారా?"
"చూసిన వాళ్ళెవరూ లేరు సర్! కానీ వాళ్ళతోనే వెళ్ళిపోయుంటారు!"
శబరి బతికి వుందా? హిప్పీలలో కలిసిపోయాక మళ్ళీ తిరిగి వస్తుందా? జుట్టు రేగిపోయి, చిరిగిన బట్టల్లో, మత్తులో ఊగిపోతూ, మురికి ఓడుతూ, చెప్పులు కూడా లేకుండా తన శబరి హిప్పీల మధ్యలో తిరుగుతోందా? శబరి బతికి ఉన్నందుకు సంతోషించాలా? లేక హిప్పీలతో కలిసిపోయినందుకు విచారించాలా? శబరి ఇంత నికృష్ట జీవితాన్ని వరించిందా? ఈ సంగతి పదిమందికీ తెలిస్తే తను తల ఎత్తుకోగలడా?
"సర్! పోలీసులకు రిపోర్టు...."
"ఇవ్వను! అక్కర్లేదు.." రంగారావు మనసులో ఏదో పదార్ధం గడ్డకట్టిపోతూ వుంది.
సుబ్బన్న రంగారావు ముఖంలోకి చూశాడు.
"సుబ్బన్నా!"
"సర్!"
"ఈ సంగతి ఎవరికీ చెప్పకు."
సుబ్బన్న ఆలోచనలో పడ్డాడు.
"వెదకించి ప్రయోజనం ఏమిటి? ఒకవేళ శబరి కన్పించినా ఇంటికి వస్తుందా? తీసుకొచ్చి నేనేం చేయాలి? పెళ్ళి చెయ్యగలనా? అందుకే చచ్చిపోయిందనే అనుకుంటాను సుబ్బన్నా! అందులో ఉన్న ఊరట బతికి హిప్పీల మధ్య విచ్చలవిడిగా తిరుగుతోంది అనుకోవడంలో లేదు. శబరి చచ్చిపోయింది. శబరి బతికిలేదు. శబరి చచ్చిపోయింది" పిచ్చివాడిలా వల్లించాడు. "నువ్వు కూడా అలాగే అనుకో! ఎవరికీ చెప్పకు!"
"అలాగే సర్!" ఈసారి సుబ్బన్న కంఠంలో జీర పలికింది.
20
ఇంకా నెలవంక పొడవలేదు. చుక్కలు మిణుకు మిణుకు మంటున్నాయి. కృష్ణ ఒడ్డున శిధిల దేవాలయం గోడవారగా నిలబడి జ్యోతి నది అవతల ఒడ్డుకేసి చూడసాగింది. కృష్ణలో వరదనీరు వురకలు తీస్తోంది. కృష్ణ కట్టమీద ఎవరో వస్తున్న అలికిడి అయింది. జ్యోతి గోడవారగా నక్కి నక్కీ నడిచి దేవాలయం లోపలికి ప్రవేశించింది. తనకు ఇచ్చిన ఆదేశాలను మననం చేసుకుంటూ గర్భగుడిలో ప్రవేశించింది.
"బుస్! బుస్! మని ధ్వని! మధ్య మధ్య "గీచ్! గీచ్!" అరుపులు.
సంచిలోంచి పెన్ టార్చి తీసి వెలిగించింది జ్యోతి. ఆమె రక్తం గడ్డకట్టినట్టు అయిపోయింది. పడగవిప్పి నిలబడ్డ గోధుమ వన్నె కోడెతాచు బుసలు కొడ్తూ చీలిన నాలికలు విసురుతోంది. పడగ కింద రక్తసిక్తమైన చుంచు ఎలుక ఎగిరెగిరి పడ్తోంది. శత్రువు ఎదురయితే విప్లవకారుడు ఏం చేస్తాడో విన్నది. కాని పాము ఎదురయితే ఏం చెయ్యాలి? దళంలో విప్లవ జీవితం ఎలా వుంటుందో ఇంకా తనకు తెలియదు. పాము అలాగే నిశ్చలంగా నిలబడి వుంది. నాలుకలూదడం మినహా వేరే కదలిక లేదు. తను ఇలా ఎంతసేపు నిలబడాలి?
పాము ఎంతసేపు నిలబడుతుంది? పాము పడగకూ ఆమెకూ వున్న దూరంతో పాటు కాలం కూడా ఆగిపోయినట్టు అనిపించింది. ముందున్న భయం ఇప్పుడు తనలో లేదు. ఇంతవరకూ తన కాళ్ళు భూమికి అతుక్కుపోయినట్టుగా వున్నాయి. ఇప్పుడు ప్రయత్నిస్తే తను కదలగలదు. ఎటు కదలాలి? ఎటు వెళ్ళాలి? పామును చూస్తే మనిషికి భయం! మరి మనిషిని చూస్తే పాముకు భయంలేదా?
పల్లెటూర్లో చిన్నప్పుడు తాతయ్య చెప్పాడు. మనిషిని చూస్తే పాముకు చచ్చేంత భయమని. కాని పాముని చూడని పతనవాసం వాళ్ళకు పామును తల్చుకుంటేనే భయమని తాతయ్యే చెప్పాడు! తాచు పడగమీదనుంచి పూర్తిగా చూపు తిప్పకుండానే పాము వెనగ్గా కన్పిస్తున్న విగ్రహాన్నీ, గర్భగుడి గోడనూ చూసింది. పాముకు పారిపోవడానికి మార్గం కావాలి. అవకాశం దొరకాలి. దొరికితే పారిపోతుంది.
మరి మనిషి? మార్గం, అవకాశం దొరికితే పారిపోతాడా? తాతయ్య 'మనిషి కూడా పారిపోతున్నాడు. పామూ మనిషీ ఒహటేనా తాతయ్యా' అంటే "ఒహటే" అన్నాడు. మనిషి పారిపోతాడేమోగాని విప్లవకారుడు పారిపోడు! అయితే విప్లవకారుడు మనిషికాడా?
కాడు! కాడు! ముమ్మాటికీ కాడు! అవకాశం దొరికితే ప్రాణభీతితి పారిపోయేవాడు విప్లవకారుడు కాడు! కానేకాడు! కాని మనిషే విప్లవకారుడౌతాడు. విప్లవకారుడయిన మనిషి పారిపోడు. రక్తం ఓడుతున్న చుంచు పాము పడగనీడలో ఎగిరెగిరి పడ్తూనే వుంది ఇంకా. ఈసారి నాలుగు కాళ్ళమీద బోర్లాపడింది. విరిగిపోయిన మెడను ఈడ్చుకుంటూ మెల్లగా పాకసాగింది. పాము విగ్రహం చాటుకు జరజరా పాకిపోయింది. మరుక్షణంలో పెద్ద "కీచ్" మంటూ శబ్దం! తర్వాత నిశ్శబ్దం!