Previous Page Next Page 
మరీచిక పేజి 29


    ఆదిత్య లాంటి హిపోక్రాట్ ను వివాహం చేసుకొని నేను సుఖపడలేను. అందుకే వెళ్ళిపోతున్నాను. మీకూ, మమ్మీకి నా తుది నమస్కారాలు.


                                                                                              సెలవు.

                                                                                              మీ బేరీ"

 

    "అమ్మా!" అంటూ గావుకేక పెట్టాడు రంగారావు.

 

    అంతవరకూ భర్తను గమనిస్తూ నిల్చుని వున్న రుక్మిణి నడుం విరిగిపోయినట్టు కూలబడింది. ఇంట్లో పనివాళ్ళంతా పరిగెత్తుకొచ్చారు.

 

    "అయ్యో ఏమైందండీ? బేరీ ఎక్కడికెళ్ళిపోయిందండీ?"

 

    "ఏం చెప్పను! మళ్ళీ తిరిగిరాని చోటుకే..." అంటూ రంగారావు రెండు చేతులతో తలపట్టుకుని నేలమీద కూలబడ్డాడు.

 

    "బేరీ!" అంటూ రుక్మిణి విరుచుకొని పడిపోయింది.

 

    ఆదిత్య అక్కడి దృశ్యం చూస్తూ స్థాణువులా నిలబడిపోయాడు.

 

    "చూశావా నాయనా అదెంతపని చేసిందో!" రంగారావు బావురుమన్నాడు. ఆదిత్య రంగారావు ముందు పడి ఉన్న ఉత్తరం తీసుకొని గబగబ చదివేశాడు. శబరికి తనను చేసుకోవడం ఇష్టంలేదా! అందుకే ఆత్మహత్య చేసుకుందా? ఆదిత్యకు నమ్మాలనిపించడంలేదు. మరేదో కారణం ఉండి ఉండాలి? తనెవర్నయినా ప్రేమిస్తోందేమో? అతన్ని చేసుకోవడానికి తల్లీతండ్రి అభ్యంతరం పెట్టివుంటారు.

 

    "రంగారావుగారూ! ఏడుస్తూ కూర్చుంటే ఎలా? చెయ్యవలసింది ఆలోచించండి!" "అయ్యో! ఏం చెయ్యాలి! ఇంకెక్కడ నా బిడ్డ!" లబలబలాడిపోతున్నాడు.

 

    "పోలీసు రిపోర్టు ఇవ్వండి. మనం కాలవ దగ్గిర కెళదాం పదండి!"

 

    "అదేదో నువ్వే చూడు బాబూ!"

 

    ఆదిత్య పోలీసులకు రిపోర్టు ఇచ్చాడు. రంగారావు స్నేహితుల ఇళ్ళకు ఫోన్ చేసి త్వరగా రావలసిందిగా చెప్పాడు.

 

    "పదండి! మనం కాలవదగ్గిర కెళదాం!" అన్నాడు రంగారావు దగ్గిరకు వచ్చి.

 

    "ఇది ఏమైపోతుందో బాబూ!" స్పృహలేకుండా పడివున్న భార్యకేసి చూస్తూ అన్నాడు రంగారావు.

 

    "డాక్టర్ కు ఫోన్ చేశాను. వచ్చి మత్తు ఇంజక్షన్ ఇస్తాడులెండి. మిసెస్ గుప్తా బయలుదేరింది. ఐదు నిమిషాల్లో వచ్చేస్తుంది. ఈ లోపల వీళ్లంతా చూసుకుంటారు పదండి!"

 

    రంగారావును రెక్కపట్టుకొని లేవదీశాడు ఆదిత్య. కాలవ గట్టున శబరి చీర జాకెట్ కన్పించాయి. అది చూసి రంగారావు బావురుమన్నాడు.

 

    'నేను నీకేం తక్కువ చేశానమ్మా! ఎందుకింత పనిచేశావు? నీకేం తక్కువైందని నిలువునా ప్రాణం తీసుకున్నావు తల్లీ!"

 

    "ఊరుకోండి రంగారావుగారూ!" మిష్టర్ సేన్ అన్నాడు.

 

    "నా పెంపులోనే ఏదో లోపం వుంది. అల్లారుముద్దుగా, కష్టం సుఖం తెలియకుండా పెంచాం! ఇది తప్పు, ఇది మంచి అని ఏనాడూ చెప్పడానికి ప్రయత్నించలేదు!" నెత్తి బాదుకుంటూ పిచ్చివాడిలా అంటున్నాడు.

 

    పోలీసులు కూడా వచ్చారు. ఈతగాళ్లు వచ్చారు. శవం కోసం గాలింపు మొదలయింది. రంగారావును బలవంతంగా ఇంటికి తీసుకు వచ్చారు. రుక్మిణికి డాక్టర్ మత్తు ఇంజక్షన్ ఇచ్చాడు. ఇల్లంతా జనంతో కిటకిటలాడి పోతూ వుంది. తలా ఒక మాట అంటున్నారు.

 

    "బంగారు బొమ్మలా ఉండేది!"

 

    "గలగలపారే సెలయేరు గుర్తొచ్చేది. ఆ పిల్ల మాట్లాడుతూ వుంటే!"

 

    "అయినా అంత కష్టమే మొచ్చింది. ఇంతపని చెయ్యడానికి? ఈ పిల్లలు మరీ అర్థంకాకుండా తయారౌతున్నారు!" తన కొడుకు పెద్ద సమస్యగా తయారైనందుకు మాథనపడుతున్న ఓ తల్లి అన్నది.

 

    "ఇంకా చిన్నదే! చదువుకుంటున్నది. పెళ్లికి అంత తొందరే మొచ్చిందో?"

 

    "తల్లి తొందరపెట్టి వుంటుంది!"

 

    "రుక్మిణి ఆధునిక భావాలుగల స్త్రీ! ఆమె పెళ్ళికి తొందర పడిందంటే ఏదో వుండివుండాలి!" పోలీసు కుక్కలాంటి ఒక స్త్రీ తన తెలివిని వెలిబుచ్చింది.

 

    "అవును! ఏదో బలమైన కారణమే వుండివుండాలి."

 

    "పాపం! ఒక్కగానొక్క బిడ్డ. అందుకే అన్నారు ఒక బిడ్డ బిడ్డా కాదు... ఒక కన్ను కన్నూ కాదని!"

 

    "పిదపకాలం పిదప బుద్ధులు!"

 

    తలొకమాటా అంటున్నారు. మత్తుగా పడివున్న రుక్మిణి చుట్టూ చేరిన ఆడవాళ్లు రెండు రోజులు వెదికినా శవం దొరకలేదు. కాలవలో కొత్తనీరు రావడం, లాకులు తెరవడం వల్ల శవం చాలా దూరం కొట్టుకొనిపోయి వుంటుందని పోలీసుల అభిప్రాయం. ఓ పది రోజుల తర్వాత ఏభై కిలోమీటర్ల దూరంలో పాచిపోయి, చేపలు తినేసి, గుర్తుతెలియని యువతి శవం ఒకటి ఒడ్డున తేలినట్లు పోలీసులకు రిపోర్టు వచ్చింది. పోలీసు ఇన్ స్పెక్టర్ ఫోన్ చేసి రంగారావుకు ఈ విషయం చెప్పాడు.

 

    రంగారావు మధనపడసాగాడు. పూర్తిగా కుళ్ళిపోయింది! తన శబరి, తన అందాల శబరి, గుర్తు తెలియకుండా కుళ్ళిపోయింది! శవాన్ని అక్కడినుంచి కదిలించడానికి వీలులేదట. ఏ కీలుకాకీలు ఊడి వచ్చేస్తుందట! అది శబరి శరీరమో కాదో తను గుర్తు పట్టాలట!

 

    "ఏమండీ! అమ్మాయికి రాళ్ళరాజులు కావాలటండీ! సాయంత్రం వెళ్ళి కొందామా?"

 

    రంగారావు చివ్వున తలెత్తి చూశాడు. మతిపోయిన భార్యని చూస్తుంటే రంగారావు కళ్ళలో నీరు తిరిగింది.

 

    'నాకంటే నువ్వే అదృష్టవంతురాలవు రుక్కూ! నీకు మతిపోయింది. అందుకే అమ్మాయి నీకు మిగిలింది. అమ్మాయితో మాట్లాడుతున్నావు. ఆమె కోర్కెల్ని వింటున్నావ్' అనుకున్నాడు. మనసులోనే రంగారావు.

 

    "మాట్లాడరేమండీ! బేరీ ముఖం చూడండి ఎంత చిన్నబోయిందో!"

 

    శూన్యంలో బేరీ రూపాన్ని చూస్తూ అన్నది రుక్మిణి.

 

    "అలాగే సాయంత్రం వెళదాం!" అన్నాడు రంగారావు.

 

    వంటమనిషి సుబ్బమ్మ వచ్చి రుక్మిణిని గదిలోకి తీసుకెళ్ళింది. తనకు మతిపోలేదు. అందుకే ఈ బాధ. పోలీసు ఇన్ స్పెక్టర్ వచ్చాడు.

 

    "నేను రాలేనయ్యా! నా బిడ్డను ఆ రూపంలో చూడలేను."

 

    "మీ అమ్మాయో కాదో ముందు చూడండి సార్! చూసినా మీరు గుర్తుపట్టలేక పోవచ్చును!"

 

    "నేను రాలేను."

 

    "మరి శవాన్ని?"

 

    "పదండి వస్తాను" అంటూ రంగారావు బయలుదేరాడు.

 

    రంగారావు ఆ శవాన్ని చూడలేకపోయాడు. కాదు! కాదు! తన శబరి కాదు. బంగారుబొమ్మ శబరి, ఎంత కుళ్ళిపోయినా ఇంత భయంకరంగా... రంగారావు తలలో రక్తనాళాలు చిట్లడానికి సిద్ధంగా వున్నాయి.

 

    "మా అమ్మాయో కాదో నాకు తెలియడంలేదు. నా బిడ్డకాకపోతే నా బిడ్డలాంటి మరోబిడ్డ... ఏ తల్లిదండ్రులు కడుపులో చిచ్చు పెట్టిందో! ఒకవేళ నా బిడ్డనేమో! నాకు మతిపోతూ వుంది."

 

    రంగారావు వచ్చి కార్లో కూర్చున్నాడు.

 

    "సర్!" డ్రైవర్ సుబ్బన్న పిలిచాడు.

 

    "ఏం సుబ్బన్నా?"

 

    "మీరు కోప్పడనంటే ఒక సంగతి చెపుతాను సర్."

 

    "చెప్పు!" ఇంకా కోప్పడే అహం కూడా నాలో వుందనే అనుకుంటున్నావా? అన్నట్టుంది రంగారావు కంఠం.

 

    "అమ్మాయిగారు చీర విప్పేసి ఒడ్డున పెట్టేశారుగదా సర్!"

 

    "అవును!"

 

    "మరి ఈ శవం వంటిమీద ముతకచీర వుంది చూశారుగా?"

 

    రంగారావు ఆలోచనలో పడ్డాడు.

 

    "అయినా అమ్మాయిగారు చీరవిప్పేసి నీళ్ళలో ఎందుకు పడ్తారు సర్? పైగా వంటిమీద నగలు మాత్రం తియ్యలేదు."

 

    నిజమే! ఈ ఆలోచన ఇంతవరకూ ఎవరికీరాలేదేం? పోలీసులకు నగలు వున్నట్టు రిపోర్టు ఇవ్వలేదు. అందుకే వాళ్ళు ఆ విషయం గురించి ఆలోచించి వుండరు.

 Previous Page Next Page