Previous Page Next Page 
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 3


    రిషికి లేవడం సాధ్యంకాలేదు. అయినా ప్రయత్నిస్తూనే "చూడండీ.... మిస్....మేడమ్... ఇదిగో .... మిమ్మల్నే" అంటూ ఆమెని ఈ లోకంలోకి తీసుకురావడానికి ప్రయత్నించాడు.

    ఆమెలో చలనంలేదు.

    ఎవరో కాళ్ళు తొక్కుకుంటూ పరిగెడుతున్నారు. ఇంకా ఎవరో మీదనున్న సామాన్లు గబగబా ఏరుకుంటున్నారు.

    రిషి వాళ్ళతో "ప్లీజ్.... మాకు కాస్త హెల్ప్ చెయ్యండి" అన్నాడు.

    వాళ్ళు వినిపించుకోలేదు. ఎవరి గోలలో వాళ్ళున్నారు. ఆమె మీద కొద్దిగా కదిలింది. ఆ మెత్తని రాపిడికి అతనికి ఏదోగా అనిపించింది. అంత బాధలోనూ నవ్వొచ్చింది.

    "మొదలుపెట్టు పదమూడవ ఎక్కం" అంది మనసు.

    "షటప్! దేనికైనా సమయా సమయాలుంటాయి" విసుక్కున్నాడు రిషి.

    "నాకే చెప్తున్నావా కబుర్లు!" అంది పాడు మనసు.

    "ఇంతకంటే నరకం లేదు!" అన్నాడు రిషి.

    "స్వర్గంలో కూడా యిలాంటి ఛాన్స్ రాదు" అంది అతని మనసు.

    ఇంతలో పెద్ద వెలుతురూ రిషి మొహాన పడింది. అతను వెంటనే కళ్ళు మూసుకునే "హెల్ప్....హెల్ప్" అని అరిచాడు.

    ఎవరో వంగి ముక్కు దగ్గర వేలుపెట్టి చూడడం తెలిసింది.

    "నాకేం కాలేదు. నాపైనవున్న అమ్మాయిని తియ్యండి" అన్నాడు గబుక్కున.

    బయట వాతావరణం భీతావహంగా వున్నట్లు గుర్తుగా గోలగోలగా జనం పరుగులూ, పోలీస్ విజిల్సూ, పిల్లల ఏడ్పులూ వినిపిస్తూనే వున్నాయి.

    రిషిమీద బరువు ఎవరో తొలగించినట్లు అనిపించింది.

    "లేవండి" అంటూ అతను చెయ్యి అందించాడు.

    రిషికి లేవడం చాలా కష్టమయింది. రెండు సీట్ల మధ్య యిరుకులో అతని కాలు చిక్కుపడిపోయింది. తలకి కూడా దెబ్బ తగిలినట్లు దిమ్ముగా వుంది.

    రిషి లేపిన వ్యక్తి అతనికాలు నెమ్మదిగా యివతలికి లాగుతూ "అదృష్టవంతులే పెద్దగా దెబ్బలేం తగల్లేదులా వుంది" అన్నాడు.

    రిషి అతని ఆసరాతో లేచి నిలబడుతూ "అసలేమయింది?" అన్నాడు.

    "ఏక్సిడెంటండీ బాబూ! రండి.... దిగాక మాట్లాడుకుందాం" అన్నాడతను.

    రిషి బాగా ఒంగి ఆ రైలుపెట్టెలోంచి ఎలాగో బయటపడ్డాడు. రైలు ఏక్సిడెంట్ల గురించి పేపర్లలో చదవడమే కానీ తనూ అందులో ఒక బాధితుడౌతానని ఎన్నడూ అనుకోలేదు కదా! అనుకున్నాడు.

    క్రిందకి దిగాక తనకి సహాయం చేసిన వ్యక్తితో "చాలా థాంక్స్! మీ రుణం తీర్చుకోలేను" అన్నాడు మనస్ఫూర్తిగా.

    అతను వెంటనే "సరే కానీ మీ మిసెస్ కి ఇంకా స్పృహ రాలేదు. అదిగో ఆ చెట్టుక్రింద వున్నారు" అంటూ గబగబా నడుచుకుంటూ రెడ్ క్రాస్ అని వ్రాసున్న వేన్ వేపు వెళ్ళిపోయాడు.

    రిషికి అతనేం అన్నాడో వెంటనే అర్ధం కాలేదు.

    అర్ధం అయ్యాక అతనికి ఆ అమ్మాయి గుర్తొచ్చింది. వెంటనే ఆ చెట్టు వైపు నడిచాడు-

    చెట్టుక్రింద ఆ అమ్మాయిని చూడగానే అతనికి చాలా జాలేసింది. ఆమె ఒంటిమీద చీర స్థానభ్రంశం చెంది వుంది. వెల్లకిలా పడుకున్న ఆమె గుండెల మీద ఆచ్ఛాదన లేదు. రిషి చటుక్కున కొంగు తీసి కప్పాడు. కాళ్ళ వరకూ చీరని లాగి సరిచేశాడు. ఎంతో యాంత్రికంగా, నిర్భావంగా చేసాడు.

    "గుడ్!" అంది మనసు.

    రిషి ఆమె మెడ బోసిగా వుండటం గమనించాడు. ఇందాకా ట్రైన్ లో ఆమె మెడలోనూ, చేతికీ నగలుండటం అతను చూసాడు. ఇప్పుడు ఆమె చేతులకి వాచీ, గాజులూ మాత్రం వున్నాయి. ఇల్లు కాలి ఒకడేడిస్తే.... చుట్ట నిప్పు కోసం ఒకడని.... ఇటువంటి ప్రమాదాల్లో జరిగే దొంగతనాల గురించి అతను విని వున్నాడు.

    రిషి ఆమె చెంప మీద సున్నితంగా తట్టి "హలో .... మిస్.... కళ్ళు తెరవండి" అని లేపడానికి ప్రయత్నించాడు.

    ఆమె కళ్ళు తెరవడానికి ప్రయత్నిస్తున్నట్లు రెప్పలు చిట్లించింది. ఆ తర్వాత బలహీనమైన స్వరంతో "దాహం.... దాహం" అంది.

    రిషికి కాస్త దూరంలో ఎవరిదో వాటర్ బాటిల్ కనిపించింది. తెచ్చి ఆమె గొంతులో నెమ్మదిగా పోస్తుంటే గుటక వేసింది. అమ్మయ్య అనుకున్నాడు.

    ఆమె నెమ్మదిగా కళ్ళు తెరిచి ఒంగి తన మొహంలోకి ఆత్రంగా చూస్తున్న రిషిని ఎగాదిగా చూసింది.

    రిషి వూపిరి పీల్చుకుని "లేవండి. దేవుడి దయవల్ల మనకే ప్రమాదమూ జరగలేదు" అన్నాడు.

    ఆమె లేస్తూ "ఏవైందీ?" అంది. అంతలోనే చుట్టూ చూసి కెవ్వుమని అరుస్తూ అతని భుజం మీద వాలిపోయింది.

    చుట్టూ వున్న మనుషుల రక్తసిక్తమైన దేహాలూ, ఏడ్పులూ ఆమెని భయపెట్టాయని అతను అర్ధం చేసుకున్నాడు.

    "బీ బ్రేవ్! మనకి ఏమీ కాకపోవడం విచిత్రం. అందుకు సంతోషించండి" అని వీపు నిముర్తూ ధైర్యం చెప్పాడు.

    ఆమె వెక్కిళ్ళు పెట్టి ఏడ్చింది.

    అలవాటు లేని ఆ స్త్రీ స్పర్శా, ఆమెని ఓదార్చే ఆ కొత్త బాధ్యతా అతనికి కొత్తగా వుండి కాస్త కంగారనిపించింది.

    ఆమె హఠాత్తుగా అతని నుండి విడివడి "మీరు ఎవరు?" అంది.

 Previous Page Next Page