Read more!
 Previous Page Next Page 
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 2



    "ఎవతివే నీవు... భీత హరివేక్షణ" అంటూ పెద్దనగారి పద్యం అందుకోవాలనిపించింది రిషేంద్రకి. "ఎవడ్రావీడు! అందమైన అమ్మాయి చేతికి దొరికితే రఘురామయ్య లెవెల్లో పద్యాలందుకుంటానంటున్నాడు!" హేళనగా అంది మనసు.

    రిషి సిగ్గుపడ్డట్టు చూసాడు.

    ఆ అమ్మాయి అందంగా నవ్వింది.

    "క్షమించండి. మీ ఏకాంతానికి భంగం కల్గించాను" వీణ మీటినట్లుగా పలికింది అమ్మాయి.

    "పరవా...లే..." రిషి మాట పూర్తి చెయ్యలేకపోయాడు. ఆమె పైట పూర్తిగా జారిపోయి వుండటంతో అతని కళ్ళు శిఖరాగ్ర సమావేశానికి ఆయత్తమయ్యాయి.

    ఆమె అతని, చూపు కొనని జాగ్రత్తగా పట్టుకుని, అమాంతం సిగ్గుపడిపోయి ఆ తర్వాత తన తప్పు తెలుసుకుని గభాల్న పైట వేసుకుంది.

    జారిన పైట జావళిలోని గమకాల్ని ఇంకా మరచిపోలేని రిషేంద్ర ఆమె ఉచ్ఛ్వాస నిస్వాశల్లోని తిల్లానాని వీక్షిస్తూ వుండిపోయాడు.

    "ఎక్స్యూజ్ మీ!" అతన్ని తప్పించుకుని ఆమె టాయిలెట్ వైపు వెళ్తూంటే మనసు లబలబలాడింది. "నా మాట వినలేదు! చూడు ఇప్పుడు రాత్రంతా నన్ను నరకయాతన పెడ్తావు!"

    "తప్పురా!" నోటిమీద వేలేసుకుని మరీ చెప్పాడు రిషేంద్ర.

    "ఆహా! ఆ మాట ఇందాకట్నించీ ఆ అమ్మాయిని ఇంచీ.... ఇంచీ కొలుస్తున్న నీ కళ్ళకు ఎందుకు చెప్పలేదు. భుజాలు పట్టుకోగానే ఆత్రంగా తడిమిన నీ వేళ్ళకి ఎందుకు చెప్పలేదూ! నీతులన్నీ నాకే గానీ శరీరానికి లేవా?" నిలదీసింది మనసు.

    "నోర్ముయ్... పీక నొక్కేస్తా జాగ్రత్త!" బెదిరించాడు రిషేంద్ర.

    రాయి దెబ్బకి మూలుగుతూ తోక ముడిచేసుకున్న కుక్కపిల్లలా అయిపోయింది మనసు. "ఎప్పుడో బైటికొచ్చి నీ గుట్టు బైట పెడ్తా జాగ్రత్త!" గొణిగింది.

    ఆ అమ్మాయి బైటికొచ్చింది. చిన్నగా చిరునవ్వు నవ్వి అతన్ని దాటుకుని వెళ్తుంటే మతైన చార్లీ స్ప్రే వాసన గుప్పుమంది.

    'ఇందాక లేదే!' అనుకున్నాడు రిషేంద్ర. వీపుమీద ఆడిస్తున్న నల్లని నాగుపాములాంటి జడ ఆగినచోట అతని కళ్ళు మళ్ళీ ఆగిపోయాయి. వడివడిగా నడుస్తున్న ఆమె, అతని నోటినుండి వచ్చిన ఓ మైగాడ్! అన్నమాటకి ఆగి వెనక్కి చూసింది.

    రిషికి తన తప్పు తెలిసి లెంపలేసుకుంటూ "భగవంతుడ్ని తలచుకుంటున్నాను" అన్నాడు.

    ఆ అమ్మాయి ఆశ్చర్యంగా చూస్తూ అంది "ఎక్కడ వున్నా ఎలాంటి పరిస్థితుల్లో వున్నా దైవప్రార్ధన మానరా!"

    "కష్టం వచ్చినప్పుడల్లా దైవాన్ని ప్రార్ధిస్తాను" రిషి చెప్పాడు.

    "ఏం కష్టం వచ్చిందిప్పుడూ!" అమ్మాయి కళ్ళు పెద్దవి చేసి అడిగింది.

    "చెప్పు....చెప్పు" మనసు కవ్వించింది.

    "ఇంకా రాలేదు... రాబోతోంది" చెప్పాడు రిషి.

    "ఏవిటది?" ఆ అమ్మాయి ఆసక్తిగా అడిగింది.

    రిషి రెండు అడుగులు దగ్గరగా వేసాడు. "మీరు చాలా అందంగా వున్నారు. మంచివారులా కూడా వున్నారు. ఇంత పెద్ద కష్టం వసుందని అసలు వూహించి ఉండరు. ఇందాక నవ్వుతూ రైలెక్కి యీ కంపార్ట్ మెంట్ లోకి ప్రవేశించినప్పుడు కూడా వూహించి ఉండరు."

    రిషి చెపుతూ వుండగానే ఆమె భయంగా అడిగింది. "ఏవిటి మీరనేది.... కష్టం రావడమేమిటి?"

    "అవును... పెద్ద ప్రమాదం. మనిద్దరం తప్పించుకోలేనిది!" రిషి అమాయకంగా వూగుతున్న ఆమె చెవి రింగువైపు చూస్తూ అన్నాడు.

    తనని తాను కంట్రోల్ చేసుకోవడం కష్టం అని అతనికే అనిపిస్తోంది. పదమూడవ ఎక్కం చదువుదామా అని కూడా అనుకున్నాడు.

    "ప్రమాదమా! మీకెలా తెలుసు?" ఆ అమ్మాయి కనుబొమలు చిట్లించి అడిగింది.

    "ఊహించగలను కాబట్టి" రిషి ఆలస్యం చెయ్యకుండా ఆమెని గభాల్న దగ్గరికి లాక్కున్నాడు.

    'కెవ్వు'మన్న ఆమె కేక ఆ నిశీధిలో ప్రతిధ్వనించలేక రైలు హోరులో కలిసిపోయింది.

    ఒక్కసారిగా ఆ నిశీధిలో ఏదో భయంకర విస్ఫోటం జరిగినట్లుగా అయింది. నడుస్తున్న ఎద్దు మొరాయించినట్లుగా రైలు పెట్టె ఓ పక్కకి ఒరిగిపోయింది.

    రిషి కళ్ళు మూసుకుని పదమూడవ ఎక్కం చదువుతున్న వాడల్లా ఠక్కున కళ్ళు తెరిచాడు. అంతా చీకటి... హాహాకారాలు! ఏడ్పులూ, పెడబొబ్బలూ వినిపిస్తున్నాయి. అతనికి ఏం జరిగిందో, ఏవిటో ఒక నిమిషం అర్ధంకాలేదు! ఆ అమ్మాయి కెవ్వుమనగానే తనకి భయం వేసింది. ఆ వెంటనే కళ్ళుమూసుకుని పదమూడవ ఎక్కం చదవడం మొదలెట్టాడు. అలా ఎన్నిసార్లు చదివాడో గుర్తులేదు కానీ ఇంతలో ఇలా! నెమ్మదిగా కదలబోయాడు. తలంతా దిమ్ముగా అనిపించింది. మళ్ళీ ప్రయత్నించాడు. తను వెల్లకిలా పడున్నట్లు తనమీద ఏదో బరువుగా వున్నట్లూ అతనికి అప్పుడు తెలిసింది.

    చుట్టూరా చీకటి, బయటనించి పెద్ద పెద్ద గొంతులతో కేకలూ, ఏడ్పులూ నేపధ్యంగా వినిపిస్తున్నాయి. అతని చెవిలో 'అమ్మా....అబ్బా!' అన్న సన్నని మూలుగు వినిపిస్తోంది.

    రిషి కళ్ళు నెమ్మదిగా ఆ చీకటికి అలవాటుపడ్డాయి. తన చెంపలకి మృదువైన స్పర్శ లభిస్తున్నట్లుగా తనచేతి క్రింద ఓ నల్లని జడ పరుచుకున్నట్లుగా అతను గమనించి కళ్ళు వాల్చి ఆమెవైపు చూసాడు.

    ఆమె అతనిమీద... అతి దగ్గరగా.... వూపిరిలో వూపిరి కలిపేటంత చేరువగా వుంది. ఆమె ముఖం బాధతోనో భయంతోనో బిగుసుకున్నట్లుగా వుంది. వీపుమీద ఏవో సామాన్లు పడడంవలన బరువుకి మూలుగుతోంది.

 Previous Page Next Page