Previous Page Next Page 
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 4



    ఆమె భుజం మీద చీరుకుపోయి రక్తం వస్తుండటం చూసిన రిషి "అరె.... అక్కడ డాక్టర్స్ వున్నారు పిలుచుకు వస్తాను" అని కదలబోయాడు.

    ఆమె అతని చేతిని గట్టిగా పట్టుకుంది.

    అతను ఆమె పెద్ద పెద్ద కళ్ళలో భయాన్ని జాలిగా చూస్తూ "ఏ వూరు వెళ్ళాలి?" అన్నాడు.

    ఆమె చాలా బ్లాంక్ గా చూసి "ఏమో!" అంది.

    రిషి ఆశ్చర్యంగా మళ్ళీ అదే ప్రశ్న వేసాడు.

    "తెలీదు" ఆమె అయోమయంగా చూస్తూ అంది.

    రిషి అనుమానంగా "ఎక్కడినుంచి వస్తున్నారు? మీ పేరేమిటి?" అన్నాడు.

    ఆమె అలాగే ఓ చూపు నిలిపి ఓ క్షణం చూసి వెంటనే ఎగసిపడిన అలలా భోరున కుప్పకూలి ఏడుస్తూ "తెలీదు.... ఏమీ గుర్తు రావడం లేదు" అంది.

    రిషి కంగారుగానే "ప్రయత్నించండి.... తప్పకుండా గుర్తొస్తుంది" అన్నాడు.

    షాక్ లో వున్న ఆమె సర్వం పోగొట్టుకున్న దాన్లా దిక్కులు చూసింది.

    రిషి కూడా ఆమె సామాన్ల కోసం చూసాడు. అక్కడక్కడా విరిగిన సూట్ కేసులూ, బొంతలూ లాంటి పనికిరాని సామానుతప్ప మరేమీ మిగల్చలేదు. ఆమె సామాన్లు పోయుంటాయని రిషికి తెలిసింది. అతను ఎలాగూ ప్రయాణాల్లో జత బట్టలు కవర్ లో పెట్టుకుని ప్రయాణం చేస్తాడు కాబట్టి పోయాయని పెద్దగా బాధపడలేదు. కానీ ఆమె పరిస్థితి ఏమిటి?

    చుట్టూ అంధకారం. ఒంటరి ఆడపిల్ల. పైగా అందమైన ఆడపిల్ల. విలువైన నగలతో వుంది. అలా ఒదిలేసి వెళ్ళిపోవడమేనా? ఆలోచించాడు.

    "మనకెందుకొచ్చిన గొడవ?" మనసు సణిగింది.

    రిషి లేవబోయాడు. కానీ ఏదో పట్టి ఆపింది.

    వెనక్కి తిరిగి చూసాడు. అతని చొక్కా కొసని ఆమె గుప్పెటలో బంధించి నీళ్ళు నిండిన కళ్ళతో బేలగా చూస్తోంది.

    అంత అందమైన ఆడపిల్లని ఆ స్థితిలో, ఒంటరిగా ఆ జనం మధ్యన విడిచి వెళ్తే ఆమె స్థితి ఏవిటో అతను వూహించగలడు. మరేం చెయ్యాలి? పోనీ పోలీసులకి చెప్తేనో! అనుకున్నాడు. అంతలోనే వాళ్ళ మీద కూడా అంత సదభిప్రాయం లేక మనస్సు మార్చుకున్నాడు.

    ఆమె నిస్తేజంగా చూస్తోంది. ఒకవేళ ఈ వాతావరణం నుంచి దూరంగా తీసికెళ్తే మామూలు మనిషౌతుందేమో అనిపించింది. అనిపించిందే తడవుగా ఆమెని తనతో తీసుకెళ్ళాలని నిర్ణయం చేసుకున్నాడు.

    "ఆగు" అంది మనస్సు.

    "ఆగను" అన్నాడు.

    "ఇదంతా అనవసరమైన గొడవలా ఉంది. మళ్ళీ తర్వాత నన్నేం తప్పు పట్టద్దు.... ముందే హెచ్చరిస్తున్నాను" అంది మనస్సు.

    "నువ్వు కొంచెం నోర్మూసుకుని పడుంటావా?" విసుక్కున్నాడు రిషి.

    అది నోర్మూసేసుకుంది.

    రిషి ఆమె దగ్గరికి నడిచి "పదండి" అన్నాడు.

    "ఎక్కడికి?" అన్న ప్రశ్న కళ్ళల్లో కదలాడింది.

    "ప్రస్తుతానికి నాతో పదండి. తర్వాత సంగతి తర్వాత ఆలోచిద్దాం" అన్నాడు.

    ఆమె యాంత్రికంగా లేచి అతన్ని అనుసరించింది.


                            *   *   *    *
   
    ఆలేరు-భువనగిరుల మధ్యన ఏక్సిడెంట్ అయింది. రిషి ఆలేరులోనే ఓ కొయ్య బొమ్మలు తయారుచేసే ఫ్యాక్టరీలో అకౌంటెంట్ గా పని చేస్తూంటాడు. ఊరి చివరగా వున్న ఓ చిన్న పెంకుటిల్లు అద్దెకి తీసుకుని ఒంటరిగా వుంటాడు.

    "రండి" అన్నాడు రిషి.

    ఆమె స్వప్నంలో నడుస్తున్న దాన్లా లోపలికి అడుగుపెట్టింది. ఒక గదీ, వంటిల్లూ వున్నాయి. గదిలో ఓ మంచం, టేబులు మీద చిన్న ట్రాన్సిష్టరూ, గూట్లో పుస్తకాల దొంతరా, చిలక్కొయ్యకి ఓ లుంగీ షర్టూ వున్నాయి. ఆ వెనకాల వున్న వంటింట్లో గట్టు మీద కిరోసిన్ స్టౌ, కొన్ని వంటగిన్నెలూ, అలమారాలో సీసాలు, డబ్బాలు పొందికగా పేర్చబడి వున్నాయి.

    "ఇదే నా నివాస స్థలం. ఇక్కడ ఓ ఫ్యాక్టరీలో అకౌంటెంట్ గా పని చేస్తున్నాను. విజయవాడ దగ్గరున్న పల్లెటూళ్ళో మా అమ్మ వుంటుంది. ఆవిడ్ని చూడ్డానికే వెళ్ళి వస్తున్నాను. ఆవిడకి నేను కాక ఇంకా రెండు బర్రెలు కూడా వున్నాయి. నాకంటే అవే నయం! వాటిమీద వచ్చే సంపాదనతోటే మేము ఇన్నాళ్ళూ బ్రతికాం" అని నవ్వాడు.

    ఆమె కూడా సన్నగా నవ్వింది.

    "కూర్చోండి! మంచం తప్ప కూర్చోడానికేమీ లేదు ఇక్కడ. నేను వెళ్ళి మనం టీ పెట్టుకోవడానికి పాల ప్యాకెట్ తీసుకొస్తాను. ఈలోగా స్నానం చేసి...." అని ఆమె వంటి మీదున్న నలిగిపోయిన మైసూర్ క్రేప్ చీరని చూసి ఆగిపోయాడు.

    "ఊ....చేసి...." ఆమె పూర్తి చెయ్యమన్నట్లుగా చూసింది.

    అతను కాస్త బెరుకుగానే "ఆ లుంగీ షర్టూ వేసుకొని, ఈ చీర కాస్త వుతికి ఆరేసుకుంటే సరిపోతుందిగా!" అన్నాడు.

    ఆమె ఏ భావం కనబరచకుండా తల వంచుకుంది.

    రిషికి ఏదైనా పొరపాటుగా మాట్లాడానేమో అనిపించింది.

    "ఏరా.... తప్పా?" అడిగాడు మనసుని.

    "నన్ను నోర్మూసుకోమన్నావుగా. ఎందుకు చెప్పాలి?" ఎత్తి పొడిచింది.

    "అనన్లే.... చెప్పు! మొదటిసారి ఆడపిల్లతో ఇలా ఒంటరిగా వుండటం వల్ల తడబాటుగా వుంది" అన్నాడు.

    "అయితే అంతా నాకు ఒదిలిపెట్టు. అప్పుడు చూడు తమాషా!" అంది హుషారుగా మనస్సు.

 Previous Page Next Page