Previous Page Next Page 
మరో దయ్యం కథ పేజి 3


    మనిషి ఆరడుగులు రెండంగుళాలైనా ఉంటాడు. ఎత్తుకు తగిన లావు, జుట్టు తెల్లబడింది. ముఖం చూస్తే అరవై దాటిన వాడిలాగే ఉన్నాడు. అయినా శరీరంలో జవసత్త్వాలు ఏ మాత్రం సడలలేదు. గుబురుగా అల్లుకుపోయిన కనుబొమల కింద కళ్ళు లోతుగా ఉన్నాయి. అయినా అవి వింతగా వెలుగుతున్నాయి. ఎంతోకాలంగా, తమనుతాము కాల్చుకుంటూ, చీకట్లో తిరిగే మిణుగురు పురుగుల్లా ఉన్నాయి అతని కళ్ళు.

 

    మనిషే! కాని ఆ కళ్ళు మాత్రం మామూలు మనిషి కళ్ళలా లేవు. కణకణలాడ తున్నాయి. ఆ కళ్ళు చూస్తుంటే నాకు గుండె గుబగుబ లాడింది. భయాన్ని ముఖంలో కన్పించకుండా తొక్కిపట్టి "ఎవరు నువ్వు?" బింకంగా అడిగాను.

 

    అతడు మాట్లాడకుండా నా చేతిలోని సూట్ కేసు తీసుకున్నాడు. నేను తేరుకునే లోపుగానే ప్రయాణీకుల షెడ్ కేసి నడిచాడు. నేనూ అతడ్ని యాంత్రికంగా అనుసరించాను. నా సూట్ కేసును ఒక బెంచీ మీద పెట్టి దాని పక్కనే కూర్చున్నాడు.

 

    నాకు వళ్ళు మండింది. ఏమిటీ జబర్దస్తీ? నాచేతిలోని సూటుకేసును తీసుకొని పక్కన పెట్టుకొని దర్జాగా కూర్చున్నాడు.

 

    "కూర్చోండి బాబూ!"

 

    బోడి మర్యాద. అసలు వీడి ఉద్దేశ్యం ఏమిటి? దొంగ కాని కాదు కదా? అయివుండాలి. లేకపోతే ఈ రాత్రిపూట చీకట్లో చెట్లమధ్య ఏం చేస్తున్నట్టు? తనలాంటి వంటరి ప్రయాణీకులకోసం ఎదురు చూస్తుంటాడన్నమాట! ఇక్కడ వాడిని ఎదిరించగల వాళ్ళెవరూ లేరు. అందుకే అంత ధైర్యంగా పెట్టెతీసుకొని పక్కన పెట్టుకొని తాపీగా కూర్చున్నాడు. పైగా నన్ను కూడా కూర్చోమంటున్నాడు.

 

    "ఏమిటి బాబుగారూ ఆలోచిస్తున్నారు? నన్ను భైరవమూర్తిగారు పంపించారు."

 

    నేను చివ్వున తలెత్తి చూశాను. అతను చిరునవ్వు నవ్వాడు. నిగూఢంగా అన్పించింది ఆ నవ్వు.

 

    "భైరవమూర్తి పంపించాడా? అతనిచ్చిన టెలిగ్రాంలో నిన్ను పంపిస్తానని రాయలేదే?" సందేహంగా చూస్తూ అడిగాను.   

 

    "అవునట. మీరు ఈ చీకట్లో వంటరిగా నడిచి దుమ్మలగూడెం వెళ్ళడానికి భయపడ్తారేమోనని నన్ను పంపించాడు."

 

    "నీ పేరు ?"

 

    "భూతరాజు."

 

    నేను తృళ్ళిపడ్డాను. అతన్ని పరిశీలనగా చూశాను. కారణం అంతకుముందు ఆ పేరు ఎక్కడో విన్నాను. కాదు చదివాను. అదేదో మిస్టరీ క్యారెక్టరని నాకు గుర్తు. ఎక్కడ చదివాను? ఆ గుర్తొచ్చింది. 'నల్లకుక్క'లో చదివాను. అవును. నరేంద్ర రచించిన 'నల్లకుక్క' అనే డిటెక్టివ్ నవల్లో చదివాను. అది మరపురాని క్యారెక్టర్.

 

    తలెత్తి అతన్ని పరిశీలనగా చూశాను. వీడి దుంపతెగ రూపం కూడా అలాగే ఉంది. ప్రవర్తనా అంతే! ఆ పోతరాజు చచ్చి భూతంగామారి భూతరాజుగా రాలేదుకదా?

 

    నా ఆలోచనకు నాకే నవ్వొచ్చింది.

 

    "ఏంటి బాబుగారూ మీలో మీరు నవ్వుకుంటున్నారు?"

 

    నా ఆలోచనల దారం పుటుక్కున తెగింది.

 

    "నిన్ను భైరవమూర్తి పంపించాడా?"

 

    "అవును!" క్లుప్తంగా ఉంది అతని సమాధానం. ఆ సమాధానం ఇచ్చేప్పుడు దూరంగా దేన్నో చూస్తున్నట్టుగా ఉన్నాడు. కళ్ళు నాకేసి తిప్పలేదు.

 

    "అయితే పద! కూర్చున్నావేం?"

 

    అతడు సమాధానం ఇవ్వలేదు. ఏదో ఆలోచిస్తున్నాడు.

 

    "దుమ్మలగూడెం ఇక్కడ కెంతదూరం?"

 

    "ఎంతదూరం అయితే ఏంలే బాబూ! ఈ రాత్రికి ఇక్కడే ఉండి తెల్లారి బండికి తిరిగెళ్ళిపోండి. ఇక్కడనుంచి బస్సులు కూడా ఉన్నాయ్. విజయవాడ కెళ్ళి అక్కడ్నుంచి హైదరాబాద్ వెళ్ళవచ్చు."

 

    నాకు ఒళ్ళు మండిపోయింది. వీడు తనను ఎలాగయినా తిప్పి పంపాలని ప్రయత్నిస్తున్నాడు. వీడ్ని భైరవమూర్తి పంపించలేదు. బహుశా భైరవమూర్తి తన టెలిగ్రాంలో ఉదహరించిన హత్యానేరంలో ఒక అపరాధి అయివుండాలి. అందుకే తనను వెనక్కు పంపించాలని చూస్తున్నాడు స్కౌండ్రల్.   

 

    "నేను దుమ్మలగూడెం వెళ్ళాలి. నువ్వొస్తే రా! లేదా ఇక్కడే పడుకో!" అంటూ పెట్టె తీసుకొని బయటికి వచ్చి చీకట్లో ప్లాట్ ఫారం అంచున నిల్చున్నాను.

 

    భూతరాజు సలహా పాటించటం మంచిదేమో అనిపించింది చీకట్లోకి చూస్తూంటే. నా పరిస్థితి అయోమయంగా ఉంది.

 

    భూతరాజు నా వెనకే వచ్చి "మరోసారి ఆలోచించండి!" అన్నాడు.

 

    నేను గిర్రున తిరిగి అతడి ముఖంలోకి చూశాను. చీకట్లో మెరుస్తున్న ఆ కళ్ళు చూస్తుంటే భయంగా అనిపించింది. అలా చీకట్లో మెరిసేది జంతువుల కళ్ళు మాత్రమే. మనిషి కళ్ళు మెరవడం నాకు తెలియదు. ఎవరూ ఎప్పుడూ చెప్పలేదుకూడా. దయ్యాల కళ్ళు మెరుస్తాయేమో? అతని పాదాలకేసి చూశాను. మామూలుగానే ఉన్నాయి. మనిషే! దయ్యం కాదు. దయ్యాలకి పాదాలు వెనక్కు తిరిగి ఉంటాయంటారు! ఇదేమిటి నేను ఇలా ఆలోచిస్తున్నాను? నేను దయ్యాల్ని నమ్మడం ఏమిటి. నాన్ సెన్స్!

 

    వీడ్ని నిజంగా భైరవమూర్తే పంపించాడా? మరి వెళ్ళొద్దంటాడేం? వీడు దొంగ అయిఉండాలి. ఇక్కడే పడుకోమని చిన్నగా తన పెట్టె పట్టుకెళ్ళాలని చూస్తున్నాడు. దొంగయితే ఇక్కడ ఉండమని ఎందుకంటాడు? దార్లో అయినా తన పెట్టె లాక్కెళ్ళొచ్చుగా?

 

    ఇతన్ని భైరవమూర్తి పంపించి ఉండడు. వీడు ఆ కేసుకు సంబంధించిన వాడై ఉంటాడు. వీడి మాట వినకపోతే నన్ను చంపుతాడేమో? ఎంత దారుణం!

 

    నాకు వెన్నెముకలో ఏదో పాకినట్టుగా వళ్ళు ఝల్లుమంది.

 

    అతడు నా పక్కగా నిల్చుని గుచ్చిగుచ్చి చూస్తున్నాడు. అతని చూపులు నాకు సూదుల్లా గుచ్చుకొంటున్నాయి.

 

    తల తిప్పి చూశాను. ఆ ఆకారం చూస్తూంటే నాకు గుండెల్లో అదురు పుట్టుకొస్తోంది. చీకట్లో మెరిసే ఆ కళ్ళతో చూస్తూ, ముసలి సింహంలా ఉన్న అతన్ని ఆ సమయంలో, ఆ పరిసరాల్లో చూస్తూంటే ఎంత ధైర్యస్తుడికయినా గుండెలు జారిపోకమానవు.

 Previous Page Next Page