Previous Page Next Page 
మరో దయ్యం కథ పేజి 4


    మా ఇద్దరి మధ్యా నిలయం చేసిన నిశ్శబ్దం భరించరానిదిగా ఉంది.

 

    "నీ పేరేమిటి?"

 

    "చెప్పానుగా భూతరాజని!"

 

    "నిన్నెవరు పంపించారు ?"

 

    "అదేటి బాబూ ! అదీ చెప్పాను-భైరవమూర్తేనని..."

 

    "మరయితే వెళ్ళవద్దని ఎందుకంటున్నావ్?" తీవ్రంగా అన్నాను.

 

    భూతరాజు చీకట్లోకి చూస్తున్నాడు. నా ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు.

 

    "మాట్లాడవేం?" ధైర్యాన్ని కూడదీసుకుంటూ గట్టిగా అడిగాను.

 

    అతడు తల తిప్పలేదు, మాట్లాడలేదు.

 

    "అసలు ఆ భైరవమూర్తి ఎవరు? నువ్వెవరు? ఏమిటీ నాటకం?" భయాన్ని దాచుకుంటూ గొంతు పెద్దది చేశాను.

 

    "నాటకం కాదు బాబూ ! మీ మంచికోరే చెప్తున్నాను."

 

    "నీ సంగతి చెప్పు ? నువ్వెవరు ? ఎక్కడుంటావ్ ? ఏం చేస్తుంటావ్ ?"

 

    "నేనెవర్నో చెబితే మీరు మరీ బెదిరిపోతారు ! మీరు తెల్లవారేంత వరకూ ఇక్కడే ఉండి తిరిగెళ్ళండి."

 

    వీడెవడో చెబితే బెదిరిపోతానా? అంటే వీడు...నా బుర్రలో నలికిలపాము కదిలినట్టుగా అయింది. తల విదిలించుకున్నాను.

 

    "ఇదుగో భూతరాజూ ! ఏమైనాసరే నేను దుమ్మలగూడెం వెళ్ళి తీరాల్సిందే. అలా కాదంటావా నన్నెందుకెళ్ళద్దంటున్నావో స్పష్టంగా చెప్పు." విసుగ్గా అన్నాను.

 

    "సరే ! మీ ఇష్టం ! బయలుదేరండి" అంటూ నా చేతిలోని పెట్టె అందుకొని ముందుకు నడకసాగించాడు.

 

    అతని వెనకే నేను నడుస్తున్నాను ఆ చీకట్లో, ఆ చెట్లమధ్యనుంచి, వాడిముఖం ముందుకు ఉన్నా, నాకెందుకో వాడు మర్మగర్భంగా నవ్వుకుంటున్నట్టుగా తోచింది.

 

    ఇద్దరం మౌనంగా నడుస్తున్నాం.

 

    చుట్టూ చీకటి! పైగా కీచురాళ్ళతోపాటు, అనేక పురుగుల అరుపులు భీభత్సంగా విన్పిస్తున్నాయి.

 

    "భూతరాజూ !" నా మనసులో నిముషనిముషానికీ పెరుగుతున్న భయాన్ని పారదోలడానికే అతడ్ని పలకరించాను.

 

    "అయ్యా !" వెనక్కు తిరక్కుండానే అన్నాడు.

 

    "కొంచెం చిన్నగా నడువు" అన్నాను.

 

    అతడు నడక వేగం తగ్గించాడు.

 

    "ఏమీ అయ్యగార్ని గురించి ఏదన్నా చెప్పు భూతరాజూ?"

 

    "ఏం చెప్పమంటారు ?"

 

    "అదే నన్నెందుకు పిలి..." ఇంతెత్తున ఎగిరిపడ్డాను. కెవ్వున అరిచాను. చెట్టుమీదనుంచి ఏదో పడింది. 'దబ్' మని శబ్దం అయింది. ఆ మరుక్షణమే ఆకులు గలగలమన్నాయి. నా శరీరం వణుకుతోంది.

 

    భూతరాజు కిందకువంగి చీకట్లో దేన్నో తీసుకొని దూరంగా విసిరాడు. అప్పటికి నాకళ్ళు చీకటికి అలవాటు పడ్డాయి. వస్తువులు స్పష్టంగా కన్పించకపోయినా మసగ్గా కన్పిస్తున్నాయి. భూతరాజు విసిరేసిన వస్తువు పొడవుగా ఉంది.

 

    "ఏమిటది ?" నా నోరు ఎండిపోతున్నది.

 

    "పాము !" తాపీగా చెప్పాడు.

 

    "పామా ?" నాగొంతులో పాము చుట్టుకున్నట్టే అయింది. మాట స్పష్టంగా రాలేదు.

 

    "భయం లేదు బాబూ ! ఇక్కడ, ఈ చెట్లమీద ఇల్లాంటివి మామూలుగా తిరుగుతూనే ఉంటాయి. పక్షుల గుడ్ల కోసం."

 

    "అలా చేతిలోకి తీసుకున్నావు గదా అది కరిస్తే ?"

 

    "కరచినా నాకేం కాదు."

 

    "అంటే అది విషపుపాము కాదా !"

 

    "ఎందుక్కాదూ ?"

 

    "మరి ?"

 

    "నాకు పాము విషం ఎక్కదు బాబూ !"

 

    మరో ప్రశ్న వెయ్యాలనిపించలేదు. ప్రశ్నించిన కొద్దీ చిక్కుముడి పీటముడిలా అయిపోతున్నది.

 

    "ఏదో అన్నారు బాబూ !"

 

    "నేనేమీ అనలేదే?"

 

    "ఏదో అడిగారుగా ? ఆఁ గుర్తొచ్చింది. భైరవమూర్తి నిన్నెందుకు రమ్మని టెలిగ్రాం ఇచ్చారని అడగబోయారు గదూ?"

 

    నేను మాట్లాడలేదు. ఆ ప్రశ్నకు ఇంకెంత భయంకరమైన సమాధానం ఇస్తాడోననే భయం కలిగింది. అయినా వీడు ఊరుకుంటాడా ?

 

    "ఆయన కిది అలవాటే బాబూ !"

 

    "ఏది ?" వద్దనుకుంటూనే యాంత్రికంగా అడిగాను!

 

    "అదే బాబూ ! రెండుమూడు నెలలకోసారి ఎవరికో టెలిగ్రాం ఇచ్చి రప్పించడం."

 

    "అందువల్ల అతనికి వచ్చేలాభం ?"

 

    "అదే నాకూ తెలవడంలేదు. ప్రతివాడ్ని నేనే భైరవమూర్తి ఇంటికి తీసుకెళ్తున్నాను. అలా వచ్చిన ప్రతివాడూ తెల్లారేసరికి చచ్చిపడి ఉంటాడు."

 

    నడుస్తున్న నేను ఠక్కున ఆగిపోయాను. ఏదో బంధం కాళ్ళకు అడ్డంపడ్డట్టయి.

 

    వాడు ఆగకుండా ముందుకు పోతున్నాడు. వాడ్ని పిలవాలంటే నోరు మెదపలేకపోతున్నాను. నా కాళ్ళల్లోని సత్తువంతా భూమి లాగేస్తున్నట్టుగా అన్పిస్తోంది. అడుగు ముందుకు పడటం లేదు.

 

    పది గజాలు వెళ్ళిన భూతరాజు వెనక్కు తిరిగొచ్చాడు.

 

    "ఏం బాబూ ఆగిపోయారు? భయం వేస్తోందా? అందుకే మిమ్మల్ని తిరిగి వెళ్ళిపొమ్మన్నాను."

 

    అప్పుడు నాకు అర్థం అయింది. వీడు నన్ను మొదటినుంచి వెనక్కు తిప్పి పంపించే ప్రయత్నంలోనే ఉన్నాడు.

 Previous Page Next Page