ఆ డాక్టర్ చెప్పిన కథ నా అర్ధచేతనా మనసు పొరల్లో అణిగి ఉండి ఉండాలి. ఇవ్వాళ అదే రూపంలో కలగా వచ్చింది.
అంతే ! కలే !"
"బాబూ !"
"ఏమిటి?" అన్నాను. 'మధ్యలో వీడొకడు!' అనుకొన్నాను.
"ఏదో వాసన వస్తోంది."
"నాకేం రావడం లేదు."
"వస్తోంది బాబూ! బాగా శ్రద్ధగా ముక్కులు పీల్చండి."
"ఏం వాసన?"
"శరీరం కాలిన వాసన!"
గుండె ధక్కు మన్నది.
వెధవ! మళ్ళీ భయపెడ్తున్నాడు!
వీడు తనకు సజషన్స్ ఇస్తున్నాడు.
మొదటినుంచీ వీడు చేస్తున్న పనే ఇది!
వీడికి హిప్నాటిజం తెలుసా?
వాడికి హిప్నాటిజం తెలుసో లేదో కాని వాడు మాత్రం సజషన్స్ ఇస్తున్నాడు.
వాడి సజషన్స్ ను నా మైండు రిసీవ్ చేసుకొంటున్నది.
ఆ సంగతి నేనూ ఊహించలేకపోయాను.
కొన్నిసార్లు, కొన్ని సమయాలలో సజషన్ ఇచ్చేవాడికి వాడు ఇస్తున్నది సజషన్స్ అని తెలియదు. అవి రిసీవ్ చేసుకొనేవాడికి తన మైండు ఆ సజషన్స్ ఇన్ ఫ్లుయన్స్ లో పడిపోయిందని తెలియదు. అయినా హిప్నటిక్ ఎఫెక్ట్ ఉంటుంది.
అలాగే జరిగి ఉండాలి.
"ఏం బాబూ! వాసన వస్తోందా?"
"వస్తోంది!" నాకు తెలియకుండానే అనేశాను.
ఏమిటిలా అనేశాను?
అనెయ్యడం కాదు.
నిజంగానే నాకు వాసన వస్తోంది.
"ఇది దుష్టాత్మ బాబూ! వాడు నిన్న చచ్చిపోయాడు. వాడికి దారీ తెన్నూ తెలియక కొట్టుమిట్టాడుతున్నాడు."
నాకు మళ్ళీ ఏదోగా అనిపించింది.
ఎంత భయం లేదని నాకు నేను సర్ది చెప్పుకుంటున్నా ప్రతిసారీ భయం వేస్తూనే ఉంది.
"ఇదుగో రహమాన్!"
"బాబూ!"
"నువ్వు మాట్లాడకుండా పో!"
"అలాగే బాబూ!"
కొంతదూరం వెళ్ళి, బండి ఆపాడు.
"ఆపావేం?" అని అడిగాను.
"ఊరి పొలిమేరల్లోకి వచ్చాం. ఇక మీరు దిగి వెళ్ళాల్సిందే!"
"ఇక్కడే ఎందుకు దిగడం?"
"ఆ భైరవమూర్తి సామాన్యుడు కాడు బాబూ! వాడికి తెలిస్తే నన్నూ, నా గుర్రాన్ని కూడా ఎత్తి విసిరేస్తాడు."
వాడు అబద్ధం ఆడుతున్నాడని నాకు తెలుసు.
డెబ్బయ్ రెండేళ్లవాడు గుర్రానీ, బండివాడ్నీ విసిరెయ్యడం ఏమిటి?
అల్లంత దూరంలో ఇళ్ళు కన్పిస్తున్నాయి.
"ఊరి మధ్యకు వెళ్ళాక ఆపు, నేను దిగివెళ్తాను."
"ఊళ్ళోకి నా గుర్రం వెళ్ళదు బాబూ !"
"అదేం ?"
"అది మరీ భయంకరమైన కథ, చెప్పమంటారా ?"
నాకు వళ్ళు మండిపోయింది.
"అక్కర్లేదులే ! ఇంద తీసుకో" అని పది రూపాయల నోటు వాడిమీద వేసి నేను దిగాను.
పెట్టె చేతిలో పట్టుకొని గబగబ నడక సాగించాను.
వెన్నెల్లో టైం చూసుకొన్నాను.
3-10 అయింది.
భైరవమూర్తి ఇంటికి ఎటు వెళ్ళాలో చెప్పు?" అడిగాను బండి వాడిని.
"తిన్నంగా వెళ్ళండి. కొంత దూరం వెళ్ళాక నాలుగు బజార్ల కూడలి కన్పిస్తుంది. కుడి చేతివైపుకు తిరిగి తిన్నగా వెళ్ళండి. ఊరి బయటగా పెద్ద బంగళా కన్పిస్తుంది. అదే భైరవమూర్తి ఇల్లు. వాడు దుర్మార్గుడు బాబూ ! వాడితో ఘర్షణకు దిగకండి" అన్నాడు.
నేను చక చక ముందుకు నడిచాను.
నా వెనక ఎవరో నడుస్తున్నట్టుగా అన్పించింది.
ఆగాను.
వాడూ ఆగాడు.
గిర్రున తిరిగి చూశాను.
ఎవరూ లేరు.
నా భయానికి నాకే నవ్వొచ్చింది. వెధవ ప్రయాణం- పిరికితనం అంటే ఏమిటో తెలియనివాడ్ని. ఎంత దారుణంగా అడుగడుక్కూ భయపడుతూ ఊరు చేరానో తల్చుకొంటే ఈ ప్రయాణం ఎందుకు పెట్టుకొన్నానో అని అనిపించింది.
ఏదో గుర్తొచ్చి ఆగి వెనక్కు చూశాను.
బండి కన్పించలేదు.
ఇంత త్వరగా వాడు కన్పించకుండా ఎలా వెళ్ళాడు ?
తిన్నగా ఉన్న రోడ్డు. ఎంత త్వరగా వెళ్ళినా కన్పించాలే !
వాడు కూడా....నా వళ్ళు ఝల్లుమన్నది.
నడక వేగం పెంచాను.
నాతోపాటు ఎవడో నడక వేగం పెంచినట్టుగా అన్పించసాగింది.
మళ్ళీ ఇదేమిటి?
గిర్రున తిరిగి నిలబడ్డాడు.
వాడూ గిర్రున తిరిగి నా వెనకే నిలబడ్డట్టు అయింది.
ఛ ! ఏమిటిది ?
అంతా నా ఊహే !