Previous Page Next Page 
బొమ్మరిల్లు పేజి 28


    గౌతమ్ ఎలా ఉన్నాడో, ఎక్కడ ఉన్నాడో, నీకోసం ఎంత కాలమైనా వేచి ఉంటానన్నాడు మరి. ఒక్కసారైనా చూట్టానికి రాలేదేం? ఒక్క ఉత్తరం కూడా రాయలేదు.


    పెళ్ళి చేసుకున్నాడేమో?


    చేసుకొనే ఉంటాడు. ఈ మగవాళ్ళ మాటలు నమ్మడానికి వీల్లేదు.


    ఏమిటి తను ఆలోచిస్తున్నది? తనకోసం నిట్టూర్పులు విడుస్తూ గౌతమ్ జీవితమంతా బ్రహ్మచారిగా ఉండాలని తన కోరికా? ఎంత స్వార్థం?


    ఈ మధ్య తన గుండెల్లో ఏదో భూగోళమంతా ఖాళీ హోరు పెడ్తున్నట్టు అన్పిస్తున్నది. ఇంత హడావిడిలో కూడా తను నిర్జన ప్రదేశంలో ఒంటరిగా ఉండిపోయినట్టు అన్పిస్తున్నది. ఎంతమంది చుట్టూ వున్నా, మానవుడు వంటరివాడేనా?


    మరొకసారి అద్దంలో తన అలసిపోయిన ముఖాన్ని అక్కడక్కడ కన్పిస్తున్న తెల్లని జుట్టునూ, మానవుడు వంటరివాడేనా?


    రేణుక నర్సింగ్ హోంపెట్టి ఐదేళ్ళు పూర్తి అయింది. గుంటూరులో రేణుకా నర్సింగ్ హోం అంటే తెలియని వాళ్ళుండరు. ఆమె హస్తవాసి మంచిదనే పేరు పడిపోయింది. రేణుక ఉన్నవాళ్ళు దగ్గిర ఫీజు వదలదు. లేనివాళ్ళను పీడించదు. బాగానే సంపాదించింది. లక్షరూపాయలు పెట్టి ఇల్లు కట్టించింది. కారు కొన్నది. ఒక జూనియర్ డాక్టర్ని కూడా అపాయింటు చేసుకున్నది. తమ్ముళ్ళన్నా చెల్లెళ్ళన్నా అపారమైన ప్రేమను పెంచుకున్నది. వాళ్ళను మరీ ముద్దుచేసి చెడగొడ్తున్నావని తల్లి రేణుకను మందలిస్తూ ఉంటుంది. రేణుక చిరునవ్వు నవ్వి ఊరుకుంటుంది.


    పెద్దవాడు రాము ఎం.ఏ. ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. పెద్ద చెల్లెలు రాధిక బి యస్ సి సెకండ్ ఇయర్ లో ఉన్నది. చిన్న తమ్ముడు పది చదువుతున్నాడు. చిన్న చెల్లెలు ఎనిమిది చదువుతుంది.


    రేణుక బాగా సంపాదిస్తోంది. పిల్లలు ఏది కావాలన్నా కాదనకుండా తెచ్చి యిచ్చేది. నలుగుర్లో తండ్రిలేని లోపాన్ని వాళ్ళు ఫీజులు లేకుండా ఎక్స్ కర్షన్స్ కూ బట్టలకూ అడిగిన డబ్బు ఇచ్చేది.


    రామం పీ.జి.సెంటర్ ప్రిన్సిపాల్ కూతురితో తిరగడం గురించి విన్నరోజు రేణుక ఆలోచనలో పడింది. రామం ఎం.ఏ. పూర్తిచేసి సంసార బాధ్యతలో తనకు చేదోడుగా ఉంటాడనుకుంది.


    కానీ...ఈరోజు తాను విన్నది ఏమిటి? రామం పెళ్ళికోసం తొందరపడుతున్నాడు. తన మార్గం తను చూసుకుంటున్నాడు. పెళ్ళి చేసుకొని వేరేకాపురం పెడతాడు. తను ఇలాగే మరి పదేళ్ళు అందర్నీ పెంచి పెద్దచేసి అలసిపోతుంది. తలంతా పండిపోతుంది. ఒంటరిగా మిగిలిపోతుంది. అమ్మ నిజమే చెప్పింది.


    "ఇదేమిటి ఇవాళ తను ఇలా ఆలోచిస్తున్నది? తన తండ్రికి ఏమని వాగ్దానం చేసింది? గౌతమ్ ను తాను ఎందుకు దూరం చేసుకుంది? తండ్రిలేని లోటును తీర్చడానికే కదా! తను నిజంగా ఆ పని చెయ్యగలిగిందా? రామం పెళ్ళి చేసుకుంటానంటే తండ్రి బాధపడ్తాడా?


    తాను చేసిన త్యాగానికి ప్రతిఫలం చిన్నవాళ్ళనుంచి...తను పెంచి పెద్ద చేసినవాళ్ళ నుంచి...ఆశిస్తుందా?


    లేదు! లేదు!


    రామం!పాపం! తనముందు చెప్పడానికి సిగ్గుపడుతున్నాడు! అందుకే తను రాగానే వెళ్ళిపోయాడు. పిచ్చి సన్యాసి! తను, వాడు పెళ్ళిచేసుకుంటానంటే బాధపడుతుంది అనుకున్నాడా!


    రేపే తను ప్రిన్సిపాల్ గారితో మాట్లాడి, ముహూర్తాలు పెట్టించాలి. తాను తండ్రికి ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి. పెళ్ళి అయితే మాత్రం ఎక్కడికి వెళ్తాడు? ఇంట్లోనే ఉంటాడు?


    రేణుక ఆలోచనల నుంచి నిద్రలోకి జారిపోయింది. ఆ రాత్రి అన్నం తినాలనిపించలేదు.


                                         15


    రామం పెళ్ళి సింపుల్ గా జరిగింది. తల్లి రేణుకను చూస్తూ కళ్ళు తుడుచుకుంది.


    పెళ్ళయ్యాక రామం ఎక్కువగా అత్తగారింట్లోనే ఉంటున్నాడు. చిన్నగా ఒక్కొక్క వస్తువే తనదనేది లేకుండా మామగారింటికి చేరవేశాడు. రేణుక చూస్తూనే ఉన్నది. చూడనట్టే ఉండిపోయింది. రామం క్రికెట్ ఛాంపియన్. అతను గెల్చుకున్న కప్పులు కూడా తీసుకెళ్ళిన రోజు రేణుక మనస్సు చివుక్కుమన్నది. కానీ ఏమీ అనలేకపోయింది. రామం ఎప్పుడో చుట్టంచూపుగా గాని రావడం లేదు. అయినా రేణుక ఒక్కమాట అనలేదు. తల్లి ఒకటి రెండుసార్లు కొడుకుని నిందించింది. రేణుక రామాన్ని సమర్ధించింది. రామం అత్తవారింట ఇల్లరికపు అల్లుడిలా వెళ్ళిపోయాడు. అది తల్చుకొని కొన్నిరోజులు వంటరిగా కన్నీరు కార్చేది కొంతకాలం.


    మరో రెండు సంవత్సరాలు గడిచాయి. రాధిక ఎమ్.ఎస్.సి. ఫస్టు ఇయర్ లో ఉన్నది. ఒకరోజు రేణుక తన జూనియర్ డాక్టర్ తో సినిమాకు వెళ్ళింది. ఇంటర్ వెల్ లో లైట్లు వెలిగాయి. ముందు సీట్లో కూర్చున్న వాళ్ళను చూసి తెల్లబోయింది రేణుక.


    రాధ ప్రక్కన ఒక అందమైన యువకుడు కూర్చుని ఉన్నాడు. రాధ కూర్చున్న కుర్చీ వెనుకభాగం మీద రాధిక పైగా చెయ్యివేసి కూర్చుని వున్నాడు. రాధిక మీదకు వంగి ఏదో మాట్లాడుతున్నాడు. వాళ్ళిద్దరూ ఈ లోకంలోని మనుషుల్లా లేరు. చుట్టూ ప్రపంచాన్నే విస్మరించినట్టు ఒకరి మీదకు ఒకరు వంగి గుసగుసగా మాట్లాడుకుంటున్నారు.


    రేణుకకు రాధ మీద కోపం వచ్చింది. సినిమా పూర్తి అయ్యీ కాకముందే ఇంటికి వచ్చేసింది. రాధ కోసం వరండాలోనే కూర్చుని ఎదురుచూడసాగింది.


    "రేణూ! రాధ సంగతి ఏమీ బాగాలేదు" అన్నది తల్లి.


    "ఏం? ఏం జరిగింది?" మీరు తెలియనట్టే అడిగింది రేణుక.


    "కాలేజీ నుంచి తిన్నగా ఇంటికి రావడం లేదు. ఇవాళ ఇంతవరకూ రాలేదు. మధ్యాహ్నం రామం వచ్చాడు. అది సుధీర్ అనే కుర్రాడితో తిరుగుతున్నదట. అతను చాలా ధనవంతుడట. ఎంతో మందిని మార్చాడటవాడు బాధపడుతూ చెప్పాడు" తల్లిమాటలు పూర్తికాలేదు.


    దూరంగా మోటార్ బైక్ ఆగింది. రాధిక దిగింది. లోపలకు వస్తూ తల్లీ, అక్కా వరండాలో లైటు వెలుగులో నిల్చుని ఉండటాన్ని గమనించింది. గతుక్కు మన్నది. ఓ క్షణం తటపటాయించి లోపలకు వెళ్ళబోయింది.


    "ఆగు!"


    రాధిక ఆగి తల్లి ముఖంలోకి చూసింది.


    "ఎవడేవాడు!"


    "ఎవరు?"


    "నిన్ను ఆ మోటార్ సైకిల్ మీద దించి వెళ్ళినవాడు"


    "అతను నా క్లాస్ మేట్! కమలా వాళ్ళింటికి నోట్సు తెచ్చుకుందామని వెళ్ళాను. ఆలస్యం అయ్యింది. బస్సు స్టాప్ లో నిలబడ్డాను. ఎంతకూ బస్ అందలేదు. ఇంతలో సుదీర్..."


    "ఆపు! నువ్వు వాడితో ఎంతకాలంగా తిరుగుతున్నావ్?"


    "అమ్మా!" రేణుక దాదాపు అరిచినట్టే అన్నది.


    "నువ్వూరుకో! నువ్వే వాళ్ళను చెడగొడుతున్నావ్.


    రేణుక మనస్సు చివుక్కు మన్నది.


    తను వాళ్ళను చెడగొడుతున్నదా? స్థాణువులా నిలబడిపోయింది రేణుక.


    "ఎందుకమ్మా అక్కయ్యని అంటావ్?"

 Previous Page Next Page