Previous Page Next Page 
పిపాసి పేజి 28


    ఫోటో చూస్తూ, కళ్ళు తిరిగినట్లయి పడిపోబోయింది రాధిక.


    "అక్క.... ఏమయింది" అంటూ గాభరాగా చెయ్యి పట్టుకుంది రేణుక.


    "కళ్ళు తిరుగుతున్నాయి. నన్ను తీసికెళ్ళి నా మంచం మీద పడుకోబెట్టు' అంది, ఎడం చేతితో తల పట్టుకుని కణతలు నొక్కుకుంటూ.


    "ఓస్.... అంతేనా..... మరీ మా బావగార్ని కొంగుకు కట్టేసుకు తిరుగుతే మరేమవుతుంది" అంటూ చెయ్యి పట్టుకు తీసికెళ్ళి మంచం మీద పడుకోపెట్టి, మంచినీళ్ళు తాగించింది.   


    రాధిక కళ్ళు మూసుకుపడుకున్నా, మెదడు రెండు సంవత్సరాల గతంలోకి వెళ్ళింది.


    "అవును అతనే సందేహం లేదు. ముమ్మాటికీ సందేహం లేదు. ఆనాడు తను బెంగుళూరులో పాట పాడుతోంది. కన్నార్పకుండా తనకేసే చూస్తున్న అతన్ని చూస్తే, ఎందుకో అసహ్యం వేసింది. ప్రోగ్రాం అయిపోగానే, తనని పొందడానికి, ఎంత కావాలంటే అంత ఇస్తానని ఆ మనిషిని అడిగాడు. ఆ కిరాతకుడు సరేనని ఒప్పుకున్నాడు. ఆ రాత్రి తన గదిలోకి కాలు పెట్టగానే, తన గుండె కొట్టుకుపోయింది. అతని కళ్ళల్లోని కామం, కండ్లలోని మదం భయంకరంగా వున్నాడు ఉన్మాదుడిలా,  తన చెయ్యి పట్టుకున్నాడు. తను అటువంటిదాన్ని కాదని, తననేమీ చెయ్యొద్దని, బతిమాలుకుంది. "ఓహో.... నీకూ నీతులు తెలుసే అంత డబ్బిచ్చింది. నీ నీతులు వినడానికిగాదు, నీతో చేతులు కలపడానికి" అంటూ కౌగిలించుకోబోయాడు. "ఛీ..... డబ్బుతో ఆడదాని శీలాన్ని కొనాలనుకునే నీచుడా, నువ్వు మనిషివి కాదు, పశువువి. నీకు అక్కాచెల్లెళ్లు లేరూ?" అని తిట్టింది." పతిత పతివ్రతలా మాట్లాడుతూ వుంటే మహా సరదాగా వుంటుంది. కానియ్.... కోపంలో కూడా నీరూపం, ఎంతో బాగుంది. ఇంత లావణ్యవతిని భరిస్తున్నాను. ఇంక..... చాలులే.....రా.... నన్ను మెచ్చావో, నీకు నచ్చినవన్నీ ఇస్తాను? అంటూ కౌగిట్లో బంధించాడు. ఆ బలమైన చేతుల్లో ఊపిరాడక నలిగిపోతూ, ఏం చెయ్యాలో తెలీక తన రక్షణకి మార్గం అర్థం కాక, పిచ్చిదానిలా గట్టిగా అతని చెయ్యి కొరికేసింది. "అమ్మో" అంటూ అతను పట్టు వదిలాడు, చేతిమీంచి రక్తం కారుతోంది. తను గబగబా తలుపు గడియవేసి, ఇవతలి కొచ్చేసింది. ఆ కిరాతకుడు బయట నుంచునే వున్నాడు కాపలా కాస్తూ. "నాకు తెలుసు నువ్విలా చేస్తావని" అంటూ తనని మళ్ళీ గదిలోకి తొయ్యబోయాడు వాడు. కానీ అతను "ఈ అమ్మాయి నాఖ్కర్లేదు. ఇది పిచ్చిది" అంటూ రివ్వున వెళ్ళిపోయాడు.


    "ఇది పిచ్చిది" అన్న చివరమాటలు చెవులో రింగుమన్నాయి. జుట్టు పీక్కుంటూ గుడ్లు మిటకరిస్తూ పిచ్చి పిచ్చిగా మాట్లాడటం మొదలెట్టింది తను.   


    "అమ్మ బాబాయ్..... నీకు పిచ్చిపడితే ఇంకేమన్నా వుందా. నా రాబడంతా నీవల్లే..... అమ్మనే....." అంటూ లేవదీసుకెళ్ళి మంచం మీద పడుకోబెట్టాడు. కసితీరా రెండు కాళ్ళతోటీ వాణ్ణి తంతూ వున్నా, వాడు నిజంగా పిచ్చి పట్టిందన్న బెంగతో అంతా ఓర్చుకున్నాడు. అప్పటినుంచీ, వాడు ఎవర్ని గదిలోకి పంపినా ఈ పిచ్చే తనని కాపాడుతూ వచ్చింది.      


    "అక్కా ఎలా వుంది? వేడిగా కొంచెం కాఫీ తాగు" కాఫీ గ్లాసుని చేతికందించింది రేణుక. ఆలోచనలతో అలసిపోయిన రాధిక గబగబా కాఫీ గ్లాసునందుకుని రెండు గుక్కల్లో తాగేసింది.


    "ఎలా వుందమ్మా, ఏమైందీ?" అంటూ అత్తగారూ తల్లీ వచ్చారు గదిలోకి.


    "ఏంలేదు. కొంచెం కళ్లు తిరిగాయి" అంది మెల్లగా రాధిక.


    వియ్యపురాళ్లిద్దరూ ఒకరి మొహాలొకరు చూచుకుని నవ్వుకున్నారు.


    రాధిక నిద్దరపోయింది. మనోవ్యాధికి డాక్టర్లిచ్చే ఏ మందూలేదు కానీ, భగవంతుడిచ్చిన ఒక్కటే ఒక్కమందుంది. అదే నిద్ర. కొందరు అభాగ్యులకి అదీ కరువైపోతోంది. రాధిక కళ్ళు తెరిచి గడియారం వంక చూసి ఆశ్చర్యపోయింది. అప్పటికిగాని తెలీలేదు తను అంతసేపు నిద్దరపోయిందని, గబగబా లేచి మొహం కడుక్కుని ఇవతలకొచ్చింది. మధన్ అప్పుడే ఆఫీసు నుంచొచ్చేసి కాఫీ తాగుతున్నాడు. సామాను సర్దడం పూర్తయి అందరూ కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు హాల్లో.


    రాధిక కాఫీ కప్పుతో వాళ్ళ మధ్యన కూర్చుంది.


    "ఎలా వుందమ్మా..... బాగా పడుకున్నావు చాలాసేపు" అంది అత్తగారు.


    బాగానే వుంది. ఏదో ఒళ్లు తెలీని నిద్రపట్టింది" అంది.


    "అదృష్టవంతురాలివి. నాకలా ఎప్పుడంటే అప్పుడు నిద్దర పట్టదు. ఒకవేళ కాస్సేపు అలా కనుముయ్యగానే ఆయనగారి టెలిఫోన్ మోగడమో, ఆయనే రావడమో" జరుగుతుంది అంది రేణుక.


    "ఆయనగారికి పెళ్ళాన్నెవరయినా ఎత్తుకుపోతారని భయమా ఏమిటి?" నవ్వుతూ అంది రాజేశ్వరమ్మ.


    ఆ సంభాషణ వింటూ వుంటే అతని రూపంమదిలో మెదిలి కడుపులో తిప్పినట్టయింది. కప్పు లోపలపెట్టేయడానికి వెళ్ళినట్టు వెళ్ళిపోయింది రాధిక.    


    శ్రీహరిగారికి, సరోజినమ్మకి, రేణుకకీ బట్టలు పెట్టారు. సాంబశివరావు దంపతులు.


    "వెళ్లొస్తావొదినా" అంటూ కంటతడి పెట్టింది సరోజినమ్మ.    


    "అమ్మాయిని త్వరలోనే పంపిస్తాలే" అంది ఓదార్పుగా అన్నట్టు రాజేశ్వరమ్మ.


    రాధిక మధన్ స్టేషన్ వరకూ వస్తామని వెళ్ళారు. రైలు కదిలింది. చూపుకందినంత వరకూ చూస్తూ వెనక్కి తిరిగింది రాధిక. వీరికోసం సాంబశివరావుగారూ రాజేశ్వరమ్మ భోం చేయకుండా ఎదురు చూస్తున్నారు. అందరూ కలిసి భోజనాలు పూర్తిచేశారు. పరధ్యానంగా మంచం మీద పడుకున్న రాధికని చూసి "అంత ఆలోచన మంచిది కాదు." అంటూ దగ్గరగా జరిగి పడుకున్నాడు.    


    "ఏమండీ! ఈ ప్రపంచంలో మనిద్దరం కలిసి ఎక్కడికి వెళ్ళినా మీకీపాట్లు తప్పవు. మొన్న మహాబలిపురంలో.."        


    మరి మాట్లాడనివ్వకుండా ఆమెనోటికి తన చేతుల్ని అడ్డంగా పెట్టి రాధీ.... ఇప్పటికి లక్షసార్లు చెప్పాను, ఎవరేమనుకున్నా నాకు లెక్కలేదని కానీ నువ్విలా దిగులుగా వుంటే నేను సహించలేను" అంటూ ఆమె నడుం చుట్టూ చేతులు వేశాడు లాలనగా. అప్పటికి ఆమె గుండెల్లోని బరువుదించినట్టయింది. పసిపాపలా అతని కౌగిట్లో వొదిగిపోయింది.

 Previous Page Next Page