Previous Page Next Page 
మరీచిక పేజి 28


                                    18


    "హాయ్ బేబీ!"

 

    "హాయ్ జాన్!"

 

    "వస్తావో లేదో అనుకుంటున్నాను. థ్యాంక్ గాడ్!"

 

    "ఎందుకలా అనుకున్నావ్?"

 

    "ఏమో!"

 

    "మనం త్వరగా ఈ వూరి నుంచి వెళ్ళిపోవాలి" బెదురు చూపులు చూస్తూ అన్నది శబరి.

 

    "భయంగా వుందా?"

 

    "డాడీ పోలీసులకు రిపోర్టు చేస్తాడు. మీ ప్యాడ్ మీద రైడ్ జరగొచ్చును."

 

    "ప్యాడ్ లో ఎవరూ లేరు. అందరూ నిన్ననే వెళ్ళిపోయారు."

 

    "ఎక్కడికి?"

 

    "గోవా!"

 

    "మనమూ వెళ్ళిపోదాం."

 

    "వెళదాం. కాని గోవా కాదు."

 

    "మరి ఎక్కడకెడదాం?"

 

    "బొంబాయి!"

 

    "బొంబాయా? అక్కడెవరున్నారు?"

 

    "అక్కడ కూడా హిప్పీస్ ఉన్నారు."

 

    "నీకు తెలుసా వాళ్ళు!"

 

    "తెలియదు!'

 

    "మరి?"

 

    "తెలియనక్కరలేదు. హిప్పీస్ ఎవరు వచ్చినా ఆహ్వానిస్తారు. ఎక్కడనుంచి వచ్చావని కూడా అడగరు. ఎప్పటినుంచో తెలిసిన వాళ్లలాగే ప్రవర్తిస్తారు. హిప్పీస్ ఎక్కడ వున్నా అంతా ఒకే కుటుంబం. మాకు స్వార్థంలేదు.

 

    "మంచివాళ్ళు!"

 

    "అవును! మంచివాళ్ళే హిప్పీస్ గా మారతారు. దగా, మోసం, అన్యాయం, కొత్తా, పాతా అంటూ లేదు. మా లోకంలో ప్రేమతప్ప మరోదానికి స్థానంలేదు."

 

    "శబరి కళ్ళు పెద్దవిచేసి ఆనందంగా చూసింది.

 

    "మనం త్వరగా వెళ్ళిపోవాలి."

 

    జాన్ తన సంచిలో నుంచి చినిగిపోయిన ప్యాంటూ షర్టూ తీసి ఇచ్చాడు.

 

    "ఇవెందుకూ?"

 

    "వేసుకో! ఆ నగలు తీసెయ్!"

 

    శబరి జాన్ ముఖంలోకి చూసింది.

 

    "ఊఁ త్వరగా! ఈ వేషంలో నిన్ను నాతో చూస్తే ఎవరైనా అనుమానిస్తారు. నేను నిన్ను మోసం చేసి తీసుకెళుతున్నాననుకుంటారు. పోలీసులకు అప్పగిస్తారు."

 

    శబరి బెదురు చూపులు చూసింది.

 

    "ఊఁ! క్విక్!"

 

    శబరి గబగబా బట్టలు మార్చుకుంది. నగలూ, డబ్బూ జాన్ చేతికి ఇచ్చింది. జాన్ వాటిని సంచిలో మురికిబట్టల మధ్యలో కుక్కాడు. శబరి జుట్టు చెరిపి సగం ముఖం కప్పేశాడు.

 

    "ఇప్పుడు నిన్ను ఒక పట్టాన ఎవరూ గుర్తించరు. ఆ చెప్పులూ, చీరా ఇక్కడే వదిలేయ్!"

 

    "నాకేదో భయంగా వుంది జాన్!"

 

    "ఛ! హిప్పీలకు భయం వుండకూడదు."

 

    "నా గుండె చూడు ఎలాకొట్టుకుంటూ వుందో!"

 

    "నేను వుండగా భయమెందుకూ? పద వెళ్దాం! బొంబాయికి వెళ్ళే బండి టైం అయింది."


                                   19


    దాదాపు తొమ్మిది గంటలకు రంగారావూ, రుక్మిణీ రేఖా వాళ్ళింటికి వచ్చారు.

 

    "శబరి అప్పుడే వెళ్లిపోయిందండీ!" అన్నది ఎదురుగా వచ్చి రేఖ.

 

    "వెళ్ళిపోయిందా? ఎక్కడికి?" రుక్మిణి ఆత్రంగా ప్రశ్నించింది.

 

    "ఆదిత్య వస్తానన్నాడట! వెంటనే వెళ్ళిపోయింది."

 

    రుక్మిణి రేఖ ముఖంలోకి అయోమయంగా చూసింది.

 

    "ఎలా వెళ్ళిందమ్మా?" రంగారావు అడిగాడు.    

 

    "ఆటోలో!" మా కారు నాన్న తీసుకెళ్ళారు."

 

    "పద!" రుక్మిణితో అని రంగారావు కారుకేసి నడిచాడు.

 

    రుక్మిణి యంత్రంలా అతన్ని అనుసరించింది. ఆమె మనసు పరిపరి విధాల ఆలోచించసాగింది. శబరి ఎక్కడికి వెళ్ళింది? ఆదిత్య ఈ రోజు రాడని చెప్పిందిగా? ఇంటికే వెళ్ళిందా? లేక...రుక్మిణి నిలువెల్లా వణికిపోయింది. రంగారావు గంభీరంగా కూర్చున్నాడు. రుక్మిణి ఏదో అడగాలనుకుంది. కాని కంఠం పెగల్లేదు. కారు ఇంటిముందు ఆగింది. రుక్మిణి పరుగులాంటి నడకతో ఇంట్లోకి వెళ్ళింది.

 

    "బేరీ! బేరీ!" అంటూ శబరి గదిలోకి నడిచింది. తలుపులు దగ్గిరగా వేసి వున్నాయి. తలుపులు నెట్టింది. శబరి గదిలో లేదు.

 

    "ఏంటమ్మా! అమ్మాయిగారు మీతోనే వచ్చారుగా?" అన్నది వంటమనిషి సుబ్బమ్మ. రుక్మిణి సుబ్బమ్మ ముఖంలోకి పిచ్చి చూపులు చూసింది.

 

    "సుబ్బమ్మా అమ్మాయి రాలేదా?" రంగారావు అడిగాడు.

 

    "లేదండీ!"

 

    "ఎక్కడికి పోయుంటుందబ్బా? అన్నది రుక్మిణి.

 

    రంగారావు ఆదిత్యకు ఫోన్ చేసి ఏదో మాట్లాడాడు. రుక్మిణి రంగారావు పాలిపోయిన ముఖం చూసింది.

 

    "ఉన్నాడా?"

 

    "ఆ ఉన్నాడు. ఇక్కడికే బయలుదేరుతున్నాడట. సెకెండ్ షోకి వెళ్దామన్నదట!"

 

    "దీనికి బొత్తిగా భయంలేకుండా పోయింది. మళ్ళీ ఎవరింటికి వెళ్ళిందో?" సాగదీసింది రుక్మిణి.

 

    ఆదిత్య వచ్చాడు. తొమ్మిది దాటినా శబరి రాలేదు. రంగారావు శబరి గదిలోకి వెళ్ళాడు. ఎదురుగా దిండుమీద ఉత్తరం కన్పించింది. చేతిలోకి తీసుకున్నాడు. కాళ్ళు వణుకుతున్నాయి.

 

    "అదేమిటి! ఎవరు రాశారు?" వెనకే వచ్చిన రుక్మిణి ఆత్రంగా అడిగింది. రంగారావు వినిపించుకోలేదు.

 

    "డాడీ!

 

    నేను వెళ్ళిపోతున్నాను. శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను. నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదని చెప్పాను. అయినా మీరు విన్పించుకోలేదు. పిల్లలకు ఊహ తెలిశాక, స్వంతంగా ఆలోచించడం వచ్చాక కూడా తల్లిదండ్రులే వాళ్ళకోసం ఆలోచించడం, పెద్దవాళ్ళ ఆలోచన ప్రకారం పిల్లలు నడుచుకోవాలని కోరుకోవడం అన్యాయం.

 

    మీ అభిప్రాయాలకూ, విలువలకూ అనుకూలంగా మీ పిల్లలు ప్రవర్తించాలని కోరుకునే మీకు నేను ఏం చెప్పినా అర్థంకాదు. అందుకే వెళ్ళిపోతున్నాను. నాకు ఈ జీవితంపట్ల గౌరవంలేదు. ఈ విలువలంటే అభిమానం లేదు. కొత్త విలువలు కావాలి. కొత్త జీవితం - మీరు ఊహించలేని జీవితం నాకు కావాలి. నేను కోరుకునే జీవితం మీకు దారుణంగా కన్పిస్తుంది. అందుకే నేను ఆత్మహత్య చేసుకోవడానికి నిర్ణయించుకున్నాను. ఊరిబయట కాలువలోపడి ఈ రొటీన్ జీవితంనుంచి విముక్తురాల్ని కాబోతున్నాను. నీళ్ళలో నాని ఉబ్బిపోయి అసహ్యంగా తయారయ్యే ఈ శరీరం కూడా మీకు దొరకకుండా ఉండాలని కోరుకుంటున్నాను. మీరు బాధపడ్తారని తెలుసు. మమ్మీ ఏడుస్తుందని కూడా తెలుసు. మిమ్మల్ని బాధపెట్టడం నాకు బాధగానే వుంది. ఈ రెండు రోజులూ నేను మీతో నాటకం ఆడాను. అంత కృత్రిమంగా ప్రవర్తిస్తూ లోలోపల ఎంత బాధపడ్డానో మీకు అర్థం కాదు. అలా నటించడానికి కారణం మీరే. లేకపోతే నాకు బయటికి వెళ్ళే అవకాశం దొరకదు. కాపలా కాస్తారు. అందుకే అలా ప్రవర్తించాను.

 Previous Page Next Page