Previous Page Next Page 
మానిని మనసు పేజి 28


    సావిత్రి కళ్ళు పెద్దవి చేసుకొని అనసూయ ముకంలోకి చూసింది.
    "ఏమిటి నఅలా చూస్తావ్ ఈ విషయాలన్నీ నాకెలా తెలిశాయనా?"
    సావిత్రి నోటిమాట పడిపోయినదానిలా చూస్తూ ఉండిపోయింది.
    "చెప్పు సావిత్రీ! నేను మీ మధ్యనుంచి తప్పుకుంటాను."
    "అనూ! నన్ను అనుమానిస్తున్నావా?" ఉండేలు దెబ్బ తగిలినట్టు విలవిలలాడిపోతూ అన్నది.
    "అనుమానమా? కళ్ళతో చూసిన వాస్తవం. నీమాటలతో ఇక నన్ను మభ్యపెట్టలేవు. నిజం చెప్పు."
    "నేను చెప్పను."
    "చెప్పి తీరాలి"
    "నువ్వు అసలు ఈ ఊరువచ్చింది ఆయనకోసం కదూ? పి.హెచ్.డి కేవలం ఒక సాకు మాత్రమే"
    "అనూ! నామాట నమ్ము. అతను ఈ వూళ్ళో ఉన్నట్టు నాకు తెలియదు. అతనే నీ భర్త అని కలలోకూడా వూహించలేని విషయం అలా అని తెలిస్తే అసలు ఇక్కడకు వచ్చి ఉండేదాన్నే కాదు."
    అనసూయ "వూఁ చెప్పు! ఆయనకూ నీకూ ఉన్న సంబంధము ఏమిటి? మొదటిరోజు ఒకర్నొకరు చూసుకుని ఎందుకలా బిగుసుకుపోయారు? ఇవ్వాళ ఆయన నిన్ను ఎందుకు చంపుతానని బెదిరించారు చెప్పు?"
    సావిత్రి మాట్లాడలేదు.
    "నువ్వు ఆయన్ను ప్రేమించావా?"
    సావిత్రి చివ్వున తలెత్తింది.
    "ఛ! అలాంటి దుర్మార్గుణ్ణి నేను ప్రేమించడం ఏమిటి"
    అనసూయ అదోలా నవ్వింది.
    "నిన్ను ప్రేమిస్తున్నట్టు నటించి మోసగించాడు. అందుకే అసహ్యించుకుంటున్నావ్"
    "కాదు... కాదు..."
    "అయితే అసలు సంగతి చెప్పడానికి ఎందుకింత మధన పడుతున్నావ్?"
    "నీ క్షేమం కోరి."
    "నా క్షేమం కోరేదానివైతే ఆయన్ను చూసినరోజే నాకు నిజం చెప్పేదానివి. నువ్వింత లోతుమనిషివని ఎప్పుడూ అనుకోలేదు."
    "నా మాట నమ్ము అనూ! నీ భర్తకూ నాకూ ఎలాంటి సంబంధం లేదు."
    "పరిచయమున్నది."
    "అవును."
    "ఎలాంటి పరిచయం?"
    "అది చెప్పలేకనే ఈ మూడురోజులనుంచీ మానసికంగా కృంగిపోతున్నాను."
    "నీ కల్లబొల్లి కబుర్లు ఇక నమ్మను నిజం చెప్పు"
    సావిత్రి ముఖం కోపంతో ఎర్రబడింది.
    "అయితే విను! మీ ఆయన హంతకుడు."
    అనసూయ తృళ్ళిపడింది.
    "అతను తన మొదటి భార్యను చంపాడు
    అనసూయ పిచ్చిచూపులు చూడసాగింది.
    "బంగారు బొమ్మలాంటి అమాయకురాల్ని నిలువునా సజీవదహనం చేశాడు."
    "ఇక ఆపు" పెద్దగా అరిచింది అనసూయ.
    "మొదలుపెట్టాక పూర్తిగా చెబుతాను"
    "నీకు నిజంగానే పిచ్చిపట్టింది."
    "నాకేం పిచ్చిలేదు. నీ భర్త సైకిక్. అప్పుడప్పుడు రాక్షసుడిగా మారిపోతాడు. ఆ సమయంలో ఎదురుగా వున్న వాళ్ళను హత్యచేస్తాడు."
    "సావిత్రీ!"
    సావిత్రి తన ధోరణిలో చెప్పుకుపోతోంది.
    "మీ ఆయన మొదటి భార్య చంద్రవదన. మొన్న చెప్పాను గుర్తుందా?"
    అనసూయ బేలగా చూసింది.
    "నీ భర్తే చంద్రవదన భర్త. భార్యను సజీవదహనం చేశాడు"
    అనసూయ ఉంగిడిపడిన పశువులా అసహాయంగా చూసింది.
    "నిన్నుకూడా ఎప్పుడో చంపేస్తాడు. అదే నా భయం. అందుకే మీ ఆయనంటే నాకు అసహ్యం. అతని బండారం బయట పెడతానన్నాను. నన్ను చంపబోయాడు.
    అనసూయ కళ్ళకు సావిత్రి కదిలిపోయిన ఫోటోలోని బొమ్మలా కనిపించసాగింది.
    "నిన్ను కూడా ఎప్పుడో పీక పిసికి చంపేస్తాడు."
    అనసూయ కళ్ళముందున్న ప్రతివస్తువూ గిర్రున తిరిగింది. కుర్చీలో వెనక్కు వాలిపోయింది. స్పృహతప్పి పడిపోయిన అనసూయ మొహంమీద నీళ్ళు చిలకరించింది సావిత్రి. పైటచెంగుతో ముఖం తుడిచింది.
    అనసూయ కళ్ళు తెరిచింది.
    సావిత్రి మంచినీళ్ళ గ్లాసు నోటిదగ్గర పెట్టింది. గ్లాసుడు నీళ్ళు గడగడ తాగింది. చుట్టూ భయం భయంగా చూసింది.
    "ఎలా వుంది అనూ!"
    అనసూయ బోలుగా నవ్వింది. వెనక్కివాలి కళ్ళు మూసుకుంది.
    తన భర్త మొదటిభార్యను చంపాడా? అతనికి భార్య పోయిందని మాత్రమే తెలుసు. ఎలా పోయిందికూడా తెలియదు. తను ఎప్పుడూ అడగలేదు. తనకు ఆ విషయం ఎత్తాలంటేనే నమస్కరించేది కాదు. తన భర్త తనకంటే ముందు మరో స్త్రీతో కాపరం చేశాడనే విషయాన్ని భరించలేక పోయేది.
    అతన్ని అన్నయ్య మంచివాడన్నాడు.
    అందరూ అదే అన్నారు.
    తనూ అలాగే అనుకుంది. తను అదృష్టవంతురాలిననుకుని మురిసిపోయింది.
    మనసులో అంత పెద్ద క్రూరజంతువును సాకుతూ పైకెంత సాధువుగా నటించగలుగుతున్నాడో!
    తనను చంపేస్తాడు. గొంతుపిసికి చంపుతాడు. వీలుకాక పోతే కాల్చి చంపుతాడు.
    అనసూయ వెన్నెముకలో ఏదో జరజర పాకినట్టయింది.
    "సారీ అనూ నీకు చెప్పకూడదనే అనుకున్నాను."
    అనసూయ సమాధానం ఇవ్వలేదు.
    "మరీ అంతగా భయపడకు. అతన్ని ఎప్పుడూ దగ్గిరగా చూడలేదు. ఈ నాలుగు రోజుల్నించీ చూస్తున్నానుగా. నువ్వంటే చాలు ఇష్టం. మనిషి మంచివాడుగానే వున్నాడు"
    "నీకు పిచ్చెక్కింది."
    సావిత్రి తృళ్ళిపడింది.
    "ఒకవైపు హంతకుడంటున్నావు. నన్ను కూడా ఎప్పుడో చంపుతాడంటున్నావు. ఇప్పుడు మంచివాడంటున్నావు."
    "నేను సైకాలజీ స్టూడెంటును. అతన్ని ఈ నాలుగు రోజులూ గమనించాను. అతను మంచివాడే కాని అప్పుడప్పుడు మానసిక రోగానికి గురి అవుతాడు. అటువంటి సమయాల్లో అతడేం చేస్తాడో అతనికే తెలియదు. ఇంతకుముందు సరిగ్గా అదే జరిగింది. నేను చంద్రవదన చావును గురించి ప్రశ్నించాను. ఆయన లోపల దాగివున్న జంతువు పైకి దూకింది. మరో పర్సనాలిటీ బయటికి వచ్చిందన్నమాట. సైకో సినీమా చూశావా? ఆ హీరోకు ఉన్న జబ్బులాంటిదే ఇదికూడా. నీకు పెళ్ళయి ఆరునెలలైంది. ఎప్పుడూ నిద్రలో ఉన్న నీ గొంతు పట్టుకోలేదా?"
    "లేదు" నిలువెల్లా వణికిపోతూ అన్నదనసూయ.
    "నేను వూహించింది నిజమే"
    "ఏమిటి?"
    "ఈమధ్య అతను అసాధారణ మానసిక స్థితిని గరికాలేదు. అదెప్పుడు ఎలా రివైవ్ అవుతుందో చెప్పలేం. ఇందాక అతను అలాంటి మానసిక స్థితిలోనే నన్ను చంపబోయాడు."
    అనసూయ నుదుటిమీద చెమటను తుడుచుకుంది. కొంకర్లు పోతున్న చేతివేళ్ళను సవరించుకుంది.
    "మరో విషయం. కొన్ని సంఘటనలూ, కొందరు వ్యక్తులూ ఇలాంటివారి గతస్మృతుల్ని జ్ఞాపకం చేస్తారు. నన్న వారం రోజులుగా చూస్తున్నాడు. అదోలా వుంటున్నాడు. ఈ రోజు అతను పూర్తిగా అసాధారణ మానసిక రోగానికి గురైనాడు."
    తనకు తెలిసిన సైకాలజీ జ్ఞానంతో చెప్పసాగింది సావిత్రి.
    "నువ్వు జాగ్రత్తగా వుండు. రాత్రిళ్ళు ఆదమరచి నిద్రపోకు."
    అనసూయ బేలగా చూసింది.
    సావిత్రి లేచి వెళ్ళింది.
    అనసూయకి లేచే ఓపికలేదు. ఆలోచించే శక్తిని మనసు కోల్పోయింది. అలాగే కుర్చీకి అంటుకొని కూర్చుండిపోయింది.
    సావిత్రి చేతిలో పెట్టెతో వచ్చింది.
    "అనూ! నేను వెళుతున్నాను."
    "ఎక్కడికి?"
    "హాస్టల్ కు."
    "వద్దు! వద్దు! ఇవ్వాళ వెళ్ళకు. నాకేదో భయంగా వుంది."
    "బాబోయ్! ఇక్కడ నేను క్షణంకూడా వుండను. మీ ఆయన నన్ను చంపేస్తాడు."
    "నేను ఉంటాగా?"
    "లాభంలేదు. అతని కంట నేను పడకూడదు. నువ్వు జాగ్రత్తగా వుండు."
    "ఈ రాత్రికి ఉండి రేపు వెళ్ళు" బ్రతిమాలుతున్నట్టు అంది.
    "సారీ అనూ! నాకింకా బ్రతకాలనివుంది."
    అనసూయ ఏమీ అనలేకపోయింది.
    "నువ్వు జాగ్రత్త. అతను ఏ కొంచెం పిచ్చిగా ప్రవర్తించినా మీ అన్నయ్య దగ్గరకు వెళ్ళిపో. వస్తాను" అంటూ సావిత్రి గబగబ వెళ్ళిపోయింది.
    అనసూయ ఎంతసేపు అలా కూర్చుందో ఆమెకే తెలియదు.
    "ఇదేమిటి లైట్ వెయ్యకుండా చీకట్లో కూర్చున్నావ్" లైటువేసి అన్నాడు రమణ.
    భర్త ముఖంలోకి భయం భయంగా చూసింది.
    "ఏం అనూ అలా ఉన్నావేం?"
    అనసూయ భర్త ముఖంలోకి బెదురుచూపులు చూసింది.
    "మీ ఫ్రెండ్ ఎక్కడ?"
    "వెళ్ళిపోయింది."
    రమణమూర్తి రిలీఫ్ గా నిట్టూర్చాడు.
    భార్య భుజంమీద చెయ్యివేశాడు.
    ఆమె కెవ్వున అరిచింది.
    "ఏమిటి అనూ? ఏమైంది? ఎందుకలా వణికిపోతున్నావ్?" మృదువుగా అడిగేడు.
    ఫ్రిజ్ నుంచి వాటర్ బాటిల్ తీశాడు. గ్లాసులోకి వంపి అనసూయకి అందించాడు. ఆమె మంచినీళ్ళు తాగింది.
    "మరో గ్లాసు కావాలా?"
    కావాలి - అన్నట్టు తలాడించింది.
    రమణ ముఖంలోకి చూసింది. చాలా ప్రశాంతంగా వుంది ఆ ముఖం.
    "మీ ఫ్రెండుకు పిచ్చి వున్నట్టుంది. వైజాగ్ లో ఉన్నప్పుడే ఆమె ప్రవర్తన వింతగా వుండేది. ఇప్పుడు ఆ పిచ్చి మరీ ఎక్కువయినట్టుంది."
    అనసూయ రమణ ముఖంలోకి చూసింది.
    పిచ్చివాళ్ళు తమకు పిచ్చిలేదంటారు. ఎదుటివాళ్ళకే పిచ్చి అంటారు. అంటే తన భర్తకు...
    అనసూయ బిగుసుకుపోయింది.
    "ఏమిటలా చూస్తావ్? భోజనం చేద్దాం లే!"
    "వంట చెయ్యలేదు."
    "ఏం?"
    "నా మనసు బాగులేదు. ఇప్పుడు చేస్తాను."
    "ఇప్పుడేం చేస్తావ్? హోటల్ నుంచి కారియర్ తెస్తాను"
    "వద్దు. ఎంతసేపు"
    "సరే పద... నేను కూడా సహాయం చేస్తాను"
    వంటింట్లో కూర్చుని రమణమూర్తి భార్యను నవ్వించే ప్రయత్నంలో ఎన్నో కబుర్లు చెప్పాడు
    సావిత్రి ఈయనకు పిచ్చి అంటుంది.
    ఈయన సావిత్రికి పిచ్చి అంటాడు.
    ఇరువురూ కలిసి తనకు పిచ్చి ఎక్కించేలా వున్నారు.
    రమణమూర్తి నిద్రపోతున్నాడు.
    "ఆదమరిచి నిద్రపోకు" సావిత్రి మాటలు గుర్తువచ్చాయామెకి.
    చాలాసేపు నిద్రపట్టలేదు.
    కలత నిద్రలోవున్న అనసూయ నడుంమీద రమణమూర్తి చెయ్యిపడింది.
    కెవ్వున అరుస్తూ లేచికూచుంది.
    రమణ చివ్వున లేచి కూర్చున్నాడు.
    "ఏమిటి? ఏమైంది."
    అనసూయ నిలువునా వణికిపోతున్నది.
    "పీడకల వచ్చిందా?"
    అవును అన్నట్టు తలాడించింది.
                                                                         14
    తెల్లవారి అనసూయ ఒక యంత్రములా తిరుగుతూ పనులన్నీ చేసింది. రమణతో ముభావంగా వుంది.
    మామూలుగా భోజనానికి రమ్మని తొందరచేసే అనసూయ ఆరోజు టేబుల్ మీద అన్నీ ఉంచి టేబుల్ ముందు కూచుంది.
    రమణ వచ్చి కూర్చున్నాడు. ఆమె మౌనంగా వడ్డించసాగింది. అతడు భార్య ముఖంలోకి చూస్తూ కూచున్నాడు. అతనికి ఆమె మౌనం చూస్తుంటే కోపం పెల్లుబుకుతూంది. అతి ప్రయత్నంమీద అణుచుకుంటూ భోజనము అయిందనిపించి లేచాడు.

 Previous Page Next Page