"లేదు."
"ఎక్కడి కెళ్ళింది?"
"పేరంటానికి."
"మరి నువ్వు కూడా వెళ్ళకపోయావ్?"
"వెళ్ళలేదు. ఎందుకో తెలుసా? నీ సంగతి తెలుసుకోవడానికి నాకు ఇంతకంటే మంచి అవకాశం దొరకదు" యుద్ధానికి సిద్ధంగా ఉన్న సిపాయిలా నిల్చుంది సావిత్రి.
"అట్టే పిచ్చిగా మాట్లాడకు" అంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు.
బట్టలు మార్చుకుని డ్రాయింగురూంలో కూర్చున్నాడు.
"నిజం చెప్పండి" కాలుస్తున్న సిగరెట్ కిందపడిపోయింది.
తలెత్తి సావిత్రి ముఖంలోకి విసుగ్గా చూశాడు.
"చెప్పండి" రెట్టించింది.
"ఏం చెప్పాలి?"
"మీరు మీ భార్యను ఎందుకు చంపారు?"
"నేను చంపలేదు."
"మీరే చంపారు. నాకు బాగా తెలుసు. ఎందుకు చంపారో చెప్పండి."
రమణమూర్తి సావిత్రి ముఖంలోకి చూశాడు. ఆమె కళ్ళు అగ్నిగోళీలులా ఉన్నాయ్. ఆవేశంతో ఊగిపోతున్నది. ఆమె రూపం చూస్తుంటే రమణమూర్తికి భయం వేసింది.
"చెప్పండి. ఎందుకు చంపారు?"
"నేను చంపలేదు. ప్రమాదవశాత్తు కాలి చనిపోయింది"
"పచ్చి అబద్ధం. మీరే చంపారు. సజీవ దహనం చేశారు. నిలువునా ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్న రాక్షసుడివి నువ్వు" ఆవేశంతో రొప్పుతూ అన్నది.
"నీకు పిచ్చా"
"నాకేం పిచ్చికాదు. మీకే పిచ్చి. అప్పుడప్పుడు మీకు మతిభ్రమణం కలుగుతుంది. స్ల్పిట్ పర్సనాలిటీ. అప్పుడు మీరేం చేస్తారో మీకే తెలియదు."
"సావిత్రీ!"
"అవును. మీకు పిచ్చివుంది. మీ భార్యను గొంతు పిసకడానికి ఎన్నోసార్లు ప్రయత్నించారు."
"ఇక ఆపు"
"ఆపను. అరిచి అరిచి నువ్వు హంతకుడివని చెబుతాను. అనసూయ నా ప్రాణ స్నేహితురాలు. ఎప్పుడో నువ్వు దాన్నికూడా చంపుతావ్. అదే నా భయం" హిస్టీరిక్ పేషెంటులా మాట్లాడుతున్నది.
రమణమూర్తికి పిచ్చికోపం వచ్చింది.
"నోరు ముయ్" అరిచాడు.
"ముయ్యను. ఈ విషయం అనసూయకు కూడా చెబుతాను. నువ్వు హంతకుడివని చెబుతాను. దాన్ని నీ బారినుంచి తప్పిస్తాను."
రమణమూర్తి ఉగ్రరూపం ధరించాడు.
కళ్ళు చింతనిప్పులా కణకణలాడుతున్నాయ్.
"ముందు ఇక్కడ్నుంచి వెళ్తావా? లేదా?"
"వెళ్ళను."
"మరోసారి నా చనిపోయిన భార్య గురించి మాట్లాడావా చంపేస్తాను" రెండడుగులు ముందుకు వేశాడు.
సావిత్రి రమణమూర్తి ఉగ్రరూపం చూసింది.
కెవ్వున అరుస్తూ బయటికి పరుగుతీసింది.
"అనసూయతో ఇలాగే వాగావా చంపేస్తాను" అరుస్తున్నాడు.
పరుగెత్తిన సావిత్రి లోపలకు వస్తున్న అనసూయను ఢీ కొన్నది. పడబోతున్న సావిత్రిని అనసూయ పట్టుకొంది.
"నన్ను వదులు. ఆ దుర్మార్గుడు నా గొంతుపిసికి చంపేస్తాడు" అంటూ పిచ్చి బలంతో అనసూయను వెనక్కునెట్టి గదిలోకి పారిపోయి ధడాల్న తలుపులు వేసుకుంది.
అనసూయ పడబోయింది. గడప పట్టుకొని నిలదొక్కుకుంది.
అనసూయ గడప పట్టుకొని అలా ఎంతసేపు నిలబడిపోయిందో ఆమెకే తెలియదు.
రమణమూర్తి బట్టలు వేసుకొని అనసూయను నెట్టుకుంటూ బయటకు వెళ్ళబోతుంటే అనసూయ "ఆగండి" అంటూ చెయ్యి అడ్డుపెట్టింది.
రమణమూర్తి ఆగాడు. భార్య ముఖంలోకి చూడలేకపోతున్నాడు.
"ఏమిటిది? సావిత్రిని ఏమన్నారు?"
"నేను ఏమీ అనలేదు. ఆవిడ ఏదో పిచ్చిపిచ్చిగా వాగుతూంది."
"మీకు ఆమెతో పరిచయం లేదన్నారుగా? కొత్త వ్యక్తితో ఘర్షణ పడాల్సిన అవసరం ఏమొచ్చింది?"
"ఇప్పుడు నన్నేమీ అడక్కు" అంటూ చరచర బయటికి వెళ్ళిపోయాడు.
అనసూయ కాళ్ళలోని సత్తువ ఎవరో లాగేసినట్టు అయింది.
లేచింది. తిన్నగా సావిత్రి గదిముందుకు వెళ్ళి నిలబడింది. లోపలనుంచి ఎలాంటి అలికిడి లేదు.
"సావిత్రీ! తలుపు తియ్" తలుపు బాదుతూ పిల్చింది అనసూయ.
"నేను తియ్యను."
"తలుపు తియ్!"
"ఆ రాక్షసుడు నన్ను చంపేస్తాడు."
"ఆయన లేరు. బయటికి వెళ్ళారు. తలుపుతియ్. నేను ఉండగా నీకేం భయంలేదు."
సావిత్రి తలుపు ఓరగా తీసి తల బైటికిపెట్టి భయం భయంగా చుట్టూ కలియజూసింది.
"ఆయన లేరులే. రా బయటికి."
సావిత్రి వేటగాడు తరుముతున్న లేడిలా బయటికి వచ్చింది. అనసూయకు సావిత్రిమీద జాలివేసింది.
"రా! కూర్చో! కాఫీ కలుపుకొస్తాను."
కాఫీ తాగాక సావిత్రి కొంచెం తేరుకున్నది.
"ఇప్పుడు చెప్పు" ఎదురు కుర్చీలో కూర్చుంటూ మామూలుగానే అడిగింది అనసూయ.
"ఏమిటి?"
"ఆయనకూ నీకూ ఉన్న సంబంధం ఎలాంటిది. ఇద్దరూ ప్రేమించుకున్నారు గదూ? ఆయన నిన్ను మోసం చేశాడు.