Previous Page Next Page 
మానిని మనసు పేజి 29


    బట్టలు మార్చుకొని ఆఫీసుకు బయలుదేరాడు. అంతకుముందు అతను ఆఫీసుకు వెళుతుంటే అనసూయ బయటకు వచ్చి వాకిట్లో నిలుచుని అతను సందు మలుపు తిరిగేంతవరకూ చూసేది. సందు మలుపు తిరుగుతూ అతడు ఒకసారి వెనక్కు చూసి చెయ్యి ఊపేవాడు. ఆరోజు అనసూయ డైనింగ్ టేబుల్ సర్దుతూ వుండిపోయింది.
    రమణకూడా భార్యకు చెప్పకుండానే విసురుగా వెళ్ళిపోయాడు.
    అనసూయకు భర్త బయటికి వెళ్ళగానే పెద్ద రిలీఫ్ దొరికినట్లనిపించింది.
    ఆయనతో మాట్లాడాలంటేనే తనకు భయంగా వున్నది. ఆయన ఇంట్లో ఉంటే ఏ నిముషం అతని మూడ్ మారి తన గొంతు పిసుకుతాడోనని భయం పట్టుకుంది.
    తన భయానికి ఆధారం లేదనిపిస్తుంది ఒకోసారి. తనను ఎన్నడూ కసురుకొని కూడా ఎరగడు. అలాంటి ఆయనమీద అనుమానాన్ని కలిగించి తన దారిన తాను వెళ్ళిపోయింది సావిత్రి.
    సరిగా పాపం! ఆయన ఇవ్వాళ భోజనంకూడా చెయ్యలేదు. ముఖంలో ఏదో బాధ కొట్టొచ్చినట్టు కన్పిస్తోంది.
    తను అనవసరంగా ఆయన మనసును నొప్పిస్తున్నది. తను బాధపడుతూ ఆయనకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నది. సావిత్రి మాటలు నమ్మి తను అనవసరంగా భర్తకు దూరం అవుతున్నది. చల్లని సంసారంలో నిప్పులు కురిపిస్తున్నది. జరిగిపోయిందేదో జరిగిపోయింది. తను ఇకనుంచి సాధ్యమైనంత మామూలుగా ఆయనతో ప్రవర్తించి ఇద్దరి మధ్యా ఏర్పడ్డ గండీను పూడ్చాలి.
    ఒక నిర్ణయానికొచ్చింది అనసూయ.
    మనసు తేలికపడినట్టు అయింది.
    భోజనంచేసి మంచంమీద నడుంవాల్చింది. కళ్ళు మూసుకుంది.
    అంతలో ఎవరో తలుపు దడదడ బాదుతున్నారు. అనసూయ లేచింది. తలుపు ఎడతెరిపి లేకుండా బాదుతుంటే ఆమెకు కోపం వచ్చింది.
    "ఎవరు?" కోపంగా అంటూ తలుపు తీసింది.
    సావిత్రి చేతిలో పెట్టెతో ఎవరో తరుముతున్నట్టు లోపలకు వచ్చింది. కొంచెమయితే అనసూయ కిందపడిపోయేదే. వెంటనే దర్వాజా కమ్మి పట్టుకొని నిలదొక్కుకుంది.
    "ఏమిటే సావీ! ఇంత హడావిడిగా వచ్చావేం?"
    సావిత్రి చూపులు ఒకచోట నిలవడంలేదు.
    నలువైపులా భయం భయంగా చూడసాగింది.
    "ఏమిటే! ఏం జరిగింది? ఎందుకలా భయంగా చూస్తున్నావ్? ఎవరూ లేరులే. చెప్పు" అన్నది సావిత్రి చేతిలోని పెట్టె తీసుకుని గోడప్రక్కగా పెట్టింది.
    "అతను వున్నాడా?"
    "ఎవరు?"
    "మీ ఆయన"
    అనసూయకు కోపం వచ్చింది.
    "వేరు" అన్నది కోపాన్ని దిగమింగుకుంటూ.
    "అమ్మయ్య" అంటూ కుర్చీలో కూలబడింది.
    "ఏమిటే ఏమైంది?"
    "ముందు మంచినీళ్ళివ్వు"
    అనసూయ మంచినీళ్ళు ఇచ్చింది.
    రెండు గ్లాసుల నీళ్ళు గడగడ తాగింది.
    "చలికాలం అంత చెమట పోసిందేమే?" సావిత్రి ముఖములోకి చూస్తూ అడిగింది ఆమె.
    "మీవారు ఇప్పుడు రారుగా?"
    "ఏమిటే ఆయనంటే మరీ అంత భయం. ఆయన నీ జోలికి రారులే. ఆరోజు జరిగినదానికి ఎంతో పశ్చాత్తాప పడుతున్నారు" రమణమూర్తిని వెనకేసుకొస్తూ అన్నదామె.
    సావిత్రి అనసూయ ముఖంలోకి నమ్మలేనట్టు చూసింది.
    "ఏమిటే అలా చూస్తావ్?"
    "మీ ఆయన రోగ్. మేకవన్నె పులి."
    "ఇదుగో సావీ! ఇకనుంచి నువ్వు ఆయనను ఏమైనా అంటే నేను సహించను. ఇంతవరకూ ఇప్పటికే చాలా సహించాను" అసహనంగా అన్నదామె.
    సావిత్రి అదోలా నవ్వింది.
    "ఇక నీకు ఆ అవకాశం ఇవ్వనులే. ఇవ్వాళే వైజాగ్ వెళ్ళిపోతున్నాను."
    "వైజాగ్ వెళుతున్నావా? మళ్ళీ ఎప్పుడొస్తావ్?"
    "ఇక రాను."
    "అదేం! పి.హెచ్.డీ చెయ్యవూ?"
    "ఇంకా ఏం పి.హెచ్.డీ. మా అమ్మకూ నాన్నకూ ఒకే బిడ్డను బ్రతికుంటే చాలు."
    "ఏమిటే ఏమైంది?" ఆశ్చర్యంగా అడిగింది.
    "గొంతు ఎండిపోతోంది మంచినీళ్ళు ఇవ్వు"
    "ఇప్పుడేగదే రెండు గ్లాసులు తాగావు!"
    "తాగానా?"
    "అదేమిటే? ఇప్పుడే తాగావు" సావిత్రి కళ్ళలోకి చూస్తూ అన్నదామె.
    సావిత్రి చూపులు చంచలంగా ఉన్నాయ్. ఎక్కడో చూస్తున్నట్టు వున్నాయ్.
    "అవునవును ఇప్పుడేకదూ తాగాను. అయినా మళ్ళీ గొంతు ఎండిపోతున్నది."
    అనసూయ మళ్ళీ ఫ్రిజ్ లోనుంచి వాటర్ బాటిల్ తీసింది. వెనకే వచ్చిన సావిత్రి బాటిల్ తీసుకుని ఎత్తి గడగడ మొత్తం నీరు తాగేసింది.
    అనసూయ అయోమయంగా చూసింది.
    "ఉండు కాఫీ పట్టుకొస్తాను"
    "వద్దు! వద్దు! నేను త్వరగా వెళ్ళిపోవాలి."
    "బండి ఏడుగంటలకు ఇప్పటినుంచే వెళ్ళి ఏం చేస్తావే?"
    "స్టేషన్ లోనే కూర్చుంటాను. పదిమంది మధ్యలో నా ప్రాణానికి అపాయముండదు."
    "ఇప్పుడు నీ ప్రాణానికొచ్చిన అపాయమేమిటే?"
    సావిత్రికి మతి చలించిందా? దాని వాలకం చూస్తే అలాగే వుంది. చూపులు కూడా పిచ్చిదాని చూపుల్లాగే వున్నాయ్. దీనిమాటలు నమ్మి తాను భర్తకు దూరమయింది.

 Previous Page Next Page