Previous Page Next Page 
మరో దయ్యం కథ పేజి 27


    మేము వచ్చాక అంత హాయిగా, రిలాక్స్ డ్ గా అంతవరకూ నవ్వలేదు.

 

    "అది పదేళ్ళ పసిముండ ! మా ఇంటికొచ్చి దాదాపు ఐదేళ్ళయింది. మా అందరికీ కన్పిస్తూ ఉంటుంది. దానికి మా కుటుంబం అంటే ఎక్కడలేని ఆప్యాయత. మాకూ అలాగే అన్పిస్తుంది. అది ఒక్కరోజు రాకపోతే మాకు తోచదు."

 

    'బాబోయ్! పిచ్చి బాగానే ముదిరిపోయింది' అని అరవబోయి, గొంతులోనే అణచుకున్నాను.

 

    "అంటే, ఆ రోజు తలుపు తీసింది ?"

 

    "ఆ పిల్లే!"

 

    "మీ భార్య రూపంలో వచ్చి తీసింది-అవునా?" అన్నాను ఆమె ముఖంలోకి లోతుగా చూస్తూ.

 

    ఆమె నా కళ్ళల్లోకి చూడలేనట్టు చూపులు దించుకొన్నది. ఆమె మీద నాకు జాలి వేసింది.

 

    ఆమె ఆ విషయాలను నమ్ముతుందో లేదో అర్థం కావడం లేదు.

 

    "మీకు ఆ విషయం ఎవరు చెప్పారు?"

 

    "ఇంటికొచ్చాక నా భార్యే చెప్పింది."

 

    నేను మళ్ళీ ఆమె కేసి చూశాను. ఆమె తల ఎత్తలేదు.

 

    భర్తకు ఇలాంటి విషయాలంటే ఇష్టంగనక చెప్పిందా?

 

    లేక స్ల్పిట్ పర్సనాలిటీయా ?

 

    రెండుగా చీలిపోయిన పర్సనాలిటీలకు ఒకదాని ఉనికి మరోదానికి తెలియదు.

 

    ఒక పర్సనాలిటీ తలుపు తీసి ఉంటుంది.

 

    ఆమె స్నానం చేసివచ్చేసరికి ఆ పర్సనాలిటీ మరుగున పడిపోయి ఉంటుంది.

 

    కాని ఆమెను చూస్తుంటే అలాంటి లక్షణాలేమీ కన్పించడం లేదు. చాలా బాలెన్స్ డ్ గా కన్పిస్తోంది. సోబర్ గా కూడా ఉంది.

 

    భర్త పిచ్చితనాన్ని అర్థం చేసుకొని ఆయనను నీడలా కాపాడుకొస్తున్నదానిలా ఉంది.

 

    "నా భార్యా నేనూ మూడు జన్మలగా భార్యాభర్తలం!"

 

    నా ఆలోచనలు పుటుక్కున తెగిపోయాయి.

 

    ఒక్కసారిగా తల విదిలించుకొని చూశాను.

 

    కృష్ణకేసి చూశాను.

 

    అతను నోరు తెరిచి ముయ్యడం మర్చిపోయి చూస్తున్నాడు.

 

    డాక్టరుగారి సతీమణి తలవంచుకొని కూర్చున్నది. సిగ్గుపడుతుందా?

 

    "మొదట ఈజిఫ్టులో పుట్టాం. అప్పుడు ఆమె పేరు ఇన్ బెల్లా. ఆమె గొప్ప కుటుంబానికి చెందినది. నేను సామాన్య సైనికుడ్ని. నన్ను ఆమె ప్రేమించింది. చివరకు ఇద్దరం పారిపోయాం. దేశం వదిలి పారిపోయాం. పెళ్ళి చేసుకొన్నాం. ముందు ఆమె చనిపోయింది. రెండో జన్మలో పారిస్ లో నాకంటే ముందుగా జన్మించింది. నాకు ఐదేళ్ళు వచ్చేసరికే ఆమెకు పెళ్ళయిపోయింది. నా ఇరవై అయిదవ ఏట నేను ఆమెను కలుసుకొన్నాను. ప్రథమ చూపుల్లోనే జన్మాంతర ప్రేమ మాలో మేల్కొన్నది. అప్పుడు ఆమె ఒక సినీమా స్టార్. మొదటి భర్తకు విడాకులిచ్చి, పదిహేనేళ్ళు చిన్నవాడ్ని అయిన నన్ను చేసుకొన్నది. పూర్తి జీవిచాన్ని జీవించాం.

 

    ఇది మూడో జన్మ.

 

    వచ్చే జన్మలో రష్యాలో పుడతాం.

 

    "ఆ జన్మలో ఆమెకు జన్మ రాహిత్యం వచ్చేస్తుంది. నేను మాత్రం మళ్ళీ జర్మనీలో పుడతాను. ఆ తర్వాత నాకూ జన్మరాహిత్యం కలుగుతుంది. ఆమెను ఊర్ధ్వలోకాల్లో కలుసుకుంటాను."

 

    నాకు జుట్టు పీక్కోవాలనిపించింది, అతని మాటలు వింటుంటే.

 

    కృష్ణకేసి చూశాను.

 

    అతను చాలా తాపీగా కూర్చున్నాడు.

 

    "అవును ! ఈ విషయం ఇంతకుముందే డాక్టరుగారు నాకు చెప్పారు." అదేదో తన కిచ్చిన ప్రత్యేకమైన క్రెడిట్ లా అన్నాడు రఘుపతి.

 

    నేను చివ్వున లేచి నిల్చున్నాను.

 

    "అరే, లేచారేం ? ఇంకా చాలా విషయాలున్నాయి" అన్నాడు డాక్టర్ రాజేంద్ర.

 

    "మళ్ళీ వస్తాం ! మావాడికి ఏదో అర్జంటు పని ఉంది" అన్నాడు కృష్ణ.

 

    "తప్పకరండి. మీరూ రావాలి!" అన్నాడు నాకేసి చూస్తూ.

 

    "అలాగే"! అన్నాను.

 

    నేను రోడ్డు మీదకు వచ్చి గుండెల నిండుగా గాలి పీల్చుకొన్నాను.

 

    పిచ్చాసుపత్రిలో నుండి బయటపడినట్టుగా ఉంది నా ప్రాణానికి.

 

    "పాపం ! డాక్టర్ ను ఏ సైకియాట్రిస్టుకైనా చూపిస్తే మంచిదేమో!" అన్నాను.

 

    "ఇలాంటివాళ్ళు చాలామంది ఉన్నార్లే!" నవ్వుతూ అన్నాడు కృష్ణ.

 

    అవును !

 

    ఉన్నారు! చాలామంది ఉన్నారు!......


                                *    *    *


    ఒక్కసారిగా గుర్రం సకిలించింది.

 

    తృళ్లిపడి వెనక్కు జారిపోతున్న నేను గుర్రంబండి తడిక బద్ధ పట్టుకొన్నాను.

 

    గతంలో నుంచి వాస్తవంలోకి వచ్చాను.

 

    ఏది గతమో ఏది వాస్తవమో కూడా తెలుసుకోలేనంతగా నా మనసు అలిసిపోయింది.

 

    ఇప్పుడు అర్థం అయింది.

 

    ఆ హెలెన్ వాస్తవం కాదు.

 

    అది కల మాత్రమే!

 

    బండిలో వెనక్కు వాలాను.

 

    బయలుదేరినప్పటినుంచీ పిశాచాల కథలూ, చుట్టూ భయం గొలిపే వాతావరణం.

 Previous Page Next Page