రాము తలవంచుకొని నిల్చున్నాడు.
తల్లి ఖళ్ళు ఖళ్ళున దగ్గుతూ ఉన్నది.
రేణుకనూ ఎవరూ చూడలేదు.
రాము పెళ్ళిచేసుకుంటానంటున్నాడా? అయితే తను విన్నది నిజమే నన్నమాట!
ప్రిన్స్ పాల్ గారి అమ్మాయి ఉషతో తిరుగుతున్నాడని చెప్పారు. కాని తను నమ్మలేకపోయింది. రాము నిదానంగా ఉంటాడు. తన కళ్ళకు ఇంకా పసివాడిగానే కన్పిస్తాడు. అవును! రాముకు ఇరవై రెండోఏడు కూడా వచ్చింది. ఎం.ఏ. రెండో సంవత్సరం చదువుతున్నాడు.
తల్లి ఖాండ్రించి పక్కనే ఇసుకలో ఉన్న డబ్బాలోకి ఊసింది.
రేణుక ఆలోచనల నుంచి బయటపడింది.
"నీ పెళ్ళికి తొందరేం వచ్చిందిరా! నువ్వు ఎం.ఏ. పాసయి ఉద్యోగంలో చేరు. కొంతకాలం ఇంటి బాధ్యత నువ్వు తీసుకో. నీకు ఉద్యోగం రాగానే అక్క పెళ్లి చేస్తాను. ఆ తర్వాత"
రాము చివ్వున తలెత్తి తల్లి ముఖంలోకి ఆశ్చర్యంగా చూశాడు.
రేణుక తనలో తనే నవ్వుకుంది.
అమ్మ తనకు పెళ్ళి చేస్తుందా? ఇంకా తనను పెళ్ళికావాల్సిన పిల్లగానే భావిస్తుందా? తల్లి మనసు!
"ఏమిట్రా అలా చూస్తావ్?"
"అక్కయ్యకు నువ్వు పెళ్ళి చేస్తావా?"
"ఏంరా! ఏం? ఎందుకు చెయ్యకూడదూ? అదేం ముసల్ది అయిపోయిందా? దానికి పెళ్ళి చేసుకొనే వయసు మళ్ళీ పోయిందా?"
"అది కాదమ్మా! అక్కయ్యకు తగినవాణ్ణి నువ్వెక్కడ చూస్తావమ్మా?"
"నేను చూడలేకపోతే అదీ చూసుకొంటుంది. దాన్ని పెళ్ళి అయ్యేదాకా నువ్వు చేసుకోవడానికి వీల్లేదు"
"నేనూ అదే అన్నాను.కాని"
"కాని?... ఈ చెప్పు! ఆ పిల్ల ఇప్పుడే పెళ్ళి కావాలని అంటున్నదా?"
రాము మాట్లాడలేదు.
"ఆ పిల్లకు చెప్పు! మా అక్కయ్య పెళ్ళి చేసుకొనేంతవరకూ నేను చేసుకోనని చెప్పు!"
రాము అలాగే నిల్చున్నాడు.
"నాకు తెలుసురా! మీరంతా స్వార్థపరులు. నీ సంగతి నువ్వు చూసుకున్నావ్. నిన్ను ఇంత చేసిన అక్క గురించి ఒక్కసారి ఆలోచించలేవు. నువ్వు స్వార్థపరుడివి. పో! వెళ్ళి పెళ్ళి చేసుకో! కాని మళ్ళీ ఈ గడప తొక్కకు!" దగ్గు తెరల మధ్య దాదాపు అరుస్తూనే అన్నది.
"అమ్మా!" రేణుక లోపలకు వచ్చింది.
"రా తల్లీ! రా! నీ తమ్ముడు ప్రయోజకుడైనాడు. వాడికి పెళ్ళి కావాలట! ఆ తర్వాత చెల్లెల్లిద్దరికీ చిన్న తమ్ముడికీ కూడా పెళ్ళి చేస్తే ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. నేనూ ఎక్కువ రోజులు వుండను. ఈ లోపల నీ తల ముగ్గు బుట్ట అవుతుంది. చర్మం ముడతలు పడుతుంది."
"అమ్మా!" రేణుక దాదాపు అరిచింది.
"విన్నావా తల్లీ! అందుకే చెప్పాను. ఎవరిపాట్లు వాళ్ళు పడ్తారు. నువ్వు పెళ్ళిచేసుకోవే తల్లి అని. అప్పుడు విన్నావా? వీడిని ఎం.ఏ.లో చేర్పించావు. చదువు పూర్తి కావడానికి మరో ఆరు నెలలు వుంది. అది పూర్తి అయ్యాక ఉద్యోగం చేస్తాడనీ, నీ భుజాల మీది బరువును తన భుజాల మీదకు తీసుకుంటాడనీ అనుకున్నాను. నీకు పెళ్ళి చేసి నా బాధ్యత తీర్చుకుందామనుకున్నాను. నీ తమ్ముడు ఎంత స్వార్థపరుడో చూడు. పెళ్ళి చేసుకుంటాడట పెళ్ళి! ఆ మాట చెప్పడానికి వాడికి నోరు ఎలా వచ్చిందో?"
"అక్కయ్యా! కారు ఏమైంది? రిక్షాలో వచ్చేవేం?" మాట మారుస్తూ అన్నాడు రాము.
"చిన్న రిపైర్ వచ్చింది. వర్కుషాపుకు పంపించాను" అన్నది చిరునవ్వుతో రేణుక.
"నేను చెప్పింది నీ చెవికి కూడా ఎక్కడం లేదా?" తల్లి అడిగింది.
"రాము ఏం తప్పుచేశాడమ్మా నువ్వంత ఇదై పోవడానికి? పెళ్ళి చేసుకుంటానన్నాడు అంతేగా" అన్నది రేణుక.
రాము చిన్నగా అక్కడ నుంచి తప్పుకున్నాడు.
"నువ్వు అలా ఉండగా వాడెలా పెళ్ళి చేసుకుంటాడే?"
"ఏం ఎందుకు చేసుకోకూడదూ? ఈ రోజుల్లో అవన్నీ ఎవరు పట్టించుకుంటున్నారమ్మా!
మరీ నీచాదస్తం కాకపోతే? అయినా నాకు ఇంకేం పెళ్ళి?"
"అదేమిటి? ఈ రోజుల్లో నలభైదాటినవాళ్ళు కూడా చేసుకుంటుంటేనూ? ముప్పయ్ ఏళ్ళు నిండని..."
"రామూ కంటే నేను పదేళ్ళు పెద్ద. రామూకు ఇప్పుడు ఇరవై రెండేళ్ళు. అంటే నాకంటే చిన్న వయసు?"
"నీకు అంత వయసు ఎక్కడే? అయినా ముప్పయ్ రెండేళ్ళు దాటిన అక్కను వదిలేసి వాడు చేసుకోవడం ఏమిటి?"
"వాడు నాకు పెళ్ళి చేస్తాడా? ఏమిటమ్మా నీ చాదస్తం! చిన్న చెల్లీ, తమ్ముడూ చదువులు పూర్తయి ప్రయోజకులవడానికి మరో పదేళ్ళయినా పట్టవచ్చును"
"ఏమిటే నీ ధోరణి, అంతవరకూ పెళ్ళి చేసుకోవా ఏమిటి?"
"అంతవరకే ఏమిటి? అసలు పెళ్ళే చేసుకోను! ఇక నా పెళ్ళిమాట మర్చిపో! చిన్నవాళ్ళ దగ్గిర మాటిమాటికి నా పెళ్ళి గురించి వాదించి నన్ను అవమానించకు" అంటూ రేణుక లోపలకు వెళ్ళిపోయింది.
ఎదురుగా వున్న నిలువుటద్దంలో ఆమెకు తన ప్రతిబింబం కన్పించింది. రోజూ చూస్తూనే ఉన్నది. ఆరోజు పరిశీలించి చూసింది. ముఖంలో, కళ్ళలో ఎంతో అలసట కన్పించింది. చెంపల దగ్గర, పాపిట్లోనూ తెల్లని జుట్టు నల్ల జుట్టు మధ్య నుంచి తొంగి చూస్తున్నది.
అనుకోకుండా రేణుక నిట్టూర్చింది.
ఇవాళ తనకేమైంది? ఉదయంనుంచీ దిగులు దిగులుగా ఉన్నది. ఆ దిగులుకు ప్రత్యేక కారణం ఏమీ కన్పించడం లేదు. కేసులు కూడా చూడాలనిపించలేదు. సీరియస్ కేసులు చూసి మిగతావి తన జూనియర్ కు అప్పగించి ఇంటికి వచ్చింది. వస్తూనే ఇలాంటి సంభాషణ ఎదురౌతుందని తను భావించలేదు.
ఉదయం నుంచి గౌతమ్ గుర్తుకు వస్తున్నాడు. గౌతమ్ తో బీచ్ లో కూర్చుని ఎన్నో కలలు కన్నది. ఎన్నో ఊహించుకున్నది.