Previous Page Next Page 
పిపాసి పేజి 27


    "రాధీ ఏడవకూడదు తప్పు?" అంటూ చేతి రుమాలుతో కళ్ళు తుడిచాడు మధన్.


    "నేనేడుస్తున్నది నా గురించి కాదండీ. నావల్ల మీకు కలుగుతూన్న అవమానాల గురించి?"


    "నిజమే పాపం బావగారికి, ఎక్కడికి వెళ్ళినా. ఈ అవమానాలు, తప్పవనుకుంటా," అదోలా అంది రేణుక.


    సత్యం, మధన్ ఆమె వంక చూశారు, స్వంత అక్కయ్య గురించి ఆమె అంటూన్న మాటలు విని. తలవంచుకుని కళ్ళు తుడుచుకుంటూన్న రాధిక తలెత్తి రేణుకని చూసింది ఆశ్చర్యంగా. అది గమనించాడు మధన్. "రాధీ..... ఏనుగు పోతూ వుంటే కుక్కలు మొరుగుతుంటాయ్...... అయినా ఏనుగు లక్ష్యపెడుతుందా? దాని దారిన అది నడుస్తుంది." అంటూ ఏవేవో కబుర్లు చెప్పి ఓదార్చాడు. రాధిక కళ్ళనీళ్ళు ఆగినప్పటికీ గుండెలోని కల్లోలు ఆగలేదు. అందరి మనసులూ రకరకాల ఆలోచనలతో నిండిపోయాయి. తిరుగు ప్రయాణం మౌనంగా గడిచిపోయింది.     


    "చెల్లెమ్మా నన్ను క్షమించు. మహాబలిపురం ప్రోగ్రాం నేనే ఏర్పాటు చేశాను. అక్కడికి వెళ్ళడం వల్లనే, ఈ అవమానం పొందవలసొచ్చింది" అన్నాడు లోపలికి వస్తూ సత్యం.


    "అన్నయ్యా పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ, తనని ఎవరూ చూడలేదు అనుకోవడం పొరపాటు."    


    "చెల్లీ ఎవరు ఏమనుకున్నా, నీ కళ్ళ నుంచి కన్నీరు కారకూడదు. మధన్ కోసం, ఈ అన్నయ్య కోసం నువ్వెప్పుడూ నవ్వుతూ వుండాలి." అన్నాడు.     


    కాస్సేపు కూర్చుని "వెళ్ళొస్తా రా" అంటూ సెలవు తీసుకున్నాడు సత్యం.


    ఆకలిగా లేదంటూ రాధికా, రేణుక మధన్ ఎవరి మంచాల మీద వారు వాలిపోయారు.


    "పిచ్చిపిల్లలు, అలసిపోయినట్టున్నారు." అనుకుంటూ, రాజేశ్వరమ్మా, సరోజినీ, వియ్యంకులిద్దరూ, భోజనాలు చేశారు.   


    మంచంమీద వెల్లకిలా పడుకుని, ఆలోచిస్తూన్న రాధిక నడుం చుట్టూ చెయ్యి వేశాడు మధన్.


    ఉలిక్కిపడి అతని గుండెలమీద వాలిపోయింది రాధిక.


    "భయపడ్డావా" అంటూ ఆమెని దగ్గరకి తీసుకుని, తల నిమురుతూ. జోకొట్టాడు, మండుతూన్న తన గుండెలని, అతని హృదయానికి ఆన్చి, మంటలను చల్లార్చుకుంది రాధిక.      


    జో కొడుతూ, జో కొడుతూ నిద్రపోయిన మధన్ ని చూసి "పాపం ఎంత అలసిపోయారో...... ఇట్టే నిద్రపట్టింది" అనుకుంటూ, తన నడుం చుట్టూ వున్న అతని చేతుల్ని మెల్లగా తీసి పక్కకునెట్టి, రగ్గు కప్పింది. నిద్దరపోతూన్న అతని అందాన్ని తనివితీరా చూస్తూ వుంటే ఏదో తన్మయత్వంతో పులకితురాలయింది. బరువెక్కిన హృదయంతో వెళ్ళి మంచం మీద పడుకుంది. దేముడిలాంటి మధన్ భర్తగా దొరికాడన్న సంతోషం, నరకంలో కొట్టుకుపోతూన్న తన జీవితం, ఇంత సులభంగా స్వర్గ ధామం కావడం తలుచుకున్న కొద్దీ సంతోషం ఉబికిపోతూ వుంటే, కళ్ళంట నీరు ధారగా కారాయి.   


    "తప్పు. ఏడవకూడదు" అంటూ కన్నీళ్ళు తుడిచిన మధన్ మాటలకి అటువైపు తిరిగి పడుకున్న రాధిక ఉలిక్కిపడి ఇటువైపు తిరిగింది. అతని రెండు చేతులని, తన చేతుల్తో గట్టిగా పట్టుకుని "మీరు నిద్రపోలేదా" అంది ఆశ్చర్యంగా.


    "ఇంత అందాలరాశి పక్కనుంటే, నిద్దరెలా వస్తుంది ఇంతకీ తమరు మరచిపోయారేమో! ఈ రోజే మన మొదటిరాత్రి తన చేతులతో ఆమెని బంధించి దగ్గరకు తీసుకున్నాడు" అయితే దొంగ నిద్ర నటించారన్నమాట" అంటూ ఆ పరిషంగ సుఖంతో మరి మాటరాక మూగదానిలా అతని బాహువుల్లో ఒదిగి పోయింది రాధిక.


    "అమ్మో..... నేను మాత్రం వెళ్ళిపోవాలి" అంది రేణుక.


    "పోనీ..... నువ్వు మాతో రామ్మ కొన్నాళ్ళు మా దగ్గరుండి వద్దువుగాని" అంది తల్లి.


    "నేనా?" మధన్ ని ఒదిలి రాగలనా, అన్నట్టుంది ఆ మాట.


    "పోనీ వెళ్ళమ్మా." అంది అత్తగారు.


    రాధిక మధన్ కేసి చూసింది, ఏమంటారూ, అన్నట్టుగా.


    అతను చిరునవ్వుతో "వెళ్ళు" అన్నట్టు సైగ చేశాడు.


    "ఎలా వెళ్ళను?" అన్నట్టు బాధగా ముఖం పెట్టింది రాధిక.


    "ఏమ్మా.... వస్తావా" అంది తల్లి మళ్ళీ.


    "ఇప్పుడు రాలేనమ్మా. మరో సారొస్తాను" అంది నేలచూపులు చూస్తూ.


    కొన్ని సంవత్సరాలు ఒకరినొకరు చూసుకోకుండా వున్నా, ఏమిటో రక్తసంబంధంలోని మహత్యం, అమ్మా నాన్న వెళ్ళిపోతున్నారనగానే ఏదో తెలియని బాధ దుఃఖం ముంచుకొచ్చాయి రాధికకి. పోనీ కొన్నాళ్ళపాటు వెళ్ళి కన్నతల్లి నీడలో, ముద్దు ముచ్చట్లు తీర్చుకొద్దామా అంటే అంతకుమించిన సంబంధం వివాహబంధం మొన్నటిదాకా తానెవరో, అతనెవరో, మధన్ ని వదిలిపెట్టి ఒక్కక్షణం కూడా బతకలేనేమోననిపిస్తోంది. ముణ్ణాళ్ళనిద్దరికి కూడా సెలవు పెట్ట లేనన్నాడు మధన్. వాళ్ళ బాస్, వూళ్ళో లేకపోవడం వల్ల, బాధ్యతంతా తనపైనే వుండడం వల్లనూ, దుఃఖాన్ని దిగమింగుకుని కళ్ళు తుడుచుకుంది రాధిక.


    రేణుక బట్టలు సర్దుకుంటోంది. "చెల్లీ మళ్ళీ ఎప్పుడు పునద్దర్శనం" అంది రాధిక రేణుక పక్కగా కూర్చుని.


    "ఏమో భగవంతుడి కెరుక. పెళ్ళికే అతి కష్టంమీద పంపించారు మా ఆయన, నన్నొదిలి ఒక్కక్షణం వుండరు" అంది గొప్పగా.   


    ఊ..... కిలకిల నవ్వుతూ "మీ ఆయన్ని చూపించకపోతే చూపించకపోయావు. కనీసం ఫోటో అయినా తెచ్చావు కాదే? మా మరిదిగారెలా వుంటారో చూసుండేదాన్ని."


    "ఇదుగో ఫోటో వుంది. ఇదెప్పుడూ నా బ్యాగ్ లోనే వుంటుంది" అంటూ హ్యాండ్ బాగ్ తెరిచి, దాన్లోంచి ఫోటో తీసి చూపెట్టింది రేణుక.

 Previous Page Next Page