"అబ్బాయే పుడ్తాడూ అచ్చం నాన్నలాగే ఉంటాడూ!
అమ్మాయే పుడ్తుంది అచ్చం అమ్మలాగే ఉంటుంది."
ఆ పాటంటే తనకు వళ్ళు మంట! అసహ్యం అదీ ఒక పాటేనా? వెధవ సరసం! అంతకంటే సరసం ఆడుకోవడానికి హీరో హీరోయిన్లకు టాపిక్కే దొరకలేదా? వాళ్ల తప్పేముందిలే! నటనేగా? డైరెక్టర్ ఎలా నటించమంటే అలా నటించాలాయె! రాసేవాళ్ళ తప్పులేదు. ఆ సినిమా తీసేవాళ్ళ తప్పులేదు. లొట్టలేసుకుంటూ చూసేవాళ్ళదే తప్పంతా!
"అబ్బబ్బ! ఇక ఆపండి! అబ్బాయీ పుడ్తాడు. అమ్మాయీ పుడ్తుంది. ఇద్దరి మోజూ తీరుతుంది. మళ్ళీ వాళ్ళకు పిల్లలు. నా మోజూ తీరుతుంది...పిల్లల్ని కనడం కూడా ఒక ఘనకార్యమేనా? ప్రతిమనిషీ ఆహా! ప్రతి జీవీ చేసే పని అదేగా! దానిమీద ఇంత తర్జన భర్జన! ఆపండి మమ్మీ!" గబగబా అనేసింది శబరి.
రంగారావూ, రుక్మిణి తెల్లబోయి ఒకరి మొహంలోకి ఒకరు చూసుకున్నారు.
"అదేమిటే అలా అంటావూ! పెళ్లయ్యాక పిల్లల్ని కనవా ఏం?" అన్నది రుక్మిణి కూతురి ముఖంలోకి చూస్తూ.
"ఆ తర్వాత చేసేపని అదేగా? అంతకంటే ఏముంటుందీ! పిల్లల్ని కనడం! వాళ్ళని పెంచడం! మళ్లీ వాళ్ళకు పిల్లలు పుడతారు. బతికివుంటే వాళ్ళను పెంచడం... మళ్ళీ వాళ్ళకు పిల్లలు... వాళ్ళ పిల్లలకు పిల్లలు... పిల్లలు - పిల్లలూ- బోర్ బోర్ అందుకే నేను" శబరి గబుక్కున నాలుక కరుచుకుంది.
ఇంకా నయం తన నోరు జారేదే! ఇంకేమయినా ఉందా? మమ్మీకి అనుమానం వస్తే ఇవ్వాళ తను వేసిన పథకం నెరవేరదు. తను ఆవేశ పడకూడదు.
రుక్మిణి వెర్రిదానిలా కూతురి ముఖంలోకి చూస్తూ వుండిపోయింది. రంగారావు ఆలోచిస్తూ వుండిపోయాడు.
"సారీ మమ్మీ! తమాషాకు ఏదేదో అన్నాను!" అంటూ పక పక నవ్వింది శబరి.
రంగారావు శబరి నవ్వులో శృతి కలిపాడు. రుక్మిణికి నవ్వు రాలేదు... డాడీ పిచ్చివాడు! మమ్మీ తెలివైంది! డాడీని నమ్మించినంత తేలిగ్గా మమ్మీని నమ్మించలేకపోతూంది.
"మీ మమ్మీకి నువ్వు ఎప్పుడు పిల్లల్ని కంటావా అని వుంది."
"మీకు మాత్రం లేదా ఏం?"
"నీకు బోల్డెంత కాలక్షేపం! ఇక క్లబ్బులూ, పార్టీలూ బంద్!" రంగారావు భార్యను ఉడికిస్తూ అన్నాడు.
అదీ అసలు సంగతి! వీళ్ళ కాలక్షేపం కోసం తను పెళ్ళి చేసుకొని అర్జెంటుగా పిల్లల్ని కనెయ్యాలి. మళ్ళీ వీళ్ళ ఆశలూ కోర్కెలూ వాళ్ళ చుట్టూ పెంచుకుంటారు. హారిబుల్!
శబరి భోజనం చేసి పడుకుంది. ఎంత వద్దనుకున్నా ఏదో భయం భయంగా వుంది. పారిపోయే లోపల పోలీసులు పట్టుకుంటే? తను మైనరు! మేజరు కావడానికి ఇంకా రెండు నెలలు వుంది. జ్యోతి వాళ్ళ నాన్న కూడా పోలీసు కంప్లయింటు ఇచ్చే వుంటాడు. అయినా పట్టుకోగలిగారా ఏం? తను వెళ్ళిపోయాక అమ్మా నాన్న ఏం చేస్తారు? అమ్మ ఏడుస్తుంది? నాన్న కూడా ఏడుస్తాడు! తనకోసం వెదుకుతారు. తను దొరకదు.
ఆ తర్వాత? అమ్మకు క్లబ్బులు ఉన్నాయి. నాన్నకు బిజినెస్ ఉండనే వుంది. ఎవర్నయినా పెంచుకుంటారేమో? శబరికి దిగులుగా అన్పించింది. తను వెళ్ళకుండా ఉంటే? నో! నో! తను తప్పక వెళ్ళిపోతుంది. హాయిగా రోజూ యల్.యస్.డి. వేసుకోవచ్చు.
శబరిలో సంఘర్షణ ప్రారంభం అయింది. ఓ నిర్ణయానికి వచ్చిన శబరి చివ్వున లేచి కూర్చుంది. లెటర్ పాడ్ తీసి వుత్తరం రాసింది. ఉత్తరం ముగించి, దిండుకింద పెట్టుకొని నిద్రపోయింది. దాదాపు సాయంత్రం నాలుగు గంటలకు మెలకువ వచ్చింది. హడావిడిగా మంచం దిగింది. తండ్రి ఇన్విటేషన్స్ మీద అడ్రసులు రాస్తున్నాడు. తల్లి గదిలోకి వెళ్ళింది. ఆమె ముస్తాబు అవుతూ వుంది.
"ఎక్కడికి మమ్మీ?"
"ఇన్విటేషన్స్ ఇవ్వాలి!"
"నేనూ వస్తాను!"
రుక్మిణి గిర్రున తిరిగి చూసింది.
"నువ్వూ వస్తావా?"
"అవును మమ్మీ బోరు కొడ్తూంది!"
"నువ్వు రాకూడదు బేరీ! నీ పెళ్ళి పిలుపుకు నువ్వే వస్తే ఏం బాగుంటుంది చెప్పు?"
"బలేగా వుంటుంది! అదే నావల్టీ!"
"పిచ్చిగా వాగకు! తోచకపోతే ఆదిత్యకు ఫోన్ చెయ్యి!"
"ఇవ్వాళ ఏదో పార్టీ వుందట! రానన్నాడు!" అబద్ధం ఆడేసింది శబరి. ఆదిత్య ఆలస్యంగా వస్తానన్నాడు. రెండో ఆట సినిమాకు తీసుకెళ్తానన్నాడు. తను సరేనన్నది.
"నువ్వొస్తే బాగుండదమ్మా! అందరూ నవ్వుతారు?"
ఇందులో నవ్వాల్సిందెముమ్దొ౧ మనం ఏది చేసినా మనకోసం కాదు ఇతర్ల కోసమే! అందుకే ఈ సమాజం అంటే తనకు చిరాకు. నవ్వుతారట! ఎందుకు నవ్వాలి? ఇందులో కాని పని ఏముంది? నాగరికత నేర్పిన హిపోక్రసీ!
"ఒకటి చేస్తాను మమ్మీ!"
"ఏమిటి!"
"నన్ను రేఖా వాళ్ళింట్లో దించెయ్యండి. నేనూ రేఖా కబుర్లు చెప్పుకుంటూ వుంటాం! మీ పని అయిపోయాక నన్ను పిక్ అప్ చేసుకోండి."
రుక్మిణి ఓ క్షణం ఆలోచించి "అయితే! త్వరగా తయారవు!"
"ఏం చీర కట్టుకోమంటావు మమ్మీ?"
"ఎర్ర బెనారస్ చీర కట్టుకొని ఎర్రరాళ్ళ నగలు పెట్టుకో?" అన్నది మురిపెంగా కూతుర్ని చూస్తూ.
"ఓ మార్వలెస్! నేనూ అదే అనుకున్నాను. మమ్మీ ఎంత మంచిదో?" అంటూ రుక్మిణి మెడచుట్టూ చేతులువేసి వేలాడింది.
"అరెరే! బేరీ! వదులు! ముడి ఊడిపోతుంది!"
"ఓకే!" అంటూ నెమలిలా వయ్యారంగా వెళుతున్న కూతుర్ని మురిపెంగా చూసుకుంది.
శబరి ముస్తాబైంది. చీరల మడతల్లో వెయ్యి రూపాయలూ జాకెట్ లో దాచుకుంది. కారు దగ్గిరకు వచ్చి నిల్చుంది. ఇంటికేసి ఎగాదిగా చూసింది. ఈ ఇంటికి తను శాశ్వతంగా దూరం కాబోతూంది. ఇక్కడే తను జన్మించింది. నడవడం నేర్చుకుంది. మాటలు నేర్చుకుంది. గుజ్జనగూళ్ళు ఆడింది. శబరికి ఆ ఇల్లు తనకేసి దిగులుగా చూస్తున్నట్టు అనిపించింది. కళ్ళు చెమ్మగిల్లాయి. ఎవరూ చూడకుండా కళ్ళు తుడుచుకుంది.
శబరిని చూస్తూనే 'హాయ్ శబరీ! ఎలా వున్నావ్?" అంటూ రేఖ కౌగలించుకుంది.
ఎనిమిది గంటలకల్లా వస్తామని చెప్పి రంగారావూ, రుక్మిణి వెళ్ళిపోయారు. రేఖ యెన్నెన్నో చెబుతూ వుంది. శబరి వినడంలేదు. పరధ్యానంగా వుంది.
"ఏమిటోయ్ అలా వున్నావ్?"
"తలనెప్పిగా వుంది."
"టాబ్ లెట్ వేసుకుంటావా?"
"వద్దు! ఇంటికి వెళతాను."
"అదేమిటీ? మీ డాడీవాళ్ళు వచ్చేదాకా ఉండవా!" విస్మయంగా అడిగింది రేఖ.
"ఉండను. వెళ్ళిపోతాను."
"నువ్వేమీ మారలేదు శబరీ? ఒక్కసారి బుర్రలోకి ఏదైనా ఆలోచనవస్తే చేసి తీరాల్సిందే! అయినా ఎందుకొచ్చినట్టూ? వచ్చీరాకముందే వెళతానంటావ్!"
"లేదు వెళ్ళాలి. మర్చేపోయాను. ఆదిత్య వస్తానన్నాడు.
"అలా చెప్పు! అమ్మాయిగారు ఇప్పటినుంచే-" అంటూ కొంటెగా చూసింది రేఖ.
"పోదూ నువ్వు మరీనూ!"
"కారు నాన్న తీసుకుపోయారు. ఇప్పుడెలా వెడతావు! కొంచెంసేపు ఉండు!"
"రాముణ్ణి పంపించి ఆటో తెప్పించు!"
ఆటో వచ్చింది. శబరి వెళ్ళిపోయింది. రేఖకు టాటా చెబుతూ వుంటే శబరి కళ్ళలో నీరు తిరిగింది.