అదీ ఒకందుకు మంచిదే.
12
ఆరాత్రి భోజనాల దగ్గిర ఎవరూ మాట్లాడలేదు. సావిత్రి మౌనంగా భోజనం చేస్తూనే ఓరగా రమణమూర్తిని చూస్తున్నది. ఆమె చూపులు కసిని కక్కుతున్నాయ్. ఆ విషయం అనసూయ గమనిస్తూనే వున్నది. రమణమూర్తి మాత్రం తల వంచుకొని గబగబా భోజనం ముగించి తన రూమ్ లో కెళ్ళి పోయాడు.
"అనూ!"
"ఊఁ"
"మరో రెండురోజులు ఇక్కడ వుంటాను. నీకు అభ్యంతరమా?"
అనసూయ ఓ క్షణం సావిత్రి ముఖంలోకి చూసింది.
"నాకే అభ్యంతరం లేదు. ఎప్పటికీ వున్నా నాకు అభ్యంతరం లేదు."
ఆమె మాటలోని అంతరార్ధం సావిత్రికి బోధపడలేదు.
"థాంక్యూ! రెండు రోజుల్లో వెళ్ళిపోతాను."
అనసూయ సమాధానం ఇవ్వలేదు.
"గుడ్ నైట్" అంటూ సావిత్రి లేచింది.
"గుడ్ నైట్! హాపీ స్వీట్ డ్రీమ్సు" అన్నదనసూయ.
"మీ ఫ్రెండు ఇంకెంతకాలం వుంటుంది? సీటు వచ్చిందటగా?"
అనసూయ రమణమూర్తి కళ్ళలోకి అదోలా చూసింది.
ఆ చూపుల్లోని తృణీకారాన్ని అతను గమనించాడు.
"ఆవిణ్ణి రేపే వెళ్ళిపొమ్మని చెప్పు"
"వెళ్ళదు. నేనే వుండమన్నాను. ఎప్పటికీ ఇక్కడే ఉండమంటున్నాను."
రమణమూర్తి వెర్రిచూపులు చూశాడు.
"ఆమె ఇక్కడుంటే మీకొచ్చిన బాధేమిటో?" వ్యంగ్యముగా అన్నది.
"మనిద్దరిమధ్యా మూడోమనిషి వుండటం నాకిష్టంలేదు. రేపే వెళ్ళిపొమ్మని చెప్పు."
"మీరే చెప్పండి"
"నేనా?"
"మీరే"
"నేనెలా చెప్పను?"
"ఏం ఎందుకు చెప్పకూడదు?"
"ఆమె నీ స్నేహితురాలు"
"మీకూ స్నేహితురాలేగా?"
"నాకా? ఎవరు చెప్పారు?"
"నేను పిచ్చిదాన్ని కాదు. నాకు కళ్ళున్నాయ్. అర్ధం చేసుకోగల బుర్రకూడా వుంది."
"ఏమిటి నువ్వు అర్ధం చేసుకుంది?"
"ఏ పరిచయం లేకుండానే అర్ధరాత్రి ఇద్దరూ వాదించుకున్నారా?"
"నీకెలా చెప్పాలో నాకు బోధపడటం లేదు. మీ స్నేహితురాలికి మనో చాంచల్యం వున్నదనుకుంటాను. ఏదేదో ఊహించుకుంటుంది."
"ఆమెను గురించి అంతబాగా తెలుసునన్నమాట"
"ఛ నీతో వాదించడం నాదే పొరపాటు" కోపంగా అని గోడవైపుకు తిరిగి పడుకున్నాడు.
సావిత్రి బయటికి వెళితే స్వేచ్ఛగా ప్రేమాయణం సాగింపవచ్చును. అందుకే త్వరగా పంపించమంటున్నాడు.
కాని సావిత్రి వెళ్ళడానికి తొందర పడటంలేదు?
ఏమిటో అంతా అయోమయంగా ఉన్నది.
అనసూయ కళ్ళు మూసుకుంది.
13
తెల్లవారింది.
అనసూయకు వళ్ళంతా విరగ్గొట్టినట్టుంది.
కళ్ళు మండుతున్నయ్.
ముభావంగా ఉండిపోయింది.
రమణమూర్తి కూడా గంభీరంగా ఉన్నాడు. అనసూయను పలకరించడానికి ప్రయత్నించలేదు.
ఆఫీసుకు వెళ్ళేంతవరకూ "అనూ! అనూ! టవల్ ఎక్కడ? సబ్బెక్కడ? నా షర్టుతియ్!" అంటూ పిలిచే భర్త అంత ముభావంగా ఉండటం చూస్తుంటే అనసూయకు దుఃఖం పొర్లుకొస్తున్నది. అయిపోయింది. అంతా అయిపోయింది. అమృత భాండంలో విషపుచుక్క పడింది. జీవితమంతా చేదును రుచి చూస్తూ బ్రతకాల్సిందే.
అనసూయ యాంత్రికంగా పనిచేస్తోంది.
మనసుమాత్రం ఆలోచిస్తూనే ఉన్నది. ఆ ఆలోచనలకు ఒక తీరూ తెన్నూ లేదు. క్యాన్సర్ వ్యాధిలా ఎటుపడితే అటే అల్లుకుపోతున్నాయ్.
ఆ రోజంతా సావిత్రితోకూడా సరిగా మాట్లాడలేదు.
రెండో వీధిలో ఉన్న పరిచయస్తుల ఇంటికి పేరంటానికి పిల్చారు.
అనసూయ తయారౌతోంది.
"ఎక్కడి కెళుతున్నావ్?" సావిత్రి అడిగింది.
"పేరంటానికి నువ్వుకూడా రాకూడదూ?"
"వాళ్ళు నాకేం తెలుసు? అయినా నాకు పేరంటాలకు వెళ్ళడము ఇష్టం ఉండదు."
అవును! ఎలా ఇష్టం ఉంటుంది. రమణ వచ్చే టైం అయింది. ఇద్దరూ హాయిగా మాట్లాడుకోవచ్చును.
"త్వరగా వచ్చేయ్!" అన్నది సావిత్రి.
అనసూయ నవ్వుతూ "ఏం భయంగా ఉందా? మా వారు వచ్చే టైం అయిందిలే. భయపడకు" అంటూ మరో మాటకు అవకాశం ఇవ్వకుండానే అనసూయ బయటికి వెళ్ళిపోయింది.
"అనూ! అనూ!" అంటూ లోపలకు వచ్చాడు రమణమూర్తి.
ఎదురుగా నిల్చుని ఉన్న సావిత్రిని చూసి నిల్చుండిపోయాడు.
"అనూ లేదా?"