మిసెస్ కైలాసంగారు ఆ నియోజక వర్గంలో నిల్చున్నదనగానే విజయం తధ్యం అన్నారు ఆ నియోజక వర్గంలోని ప్రజలు.
అంతవరకూ ఆమె ఎక్కడ కూర్చుందో ఆ నియోజక వర్గ ప్రజలకే కాదు, ఆమెగారికి టికెట్టు ఇచ్చిన ఆ పార్టీకే తెలియదు.
అంతవరకు మిసెస్ కైలాసం జి. ఓ. (గజిటెడ్ ఆఫీసరు) కుర్చీలో (రివాల్వింగ్ చైర్ లో) కూర్చుంది. జి.ఓ. నుంచి ఎన్. జి.ఓ.గా మారిన మిసెస్ కైలాసం, రివాల్వింగ్ చైర్ దిగి, సాదా చెక్క కుర్చీలో చస్తే కూర్చోనన్నది. తనంటి వ్యక్తిని చెక్క కుర్చీలో కూర్చోమని ఆర్డరు ఇచ్చిన ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోసింది. పాలకులకు బుద్ది లేదన్నది. అసలు ఈ దేశం బాగుపదదని గంగవెర్రులెత్తి కేకలు వేసింది. చివరకు రాజీనామా ఇచ్చి, తనలాంటి మేధావి సర్వీసెస్ ను పొందడం చేతగాని ప్రభుత్వాన్ని చూసి జాలిపడింది.
తనలాంటి వాళ్ళు పాలకవర్గంలో వుంటేగాని ఈ దేశం బాగుపడదనే విశ్వాసం ఆమెకు కలిగింది. భర్త పోతూ పోతూ వదిలేసిన మూడు ఎకరాల మాగాణి పొలం చూసుకోవటానికి, ఏనాడో వదిలేసిన గ్రామం చేరింది. అనతికాలంలోనే మంచి పలుకుబడి సంపాదించుకుంది. ఆ నియోజక వర్గంలో టికెట్ సంపాదించుకుంది.
ఇంతకీ ఆమెగారి విజయం గురించి అభిజ్ఞవర్గాల వారంతా ఊహాగానం చేయడం ఆమెగారి పేరు బలమేకాక, ఆమెకు టికెట్ ఇచ్చిన సీదాపార్టీ సాదా రాజకీయాలే చాలావరకు కారణం కావచ్చు! కాని ఆమెగారికి మాత్రం తన గొప్పతనమే తనకు విజయాన్ని సాధించి పెడుతుందనే పూర్తి నమ్మకం వుంది. ఆ నియోజకవర్గ ప్రజలు అంత మూర్ఖులు కాదనీ, ఎవరికి ఓటివ్వాలో వాళ్ళకు బాగా తెలుసుననీ, తనలో తనే ఎన్నోసార్లు అనుకుంది.
అసలా పార్టీ మధ్యతరగతి ప్రజల్లో పుట్టినా కార్మిక, ధనిక వర్గాల అభ్యుదయమే తమ ఆశయమని బహిరంగంగా ప్రకటించుకున్నది. ఆ పార్టీ టికెట్ దొరగ్గానే, ఆ అభ్యర్ధుల విజయం తధ్యమనేందుకు మరొక కిటుకు కూడా వుంది. పార్టీవాళ్ళు అతివాదుల్లో అతివాదులుగానూ, మితవాదుల్లో మితవాదులుగానూ వుంటూ వచ్చారు. కాని ఇప్పుడు దేశ పరిస్థితులదృష్ట్యా కానీయండి ఎలక్షన్స్ దృష్ట్యా కానీయండి, ఏ మయితేనేంగాని, అతివాదుల్లో మితవాదులుగా, మితవాదుల్లో అతివాదులుగా మారిపోయారు. తామూ తమ పార్టీ సర్వనాశనమైనా వామపక్షాలతో చేతులు కలపబోమని, పార్టీ నాయకులు పదే పదే ఉద్ఘాటించి మితవాదుల మనస్సులను చూరగొన్నారు.
అందుకే తమ పార్టీ ఎన్నికల యుద్దంలో దూకటంతోనే విజయలక్ష్మి పూలమాలతో ఎదురు వస్తుందనీ, కనీసం రెండు మూడు రాష్ట్రాల్లోనైనా మంత్రివర్గ నిర్మాణం జరుగుతుందనీ కళలు కన్నారు.
మిసెస్ కైలాసంగారు, మిసెస్ వైకుంఠం, మిసెస్ పరాంకుశం, శ్రీమతి శిఖండి, శ్రీమతి ముకుందం మొదలైన మహిళామణులతో, ఎన్నికల ప్రచారం ప్రారంభించగానే ఎదుటి పార్టీవాళ్ళ గొంతులు పక్షవాతం వచ్చినట్టు బిగుసుకు పోయాయి.
ఆమెగారికి రామలింగం, జంబులింగం ఇద్దరూ రెండు భుజాల్లా పనిచేశారు. రామలింగంగారి మంచితనము, జంబులింగంగారి కరుకుతనమూ ఆ నియోజకవర్గంలోని ఓటరు మహాశయులను తమవైపుకు ఆకర్షించుకో గలిగినై.
కూలీపేటల్లో బీదల పార్టీగానూ రైతు వీధుల్లో రైతు పార్టీగానూ, పెద్ద బజార్లో మధ్యతరగతి ప్రజల పార్టీగానూ చెలామణి అవుతున్న తమ పార్టీకి విజయం తధ్యమని, రామలింగం, జంబులింగం మిసెస్ కైలాసానికి నమ్మకం కలిగించారు. ఆ దెబ్బతో ఆమె తనకున్న ఆ మూడు ఎకరాల మాగాణి అమ్మేసింది.
తను తప్పక ఎం. ఎల్. ఏ. అవుతుంది. ఆ తర్వాత చిన్న మంత్రిణి కాలేకపోతుందా? అప్పుడు ఇలాంటి ముష్టి మూడెకరాలు ఒక లెక్కా! అలాంటి ఎకరాలు ఎన్నయినా సంపాదించుకోవచ్చు! దస్తావేజుమీద సంతకం పెడుతూ అనుకుంది.
ప్రతి ఓటరు అవసరాల్నీ, ఉద్దేశాల్నీ పసిగట్టి వాగ్దానాలు చేస్తూ ప్రచారం సాగించారు. మిసెస్ కైలాసం తాలూకు వారు.
బీదలు సాగుచేస్తున్న భూములకు పట్టాలిప్పిస్తామనీ ఎన్. జి.ఓ.లు వుంటున్న ఇళ్ళు హక్కు భుక్తం చేస్తామనీ ప్రచారం సాగించారు. మిసెస్ కైలాసంగారి గొప్పతనాన్ని గురించి చెబుతూ -ఆమె దేశంలో ప్రబలిపోతున్న అవినీతినీ, అన్యాయాన్నీ చూసి సహించలేక గెజిటెడ్ ఆఫీసరు ఉద్యోగానికి రాజీనామాచేసి రాజకీయాల్లోకి ఉరికిందనీ ఆమెలాంటి వ్యక్తిని ఎన్నుకోవడం ప్రజలు తమను తామే గౌరవించుకున్నట్టనీ శ్రీమతి శిఖండి గంట వాయించినట్టు వేదికలమీద ఎక్కి అనర్గళంగా ఉపన్యాసాలు ఇస్తోంది.
ఒక బహిరంగసభలో మిసెస్ కైలాసం ఏమంటున్నారో వినండి_"మహాజ్జనులారా! నన్ను గెలిపించి మిమ్మల్ని మీరే గౌరవించుకోండి! (జనంలో నవ్వులు) నవ్వకండి నేను చెప్పేదేమంటే మనదేశంలో...మన ఈ భారతదేశంలో...రెండే రెండు పార్టీలున్నాయి. మిగతావన్నీ చిల్లర పార్టీలు. దేశంలో ఎక్కడ చూసినా లంచగొండితనం పెరిగిపోయింది. కాగడావేసి వెతికినా నీతీ నిజాయితీ కన్పించడం లేదు. కార్మిక కర్షకులకు నిజమైన ప్రాతినిధ్యం వహించి, దేశంలో సోషలిజాన్ని స్థాపించగలిగేది నిజంగా మన పార్టీయే. కూలివాళ్ళ దగ్గర నుంచి జమీందార్ల దాకా మన పార్టీలో వున్నారు. అంటే కూలీలకు జమీందార్లమీద నమ్మకం రుజువు అయిందన్న మాట. అంటే మన పార్టీ కూలీలకూ జమీందార్లకూ మధ్య వైషమ్యం కాక, సామరస్యం కుదిరించగలిగింది." ఓ క్షణం ఆగింది.