వేదికమీద అధ్యక్షాసనంలో కూర్చునివున్న మిసెస్ వైకుంఠం చప్పట్లు కొట్టింది. సభలో కరతాళ ధ్వనులు మిన్నుముట్టాయ్. మిసెస్ కైలాసం బొడ్లో దోపుకున్న కర్చీఫుతీసి ముఖం తుడుచుకొని ఓసారి గర్వంగా సభను కలియచూసింది. ఆమెకు ఒత్తుల్లేని కొన్ని శబ్దాలకు ఒత్తులు పెట్టి పలకటం అలవాటు.
"ఈ మధ్య మన పార్టీకి ఎవరో మహారాజులూ, జమీందార్లూ, విదేశీయులూ లక్షలిచ్చారని చిల్లర పార్టీల వాళ్ళు పుకార్లు లేవదీశారు. అవన్నీ ఒట్టి పుకార్లే. పోనియ్! ఒక్కవేళ ఇచ్చారే అనుకుందాం?"
సభలో కలకలం 'వినండి! వినండి!' అనే కేకలు మిసెస్ కైలాసం ఒకసారి దగ్గి, ఎదురుగా వున్న గ్లాసులోని నీరు సిప్ చేసి సున్నితంగా పెదవులు కర్చీఫుతో అద్దుకొని మళ్లీ ప్రారంభించింది.
"ఇలా ఇచ్చారే అనుకుందాం. దీనినిబట్టి, మన పార్టీకి విదేశాల్లోనూ, జమీందార్లలోనూ వున్న పలుకుబడి స్పష్టంగా తెలుస్తుంది. మన పార్టీ అధికారంలోకి రాగానే తల వొక్కింటికి పదెకరాల పంచి పెడుతుంది."
"మరి రెండు తలకాయలుంటే?" ఎవరో లేచి ప్రశ్నించారు.
"రెండు పదులు ఇరవై." తడుముకోకుండా సభాధ్యక్షురాలు మిసెస్ వైకుంఠం కంఠం దేవుడి గుడిలోని గంటలా ఖంగ్ న మ్రోగింది. మళ్ళీ సభలో కరతాళ ధ్వనులు!
"ప్రజాసేవ చెయ్యాలనే భావం నన్ను నిద్రపోనిచ్చింది కాదు. అందుకే గెజిటెడ్ ఉద్యోగం వదులుకొని, మీ మధ్యకు వచ్చి నిలబడ్డాను. మీరు కూడా కేవలం మాబ్, అదే మందలా ప్రవర్తించకుండా విచక్షణా జ్ఞానంతో ఓట్లువేసి నన్ను గెలిపించి, నాకు మీ అందరి సేవ చేసే అదృష్టాన్ని కలిగిస్తారని ఆశిస్తున్నాను." అంటూ మిసెస్ కైలాసం సభకు ఓ పెద్ద నమస్కారం పెట్టి కూర్చుంది.
ఈ విధంగా సభల్లోనూ, ఇళ్లకు వెళ్ళీ తమపార్టీ అధికారంలోకి రాగానే, తమ పార్టీ చెట్టునీడ క్రింద వున్న వాళ్ళందరికీ తలో మేడా కట్టించి ఇస్తామన్నారు. అందాకా తాము నిర్మించిన గాలిమేడల్లోనే వుండిపొమ్మన్నారు.
తాటస్థ్యంలో పాక్షికత్వాన్ని, పక్షపాతంలో తాటస్థ్యాన్ని, ఏకత్వంలో బిన్నత్త్వాన్ని ప్రజాస్వామ్యంలో వియంత్రుత్వాన్నీ, పెట్టుబడిదారీ వర్గ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యాన్ని అయోమయంలో స్పష్టతనూ చూప గలిగింది తమ పార్టీ ఒక్కటే నన్నారు. అన్నింటికంటే వ్యక్తి స్వాతంత్ర్యానికి తమ పార్టీ ప్రాధాన్యం ఇస్తుందట. తమ పార్టీలో ప్రతి సభ్యుడికి, నాయకుడికీ తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడే స్వాతంత్య్రం వుంటుందట.
ఎన్నికల తేదీ దగ్గిర పడుతున్నకొద్దీ ప్రచారం ముమ్మరంగా సాగిపోతూంది. శ్రీమతి శిఖండమ్మ వెళ్ళిన చోటల్లా మరో పార్టీ వాళ్ళకు మంచినీళ్ళు కూడా పుట్టవనే నమ్మకం వుంది ఆ పార్టీ వాళ్ళకు. ఆఖరి క్షణాల్లో రామలింగంగారు అమాంతం ఓటర్లను కావలించుకొని ఆవురుమన్నారు. తమ పార్టీని, అభ్యర్దినీ కాకపోయినా తనను చూసైనా ఓటు వెయ్యమని వేడుకున్నాడు. ప్రేమ లేకపోయినా జాలివల్లనైనా వెయ్యమన్నాడు. వేస్తానని వాగ్దానం చేసిందాకా పట్టుకున్న కాళ్ళు విడిస్తే వొట్టు.
ఆఖరి క్షణంలో భుజంగంగారికి ఆవేశం పెరిగి పోయింది. భూమ్మీద కాళ్ళానలేదు. ఎదుటి పార్టీవాళ్ళను నోటికొచ్చిన బండబూతులూ తిట్టారు.
శ్రీమతి శిఖండమ్మ నాయకత్వాన పాతికమంది మహిళలదాకా ఇంటింటికీ వెళ్ళి ఆడంగులకు పళ్ళూ పువ్వులూ, పసుపూ కుంకుమా ఇచ్చి ఓట్లు అడిగారు. ఆడవాళ్ళ ఓట్లన్నీ తమకే పడిపోతాయనే నమ్మకం కలిగింది. మిసెస్ కైలాసం "ఏం చేసినా ఆడవాళ్ళే చెయ్యాలి. వాళ్ళకున్న తెగింపు మొగవాళ్ళలో ఎక్కడుంది." అంటూ మురిసిపోయింది.
మహిళామణుల ప్రచార ధాటికి వోటర్ల తలలు ఊగిసలాడిపోయినై బాలెట్ పెట్టెలు నిండిపోయినై, మిసెస్ కైలాసానికి విజయం తధ్యం అన్నారు. కనీసం పదివేలన్నా మెజారిటీ వుంటుందన్నారు లాబీ వర్గాలవారు.
ఆ రాత్రి అలసిపోయి మంచంమీద వాలిపోయిన మిసెస్ కైలాసానికి మనస్సు మాత్రం ఎంతో తేలిగ్గా ఆకాశంలో ఎగురుతున్నట్టనిపించింది. అలసటతో మూతలుపడ్డ కళ్ళల్లో అసెంబ్లీహాలు కనిపించసాగింది.
తన గొప్పతనాన్ని గుడ్డి ప్రభుత్వం గుర్తించలేక పోయింది. కాని ప్రజలు గుడ్డివాళ్ళు కారు! అందుకే వాళ్ళు గుర్తించారు. ఒకసారి తను బడ్జెట్ సెషన్ కు డైరెక్టర్ తో వెళ్ళి గాలరీలో కూర్చుంది! కిందకు చూస్తూ. ఒక బెంచీనుంచి మరో బెంచీకి వెళుతూ, వాళ్ళతో వీళ్ళతో కబుర్లు చెబుతూ తిరిగే ఆడ ఎం.ఎల్.ఏ.లు పైన కూర్చున్న తనకు మానస సరోవరంలో విహరించే హంసల్లా కన్పించారు. కొందరు బాతుల్లా నడుస్తున్నట్టనిపించింది. ఆనాడే తనకు అనిపించింది తను కూర్చోవలసింది గ్యాలరీలో కాదనీ, కింద హాలులోననీ. తన గొప్పతనాన్ని తను ఏనాడో గ్రహించింది. కాని ప్రజలే ఆలస్యంగా గుర్తించారు.
తన డైరెక్టరు తనను వింత మృగంలా చూసేవాడు. ఆ జానకి తలపొగరు అంతా ఇంతా కాదు. రేపు తను ఎం. ఎల్.ఏ. అవుతుంది. మినిష్టర్ కూడా అవుతుంది. సి.యం.ను అడిగి తను ప్రత్యేకంగా ఆ శాఖనే తనకు కేటాయించామని అడిగితే పోలా? అప్పుడు చూపిస్తుంది తన తడాఖా. లేకపోతే తనకు రివర్షన్ ఇప్పించి ఎన్.జి.ఓ.ని చేస్తాడు? టెస్టు పాసు కాలేదట తను. వెధవ టెస్టులు. అసలు తనలాంటి వాళ్ళకు ఎగ్జెంప్షన్ ఇప్పించాలి ఆ జానక్కి ప్రమోషన్ ఇచ్చి తన సీట్లో కూర్చో పెడతాడా?