"అనిబిసెంట్ పిలిస్తే పలుకుతుంది." ఉత్సాహంగా అన్నాడు రఘుపతి.
"అలాగే పిలవండి. కాని ఈసారి గ్లాసును నేనూ, కృష్ణా కదిలిస్తాం" అన్నాను.
"మీరు కదిలించడం ఏమిటి? మీరు పట్టుకోవాలి అంతే! ఆ స్పిరిటే కదిలిస్తుంది. మీ ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంది. మీకేమైనా సమస్యలుంటే తెలుసుకోవచ్చును." ఉత్సాహంగా అన్నాడు రఘుపతి.
"సారీ! ఐమీన్....."
"పర్వాలేదు లెండి, ఇలా పట్టుకోండి. కళ్ళు మూసుకోండి. కమాన్ హోలీ స్పిరిట్ అని నాలుగైదుసార్లు అనండి. ఆ తర్వాత గ్లాసు బోర్లించండి." డైరెక్షన్స్ ఇచ్చాడు డాక్టర్.
చెయ్యి మాత్రం పెట్టి పలక్కుండా ఉండిపోయాను.
కృష్ణ వాళ్ళు చెప్పినట్టే చేశాడు.
"నీ పేరేమిటి?"
గ్లాసు కదల్లేదు.
"ప్లీజ్ చెప్పు! నువ్వెవరు?"
ఉఁ హూ - గ్లాసు కదల్లేదు.
పది నిముషాలు కృష్ణ మాట్లాడుతూనే ఉన్నాడు. అయినా, గ్లాసు కదల్లేదు.
"కదలడం లేదు." తలెత్తి డాక్టర్ ముఖంలోకి చూస్తూ అన్నాడు కృష్ణ.
"మీ ఫ్రెండుకు నమ్మకం లేదని నాకు తెలుసు, మీకూ లేదా?"
"లేదండీ! అయితే ఓపెన్ మైండుతో వచ్చాను."
"ఇద్దరూ నమ్మకం లేనివాళ్ళే అయితే స్పిరిట్ రాదు" అన్నాడు రఘుపతి.
"స్పిరిట్ రాదనకు, గ్లాసు కదలదను" అన్నాను నేను.
"రెండూ ఒకటే!" అన్నాడు డాక్టర్.
"కాదు. ఒక్కళ్ళకైనా నమ్మకం ఉండాలంటారు. అంటే అర్థం, ఆ ఒక్కడూ గ్లాసు తోస్తాడనేగా?"
డాక్టరూ, రఘుపతీ బోలెడంత హర్టయి బాధపడిపోయారు.
"అంటే, మీ ఉద్దేశ్యం? మేము కావాలని గ్లాసు కదిలిస్తున్నామనేగా?"
"అలా అని నేను అనడం లేదు డాక్టరుగారూ? నమ్మకం ఉన్నవాడు తనకు తెలియకుండా గ్లాసును తోస్తాడు. ఇద్దరూ అలాంటి వాళ్లే అయితే ఇక చెప్పనే అక్కర్లేదు. మరి నిజంగా స్పిరిట్ ఉంటే గ్లాసు ఎవరు పట్టుకొంటే దానికేం? అందులో కొన్ని ఈవిల్ స్పిరిట్సూ, కొన్ని కొంటెవీ ఉంటాయన్నారుగా? అలాంటివైనా వచ్చి నమ్మకం లేనివాళ్ళకు నమ్మకం కలిగించాలిగా?"
"అవునండీ! నాకు అలాగే అన్పిస్తుంది. మరో విషయం! నమ్మకం ఉన్నవాళ్ళ పట్టుకొన్నా, వాళ్లు చదువుకోని వాళ్ళయితే, అంటే, అక్షరాలు తెలియని వాళ్ళయితే కూడ గ్లాసు కదలదు. దాన్ని బట్టి నమ్మేవాళ్లు వాళ్లకు తెలియకుండానే గ్లాసును తోస్తున్నారన్నమాట. అదీ చదువుకొన్న వాళ్ళయితేనే! చదువుకోని వాళ్ళు పట్టుకుంటే కూడా - వాళ్ళు నమ్మకం గలవాళ్ళే అయితే గ్లాసు కదులుతుంది. కాని, అక్షరాలు కలిపి చదివితే ఏ అర్థం రాదు" అన్నాడు కృష్ణ నన్ను సమర్థిస్తూ.
"మీకీ విషయం ఎలా తెలుసు?"
"మా మేనల్లుడికి నమ్మకం ఉంది. పిల్లలు ఆడుతుంటారు. నేను కుతూహలం కొద్దీ ప్రయత్నించి చూశాను" అన్నాడు కృష్ణ.
సమాధానం ఇవ్వలేని డాక్టర్ ముఖం కందిపోయింది. చిరాకు పడ్తున్నట్టు కన్పించాడు. ఏదో అశాంతి అతన్ని నిలవ నివ్వడం లేదని పిస్తోంది.
అతని భార్య పేరు రమాబాయి అని తర్వాత తెలిసింది.
"రాముడూ, నీ అనుభవం చెప్పు!" అన్నాడు భార్యకేసి చూస్తూ డాక్టర్.
"ఏ అనుభవం?"
"అదే - ఆ రోజు స్నానం చేస్తున్నప్పుడు నీ స్నేహితురాలు పారిజాతం, విమలా వచ్చినప్పుడు...."
"ఓ, అదా! మీరే చెప్పండి" అన్నది ఆమె.
ఆమె ముఖంలోకి చూశాను.
ఆ ముఖంలో ఎలాంటి భావం లేదు. చాలా తాపీగా ఉంది. భర్త ఇలా మాట్లాడడం, వినడం బాగా అలవాటుపడినట్టుగా మాత్రమే ఉంది. భర్త నమ్మకాలే ఆమె నమ్మకాలు అయి ఉండాలి.
"ఒక రోజు నా భార్య బాత్ రూంలో స్నానం చేస్తోంది. నేనుకూడా ఇంట్లో లేను. ఇంట్లో మరెవరూ లేరు. లోపలనుంచి గడియపెట్టి స్నానం చెయ్యడానికి వెళ్ళింది. తలంటిపోసుకొని జుట్టు ఆర్పుకొంటూ మెల్లాలోకి- అంటే ఇదే హాలులోకి వస్తూ ఆమె గడపలోనే ఆగిపోయింది. ఎదురుగా ఉన్నవాళ్ళను వెర్రిగా చూస్తూ నిలబడిపోయింది.
"ఏమిటోయ్ అలా చూస్తావ్?" అడిగింది పారిజాతం.
"మీరు లోపలకు ఎలా వచ్చారు?" బిత్తరపోతూ అడిగింది నా భార్య.
"అదేమిటి, నువ్వేగా తలుపు తీశావ్ ? తలకు నూనె పెట్టుకొని ఉన్నావ్. మాట్లాడుతూ ఉండండి, త్వరగా స్నానంచేసి వస్తానన్నావుగా? అంతలోనే మర్చిపోయావా?" స్నేహితురాళ్ళిద్దరూ నవ్వారు.
"నా భార్య కూడా తెచ్చిపెట్టుకొన్న నవ్వుతో తను ఆ విషయం మర్చిపోయినట్టుగా అంగీకరించింది" అంటూ ఆగాడు డాక్టర్.
"ఇందులో విశేషం ఏముంది?"
"వాళ్ళకొరకు తలుపు తీసింది నా భార్య కాదు."
"మరెవరు?"
"మా ఇంట్లో తిరిగే స్పిరిట్!"
"మీ ఇంట్లో స్పిరిట్ తిరుగుతూ ఉంటుందా ? మీకు మరి భయం వెయ్యదూ?" కృష్ణ అడిగాడు.
అందుకు డాక్టర్ హాయిగా నవ్వాడు.