కంఠం పెంచి, పోజుమార్చి, ఉపన్యాసం మళ్ళీ ప్రారంభించాడు.
"ఎందుకంటే....? అవి...."
"గుడ్లు పెడతాయి_" మధ్యలోనే ఎవరో జనంలో నుంచి అరిచారు. మిగతా వాళ్ళు నవ్వారు. ఆడవాళ్ళు మాత్రం నవ్వలేకపోయారు.
"ఆహా! ఏం బుర్ర! వండరఫుల్! నేను చెప్పాలనుకున్న మాట మీరే చెప్పేశారు, చూశారా మీలో ఇప్పటికిప్పుడే ఎంత చైతన్యం వచ్చిందో ఆఁ ఏం చెబుతున్నానూ?"
"నువ్వేమన్నా చెబితేగా?"
"ఆఁ అదే! కోడిపెట్టలు గుడ్లు పెడతాయి. వాటిని జనం తింటారు. గుడ్లు పుష్టిగల ఆహారం. అవి పొదగేస్తే....?"
"పిల్లలౌతాయి."
"కరెక్ట్! పిల్లలౌతాయి. అరపిల్లలు మహారుచుగా వుంటాయి. నిండుకోడిని కోస్తే పదిమంది తృప్తిగా తినొచ్చు!"
"ఏమిటయ్యా నీ సోది? దీనికీ ఫామిలీ ప్లానింగ్ కూ సంబంధం ఏమిటి?"
"వుంది! వుంది కనుకనే చెబుతున్నాను పెట్టలు గుడ్లు పెడతాయి. ఆ గుడ్లు మనం తింటాం. వాటిని పొదగేస్తే వాటినీ తింటాం. వాటిని పెంచితే మళ్ళీ అవి గుడ్లు పెడతాయి. ఆ గుడ్లు మళ్ళీ పిల్లలౌతాయి! ఇలా కోడిపెట్టల వలన జనానికి ఆహారం లభిస్తోంది. దేశానికి ఎంతో ఉపకారం చేస్తున్నాయి. కాని మన ఆడవాళ్లు.... ఏం చేస్తున్నారు? పిల్లల్ని కంటున్నారు. వాళ్లు ఆహారం కోసం దేశంమీద పడుతున్నారు. దేశంలో వున్న ఆహారం చాలక నానా కంగాళీ చేస్తున్నారు. జీతాలు పెంచమంటున్నారు. ధరలు పెరిగిపోతున్నాయంటున్నారు. సమ్మెలు చేస్తున్నారు. మళ్ళీ మాట్లాడితే "విప్లవం వర్ధిల్లాలి!" అంటూ వెర్రి కేకలు వేస్తున్నారు" అంతఅరకూ మాట్లాడి ఓసారి ఆడవాళ్ళు కూర్చున్న వైపుకు చూశాడు. వెంటనే మగవారి వైపుకు తిరిగి "అందుకే! సోదరులారా! తెలివి తెచ్చుకోండి! మన ఆడవాళ్ళకంటే కోడిపెట్టలే నయం అని తెలుసుకోండి! మీరంతా పెళ్ళాల్ని వదిలెయ్యండి! కోడిపెట్టల్ని పెంచండి! దేశం బాగుపడుతుంది!"
"తన్నండిరా గాడ్దికొడుకుని!" ఒక కంఠం అరిచింది.
ఎవడో గురిచూసి లూ ముఖం మీదకు చెప్పు విసిరాడు. వరసనే పాదరక్షలతో వేదిక నిండిపోయింది. లూ చేతులు అడ్డం పెట్టుకొని వేదిక మీద అరుస్తూ అటూ ఇటూ పరిగెత్తసాగాడు.
"తన్నండిరా!" అంటూ కొందరు యువకులు వేదిక దగ్గరకు వచ్చారు.
లూ భయపడి పోయాడు.
"అదుగో! అటు చూడండి! దుమ్ము! దుమ్ము! వస్తున్నారు ప్రెసిడెంటుగారు వస్తున్నారు_" రోడ్డుకేసి చెయ్యి చూపిస్తూ అరిచాడు.
జనం తలలు తిప్పిచూశారు. రోడ్డంతా దుమ్ము వ్యాపించింది. ముందు జీపులువచ్చి ఆగాయి. ఆ వెనకే పెద్దకారు వచ్చి ఆగింది. కొందరు రోడ్డుకేసి పరుగెత్తారు. వెళితే మళ్ళీ ముందు కూర్చునే అవకాశం దొరకదనే ఉద్దేశ్యంలో చాలామంది అక్కడే సర్దుకొని కూర్చున్నారు.
శేఖరం, ఊరిపెద్దలూ కారు దగ్గరకెళ్ళి నరహరిని ఆహ్వానించారు.
నరహరి తలపంకిస్తూ, చిద్విలాసంగా నవ్వుతూ, పంచె కుచ్చెళ్లను అందంగా పట్టుకొని కారు దిగాడు. ఆ వెనకే పరమేశం దిగాడు.
రోడ్డు పక్కగావున్న పిల్లలకోడిని గ్రద్ద తన్నుకొని ఎగిరిపోయింది.
21
పరమేశం కారుదిగి డోరు పట్టుకొని నిల్చున్నాడు. పేటంచు తెల్లటి ఖద్దరు ధోవతీ, ఖద్దరు సిల్కులాల్చీ ధరించి, హుందాగా కారు దిగాడు నరహరి.
నరహరి మెళ్ళో పెద్ద గులాబి మాల వేశాడు. కరతాళ ధ్వనులు మిన్నుముట్టాయి. నరహరి మాలను మెళ్ళోనే సర్దుకొని కూర్చున్నాడు. లూ పరమేశం మెళ్ళో పూలదండ వేశాడు. వెంటనే మాలతీసి టేబుల్ మీద పెట్టి పరమేశం జనానికి నమస్కరించాడు. మళ్ళీ కరతాళ ధ్వనులు!
పరమేశం నరహరిని పరిచయం చేశాడు. నరహరి గొప్పతనాన్ని గురించి పదినిమిషాలు గుక్కతిప్పుకోకుండా మాట్లాడాడు.
వేదిక ఎదురుగా ముందు వరసలో కింద కూర్చునివున్న ధర్మయ్యను చూసి జానకిరామయ్య నిట్టూర్చాడు.
"ఇప్పుడు నరహరిగారు తమ అమూల్య సందేశాన్ని మనకు అందిస్తారు" అంటూ పరమేశం ఉపన్యాసం ముగించాడు.
నరహరి లేచి నిలబడ్డాడు. జనంలోకి ఓసారి దృక్కుల్ని సారించాడు. చిద్విలాసంగా నవ్వాడు. గొంతు సవరించుకున్నాడు.
"సోదరులారా! సోదరీమణులారా! ఈ రోజు నిజంగానే సుదినం. నా జీవితంలో మరవరాని రోజు. మిమ్మల్నందరినీ చూడగలిగాను! మీ సేవచేసే భాగ్యం నాకు కలిగించిన పరమేశంగారికి నా కృతజ్ఞతలు. వారు నన్ను పొగిడేశారు. అదంతా వారి అభిమానం మాత్రమే! నేను అతి సామాన్యుణ్ణి! మీ సేవకుణ్ణి! ప్రజాసేవ చెయ్యడమే నా ధ్యేయంగా పెట్టుకున్నవాణ్ణి!" అంతవరకూ చెప్పి పరమేశం కేసి తిరిగాడు. పరమేశం చప్పట్లు కొట్టాడు. అనేక చేతులు అతన్ని అనుకరించాయి.
ధర్మయ్య కూడా చప్పట్లు కొడుతుంటే శేఖరం ధర్మయ్యకేసి జాలిగా చూశాడు.
"నేను మాటలవాణ్ణి కాదు. చేతలవాణ్ణి. నాకు ఉపన్యాసాలు ఇవ్వడం ఇష్టం వుండదు. అయినా మీరంతా నా సందేశం వినాలని కుతూహల పడుతున్నారు కనుక నాలుగు ముక్కలు చెబుతాను. ఇంగ్లీషువాళ్ళు మనదేశాన్ని జలగల్లా పట్టి, రక్తాన్ని పీల్చి పీల్చి, అస్తిపంజరాన్ని వదిలేసి మొన్న మొన్ననే వెళ్ళిపోయారు."
"మొన్న మొన్నేమిటయ్యా? పాతికేళ్ళు దాటిపోతేనూ!" జనంలో నుంచి ఓ యువకుడు అరిచాడు.
శేఖరం ఆ మాటకు తనలో తనే ముసి ముసిగా నవ్వుకున్నాడు. పరమేశం కళ్ళెర్రజేస్తూ చూశాడు.
లూ "సైలెన్స్!" అంటూ అరిచాడు.
నరహరి కొంచెం తడబాటు పడ్డాడు. అంతలోనే సర్దుకొని ఉపన్యాసం కొనసాగించాడు.
"అవును! పాతికేళ్ళకు పైనే అయింది. ఈ కాలం ఒక మనిషి జీవితంలో ఎక్కువే కావచ్చును. కాని ఒక దేశం జీవితంలో పాతికేళ్ళు....మొన్న మొన్న కిందే లెక్క."
"ఏమిటయ్యా మాట్లాడుతున్నావ్?" మరో కంఠం.
"సైలెన్స్!"
"ఇక్కడ కమ్యూనిస్టు కుర్రాళ్ళు చేరినట్టున్నారు_" అన్నాడు పరమేశం పక్కన కూర్చుని వున్న శేఖర్ తో.
శేఖర్ మౌనంగా వుండిపోయాడు.
"ఈ పాతికేళ్ళలో....ఈ కొద్దికాలంలో మనం ఎంతో ప్రగతి సాధించాం, రాజకీయంగానైతేనేమీ, ఆర్ధికంగానై తేనేమీ, సాంస్కృతికంగా నైతేనేమీ....మనయొక్క....ఈ భారతదేశంయొక్క.... మన నెహ్రూగారి ఏలికలోనై తేనేమీ.... ఆ యొక్క ఇందిరాగాంధీ యొక్క ఏలుబడిలో నైతేనేమీ....మనం ఎంతో ప్రగతిని సాధించాం. ఉదాహరణకు మీ ఊరునే తీసుకోండి. ఇంగ్లీషువాడి పాలనలో ఈ ఊళ్ళోకి బండి వచ్చిందా? కరెంటు దీపాలు వచ్చాయా? హరిజనులకు ఇళ్ళు కట్టించబడ్డాయా? అంతవరకూ ఎందుకు_మహిళల పురోభివృద్ధికి ఇలాంటి శంఖుస్థాపన జరిగిందా...."
"అవును! ఇంతగా ధరలు పెరిగిపోయాయా? ఇంత లంచగొండుతనం వుందా? ఇంతమంది మంత్రులు వున్నారా? ఇంతమంది ప్రజా ప్రతినిధులు వున్నారా? ఇంత అశాంతి....ఇంత అలజడి...."
నరహరి ఉపన్యాసాన్ని అందుకొని మధ్యలోనే ఎవరో అరిచారు.
నరహరి ముఖం నల్లబడిపోయింది.
"సైలెన్స్"_లూ అరిచాడు. నరహరి ఉపన్యాసం మూడు ముక్కల్లో ముగించి కూర్చున్నాడు.
"సమయం అమూల్యమైంది. ఆ సమయాన్ని ఈనాటి ముఖ్యకార్యక్రమమైన శ్రమదానానికి వినియోగించడం సమజసం. కండలు కరిగించి పని చెయ్యడంలోవున్న ఆనందం వట్టిమాటలు చెప్పడంలో లేదు. నరహరిగారు మాటల మనిషికాడు. చేతల మనిషి." కరతాళ ధ్వనులు వినిపించాయి. పరమేశం నరహరిని మరోసారి పొగిడి కూర్చున్నాడు.
అంతవరకు ముడుచుకొని వున్న నరహరి ముఖం వికసించింది.
శేఖరం నరహరికీ, ఆనాటి కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహించిన కార్యకర్తలకూ, ప్రేక్షకులకూ కృతజ్ఞతలు తెలియజేశాడు.
వేదికమీద వున్న నెహ్రూ, గాంధీ ఫోటోలకు మధ్యగా నిలబడి 'లూ' భారతమాతకీ జై!' అన్నాడు. కొన్ని కంఠాలు అతన్ని అనుసరించాయి.
అందరూ ముగ్గులు వేసివున్న ప్రదేశానికి వచ్చారు. 'శ్రమదానం' అని తాటికాయంత అక్షరాల్లో కన్పిస్తున్న ఖద్దరు పీలికను నరహరి వెండి కత్తెరతో మధ్యకు కత్తిరించాడు.
"శ్రమ" అని వ్రాసివున్న భాగం బీదా బిక్కిమీదకూ, 'దానం' అని వ్రాసివున్న భాగం నరహరి ప్రక్కగా నిల్చునివున్న వారి మీదకూ గాలివాటుకు పడ్డాయి.
నరహరి బరువుగావున్న చేతిలోని వెండి కత్తెరను ఓసారి పరిశీలించి చూసి పక్కనే నిలబడివున్న జవానుకు అందించాడు. పలుగు అందుకొని ఊపుగా భూమిలోకి దిగేశాడు. ఆ పలుగుతోపాటు పదిమందీ పలుగులు వేశారు. కొందరు పారలతో మట్టితీసి పక్కకు పోస్తున్నారు. కొందరు ఆ మట్టి తట్టల్లోకి ఎత్తి దూరంగా తీసుకెళ్ళి పోస్తున్నారు. పలుగులూ, పారలూ, తట్టలూ వేగంగా కదులుతున్నాయి.