Previous Page Next Page 
రాబందులూ - రామచిలుకలు పేజి 26


    పోలీసులు ధర్మయ్యనూ, సరస్వతమ్మనూ అరెస్టు చేశారు.

 

    పోలీసుల మధ్య నిలబడివున్న ధర్మయ్య దంపతులను చూసి జనం "ధర్మయ్యకూ జై!" అంటూ నినాదాలు చేశారు.

 

    జనంలో నుంచి గులాబీ మాలతో యువకుడైన జానకిరామయ్య ముందుకు వచ్చాడు.

 

    "ధర్మయ్యకూ జై! విప్లవం వర్ధిల్లాలి. పోలీసు జులుం నశించాలి. తెల్ల ప్రభుత్వం వైదొలగాలి" అంటూ ధర్మయ్య మెడలో మాలవేశాడు జానకిరామయ్య.

 

    జానకిరామయ్య తలమీద బలంగా ఒక లాఠీ తగిలింది. తల చిట్లి బొటబొట రక్తం కారుతూవున్నా, జానకిరామయ్య అరుస్తూ నినాదాలు చేస్తూనే వున్నాడు.

 

    నుదురుమీదకు కారిన రక్తం తీసి ధర్మయ్యకు తిలకం దిద్దాడు జానకిరామయ్య. మరుక్షణంలో కళ్ళుతిరిగి పడిపోయాడు.

 

    .... .... .... .... .... .... .... ....

 

    "ఆలస్యం అవుతోంది. ఆ దండ ఇలా ఇవ్వండి!" అంటూ సుబ్బయ్య జానకిరామయ్య చేతిలోవున్న గులాబి దండను అందుకొని బుట్టలో పెట్టుకొన్నాడు.

 

    జానకిరామయ్య గతస్మృతుల నుంచి బయటపడ్డాడు. ధర్మయ్యనూ, సరస్వతమ్మనూ మార్చిమార్చి చూశాడు.

 

    శోకపూరితమైన కంఠంతో "ధర్మయ్యా! దేశం ఎంత మారిపోయిందయ్యా?" అన్నాడు జానకిరామయ్య.

 

    ధర్మయ్య పెదవులమీద లీలగా హాసరేఖలు కన్పించాయి.

 

    "అమ్మా! అమ్మా!" అంటూ లోపలకు వస్తున్న సునందకు సుబ్బయ్య పూలబుట్టతో వాకిట్లో ఎదురుపడ్డాడు.

 

    సునంద సుబ్బయ్యకేసి చూస్తూ నిల్చుండి పోయింది. ఏదో ఆలోచన రాగా లోపలకు వచ్చి తల్లి పక్కగా పెట్టివున్న రూపాయల నోట్లనూ, తల్లి చుట్టూ చిందరవందరగా పడివున్న గులాబీ రేకుల్ని మార్చిమార్చి చూసింది. తలెత్తి తండ్రి ముఖంలోకి చూసింది.   

 

    "ఏం తల్లీ! ఏర్పాట్లన్నీ పూర్తి అయాయా?" అన్నాడు మరోవైపుకు చూస్తూ.

 

    సరస్వతమ్మ లేచి వంటింట్లోకి వెళ్ళిపోయింది.

 

    సునంద వదనం శ్రావణ మాసపు ఆకాశంలా వుంది.

 

    "చూశావా సునందమ్మా? మీ అమ్మా నాన్నా...."

 

    "జానకిరామయ్య చెప్పదల్చుకున్నది చెప్పకుండానే "ఇదమ్మా మీ నాన్న వరస. ఇక నువ్వే వాళ్ళ బాధ్యత వహించాలి. ఎంతకాలం ఈ వయసులో వాళ్ళు కష్టపడతారు."

 

    "నువ్వూరుకోవయ్యా! ఇప్పుడు మేమేం కష్టపడిపోతున్నామని అమ్మాయిని హడలగొడ్తావ్?" కసురుకున్నాడు ధర్మయ్య.

 

    "నేను మీటింగ్ దగ్గర కెళ్తున్నాను_నువ్వూ వస్తావుగా?" అంటూ బయటకు విసురుగా వెళ్ళిపోయాడు జానకిరామయ్య.

 

    "ఏమ్మా! అలా వున్నావ్? జానకిరామయ్య మాటలే అంత! కానియ్! మీటింగుకు మీ అమ్మను కూడా తీసుకెళ్ళు" అన్నాడు ధర్మయ్య.

 

    "అందుకే వచ్చాను నాన్నా! ముగ్గురం కలిసే వెళ్దాం!" ఉబికి వస్తున్న దుఃఖాన్ని దిగమింగుకుంటూ అన్నది సునంద.


                                            20


    వేసవికాలం పగలంతా ఎండ రోళ్ళు బద్దలయేలా కాచింది. పొద్దు వాటాలినా ఇంకా ఎండ తీవ్రత తగ్గలేదు.

 

    వేదికముందు పరచిన జంపఖానాలు కూడా వేడెక్కాయి. జనం పిల్లాజెల్లాతో సహా సాయంత్రం అయిదు గంటలనుంచే ఎదురెండలో కూర్చున్నారు. విసుక్కుంటున్నారు. అలజడి చేస్తున్నారు. మైక్ వాళ్ళు మధ్య మధ్య "హల్లో! హల్లో!" అంటూ టెస్టు చేస్తున్నారు. శేఖరం, ఇతర గ్రామ పెద్దలూ ప్రెసిడెంటుకోసం రోడ్డుమీద నిలబడి ఎదురు చూస్తున్నారు. కొందరు దంపతులు చేతులు పట్టుకొని అటూ ఇటూ తిరుగుతున్నారు.

 

    "అదుగో కారువస్తోంది. ప్రెసిడెంటుగారు వచ్చారు" జనంలోనుంచి ఎవరో కేకపెట్టారు. కారువచ్చి రోడ్డుమీద ఆగింది. కొందరులేచి కారు దగ్గిరకెళ్ళి నిలబడ్డారు.

 

    "అదుగో కారువస్తోంది. ప్రెసిడెంటుగారు వచ్చారు" జనంలో నుంచి ఎవరో కేకపెట్టారు. కారువచ్చి రోడ్డుమీద ఆగింది. కొందరులేచి కారు దగ్గరకెళ్ళి నిలబడ్డారు.

 

    గాంధీ టోపీ పెట్టుకొని, కుంటుకుంటూ కారుదగ్గరకు వచ్చిన ఒక యువకుడు, చేతిలోని మల్లెపూల దండను కార్లోనుంచి దిగినవ్యక్తి మెడలో వేశాడు. ఆ వ్యక్తి ఛాతీ విరుచుకొని, దండ సవరించుకొని, గర్వంగా జనాన్ని కలియజూశాడు.

 

    "ప్రెసిడెంటుకూ జై!" అన్నాడు దండవేసిన యువకుడు.

 

    "ప్రెసిడెంటుకూ జై!" అన్నాయి అనేక కంఠాలు.

 

    శేఖరం ఏదో చెప్పాడు. కాని ఆ కేకల్లో అతని మాటల్ని ఎవరూ వినిపించుకోలేదు.

 

    "నేను ప్రెసిడెంటును కదయ్యా! ప్రెసిడెంటుగారి బామ్మరిదిని!" అన్నాడు దండ వేయించుకున్న వ్యక్తి మెడలో నుంచి దండ తియ్యకుండానే.

 

    "బలేవాడివయ్యా 'లూ!' ప్రెసిడెంటుకంటే ముందే సన్మానం పొందావు" అన్నాడు శేఖరం నవ్వుతూ.

 

    దండవేసిన యువకుడు ఓ క్షణం తెల్లబోయి చూశాడు. అంతలోనే కోపం వచ్చింది.

 

    "ఆ మాట ముందే ఎందుకు చెప్పలేదు? నా దండ నా కిచ్చెయ్! అది నీకోసంకాదు తెచ్చింది!" కోపంగా చెయ్యి ముందుకు చాచాడు కుంటివాడు.

 

    "ఎత్తిన కత్తి దించకూడదు - వేసిన దండ తియ్యకూడదు! తప్పు! తప్పు!" అంటూ మెళ్ళో దండను గట్టిగా పట్టుకున్నాడు లూ.

 

    "అది ప్రెసిడెంటుగారి కోసం స్పెషల్ గా ఆర్డరిచ్చి పట్నంనుంచి తెచ్చాను. నా దండ నాకిచ్చెయ్ మర్యాదగా!" కుంటుకుంటూ లూ పై పైకి వచ్చాడు ఆ యువకుడు.  

 

    "ప్రెసిడెంటుగారి బామ్మరిదికి దండవేసిన వాడికి, ప్రెసిడెంటుగారికి దండవేసిన వాడికంటే కూడా మంచి భవిష్యత్తు వుంటుంది. తెలియకపోతే తెలుసుకో! ఇంత అమాయకుడివి నువ్వేం బాగుపడ్తావ్? నీ కుంటికాలు బాగుపడాలంటే ఈ దండ ఇలాగే నా మెళ్ళోనే వుండనియ్!" అంటూ గబగబా వేదిక దగ్గరకు వచ్చాడు లూ.

 

    ఆ యువకుడు కుంటుకుంటూ "నా దండ నా కిచ్చెయ్!" అంటూ వెంటబడ్డాడు. అదేమీ వినిపించుకోకుండా వేదిక ఎక్కి మైకుదగ్గిర నిలబడ్డాడు.

 

    జనంలో కలకలం బయలుదేరింది. చాలామంది లేచి నిల్చున్నారు.

 

    "అందరూ కూర్చోండి. అల్లరి చెయ్యకండి! ముందు నేను చెప్పే నాలుగు ముక్కలూ వినండి!" అన్నాడు లూ మైకుముందు నిలబడి.

 

    కొందరు మళ్ళీ కూర్చున్నారు కొందరు నిలబడే వున్నారు.

 

    "ఎండలో రెండు గంటల్నుంచీ మాడి చస్తున్నాం! ప్రెసిడెంటు ఎప్పుడొస్తాడో చెప్పవయ్యా?" నిల్చున్న వాళ్ళలోనుంచి ఓ కంఠం బిగ్గరగా అరిచింది.

 

    "వస్తారు! వస్తారు! మీరంతా ముందు కూర్చోండి. నేను వచ్చేటప్పుడు ప్రెసిడెంట్ గారు అనగా మా బావగారు ట్రంకులో వున్నారు."

 

    జనం గొల్లున నవ్వారు.

 

    "ప్రెసిడెంటుగారు ట్రంకుపెట్టెలో వుండటం ఏమిటయ్యా?" ఓ బొంగురు గొంతు అరిచింది.

 

    మళ్ళీ జనంలో నవ్వులు.

 

    "ఉష్! అల్లరి చెయ్యకండి! వినండి! మీకు బొత్తిగా బుర్రలు లేవు. ట్రంకు అంటే ట్రంకుపెట్టె కాదు, ట్రంక్ టెలీఫోన్. ప్రెసిడెంటు గారు, అనగా నరహరిగారు....అంటే మా బావగారు, చీఫ్ మినిష్టరుగారితో అర్జంటుగా, స్టేట్ సీక్రెట్ ట్రంకు ఫోన్ లో మాట్లాడుతున్నారు."

 

    "అయితే అర్ధరాత్రికి వస్తారా?" ఓ గొంతు కీచుమన్నది.

 

    "కొంచెం ఓపికపట్టండి! పెద్దవాళ్ళకు ఎన్ని పనులుంటాయ్! ఏ క్షణంలోనైనా రావచ్చు. ఈపాటికి సగం దూరం వచ్చేవుంటారు-" అన్నాడు లూ.

 

    జనంలో అల్లరి మళ్ళీ ప్రారంభం అయింది.

 

    "ఈలోగా మీకు కొన్ని ముఖ్యవిషయాలు చెప్పి మీ కళ్ళు తెరిపిస్తాను. గోల చెయ్యొద్దు."

 

    "మధ్యలో నీ గొడవేమిటయ్యా" - జనంలోనుంచి ఎవరో గట్టిగా అరిచారు. అందరూ నవ్వారు.

 

    "మీరు విన్నా వినకపోయినా మీలో చైతన్యం కలిగించడం నా బాధ్యతగా భావిస్తున్నాను. ఫామిలీ ప్లానింగ్ గురించి చెప్పదల్చుకున్నాను. పరిమిత కుటుంబంవల్ల ఎన్నిసుఖాలు ఉన్నాయో మీకు బొత్తిగా అర్ధంగాదు. చెప్పినా వినరు. నన్ను చెప్పమంటారా? మానమంటారా?" లూ జనంలోకి చూస్తూ ప్రశ్నించాడు.

 

    "మానెయ్!" అనేక కంఠాలు విన్పించాయి.

 

    "ఊరుకోండహే! చెప్పనియ్యండి! చెప్పండి! వింటాం!" ఓ కంఠం వినిపించింది.

 

    "చాలు! ఒక్కరు విన్నా చాలు. ఇక ఎవరూ నన్ను ఆపలేరు. మహాజనులారా! మనదేశంలో జనాభా నానాటికీ పెరిగిపోతూంది. తిండి దొరకడంలేదు జనానికి. అయినా మన ఆడవాళ్ళకు బుద్ధిలేదు. పిల్లల్ని కంటూనే వుంటారు."

 

    ఆడవాళ్లు బిగుసుకుపోయి కూర్చున్నారు. మగవాళ్ళలో కొందరు గంభీరంగా ముఖాలు పెట్టారు. ఎక్కువ మంది గొల్లున నవ్వారు.

 

    లూ మళ్ళీ ప్రారంభించాడు.

 

    "కోడిపెట్టలు....అదీ కోడిపెట్టలు వున్నాయి చూడండి...."

 

    "ఏమిటయ్యా కోడిపెట్టల్ని చూసేది?"

 

    "పూర్తిగా వినండి. మనదేశంలో ఆడవాళ్ళకంటే కోడిపెట్టలే నయం!"

 

    కుర్రాళ్ళు చప్పట్లు కొట్టారు. లూకు హుషారొచ్చింది.

 Previous Page Next Page