Previous Page Next Page 
రాబందులూ - రామచిలుకలు పేజి 28


    లూ ఒక చిన్న తట్టలో సగానికి మట్టిపోసుకొని అతి కష్టంమీద నెత్తికి ఎత్తుకున్నాడు. దూరంగా పోసి తిరిగొచ్చి తట్ట మరొకడికి అందించాడు. "ఊఁ త్వరగా! చక చక సాగాలి పని! కష్టపడాలిరా! అప్పుడే సుఖం!" అంటూ జనాన్ని హెచ్చరిస్తూ ఆర్భాటం చేస్తున్నాడు.

 

    "ఇవ్వాల్టికి ఇక చాలు! రేపటి నుంచి మిగతాపని పూర్తి చేయండి!" అన్నాడు పరమేశం నుదురు చెమట తుడుచుకుంటూ.

 

    నరహరి రొప్పుతూ నిల్చున్నాడు. తెల్ల ఖద్దరు పంచకు అంటిన మట్టిని దులుపుకోసాగాడు. అది చూసి లూ పరిగెత్తుకొచ్చి మట్టి దులపసాగాడు.

 

    ధర్మయ్య ఎత్తలేక ఎత్తుతున్న తట్టను జానకిరామయ్య అందుకుంటూ "ఇక చాల్లేవయ్యా!" అన్నాడు.

 

    "అందరూ ఏడు గంటలకల్లా భోజనాలకు సిద్ధంగా వుండండి. ఆ తర్వాత సత్యహరిశ్చంద్ర వీధి భాగవతం వుంది." అన్నాడు పరమేశం జనాన్ని ఉద్దేశించి.

 

    నరహరి తుండు చుట్టుకొని వసారాలో ముక్కాలు పీటమీద కూర్చుని వున్నాడు, మాలీసు చేయించుకోవడానికి సిద్ధంగా.

 

    నలుగురు పనివాళ్ళు వచ్చారు. నూనె సీసా తీసుకొని, తలా ఒక కాలూ, చెయ్యీ భుజాలమీద వేసుకొని మర్దన చెయ్యసాగారు. నరహరి కళ్ళు మూసుకొని ఆనందిస్తున్నాడు.

 

    అంతలో లూ ఓఢ్రమంగలిని తీసుకొని హడావిడిగా ప్రవేశించాడు. ఓఢ్రమంగలి నరహరి తలకు వంటాముదం దోసిలిలో పోసి, లయ యుక్తంగా దరువు వేస్తున్నాడు. నరహరి ఆ సుఖాన్ని కళ్ళుమూసుకొని అనుభవిస్తున్నాడు.

 

    "ఆహా! హాయిగా వుంది! వళ్ళొంచి కష్టం చెయ్యడంలో వున్న సుఖాన్ని జనం మర్చిపోతున్నారు. సోమరితనం పెరిగిపోతూ వుంది. జాతి నిర్వీర్యం అవుతోంది. వెధవలు వళ్లు దాచుకోవడం నేర్చుకున్నారు. అందుకే ప్రతినాడూ ఈసురోమంటూ కన్పిస్తాడు. ఒక్కడికీ కండపుష్టి ఎక్కడ్నుంచి వస్తుంది?" కళ్ళుమూసుకొనే అన్నాడు నరహరి.

 

    "అందుకే దేశం కూడా చిక్కిపోతుంది బావా! ఆ వెధవలు తట్ట మట్టి ఎత్తడానికి ఛస్తున్నారు అన్నాడు లూ మధ్యలో అందుకొని.

 

    "ఆఁ ఆఁ ! అక్కడే! ఆ పిక్క దగ్గిర పట్టేసింది! గట్టిగా రుద్దు! చేతుల్లో సత్తువలేదు వెధవకు!" అన్నాడు కుడికాలు మర్దిస్తున్నవాడితో నరహరి.

 

    "గట్టిగా రుద్దవోయ్! కండగల వాడికే తిండిగలదోయ్! అన్నాడు మహాకవి గుడివాడ."

 

    "గుడివాడెవరండోయ్ లూ గారూ? గురజాడా! గురజాడ అల్లా అనలేదే? తిండికలవాడికే .... .... .... ...." అప్పుడే ప్రవేశించిన శేఖరం మాటల్ని మధ్యలోనే అందుకున్నాడు లూ.

 

    "గుడివాడో గురజాడో! ఎవరైతేనేం? అతనేమంటే నేంలే! నేను వున్నమాట అన్నాను" అన్నాడు లూ.

 

    శేఖరం ఓ క్షణం లూని పరికించి చూసి వెళ్ళిపోయాడు.

 

    మాలీసు చేస్తున్నవాళ్లు చమట్లు కక్కుతున్నారు. చేతులు చచ్చుబడుతున్నాయి. నరహరి ఎప్పుడు 'చాలు' అంటాడా అని ఎదురుచూస్తూ మర్దన చేస్తున్నారు.

 

    నరహరి కళ్ళు తెరిచాడు. ఒక్కొక్కడ్నీ పరికించి చూచాడు.

 

    "వెధవలు! అప్పుడే తోటకూర కాడల్లా జావగారి పోతున్నారు. ఇక చాల్లే! ఆపండి!" అన్నాడు నరహరి.

 

    ఒకవైపు గంగాళాల్లో నీళ్ళు మసులుతున్నాయి. మరోవైపు వంటకాలు ఉడుకుతున్నాయి. నేతి గారెల వాసన ముక్కోళ్ళను తాకుతూ వుంటే, నరహరి కడుపులో ఏదో కరకరలాడుతూ వుంది.

 

    "త్వరగా కానియ్!" ఓఢ్ర మంగలిని హెచ్చరించాడు నరహరి.

 

    బక్కెట్లకొద్దీ వేడినీళ్ళు నరహరి తలమీద పోస్తున్నారు.


                                                                             22


    సునంద సామాను సర్దుకుంటూ వుంది. తల్లి పక్కన వుండి కూతురికి సహాయపడుతోంది.

 

    ధర్మయ్య గోడకు చేరబడి కూతురికేసి దిగాలుపడి చూస్తూ కూర్చున్నాడు.

 

    "సరస్వతమ్మా! ఏం చేస్తున్నారూ? ఏదో హడావిడిగా వున్నట్టున్నారు? అమ్మాయి ప్రయాణం ఇవ్వాళేనా ఏమిటి? అంటూ తులశమ్మ ప్రవేశించింది.

 

    "అవును వదినా! పరీక్ష పాసయినట్టు తెలిసిన క్షణం నుంచి ముళ్ళమీదే కూర్చుంది. నాలుగు రోజులు ఆగవమ్మా అంటే వినడంలేదు" అన్నది సరస్వతమ్మ దిగులుగా.

 

    "కాదమ్మా మరి! నీ కూతురు బుద్ధిమంతురాలు. మీరు కష్టపడుతుంటే తింటూ ఎలా కూర్చుంటుందిలే?"

 

    సరస్వతమ్మా, ధర్మయ్యా, ఒకేసారిగా కూతురి ముఖంలోకి చూశారు. సునంద తలవంచుకొని పెట్టె సర్దుకుంటూ వుంది.

 

    "అదేమిటి వదినా! ఇప్పుడు మేము పెద్దగా పడిపోతున్న కష్టాలేమున్నాయ్?" అన్నది సరస్వతమ్మ నొచ్చుకుంటూ.

 

    "మరి! సుఖపడిపోతున్నారన్నమంటారా? నువ్వేమో పూలమాలలు కట్టి అమ్ముతున్నావ్. అన్నయ్య కూరగాయలు పండించి అమ్ముతున్నాడు. ఈ ఊళ్ళోనే ఒకనాడు మీ కుటుంబం...."

 

    "తులశమ్మా!" ధర్మయ్య దెబ్బతిన్నవాడిలా అరిచాడు.

 

    "ఎందుకయ్యా బాధపడ్తావ్ వున్న మాటంటే? ఎంతమంది చెప్పినా ఆ మిగిలిన చెక్కకూడ అమ్మి కూతుర్ని చదివించావు. అమ్మాయి బి.ఏ. పాసయింది. ప్రయోజకురాలైంది. నువ్వు కోరుకున్నది అదేగా? మీ కష్టాలు గట్టెక్కుతాయి. ఎందుకంతగా బాధపడి పోతావ్?" తులశమ్మ తన ధోరణిలో మాట్లాడింది.

 

    "ఏమో తులశమ్మా! అమ్మాయిని ఇంత చిన్న వయసులో 'నీ బతుకేదో నువ్వే బతుకు' అంటూ వదిలెయ్యడానికి మనస్కరించడంలేదు" అన్నాడు ధర్మయ్య.

 

    సునంద చివ్వున తలెత్తి తండ్రి ముఖంలోకి చూసింది.

 

    "అదేమిటి నాన్నా! ఉన్నదంతా అమ్మి నన్ను చదివించారు. ఎందుకు నాన్నా? ఈరోజు చూడాలనేగా? నేను ప్రయోజకురాల్ని కావాలనీ, నా కాళ్ళమీద నేను నిలబడి ఉడతాభక్తిగా ప్రజలకు సేవచెయ్యాలనీ ఇంతకాలం కలలు కన్నావు గదూ నాన్నా? మీరు ఈ వయసులో కష్టపడుతూ వుంటే, తింటూ ఇంట్లో కూర్చోమంటారా?"

 

    "ఏమో తల్లీ! ఆడపిల్లవు. నీ అచ్చటా ముచ్చటా చూసుకోవాల్సిన సమయంలో నా పని ఇట్లా అయింది. చేతులు చాచుకొని కూర్చున్నాను. నీ బతుకు నువ్వు బతకమని గాల్లోకి వదిలేస్తున్నాను" అంటూ ధర్మయ్య భుజంమీద తుండుతో కళ్ళు వత్తుకున్నాడు.

 

    సునంద లేచి తండ్రి దగ్గరకు వచ్చింది. తండ్రి రెండు చేతులూ పట్టుకొని "నాన్నా!" అన్నది ఆర్ద్రంగా.

 

    ధర్మయ్య మౌనంగా కూతురి ముఖంలోకి చూస్తూ వుండిపోయాడు.

 

    "ఏమిటి నాన్నా ఇది? అప్పుడే మర్చిపోయావా? నీ కూతురు అందరి ఆడపిల్లల్లా కాకుండా, ఏదో కావాలనీ, ఏదో చెయ్యాలనీ, ఆశల్నీ ఆశయాల్నీ పెంచుకొని నన్ను చదివించావు. నాకు ఆత్మవిశ్వాసాన్నీ, మనో ధైర్యాన్నీ ఇచ్చావు. ఇప్పుడు తీరా నీ ఆశలూ, ఆశయాలూ ఫలించబోతూ వుంటే ఎందుకు నాన్నా బాధపడ్తావ్? నువ్వు అందరి నాన్నల్లాగే నా అచ్చటా ముచ్చటా చూడాలనుకున్న వాడివైతే చదువు ఎందుకు చెప్పించావు. పొలం ఎందుకు అమ్మావు? అది కట్నంగా చదివించి పెళ్ళిచేసేసి బరువుదించేసుకో లేకపోయావ్?"

 

    "అమ్మా సునందా!" ధర్మయ్య గర్వంగా కూతురి ముఖంలోకి చూశాడు. ఆప్యాయంగా తల నిమిరాడు.

 

    "తండ్రిగా ఓ క్షణకాలం ఆవేశపడ్డానమ్మా! అంతే" అన్నాడు ధర్మయ్య.

 

    సరస్వతమ్మ సునందకు బొట్టుపెట్టింది. బండి దగ్గరకు కూతురి వెనకే వచ్చి నిలబడింది.

 

    "అమ్మా! దిగులుపడకు. నాకు ఉద్యోగం రాగానే నిన్నూ నాన్ననూ తీసుకెళ్తాను. అందరం ఒకేచోట వుందాం!" అన్నది సునంద తల్లితో.

 

    "ఏమో తల్లీ మళ్ళీ నిన్నెప్పుడూ చూస్తానో"! సరస్వతమ్మ కంఠంలో ఏదో అపశృతి పలికింది.

 

    "ఏమిటా అశుభం మాటలు?" ధర్మయ్య భార్యను కసురుకున్నాడు.

 

    "త్వరలోనే వస్తానమ్మా! ఉద్యోగం సంపాదించుకొని వస్తాను." అంటూ సునంద బండి ఎక్కి కూర్చుంది.

 

    బండి మలుపు తిరిగేంత వరకూ చూస్తూ నిలబడి నిట్టూర్చింది సరస్వతమ్మ.


                                                                         23


    "చూడు సునందా! మరీ అంత దిగులుపడిపోకు. ఏదో ఉద్యోగం వస్తుందిలే!" అన్నది హాస్టల్ వార్డెన్ మిస్ గ్రేస్ సునందతో.

 

    "ఏమో! మేడం! నా భవిష్యత్తు అంధకార బంధురంగా కన్పిస్తోంది. నామీద ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రుల ముందుకు ఉద్యోగం దొరకలేదని వెళ్ళి ఎలా ముఖం చూపించగలను?" భారంగా అన్నది సునంద.

 

    "చూడమ్మా! ఇవ్వాళ నాలుగు గంటలకు శిఖండమ్మ అని సేవా సమాజం ప్రెసిడెంటు నిన్ను పంపించమన్నది. ఇవ్వాళ కొందర్ని ఇంటర్వ్యూ చెస్తుందట వెళ్ళిరా! ఆ చూడు మర్చేపోయాను. నిన్న ఫెర్టిలైజర్ కంపెనీ మేనేజర్ని కూడా అడిగాను. అక్కడ ఏదో క్లర్కు పోస్టు వుందట. నిన్ను చూస్తానన్నాడు. ఒకసారి అక్కడికి కూడా వెళ్ళిరా! ఇదిగో అడ్రసులు. వెళ్ళు! ఉత్సాహంగా వుండు. ఏదో ఒకటి తప్పక ఉద్యోగం వస్తుంది." అడ్రసులు రాసిన కాగితాలు అందించింది వార్డెన్.

 Previous Page Next Page