Previous Page Next Page 
బొమ్మరిల్లు పేజి 26


                                         13


    రేణుక తల వంచుకొని ఇసుకలో పిచ్చిపిచ్చి గీతలు గీస్తున్నది. ఆ గీతలు గీచే తీరులో ఆమెలోని మానసిక అశాంతి స్పష్టంగా కన్పిస్తోంది.


    గౌతమ్ గంభీరంగా ఆలోచిస్తూ ఉవ్వెత్తున లేచి ఎగిరి పడుతోన్న సముద్రపు అలల్ని చూస్తున్నాడు.


        "చెప్పు గౌతమ్! నా నిర్ణయం సరైంది కాదా? చావు బ్రతుకుల్లో ఉన్న నాన్నగారికి యిచ్చినమాట నిలబెట్టుకోవడం నా విధి కాదా?"


    గౌతమ్ చివ్వున తలతిప్పి రేణుక కేసి చూశాడు.


    "నీ నిర్ణయం సరైంది కాదని ఎవరు అనగలరు? అది నీ బాధ్యత"


    అశాంతిగా ఇసుక మీద కదులుతున్న రేణుక వేళ్ళు ఆగిపోయాయి. చివ్వున తలెత్తి గౌతమ్ ముఖంలోకి చూసింది. రిలీఫ్ గా నిట్టూర్చింది.


    "నిజంగా? నువ్వంటున్నది నిజమేనా?"


    "అబద్ధం... అదీ నీ దగ్గిర ఆడాల్సిన అవసరం నాకేముంది? నీ పరిస్థితిలో నేను ఉన్నా అదే చేస్తాను"


    రేణుక గౌతమ్ ముఖంలోకి సంతృప్తిగా చూసింది.


    "కాని...." ఆగిపోయాడు గౌతమ్.


    "ఆగిపోయావేం? చెప్పు!"


    "నేను పెళ్ళి మాత్రం మానుకోను. అంత త్యాగం నేను చెయ్యను. కుటుంబ బాధ్యత కోసం పెళ్ళి మానుకోవలసిన అవసరం లేదు"


    "నువ్వు మగవాడివి. నా సంగతి వేరు. స్త్రీ వివాహం చేసుకున్న తర్వాత పుట్టింటి బాధ్యతను నిర్వహించడం అసంభవం!" అన్నది రేణుక.


    "అవున్లే. మీ చెల్లెళ్ళనూ, తమ్ముళ్ళనూ చదివించాలి. పెంచి పెద్ద చెయ్యాలి"


    "అవును!"


    "ఆ తర్వాత ఆ పిల్లల పిల్లలకు కావల్సినవి చూడాలి. మళ్ళీ వాళ్ళను..."


    "ప్లీజ్ అలా మాట్లాడకు!"


    "ఆ తర్వాత ఎవరి దారిన వారు వెళ్ళిపోతారు. వృద్ధాప్యంలో నువ్వు ఒక్క దానివి..."


    "ప్లీజ్ గౌతమ్!" దాదాపు అరిచినట్టే అన్నది రేణుక.


    "ఊహించడానికే అంత భయంకరంగా ఉన్న నీ భవిష్యత్తు గురించి...అందుకే ఆలోచించుకోమంటున్నాను. కుటుంబ బాధ్యతను నిర్వహించవద్దు అని నేను చెప్పడం లేదు. మీ వాళ్ళను గాలికి వదిలెయ్యమనడం లేదు. కాని అందుకోసం అవివాహితగానే ఉండిపోతాననే నిర్ణయం తీసుకోవడమే తెలివితక్కువ తనం అంటున్నాను. తర్వాత పశ్చాత్తాప పడతావంటున్నాను..."


    "నేను పెళ్ళి చేసుకుంటే నాలో స్వార్థం చోటు చేసుకోకమానదు. నాకూ పిల్లలు పుడతారు. నా భర్తా, నా సంసారం అనే వ్యామోహంలో పడిపోతాను. అప్పుడు నాన్న స్థానాన్ని నేను భర్తీ చెయ్యలేను. నా మీద నాకే నమ్మకం లేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను"


    గౌతమ్ ఆలోచిస్తూ మునివేళ్ళతో ఇసుకను తవ్వుతున్నాడు.


    "గౌతమ్! నువ్వు ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్ళి చేసుకో"


    "ఆ విషయంలో నీ సలహా అడిగినప్పుడు చెప్పు! ఇప్పుడు అక్కర్లేదు"


    "నన్ను క్షమించు గౌతమ్!"


    "ఓ క్షమించేశాను" తేలిగ్గా నవ్వుతూ అన్నాడు గౌతమ్. ఆ నవ్వు ఎంతో పేలవంగా కన్పించింది రేణుకకు.


    "రేణూ! నీ నిర్ణయానికి నేను అడ్డురాను. నీకోసం ఎంతకాలం ఎదురు చూడమంటావో చెప్పు!"


    "గౌతమ్!" దాదాపు ఏడుస్తూనే అన్నది.


    "ఎందుకు ఏడుస్తావ్? ఇది సెంటిమెంట్సుకు సమయం కాదు. మనం వివేకంతో ఆలోచించి ఒక నిర్ణయానికి రావాలి"


    "మా చిన్న చెల్లెకి ఇప్పుడు ఆరో సంవత్సరం. కనీసం నా బాధ్యతలన్నీ పూర్తి అయ్యేసరికి మరోపది పన్నెండేళ్ళు పట్టవచ్చును. అప్పటి వరకూ నా కోసం నిన్ను అవివాహితుడిగా ఉండమనడం..."


    "నువ్వు అనడం లేదు. నేనే ఉంటానంటున్నాను. అదీ నీకోసం కాదు. నాకోసమే. నువ్వు నాకు కావాలి. నా ఆనందం కోసం! ఓకే, పది పన్నెండేళ్ళేగా? నాకు అమెరికా వెళ్ళే అవకాశం వచ్చేలా ఉంది. త్వరలోనే వెళ్ళిపోతాను. నేను ఎక్కడ ఉన్నా నీకు నా అవసరం ఉన్నదనుకున్నప్పుడు రెక్కలు కట్టుకొని వచ్చి నీ ముందు వాల్తాను. ఓకే! ఇక లే! వెళ్దాం!" తలమీద మృదువుగా చెయ్యి వేసి లాలింపుగా నిమిరాడు అదోలా నవ్వుతూ గౌతమ్.


    "గౌతమ్!" అంటూ అతని చేతులు రెండూ పట్టుకొని బావురుమన్నది రేణుక.


    "ఛ! ఏమిటిది? నువ్వు మంచి నిర్ణయాన్ని తీసుకున్నావ్. సంతోషంగా నిర్వహించాలి. కాని ఇలా ఏడుస్తూ...


    "అందుకు కాదు..నాకోసం కాదు"


    "మరి నా కోసమా?" పకపకా నవ్వాడు గౌతమ్.


    "లే! డోంట్ బి సిల్లీ!" అంటూ రేణుకను చెయ్యి పట్టుకొని లేవదీశాడు గౌతమ్.


                                          14


    రేణుక రిక్షా దిగింది.


    చాలా అలసటగా లోపలకు అడుగుపెట్టి యాంత్రికంగా వరండా గడపలోనే ఆగిపోయింది.


    లోపల తల్లీ, పెద్ద తమ్ముడు రామూ ఘర్షణ పడుతున్నారు.


    "ఏమిట్రా నువ్వనేది? నీకు కొంచెం అయినా బుద్ధి ఉందా? కృతజ్ఞత ఉందా? మాట్లాడవేంరా? ఇది నీకు న్యాయంగా ఉందా?"


    "ఏమిటమ్మా నీగోల? నేను పెళ్ళి చేసుకుంటే ఎవరికో అన్యాయం జరిగిపోతున్నట్టు అరుస్తావేమే?" విసుగ్గా ఉంది రాము గొంతు.


    "ఒరేయ్!ఒరేయ్! ఎంత మాటన్నావురా? ఎవరికో అన్యాయమా? ఎవరో కాదురా! అదీ నీ అక్క! ఇంటికి పెద్దబిడ్డ. మీకోసమే అది పెళ్ళీ పెటాకులు లేకుండా ఉండిపోయింది.


    "నేను ఉండమన్నానా? అందుకని నేనూ పెళ్ళీ పెటాకులు లేకుండా ఉండిపోవాలా?"


    "నోరు ముయ్యరా! మరీ పెద్దా చిన్నా లేకుండా ఎంతమాట పడితే అంత మాటంటున్నావ్?"


    "నువ్వే నన్ను రెచ్చగొడ్తున్నావ్?"


    రేణుక దర్వాజాను గట్టిగా పట్టుకొని నిల్చుంది. కాళ్ళలో సత్తువలేనట్టు నిల్చుంది.


    "ఆయన దారిన ఆయన వెళ్ళిపోయాడు. ఇటువంటివన్నీ చూడమని నన్ను వదిలేసి వెళ్ళాడు. అది లేకపోతే అందరం అడుక్కు తినేవాళ్ళంరా? బిడ్డ ఎంత కష్టపడి సంపాదించి మిమ్మల్ని ఇంత వాళ్ళను చేసిందో ఆలోచించు! అది తన మానాన తను పెళ్ళి చేసుకొని వెళ్ళిపోతే, నువ్వు ఇంత చదువు చదివేవాడివా! ప్రిన్సిపాల్ నీకు తన కూతుర్ని ఇచ్చేవాడా? ఆ పిల్ల నిన్ను చేసుకొనేదా? మెట్రిక్ చదివి ఏ గుమాస్తాగానో పని చేస్తుండే వాడివి ఈ పాటికి!" దగ్గు తెర ఆమె వాగ్ధోరణికి అడ్డుపడింది.

 Previous Page Next Page