Previous Page Next Page 
పిపాసి పేజి 26


    తెలీకుండా తీసుకుంటేనే ఫోటోలు బాగా వొస్తాయి చెల్లెమ్మా. అందుకే కెమెరా తెచ్చినట్టు చెప్పలేదు.


    "ఇప్పుడు తెలిసిపోయిందిగా."


    "ఇలారండి. బీచ్ కేసి వెళదాం" అన్నాడు మధన్.


    "నిర్మలమైన ప్రదేశం. ఉప్పొంగే మనస్సులా, సముద్రంలోకి కెరటాలు ఎగిరెగిరి పడుతున్నాయి. పొంగే యౌవ్వనంలా ఒక్కొక్క కెరటం, నురుగులు కక్కుతూ పరుగెత్తుకు రావడం. మవనపు వేడి చల్లారాక, బయలుదేరిన వేదాంతిలా కొంతదూరం పోయాక, అణిగిపోయి నెమ్మదిగా రావడం సముద్రాన్ని ఎంతసేపు చూసినా తనివితీరదు. మనిషికీ కడలికీ ఏమిటో ఈ అవినాభావ సంబంధం, ఎందుకో మనిషికి ఆ స్పందన సముద్రాన్ని చూస్తే?" తనలో తాననుకున్నట్టుగా, పైకి అనేసింది రాధిక.


    "అవును రాధీ..... నువ్వన్నమాట నిజమే. ఆ తెల్లని నురుగు చూడూ, చల్లని మనస్సులా హాయిగా అనిపిస్తుంది."    


    "పదండి నీళ్ళలోకి వెళదాం" అంది రాధిక. ఇద్దరూ చేతులు పట్టుకుని నీళ్ళలోకి నడిచారు. బుస్సున కెరటం వచ్చి, జర్రుమని జారిపోతూ, పడిపోతామేమో నన్నంత భయం కలిగి, మధన్ చేతులు గట్టిగా పట్టుకుని నుంచుంది. మోకాటివరకూ నీళ్ళొచ్చేదాకా నడిచింది రేణుక. సత్యం కూడా దూరంగానే నడిచాడు.


    "ఇంకముందుకు వెళ్ళకన్నయ్యా బాలెన్సు పోతుంది" అంటూ గట్టిగా అరిచింది రాధిక.


    "ఏం ఫరవాలేదులే. మధన్ నువ్వూ రా" అంటూ కేకవేశాడు సత్యం.


    రాధిక చెయ్యొదిలిపెట్టి సత్యం వెనకాలే వెళ్ళాడు మధన్.


    "ఏవండీ వద్దు ముందుకెళ్ళకండీ" అంటూ అరుస్తూన్న రాధికను "ఫరవాలేదులే అక్కా" అంటూ దగ్గరికెళ్ళి చెయ్యి పట్టుకుంది రేణుక. అంతలో ఒక పెద్ద కెరటం వొచ్చి చీరల్ని తడిపేసింది.     


    "అయ్యయ్యో చీరంతా తడిసిపోయింది" అంది రేణుక.


    "ఫరవాలేదులే. నేను చేంజ్ కి పట్టుకొచ్చాను. రెండుచీరలు."


    "మంచిపని చేశావ్. నేను మరిచేపోయాను సుమా. ఇలా ఇద్దరూ మాట్లాడుకుంటూ వుంటే, వెనుక నుంచొచ్చి దోసిటితో నీళ్ళు తీసి రాధిక వీపు మీద పోశాడు మధన్. "అబ్బా" అంటూ ఉలిక్కిపడి వెనక్కి తిరిగి అతన్ని గట్టిగా పట్టేసుకుంది రాధిక. రేణుక, సత్యం పగలబడి నవ్వారు.


    అలా ఎంతసేపు నీళ్ళలో ఆడారో, ఎఱ్ఱ చీర కప్పుకున్న సంద్యారాణి పలకరించేదాకా తెలీలేదు. గట్టుమీదకొచ్చి, తడి చీరెల నీరు పిండేసి కొద్ది దూరం వెళ్ళి ఒక చెట్టు దగ్గర, బట్టలు మార్చుకొచ్చారు రాధికా, రేణుక, జంబుజానా పరచి, పకోడీల పొట్లం, అరటిపళ్ళు, కాఫీ కప్పులు పైకి తీశాడు మరో సంచిలోంచి, బిస్కెట్లూ, జిలేబీలూ తీసి పెట్టాడు సత్యం.   


    "ఇవన్నీ ఎక్కడివిరా?"


    "నేముందే కొనిపెట్టా" అన్నాడు సత్యం.


    "ఇవన్నీ ఎక్కణ్ణుంచొచ్చాయ్" అంటూ అన్ని పొట్లాలు విప్పి ప్లేట్లలో పెట్టారు రాధిక రేణుక.


    "చల్లగా తడిశామేమో, పకోడీలు వేడివేడి కాఫీ హాయిగా అనిపిస్తున్నాయి" అంది రాధిక.


    "ఇప్పుడొక చక్కని పాట పాడకూడదూ" అన్నాడు మధన్.


    "ఇప్పుడా?"


    "అవును చెల్లెమ్మ. ఈ పకోడీలు, కాఫీలు మధ్య నీ కమ్మని గానం, మరీ కమ్మగా వుంటుంది." అన్నాడు సత్యం.  


    "ఎవరికి తెలియదులే గోపాలా, వనితలచేరీ, వంచన చేసి, వలువలుదాచిన నటనా లీలలు" అంటూ కల్యాణి రాగం ఆలపించింది. ఆ ప్రశాంత వాతావరణంలో, ప్రకృతి బదులు పలుకుతూన్నట్టుగా తోచింది.       


    తన్మయులై పాటవిన్నారు.


    ఏదో అలికిడి వినిపించింది. ఎవరో టూరిస్టుల్లా వున్నారు అటుకేసి వొచ్చి ఇసుకలో కూర్చున్నారు. "అదుగో రత్నావళి" అన్నాడొకడు. 'యస్. షీ ఈజ్...... రత్నావళి." అన్నాడు మరొకడు.    


    "అదేమిటి? రత్నావళి పిక్నిక్ లకి కూడా వస్తుందా?"


    "అలా అని తెలిస్తే, మనమే బుక్ చేసి వుండే వాళ్ళం కదా!"          


    "కరెక్టు ఎవరో లక్కీ ఫెలోస్ ముందుగానే బుక్ చేసుకున్నారు.


    శూలాల్లా గుచ్చుకున్నాయి ఈ మాటలు రాధిక గుండెల్లో, రేణుక తలొంచుకు కూర్చుంది.


    "మధన్ వుండరా ఇప్పుడే వస్తాను. ఆ దరిద్రులు నోటికొచ్చినట్టు కూస్తున్నారు. వాళ్ళ భరతం పట్టి వస్తాను."   


    "సత్యం..... పిచ్చి పిచ్చిగా ఆవేశపడకు. బురదలో రాయి వేస్తే. మొహం మీద పడుతుంది వాళ్ళు పదిమంది వున్నారు."


    "ఒరేయ్ పిరికివాడిలా మాట్లాడకు" అన్నాడు కోపంగా సత్యం.


    "ఎంతటి ధీరుడైనా, ఇది సమయం కాదని తెలిసినప్పుడు, మాట్లాడకుండా ఊరుకోవాలి."    


    "పాండవుల శిష్యుడిలా మాట్లాడుతున్నావ్." వ్యంగ్యంగా అన్నాడు సత్యం.


    "ఒరేయ్. మన దగ్గర ఇద్దరు ఆడవాళ్ళు వున్నారన్న సంగతి మరిచిపోతున్నావ్. వాళ్ళతో కలియబడ్డంకంటే, మనదారిన మనం పోవడం ఉత్తమం" అంటూ లేచి నుంచున్నాడు మధన్.

 Previous Page Next Page