"అబ్బ! యెంత కాలం అయిందర్రా మనం ఇలా కూర్చుని టిఫిన్ చేసి?" రుక్మిణి ఆనందంగా అన్నది.
శబరి పకపక నవ్వింది.
"బేరీ! స్నానం కూడా చేశావా?"
"అవును మమ్మీ!"
"అమ్మాయి పూర్తిగా మారిపోయిందండీ!" సంతోషంగా అన్నది రుక్మిణి.
"మమ్మీ!" గోముగా పిలిచింది శబరి.
"ఏం తల్లీ!"
"నాకు ఎర్రరాళ్ళ గాజులు కావాలి మమ్మీ!"
"అలాగే తల్లీ! సాయంత్రం వెళ్ళి కొనుక్కో!"
"ఏమిటి ఉల్లిపాయలనుకున్నావా కొనడానికి? అంత తేలికగా అనేస్తున్నావు? మొన్ననేగా తెల్లరాళ్ళ గాజులు కొన్నావ్" అన్నాడు రంగారావు.
"చూడు మమ్మీ! డాడీ మరీనూ!" మూతి సున్నా చుట్టింది శబరి.
"మీ నాన్న కాపీనం సంగతి తెలిసిందే కదమ్మా! ఫర్వాలేదు. నేనిస్తాలే డబ్బు."
"పెళ్ళికి బోలెడంత ఖర్చు వుంది."
"ఉండనివ్వండి. ఈ సంపాదనంతా ఎవరికోసం? దానికోసమేగా?"
శబరి మనసులో లోతుగా ఏదో గుచ్చుకున్నట్లు అయింది. రుక్మిణి ముఖంలోకి చూడలేకపోయింది.
"చూడండి! మీరు మరీనూ! బిడ్డ చిన్నబుచ్చుకుంది." రుక్మిణి మరోరకంగా అర్థం చేసుకుంది.
"అలాగే తల్లీ సాయంకాలం వెళదాం."
"సాయంకాలం మనం ఎలా వెళతాం. బోలెడన్ని పనులుంటేనూ" సాగదీసింది రుక్మిణి.
"అమ్మాయి ఒక్కతే ఎలా వెడుతుందీ?"
"అయ్యో తెలివి. ఒక్కతే వెళ్లటం ఏమిటి? జంటగానే వెళుతుంది!" కూతురికేసి మురిపెంగా చూస్తూ అన్నది రుక్మిణి.
దోసె నములుతూ ముసిముసిగా నవ్వుకుంది శబరి.
"ఆదిత్యకు ఫోన్ చెయ్యవే బేరీ!"
"నేను చెయ్యను బాబూ! నువ్వేచెయ్యి" అన్నది బోలెడంత సిగ్గు నటిస్తూ శబరి.
రంగారావు పక పక నవ్వాడు. రుక్మిణి ముసిముసిగా నవ్వుకుంది. శబరి ముఖం మరీ కిందకు దించుకుంది.
"పాపం! మమ్మీ! డాడీ!" మనసులోనే అనుకుంది.
16
ఇల్లు పెళ్ళి పనుల హడావుడితో కోలాహలంగా వుంది.
"మమ్మీ! మమ్మీ"! అంటూ శబరి తల్లి చుట్టూ తెచ్చిపెట్టుకొని ఉత్సాహంతో తిరుగుతూ వుంది. ప్రతిచిన్న విషయానికీ గల గల నవ్వుతూ వుంది. నాలుగు గంటలకు ఆదిత్య ట్రిమ్ గా తయారై వచ్చాడు.
శబరికి ఆదిత్యను చూస్తుంటే నవ్వు వచ్చింది. మెడకు ఉరితాడు! బటల్ హోల్ లో గులాబి పువ్వు. ఈరెండూ చస్తే మర్చిపోడు! అంత కృత్రిమంగా ఆ శరీరాన్ని బాధ పెట్టకపోతేనేమో! పాదాలనుంచి మెడ వరకు... జాన్ గుర్తొచ్చాడు. ఎంత హాయిగా ఎక్కడంటే అక్కడ కూర్చుంటాడు. ఈ డ్రస్ లో ఆదిత్యను క్రింద కూర్చోమంటే! ఊహించుకుంటూ గల గల నవ్వింది.
ఆదిత్య శబరి ముఖంలోకి కుతూహలంగా చూశాడు. పొందికగా సోఫాలో కూర్చున్నాడు. టైటు ఫాంటునూ, సూదిమొన బూట్లనూ చూస్తూ "పూర్ ఫెలో!" అనుకుంది.
"అదేమిటే అలా చూస్తూ వుండిపోయావ్! తయారవు త్వరగా!" అన్నది రుక్మిణి.
శబరి లోపలకు వెళ్ళింది. అందంగా అలంకరించుకొని అద్దంలో చూసుకుంది. ఇంకెంతకాలం ఈ గంగిరెద్దు వేషం? నిజంగా ఇది వేషమే! అందర్నీ నమ్మించాలిగా! అందుకే ఇంత నాటకం ఆడుతోంది పర్వాలేదు. తన బుర్ర చాలా షార్ప్ గా పనిచేస్తోంది. అందంగా అలంకరించుకొని ఉత్సాహంగా ఆదిత్య వెనకే వెళుతున్న కూతుర్ని చూస్తూ హాయిగా నిట్టూర్చింది రుక్మిణి.
"ఆదిత్య ఏమన్నాడే?" భోజనాల దగ్గిర అడిగింది రుక్మిణి కూతుర్ని.
"ఏమంటాడేం?" తల వంచుకుని అన్నది శబరి.
"ఎందుకే అంత సిగ్గూ?"
"మరి అందరూ నీలాగే..." రంగారావు భార్య ముఖంలోకి కొంటెగా చూశాడు.
"చాల్లే వూరుకుందురూ!" రుక్మిణి బోలెడంత సిగ్గుపడిపోయింది.
"డాడీ! మమ్మీ యెలా సిగ్గుపడి పోతోందో చూడండి." పకపక నవ్వింది శబరి.
"అబ్బా, కూతుళ్ళు ఒకటై నన్ను ఆటలు పట్టిస్తున్నారా?" రుక్మిణి హాయిగా నవ్వింది.
"ఏ సినిమాకు వెళ్ళారు?
"ఇంగ్లీషు."
"వాళ్ళు ఏ సినిమాకు వెళ్తే నీకెందుకు చెప్పు! నీకంత కోరిగ్గా వుంటే మనమూ వెళదాం. దేనికెళ్దాం? రోమియో జూలియట్ కు వెళదామా?" చాలా కాలానికి రంగారావు భార్యతో పరాచకం ఆడాడు.
"చాల్లెద్దూ! మరీ చిన్నపిల్లవాడయిపోతున్నారు."
శబరి గలగల నవ్వింది. సుబ్బమ్మ వంటిట్లో గిన్నెలు మోగిస్తున్నది. రంగారావు లేచి వెళ్ళిపోయాడు. ఆ రాత్రంతా శబరి సరిగా నిద్రపోలేదు. మదనపడుతూనే వున్నది. మనసు దిగులు దిగులుగా వున్నది.
17
"ఏమిటే బేరీ! ఇవాళ మళ్ళీ అదోలా వున్నావు?" తెల్లవారి వుదయం అడిగింది రుక్మిణి.
"ఏంలేదు మమ్మీ! రాత్రి సరిగా నిద్రపట్టలేదు."
రుక్మిణి ముసిముసిగా నవ్వుకుంది. పెళ్ళికి ముందు తనకూ అలాగే నిద్రపట్టేది కాదు. ఆనందం... భయం...
చచ్చాం పో! మమ్మీకి మళ్ళీ అనుమానం వచ్చినట్టుంది. "పాపం! జ్యోతి ఏమైందో? నా పెళ్ళి చూడకుండానే వెళ్ళిపోయింది" అన్నది శబరి సంభాషణ మరోవైపు తిప్పే వుద్దేశంతో.
జ్యోతి పేరు వినగానే రుక్మిణి కనుబొమలు ముడిపడ్డాయి.
"ఆఁ ఏమౌతుందీ? ఎవడితోనో లేచిపోయింది. సర్దా తీరాక వాడు దాన్ని నడిరోడ్డుమీద వదిలేస్తాడు. చివరకు ఏ బ్రోతల్ హౌస్ కో చేరుకోవాల్సిందే!"
"ఛ! అదేమిటి మమ్మీ! జ్యోతి చాలా మంచిది."
"నీకు ప్రపంచం తెలియదే తల్లీ! అలాంటి వాళ్ళ బ్రతుకు చివరకు..."
"మమ్మీ!" దాదాపు అరిచినట్టే అన్నది.
రుక్మిణి కూతురి ముఖంలోకి లోతుగా చూసింది.
"రేఖ అత్తవారింటినుంచి వచ్చిందట!" మాట మార్చింది రుక్మిణి.
"అవును మమ్మీ! ఒకసారి వెళ్ళి చూసి వస్తాను. నిన్న ఫోన్ చేసింది."
"అలాగే!"
"రేఖకు బాబు పుడ్తాడట మమ్మీ!" కళ్ళు మెరిపిస్తూ అన్నది శబరి.
"నీకూ పుడ్తాడులేవే పండులాంటి బాబూ! ఇంకెన్నాళ్ళు?"
"పో మమ్మీ నువ్వు మరీనూ!" గునుస్తూ అన్నది.
"బాబు కాదు. పాప పుడుతుంది" అన్నాడు రంగారావు భార్యను ఉడికించడం కోసం.
"బాబే పుడ్తాడు. అచ్చం ఆదిత్యలాగే వుంటాడు."
"లేదు. పాపే పుడ్తుంది! అచ్చం బంగారుతల్లి శబరిలాగే ఉంటుంది."
శబరికి ఆ సంభాషణ ఏవగింపుగా వుంది. ఆ మధ్య తను చూసిన తెలుగు సినిమా గుర్తొచ్చింది. అందులో పాట! ఆ పాట పాడుతూ హీరో హీరోయిన్ల ముద్దు మురిపాలు.