"రాత్రి సరిగ్గా నిద్రపోలేదా?" అనసూయ సావిత్రి ముఖంలోకి లోతుగా చూస్తూ అన్నది.
"ఎందుకు పోలేదూ? బాగా నిద్రపట్టింది. ఆ మాటకు వస్తే ఇక్కడికి వచ్చాక రాత్రి పట్టినంత నిద్ర ఇంతకుముందు పట్టలేదు."
"పచ్చి అబద్ధం" అరవాలనిపించిందామెకు.
బాగా నిద్రపోయిందా?
అర్ధరాత్రి తన భర్త గదిలో ఘర్షణపడటం తనకు తెలియదనుకుంటున్నది. తనే పిచ్చిది, అందర్నీ నమ్ముతుంది. సావిత్రినీ నమ్మింది, భర్తనీ నమ్మింది. ఇద్దరూ తనను మోసం చేస్తున్నారు.
"మరి కళ్ళు అంత ఎర్రగా ఉన్నాయేం?"
"ఎర్రగా వున్నయ్యా? ఏమో మరి. ఎక్కువ నిద్రపోయినా కళ్ళు ఎరుపెక్కుతాయనుకుంటాను."
"అలాగని నువ్వు చదివిన సైకాలజీ పుస్తకాలలో రాసివుందా?"
"ఏమిటి అనూ కొత్తగా మాట్లాడుతున్నావ్ ఇవ్వాళ"
"పాత మనుషులు కొత్తగా కన్పిస్తుంటేనూ..." ఆగి సావిత్రి ముఖంలోకి చూసింది.
సావిత్రి తల వంచుకుని టిఫిన్ తినసాగింది.
"నిద్ర రావటంలేదని డ్రాయింగ్ రూమ్ లోకి వెళ్ళావటగా? ఆయన్ను పుస్తకం అడిగేవట!"
"ఆఁ ఆఁ అవును" నీళ్ళు నమిలింది సావిత్రి.
"మరి బాగా నిద్రపోయానంటున్నావ్?"
"ఆ తర్వాత వళ్ళు తెలియకుండా నిద్రపోయాను. 8-30 దాకా మెలుకువ రాలేదు."
సావిత్రి ముఖంలో కదులుతున్న భావాలను అణుచుకోవడానికి సతమతమైపోతున్నది.
"టిఫిన్ వదిలేశావెందుకు?"
"ఆకలిగా లేదు" అని అక్కడినుంచి లేచి వెళ్ళిపోయింది సావిత్రి.
తన అనుమానం ఆధారం లేనిదికాదు. వాళ్ళిద్దరికీ ఏదో సంబంధము వుంది. రాత్రి తనకు అకస్మాత్తుగా మెలుకువ వచ్చింది. లేకపోతే తెల్లవార్లూ ఘర్షణ పడుతూనే వుండేవాళ్ళేమో. ఆమెకు అతనిమీద ఏ హక్కూ లేకపోతే అంత గట్టిగా ఎలా మాట్లాడగలుగుతుంది?
సావిత్రి మరోరకంగా ఆలోచిస్తున్నది.
అనసూయను తనే రక్షించగలదు. ఆ దుర్మార్గుడు ఎప్పుడో దీన్ని చంపేయగలడు.
ఆ భావం రాగానే సావిత్రి నిలువెల్లా వణికిపోయింది.
"అవును! నిజమే! అతను నీ స్నేహితురాల్ని చంపేస్తాడు. జాగ్రత్త! నువ్వే రక్షించాలి."
సావిత్రికి ఎవరిదో గొంతు విన్పించింది.
భయంగా చుట్టూ చూసింది.
ఎవరూ లేరు.
వెంటిలేటర్ కేసి భయం భయంగా చూసింది. ఎవరిదో ముఖం తను చూడగానే వెనక్కు వెళ్ళినట్టు అన్పించింది సావిత్రికి. కెవ్వున కేక పెట్టింది.
అనసూయ సావిత్రి దగ్గరకు పరిగెత్తుకొచ్చింది. సావిత్రి వణికిపోతున్నది. కళ్ళు భయం భయంగా అటూ ఇటూ చూస్తున్నయ్.
"సావిత్రీ! సావిత్రీ!" సావిత్రిమీద చెయ్యివేసిన అనసూయకు ఆమె శరీరం చల్లగా తగిలింది.
"ఏమైంది?"
వెంటలేటర్ కేసి భయంగా చూసింది.
"ఏమిటి అలా చూస్తున్నావ్?"
"ఎవరో అక్కడ్నుంచి తొంగిచూసి ఏదో అన్నారు."
"ఛ! అదేమిటి?"
"అవునే! అది నీ భర్త ముఖంలాగే వున్నది."
"నీకు మతిపోయింది. ఆయన ఆఫీసుకెళ్ళారు. పైగా అంత పైన వున్న వెంటిలేటర్ నుంచి తొంగిచూడడం సాధ్యం కాదు. నువ్వు దేనికో భయపడుతున్నావ్. అందుకే అలాంటి భ్రమ కలిగింది."
"అంతేనంటావా?" సావిత్రి తేరుకుంటూ అన్నది.
"అంతేగాక మరేమిటి?"
అనసూయ బయటికి వెళ్ళిపోయింది. సావిత్రికూడా రూమ్ లో ఉండలేక డ్రాయింగ్ రూమ్ లోకి వచ్చి కూర్చుంది. పుస్తకం తెరిచింది.
సావిత్రి ఎందుకింత భయపడుతుంది. తన భర్తను చూసినప్పటినుంచీ ఆమె మానసికంగా దెబ్బతిన్నది. ఆయనంటే భయం పెంచుకుంది. ఒకనాటి ప్రియుడు తన ఫ్రెండ్ భర్తగా కనిపించేసరికి షాక్ తిన్నది. తన భర్త ఆమెను హింసించి ఉంటాడు. భయపెట్టి ఉంటాడు.
అలా అయివుండదు.
అంత భయపడేది అయితే అర్ధరాత్రి ఆయన దగ్గరకు ఎలా వెళ్ళింది. గడిచిపోయిన రోజుల్ని మర్చిపోతున్నాడేమో. తనకు చెప్పవద్దని అతను బెదిరించాడేమో. రాత్రి తన భర్త గొంతు కరుకుగానే వినిపించింది. అందుకే అది భయపడుతోంది.
సావిత్రిమీద తక్షణం జాలివేసింది.
మగవాళ్ళే అంత!
సావిత్రిని రామకృష్ణ మోసం చేశాడు.
ఆ తర్వాత రమణ మోసంచేసి వుంటాడు.
మనసు గాయపడి వుంటుంది.
తమ ఇంట్లో అద్దెకున్న దుర్మార్గుడు భార్యను చంపాడు.
అందుకే సావిత్రి మగవాళ్ళంటే అసహ్యం.
సావిత్రిని అడిగితే?
ఆమెను ఎందుకడగాలి?
తన భర్తనుంచే అసలు విషయం తెలుసుకోవాలి. అతను అపరాధి అని అతని ముఖమే చెబుతోంది.
అనసూయకు దుఃఖం వస్తోంది.
వంట చెయ్యాలనిపించడం లేదు.
భోజనం వద్దు అన్నాడు.
అలిగాడు కాబోలు.
అనసూయ మనసు పరిపరి విధాల మధనపడసాగింది.
సావిత్రి హాస్టల్ కు వెళ్ళదేం?