Previous Page Next Page 
మరో దయ్యం కథ పేజి 25


    "సుశీల ఎవరూ?" నేను కుతూహలంగా అడిగాను.

 

    "సుశీల మా అమ్మాయికి ఆడబిడ్డ- భర్త పెట్టే బాధ, అత్తగారు పెట్టే యాతనలూ భరించలేక కాల్చుకొని చచ్చిపోయింది. కొందరయితే కిరసనాయిల్ గుమ్మరించి వాళ్ళే చంపారంటారు. పోలీసుకేసు అయింది. అది ఆత్మహత్యగానే నిర్ణయించారు. కాని అది ఆత్మహత్య కాదు!" అన్నాడు డాక్టర్ రాజేంద్ర.

 

    "ఆ సంగతి మీకెలా తెలుసూ?" అన్నాను కుతూహలంగా.

 

    "ఆమె చెప్పింది." ఠక్కున డాక్టర్ గారి భార్య అన్నది.

 

    "ఆమె చెప్పిందా? అంటే చచ్చిపోకముందే ఆమెకు వాళ్ళు తనను కిరసనాయిల్ పోసి చంపబోతున్నారని తెలుసా?" విస్మయంగా అడిగాను.

 

    డాక్టర్ బోర్డు మీద నుంచి తలెత్తి నా ముఖంలోకి చూశాడు.

 

    అదోలా చూశాడు. వేదాంతి ఒక పసివాడి ప్రశ్న విని చూసినట్టుగా చూశాడు.

 

    "రామాయణమంతా విని రాముడికి సీత ఏమౌతుందని నీలాంటి వాడే అడిగాడట!"

 

    నేను తెల్లబోయాను.

 

    "అదేమిటండీ? ఆమె గురించి నాకు వివరాలెం తెలియవే?" అన్నాను.

 

    "ఆమె స్పిరిట్ చెప్పింది."

 

    "ఏమని?" కృష్ణ ప్రశ్న.

 

    "తను ఆత్మహత్య చేసుకోలేదనీ, తనను భర్తా, అత్తా కలిసి హత్య చేశారనీను."

 

    "పోలీసు రిపోర్టు ఇవ్వకపోయారూ?" అన్నాను వళ్ళుమండి.

 

    "ఎలా? వాళ్లు నమ్మొద్దూ?"

 

    "వాళ్ళ ముందే స్పిరిట్ ను పిలిచి చెప్పించవచ్చుగా?" నాకు వళ్ళు మండిపోతున్నది.

 

    "చెయ్యగలను. వాళ్ళను నమ్మించగలను. కాని 'లా' ఒప్పుకోవాలిగా?"

 

    " 'లా' నే మార్పిస్తే సరి! ప్రభుత్వాలకు ఖర్చుకు ఖర్చూ తగ్గుతుంది. అసలైన అపరాధిని శ్రమ లేకుండా పట్టుకోవచ్చు." వ్యంగ్యంగా అన్నాను.

 

    నా కంఠంలో వ్యంగ్యాన్ని గ్రహించలేని ఆ పిచ్చి మహారాజు "మీ వంటి రచయితలూ, కృష్ణకుమార్ గారి వంటి విద్యావేత్తలూ కృషి చెయ్యాలి" అన్నాడు.

 

    "వట్టి కృషి చాలదండీ, ఉద్యమాలు లేవదియ్యాలి" అన్నాను వళ్ళుమండి.

 

    "డాక్టర్ గారూ, ముందు ఆ ఊజా బోర్డు మీదకు స్పిరిట్స్ ను రప్పించండి" అన్నాడు కృష్ణ కుతూహలంగా.

 

    నేను అతడి ముఖంవంక చూశాను.

 

    నన్ను మాట్లాడవద్దని కళ్ళతోనే హెచ్చరించాడు కృష్ణ.

 

    డాక్టర్ కళ్ళు మూసుకొన్నాడు.

 

    రెండు వేళ్ళను గ్లాసుమీద ఉంచాడు.

 

    "సుశీలా, రా ! రా తల్లీ రా! వస్తున్నావు గదూ ? నేను నీకు కావల్సిన వాడినే! నిజం చెప్పు! వచ్చావా?" అని గ్లాసు బోర్లించి ఊజా బోర్డు మధ్యలో పెట్టాడు.

 

    రఘుపతీ, రాజేంద్రా, ఇద్దరూ చెరొకవైపు నుంచి రెండు కుడిచేతి వేళ్లను (చూపుడు వేలూ, మధ్యవేలూ) బోర్లించిన గ్లాసుమీద ఉంచారు.

 

    "నీ పేరేమిటి ?" రఘుపతి అడిగాడు.

 

    గ్లాసు కదలలేదు.

 

    "చెప్పమ్మా, నీ పేరేమిటి?" లాలనగా అడిగాడు డాక్టర్.

 

    గ్లాసు చిన్నగా కదలసాగింది.

 

    కృష్ణ కుతూహలంగా చూడసాగాడు.

 

    నేను పరిశీలనగా చూస్తున్నాను.

 

    "సుశీల !" గ్లాసు కదిలిన అక్షరాలన్నీ కలుపుకొంటే ఆ పేరు వచ్చింది.

 

    కృష్ణ ముఖంలో కదులుతున్న భావాలను చూసి నాలో నేను నవ్వుకున్నాను.

 

    "నువ్వు ఆత్మహత్య చేసుకొన్నావా ?" డాక్టర్ గారి భార్య.

 

    గ్లాసు కదిలింది.

 

    N-O' అక్షరాలను తాకి యథాస్థానంలోకి వెళ్ళిపోయింది.

 

    "మరి ఏమైంది?"

 

    గ్లాసు కదల్లేదు.

 

    "చెప్పమా !"

 

    ఉఁహూ ! గ్లాసు కదలడం లేదు.

 

    డాక్టర్ తలెత్తి నా ముఖంలోకి చూశాడు.

 

    "మరో దుష్టశక్తి గ్లాసులోకి ప్రవేశించింది. ఆమెను నిజం చెప్పకుండా అడ్డగిస్తోంది" అన్నాడు డాక్టర్.

 

    నాకు మతిపోయినట్టే అయింది.

 

    ఇలాంటివాళ్లను ప్రశ్నించడం కూడ దండుగే అన్పించింది.

 

    "ఎవరండీ ఆ ఈవిల్ స్పిరిట్?" అడిగాడు కృష్ణ కుతూహలంగా.

 

    'ఇంకెవరు ? నువ్వే !' అనాలనిపించింది నాకు.

 

    "ఆవిడ మామగారు. వాడొక దుర్మార్గుడు. బతికున్నంతవరకూ ఆమెను వాడూ కాల్చుకుతిన్నాడు. ఆమెకంటే ఓ సంవత్సరంముందు అకస్మాత్తుగా గుండె ఆగి చచ్చాడు. చాలాకాలం ఆ పిల్లను పట్టి పీడించాడు. దాని ఖర్మగాలి చచ్చి మళ్ళీ వాడి పాలిటేపడింది" అని గ్లాసును బలంగా కదిలించ ప్రయత్నించాడు డాక్టర్ రాజేంద్ర.

 

    గ్లాసు తిరగబడింది.

 

    "చూశారా ? పాపం ! ఆ పిల్లను జుట్టుపట్టుకొని లాక్కెళ్ళాడు." నా ముఖంలోకి చూస్తూ అన్నాడు రఘుపతి.

 

    "నీకు కన్పించిందా?" అడిగాను.

 

    "అవును ! వాడికీ స్పిరిట్స్ కన్పిస్తాయి. వాడికి కూడా నాలాగే సైకిక్ పవర్సున్నాయి" అన్నాడు డాక్టర్.

 

    "ఈసారి హోలీ స్పిరిట్ ను పిలుస్తాం !" అన్నాడు డాక్టర్.

 Previous Page Next Page