Previous Page Next Page 
రాబందులూ - రామచిలుకలు పేజి 25


    "వెళ్తానండీ! ఇప్పుడే వెళ్ళి ఆహ్వానిస్తాను!" అన్నాడు శేఖరం.

 

    జానకిరామయ్య కూడా వెళ్ళిపోయాడు.

 

    రాణీ ముస్తాబై వచ్చింది.

 

    "ఏమిటావేషం?" నొసలు చిట్లిస్తూ అన్నాడు శేఖరం.

 

    "ఏం బాగాలేదా!" విసురుగా అడిగింది రాణి.

 

    "బాగా లేకేం? పెళ్ళి కూతురిలా అలంకరించుకున్నావ్! ఈ పల్లెటూర్లో ఇక. అందరికీ నిన్ను చూట్టమే సరిపోతుంది."

 

    రాణికి నిజంగానే కోపం వచ్చింది. విసురుగా లోపలకు వెళ్ళిపోతుంటే శేఖరం ఆమె చెయ్యిపట్టుకొని వారించాడు.

 

    "సర్దాగా అన్నాలే! అంతలోనే మూతి ముడుచుకోకపోతేనేం? పద! పద! ధర్మయ్యగారింటికి వెళ్లి వద్దాం!"

 

    "ఇప్పుడు అక్కడి కెందుకూ?"

 

    "ఆయన ఈ ఊరికి పెద్ద. స్వయంగావెళ్ళి ఆహ్వానిస్తే బాగుంటుంది" అన్నాడు శేఖరం.

 

    "నేనెందుకూ? నువ్వెళితే చాల్దూ ఆ ముసలాయన్ని ఆహ్వానించడానికి?"

 

    "సునందకూడా వుందిగా? నువ్వొస్తేనే బాగుంటుంది."

 

    "సూటిగా మనసులో వున్న సంగతి చెప్పరాదూ?"

 

    "ఏమిటి నీ ఉద్దేశం?" చిరాగ్గా అన్నాడు శేఖరం.

 

    "దురుద్దేశ్యం మాత్రం కాదు. సరే! పద!" అన్నది రాణి.

 

    ధర్మయ్య ఎదురొచ్చి రాణినీ, శేఖరాన్నీ ఆదరంగా ఆహ్వానించాడు. రాణిని సునంద చెయ్యిపట్టుకొని లోపలకు తీసుకెళ్ళింది.

 

    "ఏం బాబూ! సాయంత్రం మీటింగుకు అన్ని ఏర్పాట్లూ జరిగాయా?"

 

    "ఆఁ అన్నీ సవ్యంగానే జరుగుతున్నాయండీ!" అంటూ తను చేసిన ఏర్పాట్ల గురించి వివరించాడు శేఖరం.

 

    "బాగుంది బాబూ! కాని డబ్బు దుబారా చెయ్యకుండా క్లుప్తంగా సభ ముగిస్తే బాగుంటుంది. ఆ డబ్బుపెట్టి బీదలకు అన్నదానం...."

 

    "అదికూడా చేస్తున్నానండీ! ఊరంతా భోజనం పెడ్తున్నాం! మిగతా ఏర్పాట్లకు అనవసరంగా కొంచెం ఎక్కువగానే ఖర్చు పెడుతున్నామండీ! మనవాళ్ళకు డాబూ దర్పం వుంటేగాని నచ్చేట్టు కన్పించడంలేదు. మామయ్యకు అసలే నచ్చదు. మరీ మరీ చెప్పి పంపించాడు. అన్నీ ఆయన ఇష్టప్రకారమే చేస్తున్నానండీ!"

 

    "పరమేశంగారు ఇంకా రాలేదా?"

 

    "మామయ్యకోసమే నేనూ ఎదురు చూస్తున్నానండీ! నరహరిగారితోపాటే వస్తారో ఏమో!"

 

    సరస్వతమ్మ ఫలహారం ప్లేట్లు తెచ్చి ఇద్దరిముందూ వుంచింది.

 

    "ఇప్పుడివన్నీ ఎందుకండి?" మొహమాట పడిపోయాడు శేఖరం.

 

    "పర్వాలేదు నాయనా తీసుకో!" అన్నాడు ధర్మయ్య.

 

    ఫలహారం, కాఫీ అయాక శేఖరం లేచి నిల్చున్నాడు.

 

    "తప్పక వస్తారుగదూ?"


    
    "ఎందుకు రాను బాబూ! ఊళ్ళో ఇంత మంచిపని జరుగుతూవుంటే రాకుండా వుండగలనా?" అన్నాడు ధర్మయ్య.

 

    "అమ్మాయ్ సునందా! బయటికి రండమ్మా శేఖరం వెళ్ళిపోతున్నాడు" ధర్మయ్య కూతుర్ని కేకవేశాడు.

 

    రాణీ, సునందా బయటికి వచ్చారు.

 

    "తప్పక రావాలి సుమా!"

 

    సునంద చిరునవ్వు నవ్వింది.

 

    "మన మహిళామండలి బిల్డింగ్ శంకుస్థాపన కాబట్టి, మహిళలమే నడుంకట్టి ఏర్పాట్లు చెయ్యాలి! తెల్సిందా?" రాణి ఉత్సాహంగా అన్నది.

 

    "అవునండీ! మీరు తప్పక రావాలి. ఏర్పాట్లు చెయ్యడంలో మా రాణికి సహాయంగా వుండాలి మీరు" అన్నాడు శేఖరం సునంద ముఖంలోకి చూస్తూ.

 

    సునంద తండ్రికేసి చూసింది.

 

    "అలాగే వెళ్ళమ్మా!" అన్నాడు ధర్మయ్య.

 

    "రా! సునందా ఇప్పుడే మాతో వచ్చెయ్య కూడదూ?" అడిగింది రాణి.

 

    శేఖరం సునంద ముఖంలోకి ఆరాటంగా చూశాడు.

 

    "వస్తాలే! ఒక గంటలో వచ్చేస్తాను" అన్నది సునంద.

 

    శేఖరం కళ్ళు తళుక్కు మనడం సునంద చూసింది.

 

    "వస్తానండీ!" శేఖరం ధర్మయ్యకు నమస్కరించాడు.


    
    "మంచిది బాబూ!" అన్నాడు ధర్మయ్య.

 

    "ఒక గంటలో వచ్చెయ్యాలి సుమా!" రాణి సునందను హెచ్చరించింది.

 

    "అలాగే!" అన్నది సునంద.


                                            18


    సభామండపం తయారౌతోంది. మగవాళ్ళూ, ఆడవాళ్ళూ హడావుడిగా పనుల్లో నిమగ్నులై వున్నారు.

 

    మగవాళ్లు బల్లలూ, తాటి ఆకులూ, వాసాలూ చేరవేసి సభామండపం తయారు చేస్తున్నారు.

 

    ఇద్దరు ముగ్గురు స్త్రీలు సభా మండపం చుట్టూ అలికి ముగ్గులు పెడుతున్నారు.

 

    రాణికూడా ముగ్గుపెట్టటానికి ప్రయత్నిస్తోంది. ప్రతిసారీ తప్పు పోతుంటే మళ్ళీ అలికిస్తున్నది.

 

    "నువ్వు ముగ్గుపెడితే తెల్లారుతుందిగాని, ఆ ముగ్గుబుట్ట మరొకరికిచ్చి వేరే పనిచూసుకో" అన్నాడు రాణి అవస్థ చూస్తున్న శేఖరం నవ్వుతూ.

 

    రాణి చిరుకోపంతో మూతి సున్నా చుట్టింది.

 

    అప్పుడే వచ్చిన సునంద రాణీ చేతిలోనుంచి ముగుబుట్ట అందుకొని ముగ్గుపెట్టసాగింది.

 

    శేఖరం ఓ క్షణం నిల్చుని అక్కడ నుంచి వెళ్లిపోయాడు.

 

    పందిరి తయారైంది.

 

    వేదికమీద కుర్చీలూ, బల్లలూ వేశారు.

 

    సునంద దేశనాయకుల ఫోటోలు అలంకరించింది. రాణి ఫ్లవర్ వాజులూ, అగర్ బత్తీలూ టేబుల్ మీద పెట్టింది.

 

    ఏర్పాట్లు పూర్తి అయాయి. శేఖరం వచ్చి వేదికనూ, అలంకరణనూ చూసి మెచ్చుకున్నాడు.

 

    "రాణీ! నేను ఇంటికి వెళ్ళొస్తాను. ఇంకా టైం వుందిగా?" అన్నది సునంద.

 

    "ఇప్పుడు వెళ్ళకపోతేనేం? ఉండిపోరాదూ?" అన్నది రాణి.

 

    "ఇంటికి వెళ్లి అమ్మనూ, నాన్ననూ తీసుకొస్తాను."

 

    "సరే! త్వరగా వచ్చెయ్! ఈ లోపల నేను చీరె మార్చుకొని వస్తాను" అన్నది రాణి.


                                                                          19


    హాల్లో ఓ పక్కగా కూర్చుని సరస్వతమ్మ పూలమాలలు కడుతూ వుంది. ధర్మయ్య పడకకుర్చీలో కూర్చుని "గాంధీజీ ఆత్మకథ" చదువుతున్నాడు.

 

    "ధర్మయ్యగారూ!" హడావిడిగా సుబ్బయ్య ప్రవేశించాడు.

 

    "నువ్వా! రా సుబ్బయ్యా!"

 

    "ఇంకా దండలు పూర్తి కాలేదా? ప్రెసిడెంటుగారు వచ్చే సమయం కూడా అయింది" కంగారు పడుతూ అడిగాడు సుబ్బయ్య.

 

    ధర్మయ్య లేచి భార్య దగ్గరకు వచ్చి నిల్చున్నాడు. ఆఖరు దండ పూర్తిచేసి "ఇక తీసుకెళ్ళండి!" అన్నది సరస్వతమ్మ.

 

    సుబ్బయ్య జేబులో నుంచి రూపాయల నోట్లు తీసి సరస్వతమ్మ పక్కగా పెట్టాడు. వంగి ఒక్కొక్క దండాతీసి బుట్టలో పెట్టసాగాడు.

 

    "ధర్మయ్యా!" అంటూ లోపలకు వచ్చిన జానకిరామయ్య అక్కడి దృశ్యంచూసి స్థాణువులా నిలబడి పోయాడు ఓ క్షణం.

 

    మరుక్షణంలో సరస్వతమ్మ పక్కగా నేలమీదవున్న నోట్లనూ, సుబ్బయ్య తాటాకుల బుట్టలో పదిలంగా పెడుతున్న పూలదండల్నీ మార్చి మార్చి చూడసాగాడు.

 

    యాంత్రికంగా ఒక గులాబిమాలను అందుకొని రెండు చేతులతో పట్టుకున్నాడు జానకిరామయ్య. అతనికి ఆ దండ మధ్యలో ధర్మయ్య ముఖం కన్పించింది. శరీరం ఝల్లుమన్నది. కళ్లు చెమ్మగిల్లాయి.

 

    "ఒకనాడు నా ఈ చేతుల్తో...." అంటున్న జానకిరామయ్య కళ్ళముందు గత స్మృతులు సినిమా రీలులా గిర్రున తిరిగాయి.

 

    .... .... .... .... .... .... .... ....

 

    జాతి పిత బాపూజీ పిలుపు నందుకొని దేశం నలుమూలలా స్వాతంత్ర్య పోరాటం ఉధృతంగా సాగుతూంది.

 

    "వందేమాతరం!" నినాదంతో దిక్కులు పిక్కటిల్లుతున్నాయి.

 

    త్రివర్ణ పతాకాలు పట్టుకొని జనం వీధుల్లో కదిలి వస్తున్నారు. పోలీసులు ఆడా మగా తారతమ్యం లేకుండా లాఠీలతో జనాన్ని తరిమి తరిమి కొడ్తున్నారు.

 

    ఆనాడు.... "విప్లవం వర్ధిల్లాలి! తెల్ల ప్రభుత్వం వై దొలగాలి! పోలీసు దౌర్జన్యం నశించాలి!" అంటూ జన ప్రవాహం ఉరకలు తీస్తూంది. ఆ వెల్లువని అరికట్టడానికి పోలీసులు బాయినెట్ ఛార్జి చేస్తున్నారు.

 

    మూడు రంగుల జండాను పట్టుకొని "గాంధీకి జై" అంటూ ధర్మయ్య పోలీసుల ముందుకువచ్చి నిలబడ్డాడు.

 

    లాఠీలు ధర్మయ్య శరీరంమీద నాట్యంచేశాయి. క్రిందపడ్డ ధర్మయ్య చేతిలో జండాను సరస్వతమ్మ అందుకుంది. ఆమె వంటిమీద పోలీసు లాఠీలు పడ్డాయి. ధర్మయ్య మీదకు వరిగిపోతున్న ఆమె చేతిలోనుంచి మరో యువతి.... మరో యువకుడు.... ఆ జండా క్రిందపడకుండా చేతులు మారింది.

 Previous Page Next Page