ఆమె కాలేజీకి ఎందుకు రావడంలేదు? మొహం చెల్లక! తన తప్పు తను గ్రహించింది. కాని దాని తాలూకు నీలినీడలు మాత్రం మన జీవితాలను చుట్టేశాయ్"
రేణుక గౌతమ్ ముఖంలోకి బేలగా చూసింది. గౌతమ్ ఆమెకేసి చూడటం లేదు. గంభీరంగా మంద్రస్థాయిలో తనకుతానే చెప్పుకుంటున్నట్టు మాట్లాడుకుపోతున్నాడు.
"ఇదంతా చెప్పి నిన్ను నమ్మించాలని కాదు. నిజం చెప్పకుండా ఉండలేకనే ఏనాటికైనా నిజం తెలిసి, గౌతమ్ ఆనాడే నిజంచెప్పి ఉంటే ఎంత బాగుండేదని నువ్వు...సారీ! మీరు బాధపడకుండా ఉండటానికే...ఇంత కంఠశోష పడుతున్నాను. అంతేగాని... నువ్వు నన్ను అసహ్యించుకుంటున్నా నీవెంటబడి, నీకు న్యూసెన్సు అవుతానని మాత్రం భావించవద్దు.
నేను నిన్ను అమితంగా ఆరాధించాను. అయినా నీకంట పడలేదు. పెద్దగా చొరవ కూడా తీసుకోలేదు. కారణం నేను బీదవాణ్ణి. నువ్వు చొరవ చూపించావు. ఆ తర్వాత మనం దగ్గిరకు వచ్చాం. నువ్వు దూరంగా ఉండాలనే నిర్ణయానికి వచ్చి వుంటే అలాగే ఉందాం! వస్తాను. శెలవు!"
రెండు చేతులూ ఎత్తి నమస్కరించి లేచి నిలబడ్డాడు గౌతమ్.
రేణుకకు ఎవరో నొక్కుతున్నట్టు అయింది. ఏదో అనాలనుకుంది. చూస్తూనే ఉండిపోయింది.
"వస్తాను"
గౌతమ్ చరచరా బయటికి నడిచాడు "గౌతమ్" రేణుక బలవంతంగా గొంతు పెగల్చుకొని అరిచింది.
అప్పటికే గౌతమ్ హాస్టల్ గేటు దాటుతున్నాడు.
ఆమె పిలుపు అతనికి అందలేదు.
12
"రేణూ! గౌతమ్ నీతో మాట్లాడటం లేదా?"
రేణుక మంచంమీద కూర్చొని లాలింపుగా అడిగింది వాణి. రేణుక అప్పటికే దిండులో ముఖం దూర్చి వెక్కివెక్కి ఏడుస్తోంది.
"నువ్వు గౌతమ్ మనసు గాయపర్చావా?"
రేణుక సమాధానం లేదు.
"సుధ సంగతి నాకు బాగా తెలుసు. నువ్వంటే ఆమెకు చాలా ఈర్ష్య. గౌతమ్ అంటే అభిమానం కంటే అతను నిన్ను అభిమానిస్తున్నాడన్న ఈర్ష్య ఎక్కువగా ఉండేది. అందువల్లనే గౌతమ్ తనవాణ్ణిగా చేసుకోవాలనే పట్టుదల వచ్చింది. అది సాగలేదు. అందుకే కసి తీర్చుకోవడానికి అటువంటి నీచానికి వడిగట్టింది"
రేణుక చివ్వున కూర్చుంది. ప్రశ్నార్థకంగా తడికళ్ళతో వాణి ముఖంలో చూసింది.
"సుధ నాతో షర్తు కట్టింది"
"షర్తా! ఏమని?" బొంగురు కంఠంతో అడిగింది.
వాణి ఆనాడు తనకూ సుధకూ జరిగిన సంభాషణ వినిపించింది.
రేణుక వాణి ముఖంలోకి పిచ్చిచూపులు చూసింది.
"అవును! రేణూ గౌతమ్ మంచివాడు. అతను నిన్నే ఆరాధిస్తున్నాడు.సుధ విసిరిన రంగుల వలకేసి కన్నెత్తి కూడా చూడలేదు"
"వాణీ!" మళ్ళీ బావురుమన్నది రేణుక.
"ఛా! ఎందుకు ఏడుస్తావ్? అసలే తండ్రిపోయి బాధపడుతున్న నీకు సుధ తీరని అన్యాయం చేసింది. ఊర్కో! ఇప్పటికైనా తెలిసిందిగా!"
"ఇక గౌతమ్ నా ముఖం చూడడు. నువ్వు ముందే నాకీ విషయం చెబితే ఎంత బాగుండేది?"
"నేను శెలవు తీసుకొని ఊరికి వెళ్ళాను. నువ్వు వచ్చేసరికి నేను లేను. ఈలోగా పరీక్ష ప్రాక్టికల్ తప్పడం...కొన్ని కారణాల వల్ల ఇంటి దగ్గిరే ఉండిపోవాల్సి రావడం జరిగింది. పరీక్షలకు వచ్చాక తెలిసింది. ఎంతకాలంగా గౌతమ్ నీతో మాట్లాడటం లేదు."
"ఆరు నెలలైంది"
వాణి ఆలోచిస్తూ ఉండిపోయింది.
"గౌతమ్ నన్ను క్షమిస్తాడా?"
"ఎందుకు క్షమించడూ? అతనితో మనసువిప్పి అన్ని విషయాలూ మాట్లాడు"
"మాట్లాడి ప్రయోజనం లేదు"
"అదేమిటి?"
"ఎటూ అతన్ని నేను పెళ్ళిచేసుకొనే స్థితిలో లేను. మళ్ళీ లేనిపోని ఆశలు కల్పించడం నాకు ఇష్టం లేదు"
వాణి రేణుకను పిచ్చిదాన్ని చూసినట్టు చూసింది.
"ఎందుకు గౌతమ్ ను పెళ్ళిచేసుకోలేవు? మరో సంబంధం మీ పెద్దవాళ్ళు కుదిర్చారా?"
"లేదు వాణీ! ఈ జన్మకు నాకు పెళ్ళి జరగదు"
వాణి రేణుక ముఖంలోకి అయోమయంగా చూసింది.
"అదేమిటి?"
"నాన్నకు మాట ఇచ్చాను"
"ఏమని?"
"ఇంటి బాధ్యతను తీసుకొంటానని!"
"దానికీ పెళ్ళికీ సంబంధం ఏమిటి?"
"పెళ్ళి చేసుకుంటే నా చెల్లెళ్ళ బాధ్యతా, తమ్ముళ్ళ బాధ్యతా నెత్తిన వేసుకోవడం వీలయ్యే పనికాదు"
"అందుకని నీ జీవితాన్ని...."
"నాశనం చేసుకోను. సార్థకం చేసుకుంటాను. ఇది త్యాగం కాదు, నా బాధ్యత"
"ఏమో నీతో నేను ఏకీభవించలేకున్నాను. ఆ విషయం గౌతమ్ తో చర్చించడం మంచిదని నా అభిప్రాయం. కనీసం నీమనసులో అతనంటే అసహ్యం లేదని అతనికి తెలియచెప్పు. అతను నిరపరాధిగా నువ్వు నమ్ముతున్నట్టు అతనికి తెలియాలి. నువ్వు ఈరోజే గౌతమ్ ను కలుసుకొని అన్ని విషయాలూ అరమరిక లేకుండా చెప్పు"
రేణుక ఆలోచిస్తూ కూర్చుంది.
"నేను వెళ్తున్నాను. ఇవాళ్టినుంచి ఆసుపత్రికి రాకు. శెలవు తీసుకో, నేను గౌతమ్ కి నువ్వు సాయంకాలం రమ్మన్నావని చెబుతాను"
"రాడు!"
"నీకెందుకు? అతను వచ్చేలా నేను చేస్తానుగా! నువ్వు రెస్టు తీసుకో!" అంటూ వాణి వెళ్ళిపోయింది.
రేణుక వాణి వెళ్ళినవైపు చూస్తూ "గౌతమ్ వస్తాడా? గౌతమ్! నన్ను క్షమించగలడా?" మనసులోనే మళ్ళీ మళ్ళీ అనుకున్నది.