Previous Page Next Page 
పిపాసి పేజి 25


    వియ్యపురాళ్ళిద్దరూ నవ్వుకుంటూ, వంట యింట్లోకి వెళ్ళిపోయారు.


    ఎంతసేపటి నుంచి అక్కడున్నాడో సత్యం "బాగుంది. భువిలో ఒక బృందావనాన్ని సృష్టించారన్నమాట" అన్నాడు.     


    అందరూ అతనికేసి చూసారు.


    "ఎంతసేపయిందిరా నువ్వొచ్చి" అన్నాడు మధన్.


    "చెల్లెమ్మ పాట మొదలెట్టేటప్పుడు. చెల్లెమ్మా! చాలా బాగా పాడావు" అన్నాడు సత్యం.  


    "థాంక్స్" అంది.


    "మధన్! మీ భోజనాలయ్యాయా" అన్నాడు సత్యం.


    "ఇంకా లేదురా, ఏం?"


    "మహాబలిపురం వెళ్ళొద్దాం. నేను టూరిస్ట్ ఎరేంజి చేశాను."


    మధన్ అందర్నీ రెడీ అవ్వమని చెప్పాడు.     


    "మేమంతా ఎందుకురా. సరదాగా మీరు వెళ్ళిరండి. రేణుకనీ తీసుకెళ్ళండి" అంది రాజేశ్వరమ్మ.


    "అవును బాబూ చిన్నపిల్లలు మీరు వెళ్ళిరండి. అంది సరోజిని.


    "సరే" అన్నాడు మధు.


    గబగబా భోజనాలు చేసి ప్రయాణానికి సిద్ధమయ్యారు.


    "పకోడీలు చేసి యిస్తానర్రా పట్టుకెళ్ళండి" అంటూ గబగబా ఉల్లిపాయలు తరిగి, పకోడీలు తయారుచేసింది రాజేశ్వరమ్మ.


    ప్లాస్కు నిండా కాఫీ పోసింది సరోజిని. కనకాంబరంరంగు వెండి జరీ పువ్వుల బెనారస్ చీర రేణుక కట్టుకుంది. మామిడి చిగురు రంగు చీరలో, మరింత అందంగా పసిడిబొమ్మలా మెరిసిపోయింది.   


    "ఏమిటలా చూస్తున్నారు, కొత్తగా."


    "రాధీ..... ఆశ్చర్యమేమిటో కానీ, నువ్వు నిమిష నిమిషం కొత్తగానే కనిపిస్తున్నావు, ప్రపంచంలోని అందాన్నంతా ఒకచోట పోగుచేసో భగవంతుడు నిన్ను తయారు చేశాడు."   


    "చాల్లెండి. ఎప్పుడు చూసినా నన్ను పొగడ్డమే. మీరు మాత్రం ఏం తక్కువ తిన్నారు? ఉంగరాల జుట్టు, మిలమిలా మెరిసే కళ్ళు, విశాలమైన నుదురు, తీర్చిదిద్దినట్టున్న ముక్కు....."     


    "ఊ..... ఊ.... బాగానే పలకనేర్చింది చిలక."


    "నీవు నేర్పిన విద్యయేనీరజాక్ష."


    "నేను నేర్పిన విధ్యయే అయినా, గురువును మించిపోతున్నావు."


    "అయితే గురువుగారు సంతోషించవలసిన విషయమేగా?"


    "ఓ యస్.... కానీ గురుదక్షిణేది?"


    "అబ్బో.... ఏం కావాలేంటి?"


    "చెప్పనా"....., అంటూ దగ్గరకు లాగి కౌగిట్లో బంధించాడు.


    "అబ్బ..... ఉండండీ.... అదుగో వాళ్లొచ్చేస్తున్నారు" అంది, దూరంగా జరగడానికి ప్రయత్నిస్తూ.


    "ఇంకారారేమిటి, చిలకా గోరింకలు, టైమయిపోతోంది." కేకపెట్టాడు సత్యం.


    "వస్తున్నాం" అన్నాడు మధన్.


    "చూశారా. వాళ్ళు వెయిట్ చేస్తున్నారూ, పదండి" అంటూ చేతులు విడిపించుకుని, గబగబా ఇవతలి కొచ్చేసింది.   


    "బొట్టు చెరిగిందక్కా" అంది నవ్వుతూ రేణుక.


    రాధిక సిగ్గుతో తలవంచుకుంది. "సరిచేసుకొస్తా" అంటూ వెనక్కి తిరగబోయింది.


    "ఒద్దుబాబూ, మళ్ళీ ఆలస్యమౌతుంది. నేను సరిచేస్తానుండు" అంటూ సరిచేసింది రేణుక.   


    'టై'సవరించుకుంటూ ఇవతలికొచ్చాడు మధన్. రేణుక, రాధిక మధన్ వెనకసీట్లో కూర్చున్నారు. సత్యం ముందు కూర్చున్నాడు.   


    కారు కదిలింది. ఉత్సాహంగా కబుర్లు చెప్పుకుంటూ మహాబలిపురం చేరుకున్నారు.


    ప్రశాంత వాతావరణం. మెత్తని ఇసుకలో, రాతితో కట్టిన పాండవుల గుహలు, ద్రౌపది గుహ అమర్చినట్టున్నాయి. రాతితో చెక్కిన పెద్ద ఏనుగు, ఎంత అందంగా వుంది. ఆ ఏనుగుని చూసి ముగ్ధురాలైంది రాధిక.       


    "రేణూ ఎంతో బాగుందికదే" అంది.


    "అవునక్కా. ఈ శిల్పాలు, నాటి శిల్పకారుల నైపుణ్యాన్ని తెలుపుతున్నాయి.


    రాధిక తొండాన్ని ముట్టుకుని ఆనందిస్తోంది. రేణుక ఏనుగు వీపు మీద చెయ్యి వెయ్యడానికి ప్రయత్నిస్తోంది అందడం లేదు.     


    సత్యం ఫోటో తీశాడు.


    "అరె. కెమెరా ఎప్పుడు తెచ్చారు నాకు తెలీదే." అంది రాధిక.

 Previous Page Next Page