Previous Page Next Page 
మరీచిక పేజి 25


    "ఛ! ఊరుకో ఇప్పుడేమయిందని?"

 

    "ఇంకా ఏం కావాలి? ఒక్కగాను ఒక్క బిడ్డగదాని అల్లారుముద్దుగా పెంచాం! అదే మనం చేసిన తప్పేమో! దానికి బొత్తిగా మంచేదో చెడేదో తెలియకుండా పెరిగింది. అది ఆ బజారు వెధవను చేసుకుంటానంటే మన పరువేం గాను? ఈ విషయం ఆదిత్యకు తెలిస్తే ఇంకేమయినా వుందా?"

 

    శబరికి వళ్ళు మండిపోయింది.

 

    ఆదిత్యకు తెలిస్తే ఏమౌతుందట? తనను చేసుకోనంటాడు! అంతేగా? తనకు కావాల్సిందీ అదే!

 

    "రుక్కూ మరీ పసిపిల్లలా మాట్లాడకు. అమ్మాయి వాణ్ణి నా బాయ్ ఫ్రెండ్ అన్నదేగాని పెళ్లి చేసుకుంటాననలేదుగా?"

 

    "అంటుంది! అది ఏమైనా అంటుంది?" గద్గద స్వరంతో అన్నది రుక్మిణి.

 

    "డాడీ కంటే మమ్మీ తెలివైంది!" అనుకుంది శబరి.

 

    రంగారావు దృష్టి వాకిట్లో నిల్చుని ఉన్న శబరిమీద పడింది.

 

    "ఊర్కో! చూడు! అమ్మాయి వచ్చింది. లోపలకురామ్మా! అక్కడే నిలబడ్డావేం?"

 

    రుక్మిణి తలెత్తి చూసింది. కన్నీళ్ళు కమ్మిన కళ్ళకు కదిలిపోయిన ఫోటోలోని బొమ్మలా కనిపించింది శబరి. తల్లి ముఖం చూస్తుంటే శబరికి జాలివేసింది.

 

    "మమ్మీ!" అంటే ఒక్క ఉదుటపోయి తల్లిని వాటేసుకుని బావురుమన్నది.

 

    తల్లీ కూతుళ్ళు ఏడుస్తూ ఉంటే రంగారావు వెర్రివాడిలా చూస్తూ వుండిపోయాడు. రుక్మిణి కూతుర్ని ఎవరో తననుంచి లాగేస్తున్నట్టు గట్టిగా రెండు చేతులతో పట్టుకొని గుండెలకు హత్తుకుంది.

 

    "మమ్మీ! నన్ను క్షమించవూ?

 

    ఇది నిజమా? తను వింటున్నది శబరి కంఠమేనా? అవును! నిజమే! శబరే! తన కూతురే! తన రక్తమాంసాలు పంచుకొని పుట్టిన బిడ్డే! తన దుఃఖం చూడలేక క్షమించమని అడుగుతూ వుంది! తను చేసిన తప్పు తెలుసుకుంది!

 

    "ఇంకెప్పుడూ నిన్ను బాధపెట్టను మమ్మీ! నన్ను క్షమించవూ? తల్లిని చుట్టుకుపోతూ అడిగింది శబరి.

 

    "బేరీ!" అంటూ ఆవేశంగా శబరి ముఖాన్ని ముద్దులతో నింపేసింది రుక్మిణి.

 

    రంగారావు కళ్ళు చెమ్మగిల్లాయి. హృదయం తేలికపడింది.

 

    "నేను చెప్పలేదూ? బేరీ మనమ్మాయి! ప్రతివాణ్ణీ బాయ్ ఫ్రెండ్ అనడం కుర్రకారు అలవాటు! అంతే! ఏమ్మా అంతేగదూ?

 

    శబరి మాట్లాడలేదు.

 

    "చెప్పు తల్లీ! మీ అమ్మకు ధైర్యం చెప్పు!"

 

    శబరి తల దించుకుంది.

 

    "చెప్పు తల్లీ, నీ నోటి మీదుగా చెప్తేగాని నా గుండెలమీది బరువు దిగదు. నువ్వు వాణ్ణి ప్రేమించడం లేదు కదూ?" కూతుర్ని రెండు చేతులతో ఊపుతూ ఆవేశంగా అడిగింది రుక్మిణి.

 

    "చెప్పమ్మా! నీ మనసులో వున్నమాట చెప్పు! నీకు ఆదిత్య అంటే ఇష్టం లేకపోతే చెప్పు! ఈ పెళ్లి ఆపేస్తాం! నీకిష్టమైన వాణ్ణే చేస్తాం!"

 

    అన్నాడు రంగారావు.

 

    శబరి ఇంకా ఆలోచిస్తూనే వుంది.

 

    "చూశారా! నా అనుమానం నిజమే! అది ఆ బజారు వెధవనే ప్రేమిస్తూ వుంది!" పిచ్చిగా అరుస్తూ అన్నది రుక్మిణి.

 

    శబరి రుక్మిణి ముఖంలోకి ఓ క్షణం లోతుగా చూసింది. ఆమె కళ్ళలో పుట్టెడు దిగులు బాధ కొట్టొచ్చినట్టు కన్పించాయి.

 

    "లేదు మమ్మీ! నేను అతన్ని ప్రేమించడం లేదు!"

 

    "నిజమే! ఛ! నేను ఆ డర్టీ ఫెలోని ప్రేమించడం ఏమిటి?"

 

    రుక్మిణి కూతురి ముఖంలోకి నమ్మలేనట్టు చూసింది.

 

    "మరివాడు నీకు బాయ్ ఫ్రెండ్ ఎలా అయ్యాడు? అసలు మన ఇంటికి ఎందుకు వచ్చాడు?"

 

    శబరి పలకలేదు.

 

    "ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు! అసలు నీకు అతనితో పరిచయం ఎలా అయింది? వాళ్ళు మత్తుమందులు తింటారట! హిప్పీస్ చాలా భయంకరంగా జీవిస్తారట. ఆరోజు నీకు మత్తుమందు ఇచ్చింది ఇతనేనా?"

 

    "కాదు, అసలు మత్తుమందు వేసుకోలేదు!"

 

    "ఇప్పుడవన్నీ ఎందుకులెద్దూ? చూడు బేబీ! అతనితో పరిచయం ఎన్నాళ్ళ నుంచీ?" రంగారావు అడిగాడు.

 

    "అతనితో నాకు అసలు పరిచయం లేదు. అతనెవరో నాకు తెలియదు!"

 

    "తెలియదా? అయితే వాడు మనింటికి ఎందుకొచ్చాడూ? బాయ్ ఫ్రెండ్ అన్నావుగా?" అనుమానంగా చూసింది రుక్మిణి.

 

    "నాకు ఈ పెళ్ళి ఇష్టంలేదు. అతను గేటులో నిల్చుని చూస్తుంటే నేనే పిల్చాను. డబ్బులు అడిగాడు. అతని వేషం చూసి అతనితో మాట్లాడాలని సరదా వేసింది. ఇతను హిప్పీగా ఎందుకు మారాడో తెలుసుకుందామని పిల్చాను. ఇంతలో మీరు వచ్చారు. అతన్ని డాడీ పట్టుకొని కొట్టాడు. అసలే కసిగా వున్న నాకు మరీ కోపం వచ్చింది. మిమ్మల్ని ఏడ్పించాలనిపించింది. అందుకే అలా అన్నాను!"

 

    "మమ్మల్ని ఎంత హడలగొట్టావమ్మా!" రంగారావు గుండెల నిండా గాలి పీల్చుకున్నాడు.

 

    "ఎంత బాధపెట్టావే బేబీ!" కూతురి తలనిమురుతూ అన్నది రుక్మిణి.

 

    "ఏమ్మా నీకీపెళ్లి ఇష్టంలేదా?"

 

    "ఆదిత్యకేమే బేబీ! అంతకంటే అందగాడూ, ధనవంతుడూ మళ్ళీ దొరుకుతాడటే?" భర్త మాటను అందుకొని అన్నది రుక్మిణి.

 

    శబరి మాట్లాడలేదు.

 

    "పోనీయ్ లే! అమ్మాయికి ఇష్టం లేకపోతే."

 

    "నాకిష్టమే డాడీ?"

 

    తల్లీ, తండ్రీ కూతురి ముఖంలోకి చూశారు.

 

    "ఇంతకుముందే ఇష్టం లేదన్నావ్?"

 

    "అప్పుడు అలా అన్పించింది. ఆదిత్యనే చేసుకుంటాను."

 

    "మనస్ఫూర్తిగా అంటున్నావా?"

 

    రుక్మిణికి భర్తమీద కోపం వచ్చింది.

 

    "అమ్మాయి ఇష్టమేనని చెపుతూ వుంటే మీరేమిటి మధ్యలో?" కస్సున లేచింది.

 

    "మనస్ఫూర్తిగా చెబుతున్నాను డాడీ!"

 

    రుక్మిణి సంతోషానికి పట్టపగ్గాలు లేవు. అందరూ భోజనాల దగ్గర కూర్చున్నారు. శబరి ఉత్సాహంగా కబుర్లు చెపుతూ ఉంది. పెళ్ళి ఎంత వైభవంగా జరగాలో చెపుతూ వుంది రుక్మిణి.

 

    "మందు సామాను కూడా కాడా కాల్పించాలమ్మా! రేఖ పెళ్ళిలోలాగ!"

 

    "అలాగే తల్లీ!" అన్నాడు రంగారావు.

 

    శబరి మంచంమీద అటూ యిటూ కదులుతూ వుంది. నిద్ర రావడం లేదు. శబరి మనసు తేలిగ్గా వుంది. జాన్ రూపం కళ్ళ ముందు మెదిలింది. ముసిముసిగా నవ్వుకుంది. తను బ్రహ్మాండంగా నాటకం ఆడింది. డాడీ మమ్మీ పిచ్చివాళ్ళు. నమ్మేశారు. మమ్మీ ఏడుస్తుంటే తనకూ ఏడుపొచ్చింది. జాలివేసింది.

 

    జాన్ ఏం చేస్తున్నాడో? ప్యాడ్ లో పోటీ పీలుస్తూ మేరీతో డ్యాన్సు చేస్తున్నాడేమో. తను ఇక్కడ్నుంచి బయటపడాలి. డాడీకి మమ్మీకి అనుమానం రాకూడదు. వస్తే ఇల్లు కదలనివ్వరు. చాలా జాగ్రత్తగా వూరు దాటిపోవాలి. పోలీసులకు రిపోర్టు ఇస్తారేమో? ఒకవేళ పోలీసులు పట్టేస్తే? ఆలోచిస్తూ శబరి నిద్రలోకి జారిపోయింది.

 

    తెల్లవారి యెనిమిదింటికల్లా స్నానంచేసి, ముస్తాబై డైనింగ్ టేబుల్ ముందు కూర్చుంది చాలా రోజుల తర్వాత. తండ్రి మరో కుర్చీలో కూర్చుంటే "డాడీ మీ కుర్చీ అది! మర్చిపోయారా?" అన్నది.

 

    రంగారావు నవ్వుకుంటూ తను ఎప్పుడూ కూర్చునే కుర్చీలో కూర్చున్నాడు.

 

    "మమ్మీ! మమ్మీ! ఎనిమిదయిపోయింది!" కేకలు పెట్టింది శబరి.

 

    "ఏమిటే బేరీ?" అంటూ బయటికి వచ్చిన రుక్మిణి, తండ్రీ కూతుళ్ళను డైనింగ్ టేబుల్ ముందు కూర్చుని ఉండటం చూసి ఆశ్చర్యపోయింది.

 Previous Page Next Page